సాక్షి, బళ్లారి: ప్రభుత్వ రంగ సంస్థల విచ్చలవిడి ప్రైవేటీకరణకు కాంగ్రెస్ వ్యతిరేకమని ఆ పార్టీ నేత రాహుల్‌గాంధీ అన్నారు. తాము అధికారంలోకి వస్తే దీనికి అడ్డుకట్ట వేస్తామని ప్రకటించారు. ఆయన భారత్ జోడో పాదయాత్ర బుధవారం కర్ణాటకలో కొనసాగింది. చిత్రదుర్గం జిల్లాలో అవయవ దానం చేసిన వారి పిల్లలు, కుటుంబీకులతో రాహుల్ కలిసి నడిచారు. గొప్ప దాతల సంబంధీకులతో కలిసి నడవడం ఎంతో గర్వకారణంగా ఉందంటూ అనంతరం ఆయన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.
కన్నడ నట దిగ్గజం దివంగత రాజ్‌కుమార్, ఇటీవల మరణించిన ఆయన కుమారుడు పునీత్ రాజ్‌కుమార్ నేత్రదానం లక్షలాది మంది కన్నడిగులకు ఆదర్శంగా నిలిచిందంటూ కొనియాడారు. అంతకుముందు గిరియమ్మనహళ్లి వద్ద రాహుల్ నిరుద్యోగ యువతతో, రైతులతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో యువతకు ఉపాధి కల్పించేందుకు పథకం తీసుకొస్తామన్నారు. విద్య, ఆరోగ్య రంగాల్లో అపారమైన ఉపాధి అవకాశాలున్నాయన్నారు. యువత సొంత వ్యాపారాలు, చిన్న పరిశ్రమలు పెట్టుకునేందుకు ప్రత్యేక ఆర్థిక సాయం అందజేసే వ్యవస్థను తెస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment