హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పాత కారు.. పేరులో పాత ఉందని చిన్నచూపు చూడకండి. దేశంలో అమ్ముడవుతున్న పాత కార్ల సంఖ్య తెలిస్తే నోరెళ్లబెడతారు. 2022–23లో దేశవ్యాప్తంగా 15 శాతం వృద్ధితో 50 లక్షల యూనిట్ల యూజ్డ్ కార్లు చేతులు మారాయి. ఇందులో అవ్యవస్థీకృత రంగం వాటా 70 శాతం కాగా వ్యవస్థీకృత (ఆర్గనైజ్డ్) రంగం వాటా 30 శాతం ఉంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ 65 లక్షల యూనిట్లను తాకనుంది. ఈ రంగంలో దేశంలో ఎనిమిదవ స్థానంలో ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాటా 8 శాతంగా ఉంది. భారత్‌లో 2030 నాటికి పాత కార్ల పరిశ్రమ కొత్త వాటితో పోలిస్తే రెండింతలకు చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. తొలిసారిగా కారును సొంతం చేసుకుంటున్న కస్టమర్లలో 70 శాతం మంది పాత కారును కొనుగోలు చేస్తున్నారంటే ఆశ్చర్యం కలగకమానదు.
వ్యవస్థీకృత రంగమే..
యూజ్డ్ కార్ల మార్కెట్‌ను వ్యవస్థీకృత రంగమే నడిపిస్తోందని కార్స్24 కో–¸పౌండర్, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ గజేంద్ర జంగిద్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘పాత కార్ల రంగంలో అవ్యవస్థీకృత మార్కెట్ వార్షిక వృద్ధి 10 శాతమే. ఆర్గనైజ్డ్ మార్కెట్ ఏకంగా 30 శాతం వృద్ధి చెందుతోంది. కొత్త కార్ల విషయంలో 75 శాతం మందికి రుణం లభిస్తోంది. అదే పాత కార్లు అయితే ఈ సంఖ్య 15 శాతమే.
యూజ్డ్ కార్లకు రుణం లభించడం అంత సులువు కాదు. ఇక కారు ఉండాలనుకోవడం ఒకప్పుడు ఆకాంక్ష. నేడు అవసరంగా భావిస్తున్నారు. అందుకే కొత్తదానితో పోలిస్తే సగం ధరలో దొరికే యూజ్డ్ కారు స్టీరింగ్ పట్టుకుంటున్నారు. ఇటీవలి కాలంలో సర్టీఫైడ్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. క్వాలిటీ చెక్స్, వారంటీ, రిటర్న్ పాలసీ, ఈజీ ఫైనాన్స్.. ఇన్ని సౌకర్యాలు ఉండడంతో సర్టీఫైడ్ కార్ల పట్ల వినియోగదార్లలో నమ్మకం ఏర్పడింది’ అని ఆయన వివరించారు.
రెండు నగరాల్లోనే..
భారత్‌లో యూజ్డ్ కార్ల విక్రయ రంగంలో ఉన్న కంపెనీలు, విక్రేతలు వాహనాలను కొనుగోలు చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. అదే హైదరాబాద్, బెంగళూరు మార్కెట్లలో మాత్రమే పార్కింగ్ విధానం ఉందని కార్స్24 చెబుతోంది. అంటే పాత కారు యజమానులు యూజ్డ్ కార్స్ విక్రయ కేంద్రాల్లో అద్దె చెల్లించి తమ వాహనాన్ని పార్క్ చేయవచ్చు. మంచి బేరం వస్తే యజమాని సమ్మతి మేరకు కారును విక్రయిస్తారు. కమీషన్ ఆధారంగానూ క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. ఇక 2015లో 100 కొత్త కార్లు రోడ్డెక్కితే అంతే స్థాయిలో పాత కార్లు చేతులు మారాయి. ఇప్పుడీ సంఖ్య 150 యూనిట్లకు చేరింది. యూఎస్, ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లో 100 కొత్త కార్లకు 400 పాత కార్లు అమ్ముడవుతున్నాయి.
సగటు ధర రూ. 6 లక్షలు..
పాత కారు కొనుగోలు సగటు ధర రూ.6 లక్షలు ఉంటోంది. అమ్ముడవుతున్న మొత్తం పాత కార్లలో హ్యాచ్‌బ్యాక్ వాటా 60 శాతం కైవసం చేసుకుంది. ఈ విభాగం వృద్ధి నిలకడగా ఉంది. 20 శాతం వాటా ఉన్న సెడాన్స్ వృద్ధి రేటు తగ్గుతూ ప్రస్తుతం 20 శాతానికి వచ్చి చేరింది. ఎస్‌యూవీల వాటా క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం 20 శాతంగా ఉంది. అయితే వృద్ధి ఏకంగా 30 శాతానికి చేరింది.
2030 నాటికి ఎస్‌యూవీల వాటా పాత కార్ల కొనుగోళ్లలో 40 శాతానికి ఎగుస్తుందని పరిశ్రమ భావిస్తోందని సుదీర్‌కార్స్.కామ్ ఫౌండర్ బండి సు«దీర్ రెడ్డి తెలిపారు. అదే కొత్త కార్ల విషయంలో ప్రస్తుతం ఎస్‌యూవీల వాటా 45 శాతం తాకిందన్నారు. హ్యాచ్‌బ్యాక్స్ వాటా 30 శాతముందని చెప్పారు. దేశవ్యాప్తంగా గత ఆర్థిక సంవత్సరంలో 38.9 లక్షల యూనిట్ల కొత్త కార్లు రోడ్డెక్కాయి. 2023–24లో ఈ సంఖ్య 40 లక్షల యూనిట్లు దాటుతుందన్న అంచనాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment