సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రవేశ పెట్ట నున్న 2021–22 వార్షిక బడ్జెట్‌లో కేటాయింపులు, ఇతర సమస్యలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం భారీ ఆశలు పెట్టుకుంది. వివిధ ప్రాజెక్టులు, పథకాలకు నిధులతో పాటు వివిధ సందర్భాల్లో కేంద్రం ఇచ్చిన హామీలు ప్రస్తుత బడ్జెట్ సమావేశాల సందర్భంగా నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై గతంలో తాను, ఇతర రాష్ట్ర మంత్రులు రాసిన లేఖలను పార్లమెంటులో లేవనెత్తాలని పార్టీ ఎంపీలకు టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సూచించినట్లు సమాచారం. వీటిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైదరాబాద్ ఫార్మాసిటీ, టెక్స్‌టైల్ పార్క్, నిమ్జ్, ఐటీఐఆర్, నేషనల్ డిజైన్ సెంటర్ వంటి వాటికి నిధుల మంజూరు అంశాలను ఎంపీలు ప్రస్తావించే అవకాశం ఉంది.
వీటితో పాటు ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్, ట్రైబల్ యూనివర్సిటీ, కరీంనగర్‌లో ట్రిపుల్ ఐటీ, రోడ్డు, రైల్వే ప్రాజెక్టులు, బయ్యారం స్టీల్ ప్లాంటు వంటి అంశాలను సందర్భాన్ని బట్టి టీఆర్‌ఎస్ ఎంపీలు ప్రస్తావించనున్నారు. సోమవారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే వార్షిక బడ్జెట్‌లో ఫార్మాసిటీకి రూ.870 కోట్లు, మెగా టెక్స్‌టైల్ పార్క్‌కు రూ.రూ.300 కోట్లు, జహీరాబాద్ నిమ్జ్‌కు రూ.500 కోట్లు, నేషనల్ డిజైన్ సెంటర్‌కు రూ.200 కోట్లు, ఇండస్ట్రియల్ కారిడార్లకు రూ.5వేల కోట్లు, ఇవ్వాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు గత నెలలో కేంద్ర మంత్రులకు వరుస లేఖలు రాశారు. వీటికి సంబంధించిన ప్రస్తావన పార్లమెంటు వేదికగా తేవాలని టీఆర్‌ఎస్ ఎంపీలను పార్టీ అధిష్టానం ఆదేశించింది. చదవండి: (‘వ్యాక్సిన్’ స్పెషలిస్ట్.. నాడు, నేడు ఆయనదే కీలక పాత్ర)
ప్రతిష్టాత్మక విద్యా సంస్థల కోసం ఒత్తిడి
రాష్ట్ర విభజన తర్వాత కొత్తగా ఏర్పాటైన 23 జిల్లాలకు గాను 21 జిల్లాల్లో 21 జవహర్ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం గతంలో లేఖలు రాసింది. కరీంనగర్‌లో ట్రిపుల్ ఐటీతో పాటు వేగంగా అభివృద్ది బాటలో పయనిస్తున్న తెలంగాణలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)ను ఏర్పాటు చేయాలని కోరుతోంది. సెంట్రల్ యూనివర్సిటీ హోదాతో వరంగల్‌లో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు ప్రకటన కూడా ముందుకు సాగడం లేదు. యూనవర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం భూమిని చూపినా ప్రక్రియలో పురోగతి లేకుండా పోయింది. ఇదిలా ఉంటే ఉమ్మడి ఏపీలో హైదరాబాద్‌కు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్‌ఐడీ) మంజూరైంది. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎన్‌ఐడీ విజయవాడకు తరలివెళ్లింది. దీంతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆవరణలో ఎన్‌ఐడీ ఏర్పాటుకు స్థలం కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్లు మూలధనం సమకూర్చాలని కేంద్రాన్ని చాలా కాలంగా కోరుతోంది.
రైల్వే ప్రాజెక్టులు.. ఇతర మౌలిక వసతులు
రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే వేగన్ ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే డివిజన్‌తో పాటు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మనోహరాబాద్– కొత్తపల్లి, అక్కన్నపేట– మెదక్, భద్రాచలం– కొత్తగూడెం లైన్లకు పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. దీంతో పాటు ఇతర రైల్వే పెండింగ్ ప్రాజెక్టులు, సర్వేలు, పలు జాతీయ రహదారులకు అనుమతుల కోసం ఎంపీలు పార్లమెంటు వేదికగా గళమెత్తాలని నిర్ణయించారు. హైదరాబాద్ నగరం చుట్టూ 334 కిలోమీటర్ల మేర ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి సూత్రప్రాయ ఆమోదంతో పాటు, పలు జాతీయ రహదారుల విస్తరణకు సంబంధించిన వినతులు కూడా దీర్ఘకాలంగా పెండింగులో ఉన్నాయి.
రాష్ట్రానికి అదనంగా నాలుగు రిజర్వు బెటాలియన్‌లు, రామప్ప గుడికి యునెస్కో గుర్తింపు కోసం ప్రతిపాదన, హైకోర్టులో జడ్జీల సంఖ్య పెంపు, రాష్ట్ర పునర్విభజన చట్టంలోని 9, 10 షెడ్యూలు జాబితాలోని సంస్థల విభజన, బయ్యారంలో సమీకృత స్టీల్ ప్లాంటు ఏర్పాటు వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి చాలాకాలంగా స్పందన కోరుతోంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి చిరునామాగా ఉన్న హైదరాబాద్‌ను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ (ఐటీఐఆర్)గా ప్రకటించేందుకు అవసరమైన నిధులు ప్రకటించాలని కోరుతున్నా కేంద్రం నుంచి స్పందన లేదు. వీటితో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు నిధులు, ఎస్సీ వర్గీకరణ వంటి అంశాలను కూడా పార్లమెంటులో ప్రస్తావించాలని పార్టీ ఎంపీలకు సీఎం కేసీఆర్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment