ఈ ఏడాది ఆరంభంలోనే రికార్డ్‌ల మీద రికార్డ్‌లు సృష్టించిన స్టాక్ మార్కెట్ శుక్రవారం భారీగా పతనమైంది. ఈక్విటీ లాభాలపై దీర్ఘకాల మూలధన లాభాల పన్ను విధింపు స్టాక్ మార్కెట్‌ను నిండా ముంచింది. బడ్జెట్ నష్టాలు రెండో రోజు కూడా కొనసాగాయి. ద్రవ్యలోటు అంచనాలు పెరగడం, ప్రపంచ మార్కెట్ల పతనం కూడా ప్రభావం చూపడంతో సెన్సెక్స్, నిఫ్టీలు భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ 35,100 పాయింట్ల దిగువకు, నిఫ్టీ 10,800 పాయింట్ల దిగువకు పతనమయ్యాయి.
రాజస్తాన్ ఉపఎన్నికల్లో బీజేపీకి చుక్కెదురవడం, వచ్చే వారం ఆర్‌బీఐ పాలసీలో రేట్ల కోత అవకాశాలు ఉండకపోవచ్చన్న అంచనాలు సైతం ప్రతికూల ప్రభావం చూపించాయి. సెన్సెక్స్ ఏకంగా 840 పాయింట్లు పతనమై 35,067 పాయింట్ల వద్ద ముగిసింది. రెండేళ్లలో ఇదే అత్యంత భారీ పతనం. 2015, ఆగస్టు 24 (ఆ రోజు సెన్సెక్స్ 1,625 పాయింట్లు నష్టపోయింది) తర్వాత సెన్సెక్స్ ఒక్క రోజులో ఇన్ని పాయింట్లు నష్టపోవడం ఇదే మొదటిసారి.
నిఫ్టీ 256 పాయింట్లు పతనమై 10,761 పాయింట్ల వద్ద ముగిసింది. ఐటీ షేర్లు మినహా అన్ని రంగాల షేర్లు నష్టపోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 900 పాయింట్ల వరకూ, నిఫ్టీ 281 పాయింట్ల వరకూ నష్టపోయాయి. సెన్సెక్స్, నిఫ్టీలు రెండు వారాల కనిష్ట స్థాయికి పతనమయ్యాయి. ఇక వారం పరంగా చూస్తే సెన్సెక్స్ 984 పాయింట్లు (2.72 శాతం), నిఫ్టీ 309 పాయింట్లు (2.79 శాతం) చొప్పున నష్టపోయాయి.
పీసీ జ్యుయలర్‌పై వక్రంగీ ఎఫెక్ట్ ...
పీజీ జ్యుయలర్ షేర్ ఇంట్రాడేలో 60% వరకూ పతనమైంది. వక్రంగీ కంపెనీతో తమకెలాంటి వ్యాపార లావాదేవీలూ లేవని, తమ ప్రమోటర్లు ఎవరూ షేర్లను విక్రయిచడం కానీ, తనఖా పెట్టడం కానీ చేయలేదని, తమ ఫండమెంటల్స్ పటిష్టంగా ఉన్నాయని కంపెనీ ఇచ్చిన వివరణ కారణంగా చివరకు 24% నష్టంతో రూ.366 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.4,653 కోట్లు తగ్గి రూ.14,418 కోట్లకు పరిమితమయింది.
గత నెల 25న వక్రంగీ కంపెనీ 20 లక్షల పీసీ జ్యూయలర్ షేర్లను రూ.112 కోట్లకు కొనుగోలు చేసింది. వక్రంగీ కంపెనీ షేర్లు గత ఐదు రోజులుగా బాగా పతనమవుతుండటం, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో అవకతవకలకు పాల్పడిందంటూ వక్రంగీపై సెబీ విచారణ జరిపే అవకాశాలున్నాయన్న వార్తల ప్రభావం పీసీ జ్యూయలర్ షేర్‌పై పడిందని నిపుణులు చెబుతున్నారు.
ఇంకా ఏం జరిగిందంటే...
♦ క్యూ3 ఫలితాలు అంచనాలకు అనుగుణంగా లేకపోవడంతో బజాజ్ ఆటో 4.9 శాతం క్షీణించి రూ.3,243 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేర్ జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.3,473ను తాకింది. సెన్సెక్స్‌లో బాగా పతనమైన షేర్ ఇదే. భారతీ ఎయిర్‌టెల్ 4.2 శాతం తగ్గింది. యాక్సిస్ బ్యాంక్, మారుతీ సుజుకీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా స్టీల్, మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్, హీరో మోటొకార్ప్, కోటక్ బ్యాంక్, ఎల్ అండ్ టీ, ఎస్‌బీఐ, టాటా మోటార్స్, యస్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎన్‌టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు 4 శాతం వరకూ నష్టపోయాయి.
♦ బీఎస్‌ఈ 500 సూచీలోని దాదాపు వంద షేర్లు ఇంట్రాడేలో వాటి వాటి ఏడాది గరిష్ట స్థాయిల నుంచి 25% వరకూ నష్టపోయాయి. పీసీ జ్యూయలర్, వక్రంగీ, జస్ట్ డయల్, వోకార్డ్, యూనిటెక్, అబాన్ ఆఫ్‌షోర్, రెయిన్ ఇండస్ట్రీస్, జిందాల్ సా, ప్రజ్ ఇండస్ట్రీస్, ఫిలిప్స్ కార్బన్ బ్లాక్, తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్, రిలయన్స్ నేవల్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ షేర్లది కూడా ఇదే వరుస.
♦ ఇంట్రాడేలో ఐదు ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్లతో పాటు బీఎస్‌ఈ 500 సూచీలోని 29 షేర్లు తాజా ఏడాది కనిష్ట స్థాయికి పడిపోయాయి. అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కార్పొరేషన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, కమిన్స్ ఇండియా, డీసీఎమ్ శ్రీరామ్ ఇండస్ట్రీస్, వివిమెడ్ ల్యాబ్స్, విమ్ ప్లాస్ట్.. తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.
4.6 లక్షల కోట్లు ఆవిరి
సెన్సెక్స్ భారీ పతనం కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.4.6 లక్షల కోట్లు ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టయిన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4.6 లక్షల కోట్లు తగ్గి రూ.148.5 లక్షల కోట్లకు పడిపోయింది.
ఈ పతనం తాత్కాలికమే: ఆర్థికశాఖ
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్ పతనం తాత్కాలికమేనని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ వ్యాఖ్యానించారు. భారత వృద్ధి జోరుగా ఉందదని, ఇన్వెస్టర్లు ఆందోళన చెందాల్సిన అవసరమే లేదని ఆయన అభయం ఇచ్చారు. ఎల్‌టీసీజీ విధింపు కారణంగా మార్కెట్ నష్టపోతుందని ముందుగానే అంచనా వేశామని పేర్కొన్నారు. అయితే ఈ పతనం తాత్కాలికమేనని, ఇన్వెస్టర్లు భయపడాల్సిన పని లేదని భరోసా ఇచ్చారు.
పతనానికి పలు కారణాలు...
ఎల్‌టీసీజీతో లాభాల స్వీకరణ
ఈక్విటీ లాభాలపై 10 శాతం దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్‌టీసీజీ) విధిస్తామని ప్రకటించడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్ ద్వారా వచ్చే డివిడెడ్ ఆదాయంపై కూడా 10 శాతం పన్ను విధిస్తామనటం ఈ ప్రతికూల సెంటిమెంట్‌ను మరింత తీవ్రం చేసింది. 10% ఎల్‌టీసీజీ కారణంగా విదేశీ నిధుల జోరుకు బ్రేక్ పడుతుందన్న ఆందోళనతో అమ్మకాలు వెల్లువెత్తాయి.
ద్రవ్యలోటు అంచనాల పెంపు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు లక్ష్యాన్ని 3.2 శాతం నుంచి 3.5 శాతానికి పెంచుతున్నట్లు బడ్జెట్లో ఆర్థిక మంత్రి చెప్పారు. అంతేకాకుండా వచ్చే ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు లక్ష్యాన్ని అందరూ అంచనా వేసినట్లు 3.2 శాతంగా కాకుండా 3.3 శాతంగా నిర్ణయించారు. ఈ అంచనాల పెంపు స్టాక్ సూచీలను కుదేలు చేసింది.
ఆర్‌బీఐ పాలసీ
పంటలకు కనీస మద్దతు ధర పెంపు కారణంగా రిటైల్ ధరలు పెరుగుతాయని, ఫలితంగా రిటైల్ ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుందని, దీంతో ద్రవ్యోల్బణం నియంత్రణకు ఆర్‌బీఐ కఠిన చర్యలకు పూనుకుంటుందన్న అంచనాలు హల్‌చల్ చేశాయి. దీంతో వచ్చే వారం (6–7 తేదీల్లో) జరిగే ఆర్‌బీఐ పాలసీలో రేట్లు యథాతథంగానే ఉంటాయన్న అంచనాలకు మరింత బలం చేకూరింది.
ఫిచ్ హెచ్చరిక
కేంద్ర ప్రభుత్వ తాజా బడ్జెట్ ప్రతిపాదనల కారణంగా రుణ భారం పెరుగుతుందని, ఈ భారీ రుణ భారం భారత రేటింగ్ పెంపుకు ప్రతిబంధకంగా నిలుస్తుందంటూ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ చేసిన హెచ్చరిక బాగానే ప్రభావం చూపించింది.
ప్రపంచ మార్కెట్ల పతనం
అమెరికాలో బాండ్ల రాబడులు నాలుగేళ్ల గరిష్ట స్థాయికి పెరగడంతో అక్కడి స్టాక్ మార్కెట్ గురువారం నష్టపోయింది. ఈ ప్రభావంతో ఆసియా మార్కెట్లు నష్టపోగా, యూరప్ మార్కెట్లు సైతం నష్టాల్లో మొదలయ్యాయి. ఇవన్నీ కలసి మన మార్కెట్ల ప్రతికూలతను పెంచాయి.
బాండ్లు, రూపాయి ఒడిదుడుకులు
ద్రవ్యలోటు లక్ష్యాలు అంచనాలను మించాయి. వచ్చే వారం వెలువడే ఆర్‌బీఐ పాలసీలో ద్రవ్యోల్బణం కట్టడికి ఆర్‌బీఐ కఠినంగా వ్యవహరించే అవకాశాలున్నాయన్న అంచనాలతో బాండ్లలో ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయి. ఈ రెండిటికీ తోడు డాలర్‌తో రూపాయి మారకంలో హెచ్చుతగ్గులు కూడా తగినంత ప్రభావం చూపించాయి.
రాజస్తాన్‌లో బీజేపీ ఓటమి
రాజస్తాన్ ఉప ఎన్నికల్లో పాలక బీజేపీ ఓడిపోవడం సెంటిమెంట్‌ను ఒకింత దెబ్బతీసింది.
Comments
Please login to add a commentAdd a comment