ఇక ‘తుక్కు’ రేగుతుంది..! | Government announces details of vehicle scrappage policy | Sakshi
Sakshi News home page

ఇక ‘తుక్కు’ రేగుతుంది..!

Published Fri, Mar 19 2021 4:42 AM | Last Updated on Fri, Mar 19 2021 6:51 AM

Government announces details of vehicle scrappage policy - Sakshi

న్యూఢిల్లీ: కాలుష్యకారక పాత వాహనాల వినియోగాన్ని తగ్గించి, కొత్త వాహనాల కొనుగోళ్లను ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పాత వాహనాలను తుక్కు కింద మార్చేందుకు ఇచ్చి, స్క్రాప్‌ సర్టిఫికెట్‌ తీసుకుంటే కొత్త కారుకు రిజిస్ట్రేషన్‌ ఫీజును మాఫీ చేయాలని భావిస్తోంది. అలాగే, వ్యక్తిగత వాహనాలకు 25 శాతం దాకా, వాణిజ్య వాహనాలకు 15 శాతం దాకా రోడ్‌ ట్యాక్స్‌లో రిబేటు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించనుంది. ఇక స్క్రాపింగ్‌ సర్టిఫికెట్‌ గల వాహనదారులకు కొత్త వాహనాలపై అయిదు శాతం మేర డిస్కౌంటు ఇచ్చేలా వాహనాల తయారీ సంస్థలకు కూడా సూచించనుంది.

వాహనాల స్క్రాపేజీ విధానంపై కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ గురువారం పార్లమెంటులో ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. ఈ విధానంపై సంబంధిత వర్గాల అభిప్రాయాలను తెలుసుకునేందుకు రాబోయే కొన్ని వారాల్లో ముసాయిదా నోటిఫికేషన్‌ను ప్రచురించనున్నట్లు ఆయన తెలిపారు.       రిజిస్టర్డ్‌ తుక్కు కేంద్రాల్లో పాత, అన్‌ఫిట్‌ వాహనాలను స్క్రాప్‌ కింద ఇచ్చేసి, స్క్రాపింగ్‌ సర్టిఫికెట్‌ పొందే యజమానులకు ఈ స్కీమ్‌ కింద పలు ప్రోత్సాహకాలు లభిస్తాయని గడ్కరీ తెలిపారు. స్క్రాప్‌ కింద ఇచ్చేసే వాహనాల విలువ..  కొత్త వాహనాల ఎక్స్‌షోరూం రేటులో సుమారు 4–6% దాకా ఉండేలా స్క్రాపింగ్‌ సెంటర్‌ సర్టిఫికెట్‌ జారీ చేసే అవకాశం ఉంటుందన్నారు. దేశీ వాహన పరిశ్రమ టర్నోవరు ప్రస్తుతం రూ. 4.5 లక్షల కోట్ల స్థాయి నుంచి రూ. 10 లక్షల కోట్లకు పెరిగేందుకు స్క్రాపేజీ పాలసీ తోడ్పడగలదని మంత్రి తెలిపారు.  

అందరికీ ప్రయోజనకరం..: స్క్రాపేజీ విధానం అన్ని వర్గాలకూ ప్రయోజనకరంగా ఉండబోతోందని గడ్కరీ తెలిపారు. ఇంధన వినియోగ సామర్థ్యం మెరుగుపడేందుకు, కాలుష్యాన్ని తగ్గించేందుకు, కొత్త వాహనాల కొనుగోళ్లపై జీఎస్‌టీ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చేందుకు కూడా ఇది తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు. పాత, లోపభూయిష్టమైన వాహనాల సంఖ్యను తగ్గించడం ద్వారా కాలుష్య కారక వాయువుల విడుదలను నియంత్రించేందుకు, రహదారి.. వాహనాల భద్రతను మెరుగుపర్చేందుకు ఈ పాలసీ ఉపయోగపడుతుందన్నారు.   

ప్రాణాంతకంగా రోడ్డు ప్రమాదాలు..
రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య కోవిడ్‌–19 మరణాల కన్నా ఎక్కువ ఉండటం ఆందోళనకరమని గడ్కరీ తెలిపారు. గతేడాది కోవిడ్‌–19తో 1.46 లక్షల మంది మరణించగా రోడ్డు ప్రమాదాల్లో 1.5 లక్షల మంది మృత్యువాత పడ్డారని ఆయన పేర్కొన్నారు. వీరిలో అత్యధిక శాతం 18–35 ఏళ్ల మధ్య వయస్సున్న వారేనని మంత్రి చెప్పారు.

తుక్కు పాలసీ ప్రతిపాదనల్లో మరికొన్ని...
► వాహనాల ఫిట్‌నెస్‌ టెస్టులు, స్క్రాపింగ్‌ సెంటర్ల సంబంధ నిబంధనలు 2021 అక్టోబర్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయి. పదిహేనేళ్లు పైబడిన ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల వాహనాలను తుక్కు కింద మారుస్తారు. 
►  2023 ఏప్రిల్‌ 1 నుంచి భారీ వాణిజ్య వాహనాల ఫిట్‌నెస్‌ టెస్టింగ్‌ను తప్పనిసరి చేస్తారు. మిగతా వాహనాలకు దశలవారీగా 2024 జూన్‌ 1 నుంచి దీన్ని అమల్లోకి తెస్తారు.
► ఫిట్‌నెస్‌ టెస్టులో విఫలమైనా, రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ పునరుద్ధరణలో విఫలమైనా సదరు వాహనాల జీవితకాలం ముగిసినట్లుగా పరిగణిస్తారు. 15 ఏళ్ల తర్వాత ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ పొందడంలో విఫలమైన వాణిజ్య వాహనాలను డీ–రిజిస్టర్‌ చేస్తారు. ఇలాంటి వాహనాల వినియోగాన్ని తగ్గించే దిశగా 15 ఏళ్ల పైబడిన  కమర్షియల్‌ వాహనాల ఫిట్‌నెస్‌ టెస్టు, సర్టిఫికెట్ల ఫీజును భారీగా పెంచుతారు.  
► ప్రైవేట్‌ వాహనాల విషయానికొస్తే .. 20 ఏళ్ల తర్వాత ఫిట్‌నెస్‌ టెస్టులో లేదా రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ పునరుద్ధరణలో విఫలమైన పక్షంలో డీ–రిజిస్టర్‌ చేస్తారు. 15 ఏళ్ల నుంచే రీ–రిజిస్ట్రేషన్‌ ఫీజులను పెంచుతారు.
► ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంలో రిజిస్టర్డ్‌ వాహనాల స్క్రాపింగ్‌ కేంద్రాల (ఆర్‌వీఎస్‌ఎఫ్‌) ఏర్పాటుకు కేంద్రం ప్రోత్సాహమిస్తుంది.


స్క్రాపింగ్‌ కేంద్రం ఏర్పాటుకు మార్గదర్శకాల ముసాయిదా..
రిజిస్టర్డ్‌ వెహికల్‌ స్క్రాపింగ్‌ కేంద్రం (ఆర్‌వీఎస్‌ఎఫ్‌) ఏర్పాటుకు సంబంధించిన మార్గదర్శకాల ముసాయిదాను కేంద్రం ప్రకటించింది. దీని ప్రకారం వచ్చే రెండేళ్లలో దేశ వ్యాప్తంగా 100 స్క్రాపింగ్‌ సెంటర్లు అందుబాటులోకి వస్తాయి. ఆర్‌వీఎస్‌ఎఫ్‌ ఏర్పాటుకు రూ. లక్ష లేదా ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రభుత్వాలు నిర్దేశించే మొత్తం ప్రాసెసింగ్‌ ఫీజుగా ఉంటుంది. ప్రతీ ఆర్‌వీఎస్‌ఎఫ్‌కు ముం దస్తు డిపాజిట్‌గా రూ.10 లక్షల  బ్యాంక్‌ గ్యా రంటీ ఇవ్వాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్‌ కో సం దరఖాస్తు చేసుకున్న 60 రోజులల్లోగా అనుమ తులపై నిర్ణయం తీసుకోవాలి. ఈ ముసా యిదా నిబంధనలపై సంబంధిత వర్గాలు 30 రోజుల్లోగా అభిప్రాయాలు తెలియజేయాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement