సాక్షి, హైదరాబాద్ : కోవిడ్ కారణంగా ఆర్థిక రంగంలో నెలకొన్న స్తబ్ధతను తొలగించేలా కేంద్రం వివిధ రంగాలకు వెన్నుదన్నుగా నిలిచింది. ఆటోమొబైల్ రంగానికి ఊతమిచ్చేందుకు పలు చర్యలు చేపట్టింది. కోవిడ్ కాలంలో చిన్న కార్లు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు సంతృప్తికరంగానే ఉన్నప్పటికీ హై ఎండ్ వాహనాల అమ్మకాలకు మాత్రం బ్రేక్ పడింది. లగ్జరీ బైక్‌లపైనా వాహన వినియోగదారులు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీనిని దృష్టిలో ఉంచుకొని రూ.10 లక్షల ఖరీదు చేసే బైక్‌లపై సుమారు రూ.30 వేల వరకు, రూ.50 లక్షలు దాటిన కార్లపై రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు ధరలు తగ్గనున్నట్లు అంచనా.
కోవిడ్ కారణంగా ప్రజా రవాణా స్తంభించడం, కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని చాలామంది సొంత వాహనాలకు ప్రాధాన్యమిచ్చారు. కానీ చిన్న కార్లు, బైక్‌లకే ఎక్కువ డిమాండ్ కనిపించింది. గత ఏడాది మే నుంచి డిసెంబర్ వరకు సుమారు 50 వేల వరకు వాహన విక్రయాలు జరిగాయి. కానీ హై ఎండ్ వాహనాలకు మాత్రం పెద్దగా ఆదరణ లభించలేదు. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో హై ఎండ్ వాహనాల విక్రయాలను ప్రోత్సహించేందుకు వాహనాల ధరలను తగ్గించనున్నట్లు ప్రకటించారు.
హై ఎండ్‌పై ఆసక్తి..
గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు లక్షన్నర వరకు హై ఎండ్ వాహనాలు ఉన్నాయి. వీటిలో రూ.10 లక్షలు దాటిన బైక్‌లు లక్షకు పైగా ఉన్నట్లు అంచనా. రూ.50 లక్షలు దాటిన కార్లు సుమారు 50 వేల వరకు ఉంటాయి. ప్రతి సంవత్సరం 10 వేల నుంచి 15 వేల వరకు విక్రయిస్తున్నారు. ఆడి, బీఎండబ్ల్యూ, రేంజ్‌రోవర్, ఓల్వో, రోల్స్‌రాయిస్, లాంబోర్గ్ వంటి అధునాతన వాహనాలు హైదరాబాద్ రహదారులపై పరుగులు తీస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ధరల తగ్గింపుతో వినియోగదారులు హై ఎండ్ పట్ల ఆసక్తి చూపవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈవీలకు ఊతం..
మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాలకు కూడా మరిన్ని ప్రోత్సాహకాలు లభించనున్నాయి. ఇప్పటికే పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని ఎలక్ట్రిక్ వాహనాలకు జీవితకాల పన్ను నుంచి మినహాయింపునిచ్చిన సంగతి తెలిసిందే. వాహనాల ధరల్లోనూ ఈ ఆర్థిక సంవత్సరం కొంత వరకు తగ్గింపు ఉంటుంది.
ఎలక్ట్రిక్ బస్సులకు రైట్ రైట్..
సిటీ రోడ్లపై మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు తీయనున్నాయి. ప్రస్తుతం నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి 40 ఏసీ ఓల్వో ఎలక్ట్రిక్ బస్సులు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగిస్తుండగా.. తాజా బడ్జెట్ ప్రతిపాదనల మేరకు మరిన్ని అందుబాటులోకి రానున్నాయి. వాహన కాలుష్యాన్ని అరికట్టేందుకు కేంద్రం విద్యుత్ ఆధారిత వాహనాలకు ప్రోత్సాహాన్ని అందజేయనున్నట్లు స్పష్టం చేసింది.
దేశంలో 20 వేల ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నారు. ఇందులో భాగంగా నగరంలో కొన్ని సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఎలక్ట్రిక్ బస్సుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గతంలోనే ప్రణాళికలను సిద్ధం చేసింది. కేంద్రం ఇచ్చే రాయితీలపైన ఈ బస్సులను ప్రవేశపెట్టడం వల్ల గ్రేటర్ ఆర్టీసీ సేవలను బలోపేతం చేసేందుకు అవకాశం లభించనుంది.
ఆహ్వానించదగిన పరిణామం
కోవిడ్‌తో లగ్జరీ వాహనాల అమ్మకాలు బాగా తగ్గిపోవడంతో ఆ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వాహనాల ధరలను కొంత మేరకు తగ్గించాలని నిర్ణయించడం ఆహ్వానించదగిన మార్పు. అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని కూడా పెంచాల్సిన అవసరం ఉంది.
– రామ్‌కోటేశ్వర్‌రావు, తెలంగాణ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment