తుది మొదలు లేని నిరంతర ప్రవాహమైన కాలం అగణితం. కానీ, మానవ జిజ్ఞాస, ప్రయత్నం దేన్నీ ఊరకే వదలదు! అందుకే, ఊహా విభజన రేఖలు గీసి... సెకండ్లని, నిమిషాలని, రోజులని, వారాలని, నెలలని, సంవత్సరాలని కాలానికి కొలతలు వేస్తాడు. యుగాల పరిణామాలకు మౌన సాక్షీభూతమైన కాలాన్ని తానేదో ఒడిసిపట్టినట్టు మనిషి భ్రమిస్తాడు. ఓ యేడు సుఖం, సంతోషం ఎక్కువైతే ఆనందిస్తాడు, కష్టం, బాధ అధికమైతే దుఃఖించి, శపిస్తాడు. కాలపు తునకలన్నీ మనిషి గీసుకున్న ఊహా రేఖలని గ్రహించడు. అదే విభజన గడుల సంధి కాలంలో నిలుచున్న మనం పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్పి కొత్త సంవత్సరానికి స్వాగతమంటున్నాం. సరే, అందులో తప్పేమీ లేదు. మంచి చెడుల గతాన్ని వదిలి, ఆశాజనక భవిష్యత్తులోకి అడుగిడే ప్రతి మలుపులో మనకో బుల్లి సమీక్ష, సత్సంకల్పం ఉండాలి.
అలా ఉంటేనే ఒకింత జాగ్రత్తగా, కాస్త పద్ధతిగా, కొంచెం వ్యూహాత్మకంగా.... వీటన్నింటికీ మించి ఆనందంగా–ఆహ్లాదంగా ముందుకు సాగే ఆస్కారం ఉంటుంది. గడచిన ఏడాదిలో ఏమేమి అనుకొని ఏమేర సాధించాం? ఇంకేమి మిగిలాయి? అని ఆత్మావలోకనంతో సమీక్షించుకుంటే నష్టమేమీ లేదు. ఆశల అల్లికతో భవిష్యత్ ప్రణాళికా రచన నేరమేమి కాదు. అది ప్రతి 365 రోజులకొకమారు అయితే తప్పేంటి అన్నది హేతుబద్ధ యోచనే! 2021కి వీడ్కోలు చెబుతూ 2022 లోకి అడుగిడుతున్న శుభవేళ ఇది! కొత్త సంకల్పాలు తీసుకొని, వాటి సాధనకోసం పురోగమించాలి. దేశం యావత్తు ఓ ఆశావహ భావనతో భవితను చూస్తోంది. ప్రతి జనవరి ఒకటికీ చేసేది ఇదే అయినా.... మంచి–చెడుల గడుల పరిధి ఒక్కోమారు భిన్నంగా ఉండొచ్చు. ఏదీ తెలిసి జరుగదు.
అన్నీ అధిగమించి ముందుకు సాగడం మానవనైజం. మానవేతి హాసంలోనే పెద్ద మహమ్మారిగా చెబుతున్న కరోనా సృష్టించిన విలయానికి గడచిన రెండు సంవత్సరాలు దూదిపింజల్లా కొట్టుకుపోయాయి. ఎన్నెన్ని కుటుంబాల్లో అది తీరని విషాదం నింపిందో, మరెన్ని మానవ హృదయాలను భయంతో కల్లోలపరిచిందో లెక్కే లేదు. మూడో సంవత్సరం ముంగిట్లోకి వచ్చిన మనకు... కొంచెం కష్టం, కొంచెం ఇష్టం అనిపించే సమాచారం అందుతోంది. వైరస్ కొత్త వైవిధ్యమైన ‘ఒమిక్రాన్’ వేగం వల్ల, గతవారం (22–29 డిసెంబరు) సగటున రోజూ 9 లక్షల కొత్త కేసులు ప్రపంచ వ్యాప్తంగా నమోదయ్యాయి. మరోవైపు చిగురుటాశ ఏమంటే, పలు పరివర్తనాల వల్ల కొత్త వైవిధ్యమై వచ్చిన ఒమిక్రాన్ అంతగా ప్రమాదకారి కాదూ అని! భయంకర ‘మహమ్మారి’ కాస్తా ఆయా కాలాల్లో తరచూ వచ్చే సాంక్రమిక అంటు వ్యాధిలా పలుచబారిందని శాస్త్ర, వైద్యవర్గం చెప్పడం ఉన్నంతలో ఊరటనిచ్చే పరిణామం.
ప్రపంచంలో ఒక బలీయ ఆర్థిక, మార్కెట్ శక్తిగా ఎదుగుతున్న భారత్ వివిధ విభాగాల్లో సాధిస్తున్న ప్రగతి, తాజా లక్ష్యాలు కొంత ఆశావహ వాతావరణం కల్పిస్తున్నాయి. పలు రంగాల్లో విజయాల సరళి కొత్త ఆశలు రేపుతోంది. విపత్తులూ కొన్ని అవకాశాలు కల్పిస్తాయనడానికి కోవిడ్–19 నిదర్శనం. టీకాల తయారీ నుంచి వైద్యారోగ్య వ్యవస్థల్ని బలోపేతం చేసుకోవడం వరకు స్వావలంబనకు అరుదైన అవకాశం లభించింది. ఆ దిశలో అడుగులు పడుతున్నాయి. స్వాతంత్రానంతరం దశాబ్దాల తరబడి నిర్లక్ష్యానికి గురైన వైద్యం, విద్య వంటి కీలకాంశాలను తగిన బడ్జెట్ కేటాయింపులతో, ప్రణాళికాబద్ధంగా తీసుకువెళితే మంచి ఫలితాలకు ఆస్కారం ఉంటుంది. వైద్యం విషయంలో సర్కార్లు ఇపుడైనా, కరోనా దెబ్బతో ‘కాలికి తట్టుతగిలింది ఇక బట్టకట్టడం ఖాయం’ అనుకోవాలి.
కేరళ వంటి రాష్ట్రాల్లో గ్రామీణ వైద్యం, కొత్తగా ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో గ్రామసచివాలయ స్థాయి వరకు వైద్యారోగ్య వ్యవస్థ విస్తరిస్తూ భరోసా కల్పిస్తున్న తీరే ఇందుకు నిదర్శనం. విద్యకు సంబంధించి ఎన్నో లోపాలు, వైఫల్యాల్ని నేడు క్షీణించిన క్షేత్ర పరిస్థితులు అడుగడుగునా ఎత్తి చూపిస్తున్నాయి. ప్రాథమిక, సెంకడరీ విద్య నుంచి ఉన్నత, సాంకేతిక విద్య వరకు... తాజా జాతీయ నూతన విద్యా విధానంలో పొందుపరచిన అంశాలతో కొత్త ఆశలు పల్లవి స్తున్నాయి. ప్రభుత్వ రంగంలో అలవిమాలిన అలక్ష్యంతో, ప్రయివేటు రంగంలో ఫక్తు వ్యాపారమై కునారిల్లిన భారత విద్యారంగం పూర్వపు వైభవోజ్వల దశను పుణికి పుచ్చుకుంటుందని ఆశిద్దాం. ఏపీలో ‘నాడు–నేడు’తో సర్కారు బడుల స్వరూప స్వభావాల్నే మారుస్తున్న తీరొక వేగుచుక్క! క్రీడా రంగంలో... ఇటీవలి టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ సాధించిన ఏడు అథ్లెటిక్స్ పతకాలొక కొత్త ఆశారేఖ! క్రికెటొకటే క్రీడ కాదు, భారత్ కీర్తికిరీటాన్ని ధగధగలాడించే మట్టిలో మాణిక్యాలు ఆట ఆటలో ఉన్నాయని తేల్చి చెప్పే భవిష్యత్తు వైపు భారత యువతరం పరుగులు తీయాలి.
ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా ఉన్న దేశం మనది. తగిన శిక్షణ, ఉద్యోగ, ఉపాధి, మేధోపరిణతి అవకాశాలు కల్పిస్తూ యువశక్తిని ఓ బలీయమైన మానవ వనరుగా తీర్చిదిద్దాలి. ప్రపంచం దృష్టి మనవైపు మళ్లేలా తగిన వ్యూహాలు, విధానాలు, కార్యాచరణ ఉంటే మనకిక తిరుగుండదు. ప్రపంచమంతా ఐటీ, కృత్రిమ మేధ, రోబోటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి ఆధునిక పరిణామాలతో పురోగమిస్తున్న ఈ తరుణంలో విలువలు, నైతికత ప్రశ్నార్థకమౌతున్నాయి. గొప్ప సనాతన, ఆధ్యాత్మిక, చారిత్రక నేపథ్యం ఉన్న దేశంగా ఆధునిక శాస్త్ర–సాంకేతిక పురోగతిని మేళ విస్తూ ముందుకు వెళితే భారత్ ఒక ప్రపంచ చోదక శక్తిగా నిలిచే అవకాశాలు పుష్కలం. ఈ క్రమంలో 2022 ఓ గొప్ప మేలుమలుపు కావాలని మనమంతా ఆశిద్దాం. ఆశే మనిషికి దిక్సూచి!
Comments
Please login to add a commentAdd a comment