ముంబై: కేంద్ర బడ్జెట్–2021 ప్రభావిత అంశాలు, ఆర్‌బీఐ పాలసీ సమావేశ నిర్ణయాలే ఈ వారం స్టాక్ మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ రోజు బడ్జెట్ కార్యక్రమంతో పాటు జనవరి వాహన విక్రయ గణాంకాలు, అదే నెలకు సంబంధించి కొన్ని స్థూల ఆర్థిక గణాంకాలు వెల్లడికానున్నాయి. బుధవారం నుండి ఆర్‌బీఐ ద్రవ్యపాలసీ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ అంశాలే ఈ వారం రోజుల్లో మార్కెట్‌కు కీలకం కానున్నాయని స్టాక్ నిపుణులు భావిస్తున్నారు.
వీటితో పాటు ప్రపంచ మార్కెట్ల గమనం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు, కంపెనీల క్యూ3 ఆర్థిక గణాంకాలు, రూపాయి ట్రేడింగ్, క్రూడ్ కదలికలు సూచీల ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపవచ్చు. ఇక గడిచిన ఆరురోజుల్లో సెన్సెక్స్ 3056 పాయింట్లు, నిప్టీ 1010 పాయింట్లను కోల్పోయిన సంగతి తెలిసిందే. ఎఫ్‌ఐఐల పెట్టుబడులు ఉపసంహరణతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన ప్రతికూల సంకేతాలు, బడ్జెట్ నేపథ్యంలో అప్రమత్తత ఇందుకు కారణాలుగా ఉన్నాయి. ఈ వారం మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాల గురించి మరింత లోతుగా పరిశీలిస్తే...,
స్టాక్ మార్కెట్‌పై బడ్జెట్ ప్రభావమెంత..?
నిర్మలా సీతారామన్ ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్–2021ను ప్రవేశపెట్టనున్నారు. కోవిడ్–19 సంక్షోభ పరిస్థితులు, దిగజారిన ఆర్థిక వ్యవస్థలను పరిగణనలోకి తీసుకొని ప్రవేశపెట్టే బడ్జెట్ ఇది. ఇప్పుడిప్పుడే రికవరీ అవుతున్న వ్యవస్థకు మరింత చేయూతనిచ్చే విధంగా ఈ బడ్జెట్లో ఉద్దీపన చర్యలుండొచ్చని ఆర్థికవేత్తలు ఆశిస్తున్నారు. ప్రభుత్వం మందకొడిగా ఉన్న ఆర్థిక వ్యవస్థకు చేయూతనిచ్చేందుకు మౌలిక సదుపాయాల వ్యయానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందా..? లేదా ఆర్థిక విధానాలకు నిధుల కేటాయింపు ద్వారా వృద్ధిని కోరుకుంటుందా..? అనే అంశాలు మార్కెట్‌కు అత్యంత కీలకం కానున్నాయి.
మొదటి నిర్ణయంతో మార్కెట్ పరుగు తిరిగి ప్రారంభం అవుతుంది. రెండో ఎంపికతో మార్కెట్లో మరింత కరెక్షన్‌కు అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఖాళీ అయిన ఖజానాను నింపుకునేందుకు ప్రభుత్వం సంపన్న వర్గాలపై కొత్త పన్నులను విధించడంతో పాటు కార్పోరేట్ ఆదాయాలపై సెస్సును పెంచుతాయనే అంచనాలు దలాల్ స్ట్రీట్‌ను కలవరపెడుతున్నాయి. మొత్తంగా మార్కెట్‌కు అనుకూలంగా నిర్ణయాలుంటే సూచీలు, షేర్లు ఇప్పటికే భారీ ర్యాలీ చేసిన నేపథ్యంలో లాభాలు పరిమితంగా ఉండొచ్చు. ప్రతికూల నిర్ణయం వెలువడితే మరింత లాభాల స్వీకరణ చోటుచేసుకొని సూచీలు పతనాన్ని చవిచూడొచ్చు.
ఫిబ్రవరి 3న ఆర్‌బీఐ పాలసీ సమావేశం ...
బడ్జెట్ ఒకరోజు తర్వాత ఫిబ్రవరి 3న (బుధవారం) ఆర్‌బీఐ ద్రవ్య విధాన పాలసీ కమిటీ సమావేశం ప్రారంభం కానుంది. మూడు రోజులపాటు జరుగనున్న ఈ భేటీ నిర్ణయాలు శుక్రవారం (ఫిబ్రవరి 5న) వెలువడనున్నాయి. నాలుగుశాతం రెపో రేటును యథాతథంగా కొనసాగించవచ్చన్నది అంచనా.
విదేశీ పెట్టుబడుల తీరుతెన్నులు..!
గతేడాది సెప్టెంబర్ తర్వాత ఈ జనవరి 29న ముగిసిన వారంలో విదేశీ ఇన్వెస్టర్లు తొలిసారిగా నికర అమ్మకందారులుగా మారారు. ప్రతికూల అంతర్జాతీయ పరిణామాలతో పాటు డాలర్ ఇండెక్స్ బలపడటంతో చివరి వారంలో ఎఫ్‌ఐఐలు మొత్తం రూ.12 వేల కోట్ల విలువైన దేశీయ ఈక్విటీ షేర్లను విక్రయించినట్లు ఎస్‌సీడీఎల్ గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు దాదాపు నాలుగునెలల తర్వాత దేశీ ఫండ్లు(డీఐఐలు) నికర కొనుగోలుదారులుగా మారారు. గడచిన వారంలో డీఐఐలు రూ.3,789 కోట్ల షేర్లను కొన్నారు.
తుది అంకానికి క్యూ3 ఆర్థిక ఫలితాలు...
దేశీయ కార్పొరేట్ కంపెనీలు క్యూ3 ఆర్థిక ఫలితాల ప్రకటన తుది అంకానికి చేరుకుంది. హెచ్‌డీఎఫ్‌సీ, భారతీ ఎయిర్‌టెల్, హీరో మోటోకార్ప్, హెచ్‌పీసీఎల్, ఎస్‌బీఐ, బ్రిటానియా ఇండస్ట్రీస్, ఎంఅండ్‌ఎం, దీవిస్ ల్యాబ్, ఎన్‌టీపీసీలతో సహా ఈ వారంలో మొత్తం 475 కంపెనీలు తమ డిసెంబర్ ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇందులో నిఫ్టీ–50 సూచీలోని ఎనిమిది కంపెనీలున్నాయి.
జనవరి ఆటో అమ్మక గణాంకాల విడుదల...
నేడు బడ్జెట్ కార్యక్రమంతో పాటు ఆటో కంపెనీలు తమ జనవరి నెల వాహన విక్రయ గణాంకాలను వెల్లడించనున్నాయి. ప్యాసింజర్, మధ్య–భారీ వాణిజ్య వాహన, ట్రాక్టర్ విభాగపు అమ్మకాల్లో వృద్ధి ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ద్వి–చక్ర వాహన విభాగపు విక్రయాలు బలహీనంగా ఉండొచ్చని వారంటున్నారు. అంచనాలకు మించి అమ్మకాలు ఉంటే రానున్న రోజుల్లో ఆటో రంగానికి డిమాండ్ ఉంటుందని ఇన్వెస్టర్లు భావించే అవకాశం ఉంది.
గణాంకాల ప్రభావం....
నేడు మెర్కిట్ తయారీ పీఎంఐ గణాంకాలతో పాటు ఇదే జనవరి వాణిజ్యలోటు లాంటి స్థూల ఆర్థిక గణాంకాలు వెల్లడి కానున్నాయి. అలాగే అగ్రరాజ్యం అమెరికా మెర్కిట్ తయారీ గణాంకాలు కూడా ఈరోజే విడుదల అవుతాయి. ఈ బుధవారం మెర్కిట్ సేవల పీఎంఐ గణాంకాలు వెల్లడవుతాయి. వ్యవస్థ పనితీరును ప్రతిబింబింప చేసే ఈ స్థూల ఆర్థిక గణాంకాలు మార్కెట్ ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపగలవు.
ఊగిసలాట కొనసాగొచ్చు
పలు దేశాల కేంద్ర బ్యాంకుల సరళతర వైఖరితో అంతర్జాతీయంగా లిక్విడిటీ మెండుగా ఉంది. ఈ అధిక లిక్విడిటీ వర్ధమాన దేశాల ఈక్విటీల్లో ప్రవహించడంతో పలు దేశాల స్టాక్‌మార్కెట్లు అధిక వ్యాల్యుయేషన్‌తో ట్రేడ్ అవుతున్నాయి. సూచీలను పరుగులు పెట్టిస్తున్న ఈ లిక్విడిటీ ఆధారిత ర్యాలీ ఆధారంగా మన బెంచ్‌మార్క్ సూచీలు కనీసం 10 నుంచి 15 శాతం దిద్దుబాటు కావాల్సిన అవసరం ఉంది. మార్కెట్ అస్థిరతను సూచించే వొలటాలటీ ఇండెక్స్ 3 శాతం పెరిగి 25.34 వద్ద స్థిరపడింది. ఇది మార్కెట్లోని అస్థిరతను సూచిస్తుంది.
– వినోద్ నాయర్, జియోజిత్ ఫైనాన్స్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్
Comments
Please login to add a commentAdd a comment