ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటులో ప్రవేశపెడుతున్న బడ్జెట్‌పై దేశీయ డెవలపర్లు గంపెడాశలు పెట్టుకున్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రియల్ ఎస్టేట్ రంగానికి మౌలిక రంగ హోదాను ఈ బడ్జెట్‌లో ప్రకటిస్తారని డెవలపర్ల సంఘాలు ధీమావ్యక్తం చేస్తున్నాయి. ప్రాపర్టీలకు డిమాండ్ పెంచేలా, కొనుగోలుదారులకు, డెవలపర్లకు పన్ను మినహాయింపులు ఉండేలా ఈ బడ్జెట్ ఉంటుందని ఆశాభావంవ్యక్తం చేశారు. సింగిల్ విండో ద్వారా ప్రాజెక్ట్‌ల అనుమతులు, లిక్విడిటీని పెంచే చర్యలతో పాటు వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) తగ్గింపు, ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) లభ్యత వంటివి ఆశిస్తున్నట్లు టాటా రియాల్టీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎండీ అండ్ సీఈఓ సంజయ్ దత్ తెలిపారు.
రియల్టీ రంగ వృద్ధి రాబోయే ఆర్ధిక సవరణల మీద ఆధారపడి ఉందని, ప్రాజెక్ట్‌లు వేగవంతంగా పూర్తి చేయడానికి ఒకే విండో క్లియరెన్స్ యంత్రాంగాన్ని మంజూరు చేయాలని పేర్కొన్నారు. ఒకటే స్టాంప్ డ్యూటీ లేదా అన్ని రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చార్జీల తగ్గింపు వంటి సిఫారసులను చేపట్టాలని, దీంతో ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం గణనీయంగా తగ్గి గృహ కొనుగోలుదారులు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తారని వివరించారు. రిజిస్ట్రేషన్ చార్జీలు, స్టాంప్ డ్యూటీలను జీఎస్‌టీ పరిధిలోకే తీసుకురావాలని గౌర్స్ గ్రూప్ చైర్మన్ అండ్ ఎండీ మనోజ్ గౌర్ తెలిపారు. ఐటీ చట్టం, 1961లోని 80సీ కింద గృహ రుణాల్లో పన్ను మినహాయింపు పరిమితులను పెంచాలని, ప్రాపర్టీ అమ్మకం మీద దీర్ఘకాలిక పన్నుల్లో సంస్కరణలు చేపట్టాలని, నిర్మాణంలో ఉన్న ప్రాపర్టీల మీద జీఎస్‌టీని హేతుబద్దం చేయాలని సీబీఆర్‌ఈ చైర్మన్ అన్షుమన్ మ్యాగజైన్ కోరారు. అఫర్డబుల్ మరియు మిడ్–ఇన్‌కం ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడానికి కేటాయించిన ప్రత్యేక ఫండ్ (ఎస్‌డబ్ల్యూఏఎంఐహెచ్)ను రూ.25 వేల కోట్లకు పెంచాలని కోరారు.
బంగారం రుణ సంస్థలను ప్రోత్సహించాలి
వ్యవస్థలో కీలక పాత్రను పోషిస్తున్న తమను ఇతర ఎన్‌బీఎఫ్‌సీలతో పోలిస్తే ప్రత్యేకంగా చూడాలని బంగారంపై రుణాలను అందించే ఎన్‌బీఎఫ్‌సీలు కేంద్రాన్ని కోరాయి. ‘‘2021–22 బడ్జెట్ నుంచి వృద్ధి అనుకూల విధానాలను ఆశిస్తున్నాము. అప్పుడే రానున్న సంవత్సరాల్లో సామర్థ్యం మేరకు మన దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందగలదు. గోల్డ్ లోన్ ఎన్‌బీఎఫ్‌సీలు ఎంఎస్‌ఎంఈలు, వ్యక్తులకు వేగంగా రుణ సాయాన్ని అందిస్తున్నాయి. కనుక ఇతర ఎన్‌బీఎఫ్‌సీలకు భిన్నంగా చూడాలి. ఎందుకంటే రూ.1,500 మొత్తాల నుంచి సామాన్యులకు రుణాలను అందిస్తున్నాయి. ఇళ్లలోని బంగారాన్ని మానిటైజ్ చేసి ఆర్థిక వ్యవస్థకు సాయంగా నిలుస్తున్నాయి.
కనుక పారదర్శకమైన, వృద్ధికి అనుకూలంగా ఉండే నియంత్రణ పరమైన వాతావరణాన్ని కోరుకుంటున్నాము. అలా చేస్తే కస్టమర్లకు మరింత మెరుగ్గా, వేగంగా సేవలు అందించడానికి వీలు పడుతుంది. బ్యాంకులు, గోల్డ్ ఎన్‌బీఎఫ్‌సీల మధ్య ఎల్‌టీవీ విషయంలో అంతరాన్ని తొలగించాలి. బ్యాంకుల మాదిరే బంగారం కాయిన్లపై రుణాలకు అనుమతించాలి. ఆర్‌బీఐ నుంచి శాశ్వత రీఫైనాన్సింగ్ విండో ఉండాలి. అలాగే, వడ్డీపై టీడీఎస్ నుంచి మినహాయింపునివ్వాలి’’ అంటూ ముత్తూట్ ఫైనాన్స్ ఎండీ అలెగ్జాండర్ ముత్తూట్ బడ్జెట్ నుంచి తామేమి ఆశిస్తున్నామో తెలియజేశారు.
ద్రవ్యలోటు కాకుండా... వృద్ధే లక్ష్యం కావాలి! ఇండియా రేటింగ్స్
బడ్జెట్ ప్రభుత్వ ఆదాయ–వ్యయాలకు సంబంధించిన నికర వ్యత్యాసం ద్రవ్యలోటు కట్టడిపైన మరీ అంత దృష్టి పెట్టకుండా, ఆర్థిక రివకరీ, వృద్ధిపైనే చర్యలు తీసుకోవాలని ఇండియా రేటింగ్స్ గురువారం విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొంది. ఇండియా రేటింగ్స్ చీఫ్ ఎకనమిస్ట్ దేవేంద్ర పంత్ నివేదికలోని అంశాలను వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment