వందల కోట్ల కణాల మెదడుపై అధ్యయనానికి కొత్త పద్దతి
లండన్: వందల కోట్ల కణాలతో అతిక్లిష్టంగా ఉండే మన మెదడును మరింత బాగా అధ్యయనం చేసేందుకు వీలుగా బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్ శాస్త్రవేత్తలు ఓ కొత్త పద్ధతిని కనిపెట్టారు. 'మల్టీకలర్ ఆర్‌జీబీ(ఎరుపు, ఆకుపచ్చ, నీలి) ట్రాకింగ్' అనే ఈ పద్ధతిలో మెదడును కణస్థాయిలో అధ్యయనం చేసేందుకు వీలవుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. కాంతిని ప్రతిఫలింపచేసే ప్రొటీన్‌ను ఉత్పత్తి చేసే వైరస్ కణాలను చొప్పించడం ద్వారా మెదడు కణాలు ఏదో ఒక రంగును వెదజల్లేలా చేయవచ్చని వారు తెలిపారు.
అలా చేయడం ద్వారా మెదడు కణాల చర్యలను అర్థం చేసుకునేందుకు వీలవుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ తరహాలో అధ్యయనం భవిష్యత్తులో మెదడుకు సంబంధించిన అనేక చికిత్సలకు దోహదపడుతుందని వారు తెలిపారు. వారి పరిశోధనల వివరాలు 'సైంటిఫిక్ రిపోర్ట్స్' అనే పత్రికలో ప్రచురించారు.