ముఖ్యనేత వచ్చేదాకా వేచి ఉండాల్సిందే..
పనులు చేస్తే తిప్పలు తప్పవని సూచనలు
గుడ్‌విల్ కోసం కాంట్రాక్టర్ల బేరసారాలు
కొలిక్కిరాని సీసీ రోడ్ల టెండరు వ్యవహారం
వరంగల్ : భూపాలపల్లి నియోజకవర్గంలోని హౌసింగ్ కాలనీల్లో సిమెంటు రోడ్ల నిర్మాణం కోసం నిర్వహించిన టెండర్ల వ్యవహారం పెండింగ్‌లో పడింది. టెండర్లలో పాల్గొన్న కాంట్రాక్టర్ల అర్హతల పరిశీలన పేరుతో వారం రోజులు గడిచినా పనులు కేటాయింపు ఖరారు చేయపోవడం వెనుక ముఖ్యనేత హస్తం ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పనుల ఖరారు ప్రక్రియను అధికారులు మరో నాలుగు రోజులు నానబెట్టే అవకాశం ఉం దని తెలుస్తోంది. భూపాలపల్లి నియోజకవర్గానికి చెం దిన ముఖ్యనేత అందుబాటులో లేకపోవడంతో ఆయ న వచ్చేంత వరకు ఈ పక్రియను పెండింగ్‌లో పెట్టాలని హౌసింగ్ అధికారులకు మౌఖిక ఆదేశాలు అందినట్లు సమాచారం. రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ నిర్మించిన హౌసింగ్ కాలనీల్లో మౌలిక వసతుల కల్పన ప్రక్రియలో భాగంగా సిమెంటు రోడ్ల నిర్మాణానికి భూపాలపల్లి నియోజకవర్గానికి రూ.16 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. 36 కాలనీల్లో సిమెంటు రోడ్ల నిర్మాణానికి జిల్లా గృహ నిర్మాణ సంస్థ 35 ప్యాకేజీలుగా ఇ-ప్రొక్యూర్‌మెంట్‌లో టెండర్లు పిలిచింది. ఈ ప్రొక్యూర్‌మెంటులో పలువురు కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేశారు. నిధులు తీసుకువచ్చినందున తాను చెప్పిన వారే టెండర్లు వేయాలని ముఖ్యనేత నుంచి కాంట్రాక్టర్లకు ముందుగానే హెచ్చరికలు వెళ్లాయి.
హెచ్చరికలను ఖాతర చేయకుండా కొందరు టెండర్లు వేశారు. ఈ వ్యవహారం ముఖ్యనేతకు ఆగ్రహం తెప్పించింది. ‘నేను తెచ్చిన నిధుల కాంట్రాక్టర్లు నా వారికి దక్కకుంటే నిధులు మళ్లిస్తా..’ అని ముఖ్యనేత ఆగ్రహించడంతో స్థానిక నాయకులు కొందరు కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెచ్చే పనిలో పడ్డారు. పనులు ముఖ్యనేత అనుయాయునికి దక్కకుంటే.. ‘మీకు వచ్చినా చేయలేరు. తర్వాత బిల్లులు చెల్లింపులోనూ ఇబ్బందులు ఉంటాయి’ అని హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో టెండర్లు వేసిన కాంట్రాక్టర్లు తప్పని సరి పరిస్థితుల్లో రాజీపడుతున్నట్లు తెలుస్తోంది. ‘టెండర్ల నుంచి విరమించుకుంటాం. గుడ్‌విల్ కింద ఇచ్చే మొత్తాన్ని ముం దుగానే ఇవ్వాలి’ అని షరతులు పెడుతున్నట్లు సమాచారం. ముఖ్యనేత అనుయాయుడు ఇప్పటికే ఆయన తో మాట్లాడుకుని ఉన్నందున.. కాంట్రాక్టర్లకు ఏ రకమైన హామీ వస్తుందో అనేది ఎవరికీ అంతు చిక్క డం లేదు. ముఖ్యనేత నియోజకవర్గానికి రాగానే ఎవరికి ఎంత మొత్తం(గుడ్‌విల్) ఇవ్వాలనే విషయంలో స్పష్ట త వస్తుందని అనుయాయుడి వర్గం వారు చెబుతున్నా రు. టెండర్ల ప్రకటన షెడ్యూల్ ప్రకా రం ఆగస్టు 24న సాంకేతిక బిడ్, 28న ఫైనాన్సియల్ బిడ్ తెరిచి ఖరారు చేయాల్సి ఉంది. టెండర్ల ప్రక్రియలో జాప్యంపై హౌసింగ్ అధికారులను అడిగితే... ‘ఇంకా పరిశీలన పూర్తి కాలేదు’ అని చెబుతున్నారు. అధికారులు చెబుతున్న కారణాలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
టెండరు పెండింగ్!
Published Thu, Sep 3 2015 2:45 AM | Last Updated on Sun, Sep 3 2017 8:37 AM
Advertisement
Advertisement