Overview
-
పాత కారే అని చీప్‌గా చూడకండి: ఈ విషయం తెలిస్తే..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పాత కారు.. పేరులో పాత ఉందని చిన్నచూపు చూడకండి. దేశంలో అమ్ముడవుతున్న పాత కార్ల సంఖ్య తెలిస్తే నోరెళ్లబెడతారు. 2022–23లో దేశవ్యాప్తంగా 15 శాతం వృద్ధితో 50 లక్షల యూనిట్ల యూజ్డ్ కార్లు చేతులు మారాయి. ఇందులో అవ్యవస్థీకృత రంగం వాటా 70 శాతం కాగా వ్యవస్థీకృత (ఆర్గనైజ్డ్) రంగం వాటా 30 శాతం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ 65 లక్షల యూనిట్లను తాకనుంది. ఈ రంగంలో దేశంలో ఎనిమిదవ స్థానంలో ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాటా 8 శాతంగా ఉంది. భారత్‌లో 2030 నాటికి పాత కార్ల పరిశ్రమ కొత్త వాటితో పోలిస్తే రెండింతలకు చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. తొలిసారిగా కారును సొంతం చేసుకుంటున్న కస్టమర్లలో 70 శాతం మంది పాత కారును కొనుగోలు చేస్తున్నారంటే ఆశ్చర్యం కలగకమానదు. వ్యవస్థీకృత రంగమే.. యూజ్డ్ కార్ల మార్కెట్‌ను వ్యవస్థీకృత రంగమే నడిపిస్తోందని కార్స్24 కో–¸పౌండర్, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ గజేంద్ర జంగిద్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘పాత కార్ల రంగంలో అవ్యవస్థీకృత మార్కెట్ వార్షిక వృద్ధి 10 శాతమే. ఆర్గనైజ్డ్ మార్కెట్ ఏకంగా 30 శాతం వృద్ధి చెందుతోంది. కొత్త కార్ల విషయంలో 75 శాతం మందికి రుణం లభిస్తోంది. అదే పాత కార్లు అయితే ఈ సంఖ్య 15 శాతమే. యూజ్డ్ కార్లకు రుణం లభించడం అంత సులువు కాదు. ఇక కారు ఉండాలనుకోవడం ఒకప్పుడు ఆకాంక్ష. నేడు అవసరంగా భావిస్తున్నారు. అందుకే కొత్తదానితో పోలిస్తే సగం ధరలో దొరికే యూజ్డ్ కారు స్టీరింగ్ పట్టుకుంటున్నారు. ఇటీవలి కాలంలో సర్టీఫైడ్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. క్వాలిటీ చెక్స్, వారంటీ, రిటర్న్ పాలసీ, ఈజీ ఫైనాన్స్.. ఇన్ని సౌకర్యాలు ఉండడంతో సర్టీఫైడ్ కార్ల పట్ల వినియోగదార్లలో నమ్మకం ఏర్పడింది’ అని ఆయన వివరించారు. రెండు నగరాల్లోనే.. భారత్‌లో యూజ్డ్ కార్ల విక్రయ రంగంలో ఉన్న కంపెనీలు, విక్రేతలు వాహనాలను కొనుగోలు చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. అదే హైదరాబాద్, బెంగళూరు మార్కెట్లలో మాత్రమే పార్కింగ్ విధానం ఉందని కార్స్24 చెబుతోంది. అంటే పాత కారు యజమానులు యూజ్డ్ కార్స్ విక్రయ కేంద్రాల్లో అద్దె చెల్లించి తమ వాహనాన్ని పార్క్ చేయవచ్చు. మంచి బేరం వస్తే యజమాని సమ్మతి మేరకు కారును విక్రయిస్తారు. కమీషన్ ఆధారంగానూ క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. ఇక 2015లో 100 కొత్త కార్లు రోడ్డెక్కితే అంతే స్థాయిలో పాత కార్లు చేతులు మారాయి. ఇప్పుడీ సంఖ్య 150 యూనిట్లకు చేరింది. యూఎస్, ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లో 100 కొత్త కార్లకు 400 పాత కార్లు అమ్ముడవుతున్నాయి. సగటు ధర రూ. 6 లక్షలు.. పాత కారు కొనుగోలు సగటు ధర రూ.6 లక్షలు ఉంటోంది. అమ్ముడవుతున్న మొత్తం పాత కార్లలో హ్యాచ్‌బ్యాక్ వాటా 60 శాతం కైవసం చేసుకుంది. ఈ విభాగం వృద్ధి నిలకడగా ఉంది. 20 శాతం వాటా ఉన్న సెడాన్స్ వృద్ధి రేటు తగ్గుతూ ప్రస్తుతం 20 శాతానికి వచ్చి చేరింది. ఎస్‌యూవీల వాటా క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం 20 శాతంగా ఉంది. అయితే వృద్ధి ఏకంగా 30 శాతానికి చేరింది. 2030 నాటికి ఎస్‌యూవీల వాటా పాత కార్ల కొనుగోళ్లలో 40 శాతానికి ఎగుస్తుందని పరిశ్రమ భావిస్తోందని సుదీర్కార్స్.కామ్ ఫౌండర్ బండి సు«దీర్ రెడ్డి తెలిపారు. అదే కొత్త కార్ల విషయంలో ప్రస్తుతం ఎస్‌యూవీల వాటా 45 శాతం తాకిందన్నారు. హ్యాచ్బ్యాక్స్ వాటా 30 శాతముందని చెప్పారు. దేశవ్యాప్తంగా గత ఆర్థిక సంవత్సరంలో 38.9 లక్షల యూనిట్ల కొత్త కార్లు రోడ్డెక్కాయి. 2023–24లో ఈ సంఖ్య 40 లక్షల యూనిట్లు దాటుతుందన్న అంచనాలు ఉన్నాయి. -
అడుగులేద్దాం... ఆశే ఊపిరిగా
తుది మొదలు లేని నిరంతర ప్రవాహమైన కాలం అగణితం. కానీ, మానవ జిజ్ఞాస, ప్రయత్నం దేన్నీ ఊరకే వదలదు! అందుకే, ఊహా విభజన రేఖలు గీసి... సెకండ్లని, నిమిషాలని, రోజులని, వారాలని, నెలలని, సంవత్సరాలని కాలానికి కొలతలు వేస్తాడు. యుగాల పరిణామాలకు మౌన సాక్షీభూతమైన కాలాన్ని తానేదో ఒడిసిపట్టినట్టు మనిషి భ్రమిస్తాడు. ఓ యేడు సుఖం, సంతోషం ఎక్కువైతే ఆనందిస్తాడు, కష్టం, బాధ అధికమైతే దుఃఖించి, శపిస్తాడు. కాలపు తునకలన్నీ మనిషి గీసుకున్న ఊహా రేఖలని గ్రహించడు. అదే విభజన గడుల సంధి కాలంలో నిలుచున్న మనం పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్పి కొత్త సంవత్సరానికి స్వాగతమంటున్నాం. సరే, అందులో తప్పేమీ లేదు. మంచి చెడుల గతాన్ని వదిలి, ఆశాజనక భవిష్యత్తులోకి అడుగిడే ప్రతి మలుపులో మనకో బుల్లి సమీక్ష, సత్సంకల్పం ఉండాలి. అలా ఉంటేనే ఒకింత జాగ్రత్తగా, కాస్త పద్ధతిగా, కొంచెం వ్యూహాత్మకంగా.... వీటన్నింటికీ మించి ఆనందంగా–ఆహ్లాదంగా ముందుకు సాగే ఆస్కారం ఉంటుంది. గడచిన ఏడాదిలో ఏమేమి అనుకొని ఏమేర సాధించాం? ఇంకేమి మిగిలాయి? అని ఆత్మావలోకనంతో సమీక్షించుకుంటే నష్టమేమీ లేదు. ఆశల అల్లికతో భవిష్యత్ ప్రణాళికా రచన నేరమేమి కాదు. అది ప్రతి 365 రోజులకొకమారు అయితే తప్పేంటి అన్నది హేతుబద్ధ యోచనే! 2021కి వీడ్కోలు చెబుతూ 2022 లోకి అడుగిడుతున్న శుభవేళ ఇది! కొత్త సంకల్పాలు తీసుకొని, వాటి సాధనకోసం పురోగమించాలి. దేశం యావత్తు ఓ ఆశావహ భావనతో భవితను చూస్తోంది. ప్రతి జనవరి ఒకటికీ చేసేది ఇదే అయినా.... మంచి–చెడుల గడుల పరిధి ఒక్కోమారు భిన్నంగా ఉండొచ్చు. ఏదీ తెలిసి జరుగదు. అన్నీ అధిగమించి ముందుకు సాగడం మానవనైజం. మానవేతి హాసంలోనే పెద్ద మహమ్మారిగా చెబుతున్న కరోనా సృష్టించిన విలయానికి గడచిన రెండు సంవత్సరాలు దూదిపింజల్లా కొట్టుకుపోయాయి. ఎన్నెన్ని కుటుంబాల్లో అది తీరని విషాదం నింపిందో, మరెన్ని మానవ హృదయాలను భయంతో కల్లోలపరిచిందో లెక్కే లేదు. మూడో సంవత్సరం ముంగిట్లోకి వచ్చిన మనకు... కొంచెం కష్టం, కొంచెం ఇష్టం అనిపించే సమాచారం అందుతోంది. వైరస్ కొత్త వైవిధ్యమైన ‘ఒమిక్రాన్’ వేగం వల్ల, గతవారం (22–29 డిసెంబరు) సగటున రోజూ 9 లక్షల కొత్త కేసులు ప్రపంచ వ్యాప్తంగా నమోదయ్యాయి. మరోవైపు చిగురుటాశ ఏమంటే, పలు పరివర్తనాల వల్ల కొత్త వైవిధ్యమై వచ్చిన ఒమిక్రాన్ అంతగా ప్రమాదకారి కాదూ అని! భయంకర ‘మహమ్మారి’ కాస్తా ఆయా కాలాల్లో తరచూ వచ్చే సాంక్రమిక అంటు వ్యాధిలా పలుచబారిందని శాస్త్ర, వైద్యవర్గం చెప్పడం ఉన్నంతలో ఊరటనిచ్చే పరిణామం. ప్రపంచంలో ఒక బలీయ ఆర్థిక, మార్కెట్ శక్తిగా ఎదుగుతున్న భారత్ వివిధ విభాగాల్లో సాధిస్తున్న ప్రగతి, తాజా లక్ష్యాలు కొంత ఆశావహ వాతావరణం కల్పిస్తున్నాయి. పలు రంగాల్లో విజయాల సరళి కొత్త ఆశలు రేపుతోంది. విపత్తులూ కొన్ని అవకాశాలు కల్పిస్తాయనడానికి కోవిడ్–19 నిదర్శనం. టీకాల తయారీ నుంచి వైద్యారోగ్య వ్యవస్థల్ని బలోపేతం చేసుకోవడం వరకు స్వావలంబనకు అరుదైన అవకాశం లభించింది. ఆ దిశలో అడుగులు పడుతున్నాయి. స్వాతంత్రానంతరం దశాబ్దాల తరబడి నిర్లక్ష్యానికి గురైన వైద్యం, విద్య వంటి కీలకాంశాలను తగిన బడ్జెట్ కేటాయింపులతో, ప్రణాళికాబద్ధంగా తీసుకువెళితే మంచి ఫలితాలకు ఆస్కారం ఉంటుంది. వైద్యం విషయంలో సర్కార్లు ఇపుడైనా, కరోనా దెబ్బతో ‘కాలికి తట్టుతగిలింది ఇక బట్టకట్టడం ఖాయం’ అనుకోవాలి. కేరళ వంటి రాష్ట్రాల్లో గ్రామీణ వైద్యం, కొత్తగా ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో గ్రామసచివాలయ స్థాయి వరకు వైద్యారోగ్య వ్యవస్థ విస్తరిస్తూ భరోసా కల్పిస్తున్న తీరే ఇందుకు నిదర్శనం. విద్యకు సంబంధించి ఎన్నో లోపాలు, వైఫల్యాల్ని నేడు క్షీణించిన క్షేత్ర పరిస్థితులు అడుగడుగునా ఎత్తి చూపిస్తున్నాయి. ప్రాథమిక, సెంకడరీ విద్య నుంచి ఉన్నత, సాంకేతిక విద్య వరకు... తాజా జాతీయ నూతన విద్యా విధానంలో పొందుపరచిన అంశాలతో కొత్త ఆశలు పల్లవి స్తున్నాయి. ప్రభుత్వ రంగంలో అలవిమాలిన అలక్ష్యంతో, ప్రయివేటు రంగంలో ఫక్తు వ్యాపారమై కునారిల్లిన భారత విద్యారంగం పూర్వపు వైభవోజ్వల దశను పుణికి పుచ్చుకుంటుందని ఆశిద్దాం. ఏపీలో ‘నాడు–నేడు’తో సర్కారు బడుల స్వరూప స్వభావాల్నే మారుస్తున్న తీరొక వేగుచుక్క! క్రీడా రంగంలో... ఇటీవలి టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ సాధించిన ఏడు అథ్లెటిక్స్ పతకాలొక కొత్త ఆశారేఖ! క్రికెటొకటే క్రీడ కాదు, భారత్ కీర్తికిరీటాన్ని ధగధగలాడించే మట్టిలో మాణిక్యాలు ఆట ఆటలో ఉన్నాయని తేల్చి చెప్పే భవిష్యత్తు వైపు భారత యువతరం పరుగులు తీయాలి. ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా ఉన్న దేశం మనది. తగిన శిక్షణ, ఉద్యోగ, ఉపాధి, మేధోపరిణతి అవకాశాలు కల్పిస్తూ యువశక్తిని ఓ బలీయమైన మానవ వనరుగా తీర్చిదిద్దాలి. ప్రపంచం దృష్టి మనవైపు మళ్లేలా తగిన వ్యూహాలు, విధానాలు, కార్యాచరణ ఉంటే మనకిక తిరుగుండదు. ప్రపంచమంతా ఐటీ, కృత్రిమ మేధ, రోబోటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి ఆధునిక పరిణామాలతో పురోగమిస్తున్న ఈ తరుణంలో విలువలు, నైతికత ప్రశ్నార్థకమౌతున్నాయి. గొప్ప సనాతన, ఆధ్యాత్మిక, చారిత్రక నేపథ్యం ఉన్న దేశంగా ఆధునిక శాస్త్ర–సాంకేతిక పురోగతిని మేళ విస్తూ ముందుకు వెళితే భారత్ ఒక ప్రపంచ చోదక శక్తిగా నిలిచే అవకాశాలు పుష్కలం. ఈ క్రమంలో 2022 ఓ గొప్ప మేలుమలుపు కావాలని మనమంతా ఆశిద్దాం. ఆశే మనిషికి దిక్సూచి! -
బడ్జెట్ 2021-22: ఓ లుక్కేయండి!
చరిత్ర రాల్చిన విషపు చుక్క లాంటి కోవిడ్‌తో... మనుషులే కాదు, వ్యవస్థలూ మంచానపడ్డాయి. కాస్త కోలుకున్నా... పూర్వపు స్థితి వస్తుందో రాదో తెలియని స్థితి. కాకపోతే జనానికిప్పుడు వ్యాక్సిన్ అందుతోంది. ఈ బడ్జెట్‌తో భారత ఆర్థిక వ్యవస్థక్కూడా తొలిడోసు టీకా ఇచ్చే ప్రయత్నం చేసింది మోదీ ప్రభుత్వం. విద్య, వైద్యం, రోడ్లు, నౌకాశ్రయాలు... ఇలా అన్నింటా మౌలిక సదుపాయాలకు జై కొడుతూ ప్రణాళిక వ్యయాన్ని ఏకంగా రూ.5.54 లక్షల కోట్లకు పెంచింది. ఆరోగ్య, మౌలిక రంగాలపై దృష్టిపెట్టింది. త్వరలో ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాలపై ప్రత్యేక ప్రేమ చూపించింది. మరి ఇంత డబ్బెలా వస్తుంది..?? ఒకటి... భారీ అప్పులు తప్పవు. మరి ఆ తరవాత..? ‘సేల్ ః ఇండియా’!!. ఆర్థిక మంత్రి ఆశలన్నీ దీనిపైనే. టోల్ రోడ్లు, రైల్వే లైన్లు, గ్యాస్ పైప్లైన్లు, విమానాశ్రయాలు, గిడ్డంగులు, క్రీడా మైదానాలు... వీటన్నిటికీ ‘ఫర్ సేల్’ ట్యాగ్ తగిలించబోతున్నారు. ఇక ప్రభుత్వ కంపెనీలు ఎల్ఐసీ, బీపీసీఎల్, ఎయిరిండియా, షిప్పింగ్ కార్పొరేషన్, కంటెయినర్ కార్పొరేషన్, ఐడీబీఐ బ్యాంక్, బీఈఎంఎల్, పవన్ హాన్స్, నీలాచల్ ఇస్పాత్ నిగం సరేసరి. వాటిలో వాటా విక్రయాన్ని ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లోనైనా పూర్తిచేయాలన్నది ప్రణాళిక. నిజానికి ప్రభుత్వానికి వేరే మార్గం కూడా లేదు. ఇక అన్నిటికన్నా సాహసోపేతమైన చర్య... జవాబుదారీ తనమే లక్ష్యంగా మరో రెండు బ్యాంకుల ప్రైవేటీకరణ. జాతీయీకరణ జరిగిన 51 ఏళ్ల తరవాత ఓ రెండు బ్యాంకులు మళ్లీ ప్రైవేటు రంగం చేతుల్లోకి వెళ్లబోతున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగి అమ్మకాలు పూర్తయితే... భారత ఆర్థిక వ్యవస్థకు వ్యాక్సిన్ ఇచ్చినట్లే. మరి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా..? అది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాలి.!! సిక్స్ ప్యాక్ బడ్జెట్... దేశం కరోనా కల్లోలం నుంచి తేరుకొని వృద్ధి బాటలో పరుగులు పెట్టేందుకు ఆరు కీలక రంగాలు పునాదులుగా ‘సిక్స్ పిల్లర్ బడ్జెట్’ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఆ ఆరు రంగాలు ఏమిటంటే... ఆరోగ్యంపై త్రికరణ శుద్ధి.. వ్యాధి నివారణ, చికిత్స, బాగోగులే లక్ష్యంగా ఆరోగ్య రంగానికి అత్యంత ప్రాధాన్యం కల్పించి బడ్జెట్లో కేటాయింపులు 137 శాతం పెంచారు. కోవిడ్ వ్యాక్సినేషన్‌కు రూ.35,000 కోట్లు ప్రతిపాదించారు. పీఎల్ఐ ఆత్మనిర్భర్ భారత్ కింద ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకానికి ఐదేళ్లలో రూ.1.97 లక్షల కోట్లు. ఉత్పత్తి సంస్థలు అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో భాగస్వాములుఅయ్యేందుకు ఇది ఉపకరిస్తుంది. వ్యవసాయ భారతం.. వ్యవసాయ ఉత్పత్తుల ఉత్పాదక వ్యయంపై కనీసం 1.5 రెట్లు అధికంగా మద్దతు ధర. వ్యవసాయ రుణ పరిమితి లక్ష్యం పెంపు. పశు సంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమ రంగాలపై ప్రత్యేక దృష్టి. నాణ్యమైన విద్య.. దేశంలో కొత్తగా 100 సైనిక స్కూళ్లు. ఉన్నత విద్యలో నాణ్యతకు కమిషన్ ఏర్పాటు. గిరిజన ప్రాంతాల్లో 750 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లు. ఉపాధిని పెంపొందించేందుకు అప్రెంటిస్‌షిప్ చట్టం. పరిశోధనలకు ప్రోత్సాహం నూతన ఆవిష్కరణలు, పరిశోధన, అభివృద్ధి రంగాలకు వచ్చే ఐదేళ్లలో రూ.50,000 కోట్ల కేటాయింపుపై విధివిధానాలు. డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహానికి రూ.1,500 కోట్లు. కనిష్ట ప్రభుత్వం–గరిష్ట పాలన సత్వర న్యాయానికి ట్రిబ్యునళ్లలో సంస్కరణలు. దేశంలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను పెంచేందుకు పన్ను చెల్లింపుదారులపై ఒత్తిడి తగ్గించేలా పారదర్శక, సమర్థ పన్నుల విధానం. న్యూఢిల్లీ: ఆరోగ్య భారత్, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంగా ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను ప్రకటించారు. కరోనా సృష్టించిన విధ్వంసంతో అస్తవ్యస్తమైన వ్యవస్థలను గాడిన పెట్టడంతో పాటు, భవిష్యత్తులో విశ్వ యవనికపై భారత పతాకాన్ని రెపరెపలాడించే ఆర్థిక ప్రణాళికను దేశప్రజల ముందుంచారు. దేశ ప్రజలకు కరోనా నుంచి విముక్తి కలిగించే వ్యక్తిగత వ్యాక్సిన్‌తో పాటు, కరోనాతో కుదేలైన రంగాలకు ఊరట కల్పించి, వృద్ధి బాట పట్టించేందుకు అవసరమైన వ్యాక్సిన్‌నూ ఈ బడ్జెట్లో పొందుపర్చారు. కరోనా కల్లోలం నుంచి తేరుకుని వృద్ధి దిశలో పరుగులు పెట్టాల్సిన దేశానికి అవసరమైన ముడి సరుకులను ప్రణాళికాబద్ధంగా సిద్ధం చేశారు. 2021– 22 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్‌ను సోమవారం ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. స్వల్పకాలం ఊరట కల్పించే పథకాల ప్రకటన కన్నా దీర్ఘకాలంలో దేశాభివృద్ధికి బాటలు వేసే వ్యవస్థీకృత కార్యక్రమాలపై ఈ బడ్జెట్లో దృష్టి పెట్టారు. ఈ దిశగా ఆరు కీలక రంగాలు పునాదులుగా ‘సిక్స్ పిల్లర్ బడ్జెట్’ను ఆమె ప్రవేశపెట్టారు. స్వాస్థ భారత్, పెట్టుబడులు– మౌలిక సదుపాయాలు, సమగ్ర సమ్మిళిత పురోగతి, మానవ వనరుల అభివృద్ధి, సృజనాత్మకత– పరిశోధన–అభివృద్ధి, కనీస ప్రభుత్వం– గరిష్ట పాలన.. స్థూలంగా ఈ ఆరు రంగాలు పునాదులుగా బడ్జెట్‌ను రూపొందించామని నిర్మల తెలిపారు. ‘నేషన్ ఫస్ట్’సంకల్పంలో భాగంగా, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం, మౌలిక వసతుల కల్పన, స్వాస్థ భారత్, సుపరిపాలన, యువతకు ఉపాధి అవకాశాలు, అందరికీ విద్య, మహిళా సాధికారత, సమ్మిళిత వృద్ధి.. అనే ఎనిమిది అంశాలపై ఆర్థిక మంత్రి ప్రధానంగా దృష్టి పెట్టారు. ఈ బడ్జెట్లో ఆరోగ్యం, మౌలిక వసతులపై కేటాయింపులను భారీగా పెంచారు. బీమా రంగంలో విదేశీ పెట్టుబడుల పరిమితిని ప్రస్తుతమున్న 49% నుంచి 74 శాతానికి పెంచాలని ప్రతిపాదించారు. వ్యక్తిగత, కార్పొరేట్ పన్ను రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. దేశీయ తయారీ రంగానికి ఉపకరించేలా ఆటోమొబైల్ విడిభాగాలు, మొబైల్ ఫోన్ విడిభాగాలు, సోలార్ ప్యానెల్స్‌ల దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీని పెంచారు. అలాగే, యాపిల్స్, పీస్, పప్పు ధాన్యాలు, ఆల్కహాల్, కెమికల్స్, వెండి, పత్తి.. తదితర పలు ఉత్పత్తుల దిగుమతులపై వ్యవసాయ మౌలిక వసతులు, అభివృద్ధి పన్ను(అగ్రి సెస్– అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్)ను విధించారు. అయితే, ఇంపోర్ట్ డ్యూటీని సర్దుబాటు చేయడం ద్వారా ఆయా ఉత్పత్తుల ధరలపై ప్రభావం పడకుండా చూస్తారు. భవిష్యనిధి(ప్రావిడెంట్ ఫండ్)కు ఉద్యోగి ఇచ్చే వాటాపై వడ్డీ ఏడాదికి రూ. 2.5 లక్షలు దాటితే, అది ఏప్రిల్ 1, 2021 నుంచి పన్ను పరిధిలోకి వస్తుంది. కాగా, సీనియర్ సిటిజన్లకు స్వల్ప ఊరట కలిగించే నిర్ణయాన్ని ఈ బడ్జెట్లో ప్రకటించారు. పెన్షన్‌పై, వడ్డీపై మాత్రమే ఆధారపడిన 75 ఏళ్లు పైబడిన వృద్ధులు ఇకపై ఐటీ రిటర్న్‌లు దాఖలు చేయాల్సిన అవసరం లేదు. అలాగే, అందరికీ సొంత ఇల్లు లక్ష్య సాధనలో భాగంగా ప్రకటించిన గృహ రుణ వడ్డీలో రూ. 1.5 లక్షల తగ్గింపు సదుపాయం మరో సంవత్సరం పాటు కొనసాగించనున్నారు. ఈ పథకం 2022 మార్చి 31 వరకు కొనసాగుతుంది. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన బడ్జెట్ ఇదేనని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసించారు. మరోవైపు, ఈ బడ్జెట్‌పై విపక్ష కాంగ్రెస్ పెదవి విరిచింది. గతమెన్నడూ లేనంత నిరుత్సాహపూరితంగా ఉందని అభివర్ణించింది. తప్పు వ్యాధి నిర్ధారణ, చికిత్స రెండు తప్పుడువేనని పేర్కొంది. మౌలికం కోసం.. మౌలిక వసతుల రంగంలో పెట్టుబడుల కల్పన కోసం ఈ బడ్జెట్లో ఏకంగా రూ. 5.54 లక్షల కోట్లను ఆర్థికమంత్రి కేటాయించారు. ఇందులో ప్రధానంగా రూ. 1.18 లక్షల కోట్లు రోడ్స్ అండ్ హైవే రంగానికి, రూ. 1.08 కోట్లు రైల్వే రంగానికి కేటాయించారు. ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ ఏర్పడేందుకు, ఉపాధి కల్పనకు ఈ నిధులు ఉపయోగపడ్తాయని తెలిపారు. ఇందుకు అదనంగా అవసరమైన నిధులను పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా సాధిస్తామన్నారు. వ్యూహాత్మక రంగంలో లేని ప్రభుత్వ రంగ కంపెనీల్లో వాటాల ఉపసంహరణ ద్వారా రూ. 1.75 లక్షల కోట్లు, కొత్తగా విధించిన అగ్రిసెస్ ద్వారా రూ. 30 వేల కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని నిర్మల సీతారామన్ వెల్లడించారు. ఆత్మనిర్భర భారత్ రూపుదిద్దుకునేందుకు భారతీయ తయారీ పరిశ్రమలు ప్రపంచ దేశాలకు సరఫరా కేంద్రాలుగా మారాల్సి ఉందని నిర్మల పిలుపునిచ్చారు. ఇందుకు గానూ ఐదేళ్ల కాలపరిమితితో 2020లోనే రూ. 1.97 లక్షల కోట్లను కేటాయించామన్నారు. దేశీయ టెక్స్టైల్స్ రంగం అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేందుకు వీలుగా దేశవ్యాప్తంగా రానున్న మూడేళ్లలో ఏడు ‘మెగా టెక్స్టైల్స్ ఇన్వెస్ట్మెంట్ పార్క్’లను ఏర్పాటు చేయనున్నామన్నారు. లోక్‌సభలో బడ్జెట్‌ను చదివి వినిపిస్తున్న నిర్మలా సీతారామన్. చిత్రంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్, ప్రహ్లాద్ జోషి తదితరులు సాగు సాయం కొత్త సాగు చట్టాల రద్దు డిమాండ్‌తో గత రెండు నెలలుగా దేశ రాజధాని సరిహద్దుల్లో లక్షలాది రైతులు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్న నేపథ్యంలో.. రైతుల ఆదాయం పెంపు లక్ష్యంగా వ్యవసాయ రంగంలో సంస్కరణలు కొనసాగుతాయని కేంద్రం స్పష్టం చేసింది. రైతు ప్రయోజనాలు లక్ష్యంగా మరే ఇతర ప్రభుత్వం కూడా తమ ప్రభుత్వంలా చర్యలు తీసుకోలేదని పేర్కొంది. వ్యవసాయ రుణాల లక్ష్యంలో ఈ సంవత్సరం 10% పెంపును ప్రతిపాదిస్తున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఈ పెంపుతో రైతులకు రూ. 16.5 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు అందుబాటులో ఉంటాయన్నారు. పంట నిల్వకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు కొత్తగా ప్రతిపాదించిన అగ్రి సెస్ మొత్తాన్ని వినియోగిస్తామని తెలిపారు. 2013–14లో గోధుమ సేకరణ కోసం నాటి ప్రభుత్వం రూ. 33,874 కోట్లు ఖర్చుచేయగా, 2020–21లో తమ ప్రభుత్వం రూ. 75,050 కోట్లు ఖర్చుచేసిందన్నారు. స్వమిత్వ పథకంలో భాగంగా 1.8 లక్షల మంది రైతులు ప్రాపర్టీ పట్టాలు పొందారని ఆర్థిక మంత్రి సీతారామన్ గుర్తుచేశారు. వ్యవసాయ మార్కెట్లకు ఇకపై అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర, మండీల కొనసాగింపుపై రైతుల్లో ఆందోళనలు నెలకొన్న పరిస్థితుల్లో బడ్జెట్లో ఈ ప్రతిపాదన చేశారు. ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్(ఈ–నామ్) విధానం విజయవంతమైందని, ఇప్పటివరకు 1.68 కోట్ల మంది రైతులు ఇందులో రిజిస్టర్ అయ్యారని, రూ. 1.14 లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయని నిర్మల తెలిపారు. త్వరలో మరో వెయ్యి మండీలను ‘ఈ–నామ్’లో చేరుస్తామన్నారు. మత్య్స పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, దేశంలోని విశాఖపట్నం, చెన్నై, కొచ్చి, పారాదీప్, పెటువఘాట్ ఫిషింగ్ హార్బర్లను ‘ఎకనమిక్ యాక్టివిటీ హబ్స్’గా ఆధునీకరిస్తామని హామీ ఇచ్చారు. పెట్రోపై ‘అగ్రి సెస్’ తాజా బడ్జెట్లో పలు ఇతర దిగుమతులతో పాటు పెట్రోలు, డీజిల్‌లపై కూడా అగ్రి సెస్‌ను ప్రకటించారు. లీటరు పెట్రోలుపై రూ. 2.5ను, లీటరు డీజిల్‌పై రూ. 4ను అగ్రిసెస్‌గా నిర్ణయించారు. అయితే, అంతే మొత్తంలో ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం ద్వారా ఆ భారం వినియోగదారుడిపై పడకుండా జాగ్రత్త తీసుకున్నారు. రక్షణ.. నామమాత్రమే చైనాతో తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లో తీవ్ర స్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రక్షణ రంగానికి భారీగా కేటాయింపులు ఉంటాయని భావించారు. కానీ, రక్షణ రంగ బడ్జెట్‌ను గత సంవత్సరం కన్నా నామమాత్రంగా 1.4% మాత్రమే పెంచారు. గత సంవత్సరం ఈ మొత్తం రూ. 4.71 లక్షల కోట్లు కాగా, ఈ సంవత్సరం అది రూ. 4.78 లక్షల కోట్లకు పెంచారు. రూ. 1.35 లక్షల కోట్లను ఆయుధాలు, యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు, ఇతర మిలటరీ హార్డ్‌వేర్ కొనుగోలు కోసం కేటాయించారు. ‘ఎన్నికల’ రాష్ట్రాలకు వరాలు ఈ సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేక వరాలు ప్రకటించింది.పశ్చిమబెంగాల్‌కు రూ. 25 వేల కోట్లు, తమిళనాడుకు రూ. 1.03 లక్షల కోట్లు, కేరళకు రూ. 65 వేల కోట్లు, అస్సాంకు 19 వేల కోట్ల విలువైన పెట్టుబడుల ప్రతిపాదనలను బడ్జెట్లో పొందుపర్చింది. ద్రవ్యలోటు తగ్గించేందుకు.. కరోనా మహమ్మారి సమయంలో ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వం భారీగా ఖర్చు చేసిన నేపథ్యంలో ప్రస్తుత సంవత్సర ద్రవ్యలోటు జీడీపీలో 9.5 శాతంగా ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరం ఇది జీడీపీలో 6.8 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. మునుపెన్నడు లేనంత ఎక్కువగా ప్రభుత్వ ఖర్చు పెరిగిందని ఆర్థికమంత్రి తెలిపారు. ఎకానమీకి ద్రవ్య విధాన మద్దతు మరో మూడేళ్లు కొనసాగుతుందని, ద్రవ్యలోటు 2025–26 సంవత్సరానికి జీడీపీలో 4.5 శాతానికి తగ్గుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కస్టమ్స్ డ్యూటీని తగ్గించడంతో బంగారం, వెండి ధరలు తగ్గే అవకాశముంది. అలాగే, పలు ఐరన్, స్టీల్ ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని పెంచడంతో ఆయా వస్తువుల ధరలు పెరిగి, రియల్ ఎస్టేట్ రంగంపై ప్రతికూల ప్రభావం పడనుంది. పట్టణాభివృద్ధి రంగానికి సంబంధించి.. ఐదేళ్ల కాలానికి గానూ రూ. 2.87 లక్షల కోట్లతో ‘జల జీవన్ మిషన్ –అర్బన్’ను ప్రారంభించనున్నట్లు ఆర్థికమంత్రి తెలిపారు. అలాగే, ‘పబ్లిక్ బస్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్’కోసం రూ. 18 వేల కోట్లు కేటాయించామన్నారు. నగదు సమీకరణ పథకాల అమలు, ఇతర అవసరాల కోసం ఆస్తులను నగదుగా మార్చుకునే ప్రక్రియ ఏ ప్రభుత్వానికైనా అవసరమని ఆర్థికమంత్రి పేర్కొన్నారు. పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ఐడీబీఐతో పాటు రెండు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో వాటాలను అమ్మాలని నిర్ణయించామన్నారు. మంత్రిత్వ శాఖల వద్ద, ప్రభుత్వ రంగ సంస్థల వద్ద అదనంగా ఉన్న భూములను అమ్మకానికి పెట్టనున్నట్లు వెల్లడించారు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం రూ. 1.75 లక్షల కోట్లు కాగా, 2020–21 సంవత్సరానికి రూ. 2.1 లక్షల కోట్లు. అయితే, కరోనా కారణంగా రూ. 20 వేల కోట్లను కూడా సమీకరించలేకపోయారు. ముఖ్యాంశాలు మహా కవుల మాటలు ప్రసంగం సమయంలో మహాకవులు రవీంద్రనాథ్ టాగోర్, తిరువళ్లువర్ల కవితాపంక్తులను నిర్మలాసీతారామన్ ఉటంకించారు. ‘తూరుపున పూర్తిగా తెలవారకముందే రానున్న వెలుగు రేకలను ఊహిస్తూ గానం చేయడమే విశ్వాసం’అనే రవీంద్రుడి కవితాపాదాన్ని ఆమె ప్రసంగం ప్రారంభించిన కాసేపటికే గుర్తుచేశారు. అలాగే, ‘రాజు/పాలకుడు సంపదను సృష్టించి, సమీకరించి, అనంతరం ఆ సంపదను పరిరక్షించి, ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగిస్తాడు’అన్న తమిళ మహాకవి తిరువళ్లువర్ రాసిన పంక్తులను కూడా ఆమె చదివారు. ప్రత్యక్ష పన్నుల వివరాలను వెల్లడించేముందు ఆమె ఈ పంక్తులను వినిపించారు. గత సంవత్సరం కూడా ఆమె తిరువళ్లువర్‌ను ఉటంకించారు. అంతకుముందు, యూపీఏ ఆర్థికమంత్రి చిదంబరం కూడా తమిళనాడుకు చెందిన ఆ మహాకవి వ్యాఖ్యలను తన బడ్జెట్ ప్రసంగంలో వినిపించారు. ♦ఇది తొలి కాగిత రహిత, డిజిటల్ బడ్జెట్ ♦ఎరుపు రంగు చీరలో, ఎరుపు రంగు వస్త్రంతో రూపొందిన సంచీ(బాహీ ఖాతా)తో నిర్మల సభకు వచ్చారు. బడ్జెట్‌ను తొలిసారి ట్యాబ్‌లో చూసి చదివారు. స్వాస్థ్య భారత్.. కరోనా వైరస్ విజృంభణతో మునుపెన్నడు చూడని సంక్షోభాన్ని భారత్ ఎదుర్కొంది. సాధారణ జన జీవనం అస్తవ్యస్తమైంది. ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో, ఆరోగ్య రంగంలో స్వావలంబన అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఆరోగ్య రంగానికే పెద్ద పీట వేసింది. కోవిడ్–19 వ్యాక్సిన్‌కు కేటాయించిన రూ. 35 వేల కోట్లు సహా మొత్తంగా రూ. 2, 23, 846 లక్షల కోట్లను కేటాయించింది. ఇది ఈ రంగానికి గత సంవత్సరంలో కేటాయించిన మొత్తం కన్నా 137% అధికం. ఆత్మ నిర్భర భారత్ పునాదుల్లో ఆరోగ్య భారత్ అత్యంత కీలకమైనదని ఈ సందర్భంగా నిర్మలాసీతారామన్ స్పష్టం చేశారు. వ్యాధి నివారణ, చికిత్స, సమగ్ర శ్రేయస్సు అనే మూడు అంశాలను దృఢతరం చేసేలా కేటాయింపులు జరిపామన్నారు. కోవిడ్–19 టీకా కోసం కేటాయించిన రూ. 35 వేల కోట్లు ప్రాథమిక అంచనాయేనని, అవసరమైతే, ఆ మొత్తాన్ని పెంచుతామని వివరించారు. రూ. 64,180 కోట్లతో త్వరలో ప్రధానమంత్రి ఆత్మనిర్బర్ స్వాస్థ యోజనను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. అన్ని జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కరోనా సంక్షోభాన్ని భారత్ అద్భుతంగా ఎదుర్కొందని ఈ సందర్భంగా నిర్మల సీతారామన్ వ్యాఖ్యానించారు. లాక్డౌన్ ప్రకటించిన 48 గంటల్లోపే ప్రధాని మోదీ రూ. 2.76 లక్షల కోట్లతో ప్రధానమంత్రి గరీబ్‌కళ్యాణ్ యోజనను ప్రకటించారని గుర్తు చేశారు. ఆరోగ్యానికి వాయు కాలుష్యం చేసే చేటును దృష్టిలో పెట్టుకుని 20 ఏళ్లు దాటిన వ్యక్తిగత వాహనాలను, 15 ఏళ్లు దాటిన కమర్షియల్ వాహనాలను నిషేధించేందుకు వీలుగా ప్రత్యేక విధానాన్ని ప్రారంభించనున్నామన్నారు. -
ఎప్పటికప్పుడు సమాచారం పంచుకున్నాం
బీజింగ్: ప్రాణాంతక కరోనా వైరస్‌పై సరైన సమయంలో ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయలేదన్న నేరారోపణలు ఎదుర్కొంటున్న చైనా.. తాజాగా వైరస్‌కు సంబంధించి శ్వేత పత్రాన్ని ఆదివారం విడుదల చేసింది. వైరస్ విషయాన్ని దాచిపెట్టలేదని, ఇందులో తమ తప్పు, పొరపాటు ఏమీ లేదని సమర్థించుకుంటూ సమగ్ర వివరణ ఇచ్చింది. ఈ కరోనా వైరస్‌ను తొలిసారి వూహాన్లో గత సంవత్సరం డిసెంబర్ 27న ఒక ఆసుపత్రిలో వైరల్ న్యూమోనియాగా గుర్తించామని వెల్లడించింది. మనిషి నుంచి మనిషికి సోకుతుందన్న విషయాన్ని జనవరి 19న నిర్ధారించామన్నారు. ఆ వెంటనే వైరస్ వ్యాప్తి నిరో«ధ చర్యలు ప్రారంభించామంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా పలువురు ప్రపంచ దేశాధి నేతలు కరోనా మారణకాండకు, ఆర్థిక అస్తవ్యస్తతకు చైనానే కారణమని ఆరోపణలు చేస్తుండటం తెలిసిందే. జనవరి 19కి ముందు, ఆ వైరస్ మనుషుల నుంచి మనుషులకు సోకుతుందనేందుకు శాస్త్రీయ ఆధారాలు లభించలేదని వైరస్ వ్యాప్తిపై చైనా నేషనల్ హెల్త్ కమిషన్(ఎన్‌హెచ్‌సీ) ఏర్పాటు చేసిన అత్యున్నత శాస్త్రవేత్తల కమిటీ సభ్యుడు, ఊపిరితిత్తుల వ్యాధి నిపుణుడు వాంగ్ గ్వాంగ్ఫా పేర్కొన్నారు. వూహాన్‌కు తాము వెళ్లినప్పటికే.. అక్కడ జ్వర పీడితుల సంఖ్య అనూహ్యంగా పెరిగిందన్నారు. వైరస్‌ను తొలుత గుర్తించిన మాంసాహార మార్కెట్‌కు వెళ్లని వారికి కూడా ఈ వ్యాధి సోకినట్లు గుర్తించామన్నారు. జనవరి 14 నాటికి వూహాన్ నగరం ఉన్న హ్యుబయి రాష్ట్రం మొత్తం వైరస్ వ్యాప్తి ముప్పు ఉన్నట్లు గుర్తించిన ఎన్‌హెచ్‌సీ.. ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసిందని శ్వేతపత్రంలో పేర్కొన్నారు. నిర్ధారించలేని కారణంతో న్యూమోనియా రావడాన్ని గుర్తించిన తక్షణమే అందుకు కారణాలను అన్వేషించాలని పరిశోధకులను ప్రభుత్వం ఆదేశించిందని వివరించారు. ముప్పును గుర్తించిన చైనా వెంటనే ప్రపంచ ఆరోగ్య సంస్థను, అమెరికా సహా ఇతర దేశాలను అప్రమత్తం చేసిందన్నారు. అనంతరం, ఈ కొత్త కరోనా వైరస్ జన్యుక్రమాన్ని పరిశోధించి, ఆ వివరాలను కూడా డబ్ల్యూహెచ్ఓ, ప్రపంచ దేశాలతో పంచుకుందన్నారు. హ్యుబయితో పాటు ఇతర ప్రాంతాలకు విస్తరించడంతో దేశంలో కూడా వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యలు ప్రారంభించామని తెలిపారు. జనవరి 3 నుంచే వైరస్ సంబంధించిన వివరాలను డబ్ల్యూహెచ్ఓతో పాటు ఇతర దేశాలతో పంచుకున్నామన్నారు. -
అడిగింది ఒకటి..? అనుకుంది యింకోటి..!
అనంగ అనంగ ఒక రాజు వుండేటోడు. ఆయిన శాన మేదావి. యెప్పుడు యేదో ఒక దాని గురించి లోతుగ ఆలోశన జేస్తుండేటోడు. అట్ల ఆలోశన జేశి కొత్త కొత్త ముచ్చట్లు జెప్పేటోడు. అయన్ని యిన్నోల్లు రాజు మస్తు తెలివిగల్లోడని శిత్రపొయ్యేటోల్లు. రాజు కాడ పెద్ద పెద్ద సదువులు సదివిన మస్తుమంది పండితులు వుండేటోల్లు. ఆల్లంత యెప్పటికప్పుడు రాజు అడిగిన ప్రశ్నలకు, అనుమానాలకు జెవాబు జెప్తుండేటోల్లు. అప్పుడప్పుడు రాజు కొత్త కొత్త ప్రశ్నలు యేశి ఆల్లకు గూడ పరిక్ష వెట్టెటోడు. ఆటికి జెవాబు జెప్పలేక పండితులంత కిందమీద అయ్యేటోల్లు. ఒకసారి ఆయిన సబల కూసోని ఒక యేలు సూపెట్టుకుంట ‘యిది యేంటిది?’ అని అడిగిండు. శానమంది అది సూపుడు యేలని శెప్పాలనుకున్నరు. కని రాజు గంత అల్కటి ప్రశ్న యెందుకు అడుగుతడు? అండ్ల యేదో పరమార్దం వుంటది అనుకోని యెన్కకు తగ్గిర్రు. రాజు యెంతశేపు జూశినా ఒక్కలు గూడ జెవాబు యియ్యకపొయ్యేసరికి ‘మీకు మూడు దినాల టైమిస్తున్న! యీ లోపల బాగ ఆలోశించి శెప్పుర్రి! మీరు జెప్పినా సరే, యింకెవలినన్న తీస్కొచ్చి శెప్పిచ్చినా సరె! మొత్తం మీద నాకు సమదానం గావాలె!’ అన్నడు రాజు. యిగ అందరు తల్కాయ పలిగిపోయేటట్టు ఆలోశన జేశిర్రు. యెంత ఆలోశించినా ఆల్లకేం అర్దంగాలే. అందరు గల్శి గుంపుగ గూసోని గూడ మాట్లాడుకుర్రు. తెల్శినోల్లనందరిని అడిగి జూశిర్రు. యెంత జేశినా యేం లాబం లేకుంటవొయ్యింది. ఆకర్కి ఒక పండితుడు దాని గురించే కింద మీదవడుకుంట వూరి బైటికివొయ్యిండు. శెరువు కట్ట మీదున్న శెట్టు కింద గూసుండు. ‘యింత సదువు సదివి రాజుకు జెవాబు జెప్పలేకపోతున్న గదా!’ అని పరేషాన్ల వడ్డడు. ఆడ గొర్లు మేపుకుంటున్న ఒక గొర్లకాపరి పండితుని దిక్కు జూశిండు. ‘యేవైంది పంతులూ! యెందుకిట్ల దివాలుగ గూసున్నవు?’ అని అడిగిండు దెగ్గెరికొచ్చి. దానికి పండితుడు రాజు అడిగిన ప్రశ్న గురించి జెప్పిండు. అది యిన్నంక గొర్లకాపరి గట్టిగ నవ్వి ‘గీ దానికే గింత యిదైపోతవేంది పంతులూ? మీ రాజుకు నేను సమదానం జెప్త పోదాం పా!’ అన్నడు. ‘యెంతో సదువు సదివి, శాస్త్రాలు, పురానాలు ఒంట వట్టిచ్చుకున్న నాకే అర్దం గానిది గొర్లకాపరివి నీకేం అర్దమైంది?’ శిత్రంగ జూస్కుంట అడిగిండు పండితుడు. దానికి గొర్లకాపరి ‘అయన్ని యెందుకు పంతులూ! మీ రాజుకు సమదానం జెప్పాలె అంతే గద, నువ్వు నిమ్మలంగ వుండు!’ అన్నడు గట్టిగ. పండితుడు మారు మాట్లాడకుంట గొర్లకాపరిని యెంట వెట్కోని రాజు కాడికి తీస్కపొయ్యిండు. ‘రాజా రాజా! నువ్వు అడిగిన దానికి యీన జెవాబు జెప్తడట!’ అని జెప్పిండు. యెవ్వలూ జెప్పలేంది యీ గొర్లకాపరి యేం జెప్తడా అని అందరు ఆత్రంగ సూడవట్టిర్రు. అప్పుడు రాజు ఒక యేలు సూపెట్టిండు. గొర్లకాపరి యెంబడే రొండు యేల్లు సూపెట్టిండు. దానికి రాజు యేదో ఆలోశించి మూడు యేల్లు సూపెట్టిండు. అందుకు గొర్లకాపరి జెరంత కోపంతోని ‘లేదు పో!’ అన్కుంట బైటికి వొయ్యిండు. అప్పుడు రాజు యెంతో సంతోషంగ ‘నాకు జెవాబు దొర్కింది!’ అని గట్టిగ మొత్కుండు. పండితులకు యేం అర్దంగాలే. ‘రాజా! నువ్వు అడిగింది యేంది? ఆయిన జెప్పింది యేంది? జెర మాకు అర్దమైతట్టు జెప్పవా!‘ అని అడిగిర్రు నెత్తి గోక్కుంట. అప్పుడు రాజు ‘నేను దేవుడు ఒక్కడే అని ఒక యేలు సూపెట్టిన. అందుకు గొర్లకాపరి శెంకరుడు, విష్ణుమూర్తి యిద్దరు దేవుల్లు గద అని రొండు యేల్లు సూపెట్టిండు. నేనప్పుడు బ్రమ్మదేవునితోటి ముగ్గురైతరు గద అని మూడు యేల్లు సూపెట్టిన! దానికి గొర్లకాపరి ఒప్పుకోక అసలు దేవుడే లేడు పో! అన్కుంట వొయ్యిండు. అది సంగతి!’ అని జెప్పిండు. పండితులు ‘ఓ అదా సంగతి!’ అనుకున్నరు. అనుకోని వూకోకుంట యెంబడే శెరువు కాడికి వుర్కిర్రు. గొర్లకాపరిని దొర్కిచ్చుకుర్రు. ‘రాజు అడిగిన ముచ్చటల నీకేం అర్దమైందో జెప్పు?’ అని అడిగిర్రు ఆయినేం జెప్తడో యిందామని! అప్పుడాయిన ‘రాజు ఒక గొర్రెని యియ్యమని ఒక యేలు సూపెట్టిండు. అడుగుతుంది మన రాజే గద రొండు యిద్దాంలే అని, నేను రొండు యేల్లు సూపెట్టిన! రాజు మస్తు ఆశగొండోడు వున్నట్టుండు గద! రొండు గాదు మూడు గావాలె అని మూడు యేల్లు సూపెట్టిండు. నాకు తిక్కలేశి యేది లేదుపో అన్న!’ అని అసలు ముచ్చట జెప్పిండు గొర్లని అల్లిచ్చుకుంట.అది యిన్నంక పండితులందరు ‘అడిగింది ఒకటి... అనుకుంది యింకోటి!’ అని కడుపువలిగేటట్టు పక్కపక్క నవ్విర్రు. యీ సంగతి తెల్సుకోని జెనాలందరు కండ్లల్లకు నీల్లొచ్చేదాక నవ్వుకున్నరు. ఆకర్కి ముచ్చట రాజు కాడికి వొయ్యింది. యేముంటదిగ? నోరెల్లవెట్టిండు రాజు! - పెండెం జగదీశ్వర్ -
జిందాతిలిస్మాత్ కాదు..సంజీవనా..?
-
టెండరు పెండింగ్!
ముఖ్యనేత వచ్చేదాకా వేచి ఉండాల్సిందే.. పనులు చేస్తే తిప్పలు తప్పవని సూచనలు గుడ్‌విల్ కోసం కాంట్రాక్టర్ల బేరసారాలు కొలిక్కిరాని సీసీ రోడ్ల టెండరు వ్యవహారం వరంగల్ : భూపాలపల్లి నియోజకవర్గంలోని హౌసింగ్ కాలనీల్లో సిమెంటు రోడ్ల నిర్మాణం కోసం నిర్వహించిన టెండర్ల వ్యవహారం పెండింగ్‌లో పడింది. టెండర్లలో పాల్గొన్న కాంట్రాక్టర్ల అర్హతల పరిశీలన పేరుతో వారం రోజులు గడిచినా పనులు కేటాయింపు ఖరారు చేయపోవడం వెనుక ముఖ్యనేత హస్తం ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పనుల ఖరారు ప్రక్రియను అధికారులు మరో నాలుగు రోజులు నానబెట్టే అవకాశం ఉం దని తెలుస్తోంది. భూపాలపల్లి నియోజకవర్గానికి చెం దిన ముఖ్యనేత అందుబాటులో లేకపోవడంతో ఆయ న వచ్చేంత వరకు ఈ పక్రియను పెండింగ్‌లో పెట్టాలని హౌసింగ్ అధికారులకు మౌఖిక ఆదేశాలు అందినట్లు సమాచారం. రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ నిర్మించిన హౌసింగ్ కాలనీల్లో మౌలిక వసతుల కల్పన ప్రక్రియలో భాగంగా సిమెంటు రోడ్ల నిర్మాణానికి భూపాలపల్లి నియోజకవర్గానికి రూ.16 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. 36 కాలనీల్లో సిమెంటు రోడ్ల నిర్మాణానికి జిల్లా గృహ నిర్మాణ సంస్థ 35 ప్యాకేజీలుగా ఇ-ప్రొక్యూర్మెంట్లో టెండర్లు పిలిచింది. ఈ ప్రొక్యూర్మెంటులో పలువురు కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేశారు. నిధులు తీసుకువచ్చినందున తాను చెప్పిన వారే టెండర్లు వేయాలని ముఖ్యనేత నుంచి కాంట్రాక్టర్లకు ముందుగానే హెచ్చరికలు వెళ్లాయి. హెచ్చరికలను ఖాతర చేయకుండా కొందరు టెండర్లు వేశారు. ఈ వ్యవహారం ముఖ్యనేతకు ఆగ్రహం తెప్పించింది. ‘నేను తెచ్చిన నిధుల కాంట్రాక్టర్లు నా వారికి దక్కకుంటే నిధులు మళ్లిస్తా..’ అని ముఖ్యనేత ఆగ్రహించడంతో స్థానిక నాయకులు కొందరు కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెచ్చే పనిలో పడ్డారు. పనులు ముఖ్యనేత అనుయాయునికి దక్కకుంటే.. ‘మీకు వచ్చినా చేయలేరు. తర్వాత బిల్లులు చెల్లింపులోనూ ఇబ్బందులు ఉంటాయి’ అని హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో టెండర్లు వేసిన కాంట్రాక్టర్లు తప్పని సరి పరిస్థితుల్లో రాజీపడుతున్నట్లు తెలుస్తోంది. ‘టెండర్ల నుంచి విరమించుకుంటాం. గుడ్‌విల్ కింద ఇచ్చే మొత్తాన్ని ముం దుగానే ఇవ్వాలి’ అని షరతులు పెడుతున్నట్లు సమాచారం. ముఖ్యనేత అనుయాయుడు ఇప్పటికే ఆయన తో మాట్లాడుకుని ఉన్నందున.. కాంట్రాక్టర్లకు ఏ రకమైన హామీ వస్తుందో అనేది ఎవరికీ అంతు చిక్క డం లేదు. ముఖ్యనేత నియోజకవర్గానికి రాగానే ఎవరికి ఎంత మొత్తం(గుడ్‌విల్) ఇవ్వాలనే విషయంలో స్పష్ట త వస్తుందని అనుయాయుడి వర్గం వారు చెబుతున్నా రు. టెండర్ల ప్రకటన షెడ్యూల్ ప్రకా రం ఆగస్టు 24న సాంకేతిక బిడ్, 28న ఫైనాన్సియల్ బిడ్ తెరిచి ఖరారు చేయాల్సి ఉంది. టెండర్ల ప్రక్రియలో జాప్యంపై హౌసింగ్ అధికారులను అడిగితే... ‘ఇంకా పరిశీలన పూర్తి కాలేదు’ అని చెబుతున్నారు. అధికారులు చెబుతున్న కారణాలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. -
వాటర్‌గ్రిడ్ టెండర్లపై ప్రి బిడ్ సమావేశం
హైదరాబాద్ : తెలంగాణ తాగునీటి సరఫరా పథకం(వాటర్ గ్రిడ్) రెండోదశ టెండర్ల ప్రీ బిడ్ సమావేశాన్ని శుక్రవారం గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు నిర్వహించారు. సుమారు రూ.14,098 కోట్ల అంచనాలతో 10 ప్యాకేజీలకు ఈ నెల 17న టెండర్ నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి జరిగిన ప్రీ బిడ్ సమావేశానికి 18 కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరై, టెండరు నిబంధనల విషయంలో తమకున్న సందేహాలపై ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో చర్చించారు. ప్రాజెక్ట్ పనులను ఎంత సమయంలో పూర్తి చేయాలన్న అంశంపై స్పష్టత కావాలని కోరారు. ఆయా కంపెనీల ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆర్డబ్ల్యూఎస్ సలహాదారు జ్ఞానేశ్వర్, వాటర్ ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ సురేశ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు జవాబులిచ్చారు. ఈ సమావేశంలో ప్రాజెక్ట్ ఎస్ఈలు జగన్మోహన్రావు, నందనరావు తదితరులు పాల్గొన్నారు.