న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ కంపెనీలు, ఫైనాన్షియల్ రంగ సంస్థలలో వాటాల విక్రయం ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరం (2021–22)లో రూ. 1.75 లక్షల కోట్లను సమకూర్చుకోవాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్‌లో ప్రతిపాదించారు. గత బడ్జెట్‌లో ప్రతిపాదించిన డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం రూ. 2.10 లక్షల కోట్లతో పోలిస్తే తాజా ప్రతిపాదనలు రూ. 35,000 కోట్లు తక్కువకావడం గమనార్హం! అయితే కేంద్ర ప్రభుత్వ సంస్థల(సీపీఎస్‌ఈలు) వాటా విక్రయంపై కోవిడ్–19 ప్రతికూల ప్రభావం చూపడంతో ఈ ఏడాది డిజిన్వెస్ట్‌మెంట్ అంచనాలను తాజాగా రూ. 32,000 కోట్లమేర తగ్గించింది. కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకూ సీపీఎస్‌ఈలలో వాటాల విక్రయం, షేర్ల బైబ్యాక్ ద్వారా రూ. 19,499 కోట్లు మాత్రమే సమీకరించింది.
రూ. లక్ష కోట్లు: వచ్చే ఏడాది లక్ష్యంగా పెట్టుకున్న రూ. 1.75 లక్షల కోట్లలో రూ. లక్ష కోట్లను ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఫైనాన్షియల్ కంపెనీలలో వాటాల విక్రయం ద్వారా సమకూర్చుకోవాలని ఆర్థిక శాఖ భావిస్తోంది. ఈ బాటలో సీపీఎస్‌ఈల డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా మరో రూ. 75,000 కోట్లను సమీకరించేందుకు ప్రతిపాదించింది. ఈసారి డిజిన్వెస్ట్‌మెంట్ వ్యూహంలో భాగంగా నాలుగు రంగాలను ఎంపిక చేసినట్లు ఆర్థిక మంత్రి సీతారామన్ పేర్కొన్నారు. అణు ఇంధనం(ఆటమిక్ ఎనర్జీ), అంతరిక్షం, రక్షణ, రవాణా, టెలికమ్యూనికేషన్స్, విద్యుత్, పెట్రోలియం, బొగ్గు, ఇతర మినరల్స్, బ్యాంకింగ్, బీమా, ఫైనాన్షియల్ సర్వీసెస్‌లను ప్రస్తావించారు. తాజా ప్రతిపాదనల ప్రకారం వ్యూహాత్మక రంగాలలో ప్రభుత్వ రంగ సంస్థల పాత్రను నామమాత్రం చేయనున్నారు.
ఈ రంగాలలో మిగిలిన సీపీఎస్‌ఈలను ప్రయివేటైజ్ చేయడం లేదా విలీనం లేదా అనుబంధ సంస్థలుగా మార్చడం వంటి అంశాలకు తెరతీయనున్నారు. ఇలాకాకుంటే వీటిని మూసివేస్తారు. వచ్చే ఏడాదిలో బీపీసీఎల్, ఎయిరిండియా, షిప్పింగ్ కార్పొరేషన్, కంటెయినర్ కార్పొరేషన్, ఐడీబీఐ బ్యాంక్, బీఈఎంఎల్, పవన్ హంస్, నీలాచల్ ఇస్పాత్ నిగమ్ తదితరాల డిజిన్వెస్ట్‌మెంట్‌ను పూర్తి చేయనున్నట్లు సీతారామన్ పేర్కొన్నారు. ఐడీబీఐ బ్యాంక్ సహా మరో రెండు పీఎస్‌యూ బ్యాంకులు, ఒక సాధారణ బీమా కంపెనీని ప్రయివేటైజ్ చేసేందుకు ప్రతిపాదించినట్లు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు తమ పీఎస్‌యూలలో డిజిన్వెస్ట్‌మెంట్‌ను చేపట్టేందుకు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు చెప్పారు.
ఆస్తుల విక్రయయానికి ప్రత్యేక కంపెనీ...
వినియోగంలోలేని ఆస్తులు ఆత్మనిర్భర్ భారత్‌కు సహకరించవని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. కీలకంకాని ఆస్తుల జాబితాలో ప్రభుత్వ శాఖలు, పీఎస్‌యూల వద్ద గల మిగులు భూములు అధికంగా ఉన్నట్లు వెల్లడించారు. వీటి ప్రత్యక్ష విక్రయం లేదా ఇతర విధానాలలో మానిటైజేషన్‌కు వీలుగా ఒక ప్రత్యేక కంపెనీ(ఎస్‌పీవీ)ను ఏర్పాటుకు ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు.
ఎల్‌ఐసీ లిస్టింగ్‌కు సై రూ. 8–10 లక్షల కోట్ల మార్కెట్ విలువ అంచనా
వచ్చే ఏడాది(2021–22)లో ప్రభుత్వ రంగ దిగ్గజం ఎల్‌ఐసీ పబ్లిక్ ఇష్యూని చేపట్టనున్నట్లు సీతారామన్ పేర్కొన్నారు. ఈ బాటలో ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకు అవసరమైన చట్ట సవరణలను ప్రవేశపెడుతున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో తాజాగా ఆర్థిక మంత్రి తెలియజేశారు. జీవిత బీమా బ్లూచిప్ కంపెనీ ఎల్‌ఐసీలో ప్రభుత్వానికి ప్రస్తుతం 100 శాతం వాటా ఉంది. ఎల్‌ఐసీ స్టాక్ మార్కెట్లో లిస్టయితే రూ. 8–10 లక్షల మార్కెట్ విలువను సాధించగలదని విశ్లేషకుల అంచనా. తద్వారా దేశీయంగా అత్యంత విలువైన కంపెనీగా నిలిచే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment