బడ్జెట్ 2021-22‌: ఓ లుక్కేయండి! | Union Budget 2021-22 Summary: Complete Overview Of Budget | Sakshi
Sakshi News home page

వ్యక్తులకు, వ్యవస్థకు వ్యాక్సినేషన్‌

Published Tue, Feb 2 2021 2:08 AM | Last Updated on Tue, Feb 2 2021 4:31 PM

Union Budget 2021-22 Summary: Complete Overview Of Budget - Sakshi

చరిత్ర రాల్చిన విషపు చుక్క లాంటి కోవిడ్‌తో... మనుషులే కాదు, వ్యవస్థలూ మంచానపడ్డాయి. కాస్త కోలుకున్నా... పూర్వపు స్థితి వస్తుందో రాదో తెలియని స్థితి. కాకపోతే జనానికిప్పుడు వ్యాక్సిన్‌ అందుతోంది. ఈ బడ్జెట్‌తో భారత ఆర్థిక వ్యవస్థక్కూడా తొలిడోసు టీకా ఇచ్చే ప్రయత్నం చేసింది మోదీ ప్రభుత్వం. విద్య, వైద్యం, రోడ్లు, నౌకాశ్రయాలు... ఇలా అన్నింటా మౌలిక సదుపాయాలకు జై కొడుతూ ప్రణాళిక వ్యయాన్ని ఏకంగా రూ.5.54 లక్షల కోట్లకు పెంచింది. ఆరోగ్య, మౌలిక రంగాలపై దృష్టిపెట్టింది. త్వరలో ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాలపై ప్రత్యేక ప్రేమ చూపించింది. మరి ఇంత డబ్బెలా వస్తుంది..?? ఒకటి... భారీ అప్పులు తప్పవు. మరి ఆ తరవాత..? 

‘సేల్‌ ః ఇండియా’!!. ఆర్థిక మంత్రి ఆశలన్నీ దీనిపైనే. 
టోల్‌ రోడ్లు, రైల్వే లైన్లు, గ్యాస్‌ పైప్‌లైన్లు, విమానాశ్రయాలు, గిడ్డంగులు, క్రీడా మైదానాలు... వీటన్నిటికీ ‘ఫర్‌ సేల్‌’ ట్యాగ్‌ తగిలించబోతున్నారు. ఇక ప్రభుత్వ కంపెనీలు ఎల్‌ఐసీ, బీపీసీఎల్, ఎయిరిండియా, షిప్పింగ్‌ కార్పొరేషన్, కంటెయినర్‌ కార్పొరేషన్, ఐడీబీఐ బ్యాంక్, బీఈఎంఎల్, పవన్‌ హాన్స్, నీలాచల్‌ ఇస్పాత్‌ నిగం సరేసరి. వాటిలో వాటా విక్రయాన్ని ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లోనైనా పూర్తిచేయాలన్నది ప్రణాళిక. నిజానికి ప్రభుత్వానికి వేరే మార్గం కూడా లేదు. ఇక అన్నిటికన్నా సాహసోపేతమైన చర్య... 
జవాబుదారీ తనమే లక్ష్యంగా మరో రెండు బ్యాంకుల ప్రైవేటీకరణ. జాతీయీకరణ జరిగిన 51 ఏళ్ల తరవాత ఓ రెండు బ్యాంకులు మళ్లీ ప్రైవేటు రంగం చేతుల్లోకి వెళ్లబోతున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగి అమ్మకాలు పూర్తయితే... భారత ఆర్థిక వ్యవస్థకు వ్యాక్సిన్‌ ఇచ్చినట్లే. మరి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయా..? అది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాలి.!!  

సిక్స్‌ ప్యాక్‌ బడ్జెట్‌...
దేశం కరోనా కల్లోలం నుంచి తేరుకొని వృద్ధి బాటలో పరుగులు పెట్టేందుకు ఆరు కీలక రంగాలు పునాదులుగా ‘సిక్స్‌ పిల్లర్‌ బడ్జెట్‌’ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఆ ఆరు రంగాలు ఏమిటంటే... 

ఆరోగ్యంపై త్రికరణ శుద్ధి.. 
వ్యాధి నివారణ, చికిత్స, బాగోగులే లక్ష్యంగా ఆరోగ్య రంగానికి అత్యంత ప్రాధాన్యం కల్పించి బడ్జెట్‌లో కేటాయింపులు 137 శాతం పెంచారు. కోవిడ్‌ వ్యాక్సినేషన్‌కు రూ.35,000 కోట్లు ప్రతిపాదించారు.

పీఎల్‌ఐ
ఆత్మనిర్భర్‌ భారత్‌ కింద ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకానికి ఐదేళ్లలో రూ.1.97 లక్షల కోట్లు. ఉత్పత్తి సంస్థలు అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో భాగస్వాములుఅయ్యేందుకు ఇది ఉపకరిస్తుంది.

వ్యవసాయ భారతం.. 
వ్యవసాయ ఉత్పత్తుల ఉత్పాదక వ్యయంపై కనీసం 1.5 రెట్లు అధికంగా మద్దతు ధర. వ్యవసాయ రుణ పరిమితి లక్ష్యం పెంపు. పశు సంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమ రంగాలపై ప్రత్యేక దృష్టి.


నాణ్యమైన విద్య.. 
దేశంలో కొత్తగా 100 సైనిక స్కూళ్లు. ఉన్నత విద్యలో నాణ్యతకు కమిషన్‌ ఏర్పాటు. గిరిజన ప్రాంతాల్లో 750 ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లు. ఉపాధిని పెంపొందించేందుకు అప్రెంటిస్‌షిప్‌ చట్టం.

పరిశోధనలకు ప్రోత్సాహం
నూతన ఆవిష్కరణలు, పరిశోధన, అభివృద్ధి రంగాలకు వచ్చే ఐదేళ్లలో రూ.50,000 కోట్ల కేటాయింపుపై విధివిధానాలు. డిజిటల్‌ చెల్లింపుల ప్రోత్సాహానికి రూ.1,500 కోట్లు.

కనిష్ట ప్రభుత్వం–గరిష్ట పాలన
సత్వర న్యాయానికి ట్రిబ్యునళ్లలో సంస్కరణలు. దేశంలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను పెంచేందుకు పన్ను చెల్లింపుదారులపై ఒత్తిడి తగ్గించేలా పారదర్శక, సమర్థ పన్నుల విధానం.   

న్యూఢిల్లీ: ఆరోగ్య భారత్, ఆత్మనిర్భర్‌ భారత్‌ లక్ష్యంగా ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ కేంద్ర బడ్జెట్‌ను ప్రకటించారు. కరోనా సృష్టించిన విధ్వంసంతో అస్తవ్యస్తమైన వ్యవస్థలను గాడిన పెట్టడంతో పాటు, భవిష్యత్తులో విశ్వ యవనికపై భారత పతాకాన్ని రెపరెపలాడించే ఆర్థిక ప్రణాళికను దేశప్రజల ముందుంచారు. దేశ ప్రజలకు కరోనా నుంచి విముక్తి కలిగించే వ్యక్తిగత వ్యాక్సిన్‌తో పాటు, కరోనాతో కుదేలైన రంగాలకు ఊరట కల్పించి, వృద్ధి బాట పట్టించేందుకు అవసరమైన వ్యాక్సిన్‌నూ ఈ బడ్జెట్‌లో పొందుపర్చారు. కరోనా కల్లోలం నుంచి తేరుకుని వృద్ధి దిశలో పరుగులు పెట్టాల్సిన దేశానికి అవసరమైన ముడి సరుకులను ప్రణాళికాబద్ధంగా సిద్ధం చేశారు. 2021– 22 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్‌ను సోమవారం ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్‌ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. స్వల్పకాలం ఊరట కల్పించే పథకాల ప్రకటన కన్నా దీర్ఘకాలంలో దేశాభివృద్ధికి బాటలు వేసే వ్యవస్థీకృత కార్యక్రమాలపై ఈ బడ్జెట్‌లో దృష్టి పెట్టారు.

ఈ దిశగా ఆరు కీలక రంగాలు పునాదులుగా ‘సిక్స్‌ పిల్లర్‌ బడ్జెట్‌’ను ఆమె ప్రవేశపెట్టారు. స్వాస్థ భారత్, పెట్టుబడులు– మౌలిక సదుపాయాలు, సమగ్ర సమ్మిళిత పురోగతి, మానవ వనరుల అభివృద్ధి, సృజనాత్మకత– పరిశోధన–అభివృద్ధి, కనీస ప్రభుత్వం– గరిష్ట పాలన.. స్థూలంగా ఈ ఆరు రంగాలు పునాదులుగా బడ్జెట్‌ను రూపొందించామని నిర్మల తెలిపారు. ‘నేషన్‌ ఫస్ట్‌’సంకల్పంలో భాగంగా, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం, మౌలిక వసతుల కల్పన, స్వాస్థ భారత్, సుపరిపాలన, యువతకు ఉపాధి అవకాశాలు, అందరికీ విద్య, మహిళా సాధికారత, సమ్మిళిత వృద్ధి.. అనే ఎనిమిది అంశాలపై ఆర్థిక మంత్రి ప్రధానంగా దృష్టి పెట్టారు. ఈ బడ్జెట్‌లో ఆరోగ్యం, మౌలిక వసతులపై కేటాయింపులను భారీగా పెంచారు. బీమా రంగంలో విదేశీ పెట్టుబడుల పరిమితిని ప్రస్తుతమున్న 49% నుంచి 74 శాతానికి పెంచాలని ప్రతిపాదించారు. వ్యక్తిగత, కార్పొరేట్‌ పన్ను రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు.

దేశీయ తయారీ రంగానికి ఉపకరించేలా ఆటోమొబైల్‌ విడిభాగాలు, మొబైల్‌ ఫోన్‌ విడిభాగాలు, సోలార్‌ ప్యానెల్స్‌ల దిగుమతులపై కస్టమ్స్‌ డ్యూటీని పెంచారు. అలాగే, యాపిల్స్, పీస్, పప్పు ధాన్యాలు, ఆల్కహాల్, కెమికల్స్, వెండి, పత్తి.. తదితర పలు ఉత్పత్తుల దిగుమతులపై వ్యవసాయ మౌలిక వసతులు, అభివృద్ధి పన్ను(అగ్రి సెస్‌– అగ్రికల్చర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెస్‌)ను విధించారు. అయితే, ఇంపోర్ట్‌ డ్యూటీని సర్దుబాటు చేయడం ద్వారా ఆయా ఉత్పత్తుల ధరలపై ప్రభావం పడకుండా చూస్తారు. భవిష్యనిధి(ప్రావిడెంట్‌ ఫండ్‌)కు ఉద్యోగి ఇచ్చే వాటాపై వడ్డీ ఏడాదికి రూ. 2.5 లక్షలు దాటితే, అది ఏప్రిల్‌ 1, 2021 నుంచి పన్ను పరిధిలోకి వస్తుంది. కాగా, సీనియర్‌ సిటిజన్లకు స్వల్ప ఊరట కలిగించే నిర్ణయాన్ని ఈ బడ్జెట్‌లో ప్రకటించారు.

పెన్షన్‌పై, వడ్డీపై మాత్రమే ఆధారపడిన 75 ఏళ్లు పైబడిన వృద్ధులు ఇకపై ఐటీ రిటర్న్‌లు దాఖలు చేయాల్సిన అవసరం లేదు. అలాగే, అందరికీ సొంత ఇల్లు లక్ష్య సాధనలో భాగంగా ప్రకటించిన గృహ రుణ వడ్డీలో రూ. 1.5 లక్షల తగ్గింపు సదుపాయం మరో సంవత్సరం పాటు కొనసాగించనున్నారు. ఈ పథకం 2022 మార్చి 31 వరకు కొనసాగుతుంది. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన బడ్జెట్‌ ఇదేనని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసించారు. మరోవైపు, ఈ బడ్జెట్‌పై విపక్ష కాంగ్రెస్‌ పెదవి విరిచింది. గతమెన్నడూ లేనంత నిరుత్సాహపూరితంగా ఉందని అభివర్ణించింది. తప్పు వ్యాధి నిర్ధారణ, చికిత్స రెండు తప్పుడువేనని పేర్కొంది.  

మౌలికం కోసం.. 
మౌలిక వసతుల రంగంలో పెట్టుబడుల కల్పన కోసం ఈ బడ్జెట్‌లో ఏకంగా రూ. 5.54 లక్షల కోట్లను ఆర్థికమంత్రి కేటాయించారు. ఇందులో ప్రధానంగా రూ. 1.18 లక్షల కోట్లు రోడ్స్‌ అండ్‌ హైవే రంగానికి, రూ. 1.08 కోట్లు రైల్వే రంగానికి కేటాయించారు. ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ ఏర్పడేందుకు, ఉపాధి కల్పనకు ఈ నిధులు ఉపయోగపడ్తాయని తెలిపారు. ఇందుకు అదనంగా అవసరమైన నిధులను పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా సాధిస్తామన్నారు. వ్యూహాత్మక రంగంలో లేని ప్రభుత్వ రంగ కంపెనీల్లో వాటాల ఉపసంహరణ ద్వారా రూ. 1.75 లక్షల కోట్లు, కొత్తగా విధించిన అగ్రిసెస్‌ ద్వారా రూ. 30 వేల కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని నిర్మల సీతారామన్‌ వెల్లడించారు. ఆత్మనిర్భర భారత్‌ రూపుదిద్దుకునేందుకు భారతీయ తయారీ పరిశ్రమలు ప్రపంచ దేశాలకు సరఫరా కేంద్రాలుగా మారాల్సి ఉందని నిర్మల పిలుపునిచ్చారు. ఇందుకు గానూ ఐదేళ్ల కాలపరిమితితో 2020లోనే రూ. 1.97 లక్షల కోట్లను కేటాయించామన్నారు. దేశీయ టెక్స్‌టైల్స్‌ రంగం అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేందుకు వీలుగా దేశవ్యాప్తంగా రానున్న మూడేళ్లలో ఏడు ‘మెగా టెక్స్‌టైల్స్‌ ఇన్‌వెస్ట్‌మెంట్‌ పార్క్‌’లను ఏర్పాటు చేయనున్నామన్నారు.  


లోక్‌సభలో బడ్జెట్‌ను చదివి వినిపిస్తున్న నిర్మలా సీతారామన్‌. చిత్రంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్, ప్రహ్లాద్‌ జోషి తదితరులు   

సాగు సాయం 
కొత్త సాగు చట్టాల రద్దు డిమాండ్‌తో గత రెండు నెలలుగా దేశ రాజధాని సరిహద్దుల్లో లక్షలాది రైతులు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్న నేపథ్యంలో.. రైతుల ఆదాయం పెంపు లక్ష్యంగా వ్యవసాయ రంగంలో సంస్కరణలు కొనసాగుతాయని కేంద్రం స్పష్టం చేసింది. రైతు ప్రయోజనాలు లక్ష్యంగా మరే ఇతర ప్రభుత్వం కూడా తమ ప్రభుత్వంలా చర్యలు తీసుకోలేదని పేర్కొంది. వ్యవసాయ రుణాల లక్ష్యంలో ఈ సంవత్సరం 10% పెంపును ప్రతిపాదిస్తున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఈ పెంపుతో రైతులకు రూ. 16.5 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు అందుబాటులో ఉంటాయన్నారు. పంట నిల్వకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు కొత్తగా ప్రతిపాదించిన అగ్రి సెస్‌ మొత్తాన్ని వినియోగిస్తామని తెలిపారు. 2013–14లో గోధుమ సేకరణ కోసం నాటి ప్రభుత్వం రూ. 33,874 కోట్లు ఖర్చుచేయగా, 2020–21లో తమ ప్రభుత్వం రూ. 75,050 కోట్లు ఖర్చుచేసిందన్నారు.

స్వమిత్వ పథకంలో భాగంగా 1.8 లక్షల మంది రైతులు ప్రాపర్టీ పట్టాలు పొందారని ఆర్థిక మంత్రి సీతారామన్‌ గుర్తుచేశారు. వ్యవసాయ మార్కెట్లకు ఇకపై అగ్రికల్చర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర, మండీల కొనసాగింపుపై రైతుల్లో ఆందోళనలు నెలకొన్న పరిస్థితుల్లో బడ్జెట్లో ఈ ప్రతిపాదన చేశారు. ఎలక్ట్రానిక్‌ నేషనల్‌ అగ్రికల్చర్‌ మార్కెట్‌(ఈ–నామ్‌) విధానం విజయవంతమైందని, ఇప్పటివరకు 1.68 కోట్ల మంది రైతులు ఇందులో రిజిస్టర్‌ అయ్యారని, రూ. 1.14 లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయని నిర్మల తెలిపారు. త్వరలో మరో వెయ్యి మండీలను ‘ఈ–నామ్‌’లో చేరుస్తామన్నారు. మత్య్స పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, దేశంలోని విశాఖపట్నం, చెన్నై, కొచ్చి, పారాదీప్, పెటువఘాట్‌ ఫిషింగ్‌ హార్బర్‌లను ‘ఎకనమిక్‌ యాక్టివిటీ హబ్స్‌’గా ఆధునీకరిస్తామని హామీ ఇచ్చారు.  

పెట్రోపై ‘అగ్రి సెస్‌’ 
తాజా బడ్జెట్‌లో పలు ఇతర దిగుమతులతో పాటు పెట్రోలు, డీజిల్‌లపై కూడా అగ్రి సెస్‌ను ప్రకటించారు. లీటరు పెట్రోలుపై రూ. 2.5ను, లీటరు డీజిల్‌పై రూ. 4ను అగ్రిసెస్‌గా నిర్ణయించారు. అయితే, అంతే మొత్తంలో ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించడం ద్వారా ఆ భారం వినియోగదారుడిపై పడకుండా జాగ్రత్త తీసుకున్నారు. 

రక్షణ.. నామమాత్రమే 
చైనాతో తూర్పు లద్దాఖ్‌ సరిహద్దుల్లో తీవ్ర స్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రక్షణ రంగానికి భారీగా కేటాయింపులు ఉంటాయని భావించారు. కానీ, రక్షణ రంగ బడ్జెట్‌ను గత సంవత్సరం కన్నా నామమాత్రంగా 1.4% మాత్రమే పెంచారు. గత సంవత్సరం ఈ మొత్తం రూ. 4.71 లక్షల కోట్లు కాగా, ఈ సంవత్సరం అది రూ. 4.78 లక్షల కోట్లకు పెంచారు. రూ. 1.35 లక్షల కోట్లను ఆయుధాలు, యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు, ఇతర మిలటరీ హార్డ్‌వేర్‌ కొనుగోలు కోసం కేటాయించారు.  

‘ఎన్నికల’ రాష్ట్రాలకు వరాలు 
ఈ సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేక వరాలు ప్రకటించింది.పశ్చిమబెంగాల్‌కు రూ. 25 వేల కోట్లు, తమిళనాడుకు రూ. 1.03 లక్షల కోట్లు, కేరళకు రూ. 65 వేల కోట్లు, అస్సాంకు 19 వేల కోట్ల విలువైన పెట్టుబడుల ప్రతిపాదనలను బడ్జెట్లో పొందుపర్చింది. 

ద్రవ్యలోటు తగ్గించేందుకు.. 
కరోనా మహమ్మారి సమయంలో ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వం భారీగా ఖర్చు చేసిన నేపథ్యంలో ప్రస్తుత సంవత్సర ద్రవ్యలోటు జీడీపీలో 9.5 శాతంగా ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరం ఇది జీడీపీలో 6.8 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. మునుపెన్నడు లేనంత ఎక్కువగా ప్రభుత్వ ఖర్చు పెరిగిందని ఆర్థికమంత్రి తెలిపారు. ఎకానమీకి ద్రవ్య విధాన మద్దతు మరో మూడేళ్లు కొనసాగుతుందని, ద్రవ్యలోటు 2025–26 సంవత్సరానికి జీడీపీలో 4.5 శాతానికి తగ్గుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కస్టమ్స్‌ డ్యూటీని తగ్గించడంతో బంగారం, వెండి ధరలు తగ్గే అవకాశముంది. అలాగే, పలు ఐరన్, స్టీల్‌ ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని పెంచడంతో ఆయా వస్తువుల ధరలు పెరిగి, రియల్‌ ఎస్టేట్‌ రంగంపై ప్రతికూల ప్రభావం పడనుంది. పట్టణాభివృద్ధి రంగానికి సంబంధించి.. ఐదేళ్ల కాలానికి గానూ రూ. 2.87 లక్షల కోట్లతో ‘జల జీవన్‌ మిషన్‌ –అర్బన్‌’ను ప్రారంభించనున్నట్లు ఆర్థికమంత్రి తెలిపారు. అలాగే, ‘పబ్లిక్‌ బస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సర్వీసెస్‌’కోసం రూ. 18 వేల కోట్లు కేటాయించామన్నారు. 

నగదు సమీకరణ 
పథకాల అమలు, ఇతర అవసరాల కోసం ఆస్తులను నగదుగా మార్చుకునే ప్రక్రియ ఏ ప్రభుత్వానికైనా అవసరమని ఆర్థికమంత్రి పేర్కొన్నారు. పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ఐడీబీఐతో పాటు రెండు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో వాటాలను అమ్మాలని నిర్ణయించామన్నారు. మంత్రిత్వ శాఖల వద్ద, ప్రభుత్వ రంగ సంస్థల వద్ద అదనంగా ఉన్న భూములను అమ్మకానికి పెట్టనున్నట్లు వెల్లడించారు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం రూ. 1.75 లక్షల కోట్లు కాగా, 2020–21 సంవత్సరానికి రూ. 2.1 లక్షల కోట్లు. అయితే, కరోనా కారణంగా రూ. 20 వేల కోట్లను కూడా సమీకరించలేకపోయారు. 

ముఖ్యాంశాలు
మహా కవుల మాటలు 
ప్రసంగం సమయంలో మహాకవులు రవీంద్రనాథ్‌ టాగోర్, తిరువళ్లువర్‌ల కవితాపంక్తులను నిర్మలాసీతారామన్‌ ఉటంకించారు. ‘తూరుపున పూర్తిగా తెలవారకముందే రానున్న వెలుగు రేకలను ఊహిస్తూ గానం చేయడమే విశ్వాసం’అనే రవీంద్రుడి కవితాపాదాన్ని ఆమె ప్రసంగం ప్రారంభించిన కాసేపటికే గుర్తుచేశారు. అలాగే, ‘రాజు/పాలకుడు సంపదను సృష్టించి, సమీకరించి, అనంతరం ఆ సంపదను పరిరక్షించి, ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగిస్తాడు’అన్న తమిళ మహాకవి తిరువళ్లువర్‌ రాసిన పంక్తులను కూడా ఆమె చదివారు. ప్రత్యక్ష పన్నుల వివరాలను వెల్లడించేముందు ఆమె ఈ పంక్తులను వినిపించారు. గత సంవత్సరం కూడా ఆమె తిరువళ్లువర్‌ను ఉటంకించారు. అంతకుముందు, యూపీఏ ఆర్థికమంత్రి చిదంబరం కూడా తమిళనాడుకు చెందిన ఆ మహాకవి వ్యాఖ్యలను తన బడ్జెట్‌ ప్రసంగంలో వినిపించారు. 
♦ఇది తొలి కాగిత రహిత, డిజిటల్‌ బడ్జెట్‌ 
♦ఎరుపు రంగు చీరలో, ఎరుపు రంగు వస్త్రంతో రూపొందిన సంచీ(బాహీ ఖాతా)తో నిర్మల సభకు వచ్చారు. బడ్జెట్‌ను తొలిసారి ట్యాబ్‌లో చూసి చదివారు.  

స్వాస్థ్య భారత్‌.. 
కరోనా వైరస్‌ విజృంభణతో మునుపెన్నడు చూడని సంక్షోభాన్ని భారత్‌ ఎదుర్కొంది. సాధారణ జన జీవనం అస్తవ్యస్తమైంది. ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో, ఆరోగ్య రంగంలో స్వావలంబన అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికే పెద్ద పీట వేసింది. కోవిడ్‌–19 వ్యాక్సిన్‌కు కేటాయించిన రూ. 35 వేల కోట్లు సహా మొత్తంగా రూ. 2, 23, 846 లక్షల కోట్లను కేటాయించింది. ఇది ఈ రంగానికి గత సంవత్సరంలో కేటాయించిన మొత్తం కన్నా 137% అధికం. ఆత్మ నిర్భర భారత్‌ పునాదుల్లో ఆరోగ్య భారత్‌ అత్యంత కీలకమైనదని ఈ సందర్భంగా నిర్మలాసీతారామన్‌ స్పష్టం చేశారు. వ్యాధి నివారణ, చికిత్స, సమగ్ర శ్రేయస్సు అనే మూడు అంశాలను దృఢతరం చేసేలా కేటాయింపులు జరిపామన్నారు.

కోవిడ్‌–19 టీకా కోసం కేటాయించిన రూ. 35 వేల కోట్లు ప్రాథమిక అంచనాయేనని, అవసరమైతే, ఆ మొత్తాన్ని పెంచుతామని వివరించారు. రూ. 64,180 కోట్లతో త్వరలో ప్రధానమంత్రి ఆత్మనిర్బర్‌ స్వాస్థ యోజనను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. అన్ని జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కరోనా సంక్షోభాన్ని భారత్‌ అద్భుతంగా ఎదుర్కొందని ఈ సందర్భంగా నిర్మల సీతారామన్‌ వ్యాఖ్యానించారు. లాక్‌డౌన్‌ ప్రకటించిన 48 గంటల్లోపే ప్రధాని మోదీ రూ. 2.76 లక్షల కోట్లతో ప్రధానమంత్రి గరీబ్‌కళ్యాణ్‌ యోజనను ప్రకటించారని గుర్తు చేశారు. ఆరోగ్యానికి వాయు కాలుష్యం చేసే చేటును దృష్టిలో పెట్టుకుని 20 ఏళ్లు దాటిన వ్యక్తిగత వాహనాలను, 15 ఏళ్లు దాటిన కమర్షియల్‌ వాహనాలను నిషేధించేందుకు వీలుగా ప్రత్యేక విధానాన్ని ప్రారంభించనున్నామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement