6న దేశవ్యాప్త చక్కా జామ్‌ | Protesting farmers announce 3-hour nationwide chakka jam on February 6 | Sakshi
Sakshi News home page

6న దేశవ్యాప్త చక్కా జామ్‌

Published Tue, Feb 2 2021 5:09 AM | Last Updated on Tue, Feb 2 2021 9:35 AM

Protesting farmers announce 3-hour nationwide chakka jam on February 6 - Sakshi

ఘాజీపూర్‌ వద్ద కాంక్రీట్‌ బారియర్లు

న్యూఢిల్లీ/నోయిడా: ఢిల్లీ సరిహద్దుల్లో రైతు ఆందోళనలు కొనసాగుతున్న ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ను బంద్‌ చేయడం, రైతులపై అధికారుల వేధింపులకు నిరసనగా ఈ నెల 6వ తేదీన చక్కా జామ్‌(రహదారుల దిగ్బంధనం) చేపడతామని రైతు సంఘాల నేతలు తెలిపారు. దేశవ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర రహదారులపై రాకపోకలను మూడు గంటలపాటు.. 6న మధ్యాహ్నం 12 గంటల నుంచి మూడు గంటల వరకు అడ్డుకుంటామన్నారు.

నిరసనలు కొనసాగుతున్న ప్రాంతాల్లో ప్రభుత్వం రైతులకు నీరు, కరెంటు అందకుండా చేస్తోందని నేతలు ఆరోపించారు. కేంద్ర వార్షిక బడ్జెట్‌లో రైతులను పట్టించుకోలేదనీ, సాగు రంగానికి కేటాయింపులను తగ్గించి వేసిందని స్వరాజ్‌ అభియాన్‌ నేత యోగేంద్ర యాదవ్‌ విమర్శించారు. ‘సంయుక్త కిసాన్‌ మోర్చా’, ‘ట్రాక్టర్‌2ట్విట్టర్‌’ అనే ట్విట్టర్‌ అకౌంట్లను ప్రభుత్వం మూసి వేయించిందన్నారు.

బిజ్నోర్‌లో మహాపంచాయత్‌
ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో రైతుల మహాపంచాయత్‌ జరిగింది. సోమవారం స్థానిక ఐటీఐ గ్రౌండ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి బిజ్నోర్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు ట్రాక్టర్లలో తరలివచ్చారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన పంచాయత్‌కు ఆ ప్రాంత రైతు నేతలు కూడా హాజరయ్యారు.    ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనకు మద్దతుగా ఇప్పటికే ముజఫర్‌నగర్, మథుర, భాగ్‌పట్‌ జిల్లాల్లో మహాపంచాయత్‌లు నిర్వహించారు.  

సింఘు వద్ద కాంక్రీట్‌ గోడ
ఢిల్లీ సరిహద్దుల్లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలను కట్టడి చేసేందుకు యంత్రాంగం పక్కా ఏర్పాట్లు చేపడుతోంది. ఢిల్లీ సరిహద్దుల్లోని రైతు నిరసనలు కొనసాగుతున్న సింఘు వద్ద హైవేపై రెండు వరుసల సిమెంట్‌ బారియర్ల మధ్యన ఇనుపరాడ్లను అమర్చి, కాంక్రీట్‌తో నింపుతోంది. పోలీసు అధికారుల పర్యవేక్షణలో ఇందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఢిల్లీ–యూపీ సరిహద్దుల్లోని ఘాజీపూర్‌ వద్ద వాహనాల రాకపోకలను అడ్డుకునేందుకు పలు వరుసల బారికేడ్లను నిర్మించారు. బారికేడ్లతోపాటు ఆందోళనకారులు హద్దులు దాటి రాకుండా ముళ్లకంచెను కూడా పోలీసులు ఏర్పాటు చేశారు.

ఇప్పటికే ఢిల్లీ–హరియాణా సరిహద్దుల్లో తాత్కాలిక సిమెంట్‌ గోడను నిర్మించి, రహదారిని పాక్షికంగా మూసివేశారు. ట్రాక్టర్‌ పరేడ్‌ సందర్భంగా జనవరి 26వ తేదీన నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపడుతున్నారు.  హైవేకు కొద్ది దూరంలో ఉన్న ఓ వీధి వద్ద చిన్న కందకం కూడా తవ్వారు. రహదారికి రెండు వైపులా సిమెంట్‌ బారికేడ్లను ఏర్పాటు చేశారు. భారతీయ కిసాన్‌ సంఘ్‌ ఆందోళనకు యూపీ, హరియాణా, రాజస్తాన్‌ నుంచి రైతుల మద్దతు పెరుగుతుండటంతో వాహనాలను క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు.

సరిహద్దుల్లో ఇంటర్నెట్‌ సేవలపై నిషేధం
ఢిల్లీ సరిహద్దుల్లో రైతు సంఘాలు ఆందోళనలు కొనసాగిస్తున్న సింఘు, ఘాజీపూర్, టిక్రిల వద్ద ఇంటర్నెట్‌ సేవలపై విధించిన సస్పెన్షన్‌ను మంగళవారం రాత్రి వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ తెలిపింది. వీటితోపాటు రైతులు నిరసన తెలుపుతున్న మరికొన్ని ప్రాంతాలకు కూడా ఈ నిషేధం వర్తిస్తుందని పేర్కొంది. ఈ సస్పెన్షన్‌ జనవరి 31వ తేదీ రాత్రి 11 గంటల నుంచి ఫిబ్రవరి 2వ తేదీ రాత్రి 11 గంటల వరకు అమల్లో ఉంటుందని వివరించింది. టెంపరరీ సస్పెన్షన్‌ ఆఫ్‌ టెలికం సర్వీసెస్‌ నిబంధనలు–2017 ప్రకారం శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు ఈ చర్య చేపట్టినట్లు పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement