న్యూఢిల్లీ: 2021-22 కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివిధ ఉత్పత్తుల్లో దిగుమతి చేసుకొనే వాడే విడి భాగాలపై కస్టమ్స్ డ్యూటీ పెంచేశారు. దిగుమతి చేసుకున్న విడి భాగాలపై కస్టమ్స్ సుంకం పెరగడం వల్ల రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, ఎల్‌ఈడీ లైట్లు, మొబైల్ ఫోన్‌లతో సహా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు పెరగనున్నాయి. రిఫ్రిజిరేటర్లు, ఏసీల్లో కీలకంగా వాడే కంప్రెషర్‌పై 2.5 శాతం, ఎలక్ట్రిక్ మోటార్లపై 10-15 శాతం కస్టమ్స్ డ్యూటీ పెంచారు. దేశీయ ఎలక్ట్రానిక్ తయారీ రంగం వేగంగా వృద్ధి చెందడానికి విదేశీ వస్తువుల దిగుమతిపై ప్రభుత్వం కస్టమ్ డ్యూటీని విధించిందని సీతారామన్ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశీయ అవసరాలకు అనుగుణంగా 40 శాతం రిఫ్రిజిరేటర్లు, 20 శాతం ఎయిర్ కండీషనర్ల స్థానికంగా ఉత్పత్తి మాత్రమే జరుగుతున్నది.(చదవండి: గృహ కొనుగోలుదారులకు శుభవార్త!)
తాజాగా కస్టమ్స్ సుంకం పెంచడంతో స్వల్పంగా ఒక శాతం అంటే రూ.100 నుంచి రూ.500 మధ్య ధరలు పెరుగనున్నాయి. ఈ పెంపు అనేది ఇండస్ట్రీపై ప్రతికూల ప్రభావం చూపనున్నట్లు కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లియెన్సెస్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (సీఈఏఎంఏ) అధ్యక్షుడు కమల్‌నంది పేర్కొన్నారు. రిఫ్రిజిరేటర్లపై 12.5 శాతం, ఏసీలపై 15 శాతం పన్ను విధించనున్నందున మొత్తం కంప్రెషర్ ధర 25-30 శాతం ఎక్కువవుతుందన్నారు. పానాసోనిక్ ఇండియా సీఈవో మనీశ్ శర్మ మాట్లాడుతూ.. కస్టమ్స్ సుంకం పెంపు ప్రభావం 0.6 శాతం ఉంటుందని చెప్పారు. రెండు పెద్ద కంపెనీలు కంప్రెషర్ తయారీకి ఉత్పాదక యూనిట్లు ప్రారంభించాయని, కానీ కరోనాతో అంతరాయం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ప్రస్తుతం ఈ ప్రాజెక్టుల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment