సాక్షి, అమరావతి: సర్వ జనుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర బడ్జెట్ రూపుదిద్దుకుంది. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి ఈ బడ్జెట్‌లో అగ్రతాంబూలం దక్కింది. బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ, కాపు, బ్రాహ్మణులు, మైనార్టీలు.. ఇలా ప్రతి ఒక్కరి సంక్షేమానికి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. గతేడాది కంటే అన్ని వర్గాలకు నిధుల కేటాయింపు పెరగడం విశేషం.
పేద, వెనుకబడిన, బలహీనవర్గాల అవసరాలను, ప్రాధాన్యతలను నెరవేర్చేలా కేటాయింపులు జరిగాయి. ఇప్పటికే ఇచ్చిన హామీల్లో 90 శాతంపైగా నెరవేర్చిన ఘనతను దక్కించుకున్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నవరత్నాల ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. నవరత్నాలతోపాటు వివిధ పథకాల ద్వారా సంక్షేమ ఫలాలు అందిస్తోంది.
ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి.. భారీగా నిధులు
బడ్జెట్‌లో షెడ్యూల్డ్ కులాలు, గిరిజనుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. ఎస్సీ సబ్‌ప్లాన్‌కు గత ఆర్థిక సంవత్సరంలో రూ.14,218.76 కోట్లు కేటాయించగా.. ఈసారి 17,403.14 కోట్లకు పెంచింది. తద్వారా గతేడాది కంటే రూ.3,184.38 కోట్లను ఎస్సీల కోసం అదనంగా కేటాయించింది. ఎస్టీ సబ్‌ప్లాన్‌కు 2020–21లో రూ.4,814.50 కోట్లు కేటాయించగా ఈసారి 27 శాతం(రూ.1,316.74 కోట్లు) అదనంగా పెంచుతూ రూ.6,131.24 కోట్ల మేర కేటాయింపులు జరిపింది.
- ఎస్సీ సబ్‌ప్లాన్‌కు 17,403.14కోట్లు
- ఎస్టీ సబ్‌ప్లాన్‌కు 6,131.24కోట్లు
- గతేడాది కంటే 3,184.38కోట్లు అదనం
- గతేడాది కన్నా 27 శాతం అదనపు నిధులు
Comments
Please login to add a commentAdd a comment