brain cells
-
సర్జరీ లేకుండా మతిమరుపును పోగొట్టొచ్చు, శాస్త్రవేత్తల కొత్త ప్రయోగం
విద్యుత్ షాక్‌ని ఉపయోగించి మతిమరుపును పోగొట్టొచ్చు అని శాస్త్రవేత్తలు కొత్తరకం ప్రయోగం చేశారు. హై-ఫ్రీక్వెన్సీ టెక్నాలజీని ఉపయోగించి వృద్ధుల్లో జ్ఞాపకశక్తిని మెరుగుపరిచేందుకు సహాయపడుతుందట. అంతేకాకుండా ఎలాంటి సర్జరీ అవసరం లేకుండానే ఈ చికిత్స నిర్వహించనున్నట్లు సైంటిస్టులు తెలిపారు. తీవ్రమైన మతిమరుపును తెచ్చిపెట్టే డిమెన్షియా రకాల్లో అల్జీమర్స్ ఒకటి. అల్జీమర్స్ కారణంగా మానసిక, ప్రవర్తన, సామాజిక నైపుణ్యాలు క్రమంగా క్షీణిస్తాయి. ఈ న్యూరోలాజిక్ డిజార్డర్ కారణంగా బ్రెయిన్ సెల్స్ దెబ్బతింటాయి. కాలక్రమేణా అల్జీమర్స్ వ్యాధి లక్షణాలు తీవ్రమవుతాయి. మెదడులోని టెంపోరలో అనే భాగంలో జ్ఞాపకశక్తికి సంబంధించిన కణాలు ఉంటాయి. అల్జీమర్స్ బారినపడినవాళ్ల లో ఈ కణాలు సన్నగా, చిన్నగా అవుతాయి. దాంతో టెంపోరల్ చిన్నగా అవుతుంది. అంతేకాదు 'హైపోమెటబాలిజం' ఉంటుంది. అంటే గ్లూకోజ్ తక్కువ అందుతుంది. దాంతో మెదడు చురుకుదనం కోల్పోతుంది. దాంతో ఆలోచనా శక్తి తగ్గిపోవడమే. కాకుండా జ్ఞాపకాలు చెదిరిపోయి, మతిమరుపు మొదలవుతుంది. హిప్పోకాంపస్లోని న్యూరాన్లను ఉత్తేజపరిచేందుకు కొత్త హై-ఫ్రీక్వెన్సీ టెక్నాలజీని ఉపయోగించి మతిమరుపును పోగొట్టొచ్చు అని రీసెంట్గా శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో తేల్చారు. ఇంపీరియల్ కాలేజ్ లండన్ (ICL) శాస్త్రవేత్తల నేతృత్వంలో టెంపోరల్ ఇంటర్ఫెరెన్స్ (TI) బ్రెయిన్ స్టిమ్యులేషన్‌తో మతిమరుపును పోగొట్టచ్చని కనిపెట్టారు. ఇందులో భాగంగా హై ఫ్రీక్వెన్సీ విద్యుత్ కణాలకు బ్రెయిన్‌కు పంపించి జ్ఞాపకశక్తిని తిరిగి పొందేందుకు సహాయపడుతుందట. ఇందులో భాగంగా2,000 Hz,2,005 Hz, వద్ద విద్యుత్ కణాలను పంపిస్తాయి. ఇది ఒకరకంగా కరెంట్ షాక్ లాంటిదే. 5-Hz కరెంట్‌తో అదే ఫ్రీక్వెన్సీలో బ్రెయిన్ సెల్స్ యాక్టివేట్ అవుతాయి. దీని వల్ల సెల్-పవర్ చేసే మైటోకాండ్రియాను పునరుజ్జీవింపజేస్తాయని, ఇది మతిమరుపును పోగొడుతుందని సైంటిస్టులు తమ రీసెర్చ్‌లో వివరించారు.''ఇప్పటివరకు మెదడుకు సంబంధించిన ఏదైనా సమస్యలు తలెత్తితే రోగికి ఎలక్ట్రోడ్లను శస్త్రచికిత్స ద్వారా అమర్చాల్సి వచ్చేది. కానీ ఈ హై-ఫ్రీక్వెన్సీ టెక్నాలజీతో ఎలాంటి నొప్పిలేకుండా రోగికి జ్ఞాపకశక్తిని మెరుగుపరిచేలా చేయొచ్చు.'' అని సైంటిస్ట్ నిర్ గ్రాస్మాన్ తెలిపారు. ఈ టెక్నిక్‌తో సర్జరీ అవసరం లేకుండా మనిషి మెదడులోని కణాలను ప్రేరేపించడం సాధ్యమవుతుంది. ఇది బ్రెయిన్ సెల్స్‌ను ప్రభావితం చేస్తుంది అని పేర్కొన్నారు. -
ల్యాబ్‌లోని మెదడు కణాలూ వీడియోగేమ్ ఆడేశాయ్
సిడ్నీ: మానవ మేథోశక్తిని ప్రయోగశాలలో పునఃసృష్టి చేసేందుకు ప్రయత్నిస్తున్న పరిశోధకులు ఆ క్రతువులో స్వల్ప విజయం సాధించారు. 1970ల నాటి టెన్నిస్ క్రీడను తలపించే పోంగ్ కంప్యూటర్ వీడియోగేమ్‌ను ప్రయోగశాలలో అభివృద్ధిచేసిన మెదడు కణాలు అర్థంచేసుకుని, అందుకు అనుగుణంగా స్పందిస్తున్నాయి. కొత్త తరం బయోలాజికల్ కంప్యూటర్ చిప్స్ అభివృద్ధి కోసం ఆస్ట్రేలియాలోని కార్టికల్ ల్యాబ్స్ అంకురసంస్థ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఇందులోని న్యూరో శాస్త్రవేత్తల బృందం మానవ, ఎదగని ఎలుక నుంచి మొత్తంగా దాదాపు 8,00,000 మెదడు కణాలను ల్యాబ్‌లో పెంచుతోంది. డిష్‌బ్రెయిన్‌గా పిలుచుకునే ఈ మెదడు కణాల సముదాయం ఎలక్ట్రోడ్ వరసలపై ఉంచినపుడు పోంగ్ వీడియోగేమ్‌కు తగ్గట్లు స్పందించిందని పరిశోధనలో భాగస్వామి అయిన డాక్టర్ బ్రెడ్ కగాన్ చెప్పారు. ఈ తరహా ప్రయోగం కృత్రిమ జీవమేథో ప్రయోగాల్లో మొదటిది కావడం గమనార్హం. మూర్ఛ, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం సమస్యలను మరింతగా అర్ధంచేసుకునేందుకు, భవిష్యత్‌లో కృత్రిమంగా ప్రయోగశాలలోనే జీవమేథ రూపకల్పనకు ఈ పరిశోధన ఫలితాలు ఉపయోగపడతాయని ఆయన చెప్పారు. తదుపరి పరీక్షలో తాము మత్తునిచ్చే ఇథనాల్‌ను వాడి కణాల పనితీరు.. మద్యం తాగిన మనిషి ‘పనితీరు’లా ఉందో లేదో సరిచూస్తామన్నారు. ఈ పరిశోధన వివరాలు న్యూరాన్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
Science Facts: మోచేతికి ఏదైనా తగిలితే అందుకే షాక్ కొట్టినట్టు ‘జిల్’ మంటుంది..!
Cubital Tunnel Syndrome: వాస్తవంగా చెప్పాలంటే ఈ సమస్య మనందరికీ తెలిసిందే. చిన్నతనంలో మనమందరమూ అనుభవించిందే. మన తోటి సావాసగాళ్లలో ఉండే ఏ చిలిపి పిల్లలో, లేదా అనుకోకుండా ఎవరైనా ఇతరులో మన మోచేతి దగ్గర ఉండే బొడిపెలాంటి ఎముకను ఠక్కున తాకినప్పుడు క్షణకాలం పాటు మోచేతి నుంచి అరచేతివరకూ ‘జిల్లు’మంటుంది. ముంజేయంతా స్పర్శ కోల్పోయినట్లుగా అవుతుంది. కాసేపటి తర్వాత అదే సర్దుకుని మామూలవుతుంది. అలా కాసేపు మనల్ని అల్లాడించే తిమ్మిరిలాంటి ఈ నొప్పి/బాధకు ‘ఫన్నీ బోన్ పెయిన్’ అన్న పేరుందని మనలో చాలామందికి తెలియదు. ఎందుకీ సమస్య? మోచేతి దగ్గర బొడిపెలా ఉన్న ఎముక పక్కనుంచి ఓ నరం వెళ్తుంటుంది. అది మెదడు నుంచి మొదలై మోచేతి ఎముక దగ్గరనుంచి చేతి వేళ్లలోకి వెళ్లే సర్వైకల్ నరాల్లో ఒకటైన అల్నార్ నర్వ్ అనే నరం. అకస్మాత్తుగా అక్కడ దెబ్బ తగలగానే ఠక్కున మెదడు సిగ్నళ్లు మోచేతి నుంచి అరచేతిలోకి పాకడం వల్ల ఈ ‘ఫన్నీ బోన్ పెయిన్’ కనిపిస్తుంది. అందరిలోనూ క్షణకాలం పాటు ఉన్నప్పటికీ కొందరిలో ఇది దీర్ఘకాలిక సమస్యగా మారుతుంది. అంటే వాళ్లలో ఇదే తరహా నొప్పి/తిమ్మిరి/స్పర్శ లేకపోవడం అన్న కండిషన్ అదేపనిగా కొనసాగుతుంది. ఇలా జరగడానికి కారణం క్షణకాలం పాటు కాకుండా అక్కడి నరం పూర్తిగా నొక్కుకుపోవడమే. కారణాలు... ఇలా జరగడానికి చాలా కారణాలే ఉంటాయి. ఉదాహరణకు తమ పనుల్లో భాగంగా అదేపనిగా మోచేతిని బల్లమీద ఎప్పుడూ అనించి ఉంచడమూ లేదా నిద్రపోయే సమయంలో ముంజేతిని మడతేసి, దాన్నే తలగడలా భావిస్తూ తల బరువును పూర్తిగా దానిపైనే మోపి నిద్రపోతూ ఉండటం కొందరికి అలవాటు. ఇలా చేసేవాళ్లలో ‘అల్నార్’నరం నొక్కుకుపోతుంది. దాంతో మనమంతా చిన్నప్పుడు తాత్కాలికంగా అనుభవించిన బాధ అదేపనిగా వస్తూనే ఉంటుంది. తగ్గేదెలా? మోచేతులు మడత వేయకుండా జాగ్రత్తలు తీసుకుంటే కొందరిలో ఈ సమస్య దానంతట అదే తగ్గుతుంది. ఇక మరికొందరిలో బ్రేసెస్, స్ల్పింట్స్ వంటి ఉపకరణాల సహాయంతో నరంపై బరువు పడకుండా చూడటంతో పాటు కొన్ని రకాల వ్యాయామాలతో నొప్పి తగ్గుతుంది. ఇలాంటి సాధారణ పెయిన్ మేనేజ్మెంట్ ప్రక్రియలు పనిచేయనప్పుడు కొందరిలో శస్త్రచికిత్స చేసి ‘అల్నార్ నర్వ్’పై పడే ఒత్తిడిని తొలగించాల్సి వస్తుంది. అయితే ఇలాంటి సర్జరీ చాలా అరుదుగా, చాలా తక్కువ మందికే అవసరమవుతుంది. చదవండి: Worlds Most Dangerous Foods: అత్యంత విషపూరితమైన వంటకాలు.. ప్రాణాలను పణంగా పెట్టి మరీ తింటారట!! -
పెద్దల మెదడు మొద్దుబారదు..
లండన్ : వృద్ధుల మెదడు మొద్దుబారుతుందని, యువకులతో పోలిస్తే వారి మెదడు కణాల్లో ఎదుగుదల మందగిస్తుందనే అంచనాలను తాజా అథ్యయనం పటాపంచలు చేసింది. యువకుల తరహాలోనే పెద్దవయసు వారి మెదడు కణాలూ వృద్ధి చెందుతాయని కొలంబియా యూనివర్సిటీ పరిశోధకుల అథ్యయనంలో తొలిసారిగా వెల్లడైంది. 79 సంవత్సరాల వయస్సున మహిళలు, పురుషుల మెదడు కణాలు 14 సంవత్సరాల వయసు వారి తరహాలోనే వ్యాప్తి చెందుతున్నాయని తమ పరిశోధనలో వెల్లడైనట్టు రీసెర్చర్లు తెలిపారు. పెద్దల మెదడులో కొత్త న్యూరాన్లు పెరగవని గతంలో పలు అథ్యయనాలు వెల్లడించాయి. అయితే జర్నల్ సెల్ స్టెమ్ సెల్లో ప్రచురితమైన నూతన అథ్యయనంలో మాత్రం ఇందుకు భిన్నమైన అంశాలు వెలుగుచూశాయి. తాజా అథ్యయన ఫలితాలు అల్జీమర్స్ వ్యాధుల వంటి పలు మానసిక, న్యూరలాజికల్ వ్యాధుల చికిత్సలో మెరుగైన పద్ధతుల ఆవిష్కరణకు దారితీస్తాయని చెబుతున్నారు. అంచనాలకు భిన్నంగా సీనియర్ సిటిజన్లు మెరుగైన జ్ఞాపకశక్తిని, సరైన భావోద్వేగ నియంత్రణలను కలిగి ఉంటారని తమ పరిశోధనలో వెల్లడైందని అథ్యయనానికి నేతృత్వం వహించిన కొలంబియా యూనివర్సిటీకి చెందిన న్యూరోబయాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మౌరా బోల్డ్రినీ తెలిపారు. పెద్దల మెదడులో కొత్తగా న్యూరాన్ల పెరుగుదల నిలిచిపోవడంతో వారిలో జ్ఞాపకశక్తి మందగిస్తుందని గతంలో శాస్త్రవేత్తలు భావించేవారు. అయితే యువత మాదిరే పెద్దల మెదడులోనూ వేలాది కొత్త న్యూరాన్లు పుట్టుకొస్తున్నాయని డాక్టర్ బోల్ర్డినీ చెప్పారు. -
ఫాస్టింగ్‌తో మెదడుకు మేలు
లండన్ : అడపాదడపా ఉపవాసం ఉంటే ఆరోగ్యానికి మేలేనంటూ తాజా అథ్యయనం వెల్లడించింది. ఫాస్టింగ్‌తో మెదడు ఆరోగ్యం పదిలంగా ఉంటుందని తేలింది. అవసరమైన కేలరీల కంటే 40 శాతం తక్కువగా కొవ్వు లేని ఆహారం తీసుకున్న ఎలుకల మెదడు కణాల్లో వాపు (ఇన్ఫ్లమేషన్) తగ్గినట్టు వెల్లడైంది. ఈ తరహా ఆహారం మెదడు కణజాలం పనితీరును మెరుగుపరుస్తుందని పరిశోధన పేర్కొంది. పరిమిత కేలరీలతో కూడిన కొవ్వు రహిత ఆహారం ఇచ్చినప్పుడే ఎలుకల్లో వయసు ప్రభావంతో వచ్చే వాపును తగ్గించగలిగామని అథ్యయనానికి నేతృత్వం వహించిన గ్రొనిజెన్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్‌కు చెందిన డాక్టర్ బార్ట్ ఈగెన్ చెప్పారు. వ్యాయామం కంటే కేలరీలను తగ్గించడం ద్వారా మెదడు ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని తమ పరిశోధనలో వెల్లడైందని ఆయన తెలిపారు. మెదడు కణాల వాపు సోరియాసిస్, డిమెన్షియా సహా పలు వ్యాధులకు దారితీస్తుంది. వయసురీత్యా వచ్చే అనర్ధాలను తగ్గించుకుని మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు బెర్రీస్, తాజా కూరగాయలు, నట్స్, చేపలు, సముద్ర ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. -
వందల కోట్ల కణాల మెదడుపై అధ్యయనానికి కొత్త పద్దతి
లండన్: వందల కోట్ల కణాలతో అతిక్లిష్టంగా ఉండే మన మెదడును మరింత బాగా అధ్యయనం చేసేందుకు వీలుగా బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్ శాస్త్రవేత్తలు ఓ కొత్త పద్ధతిని కనిపెట్టారు. 'మల్టీకలర్ ఆర్జీబీ(ఎరుపు, ఆకుపచ్చ, నీలి) ట్రాకింగ్' అనే ఈ పద్ధతిలో మెదడును కణస్థాయిలో అధ్యయనం చేసేందుకు వీలవుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. కాంతిని ప్రతిఫలింపచేసే ప్రొటీన్‌ను ఉత్పత్తి చేసే వైరస్ కణాలను చొప్పించడం ద్వారా మెదడు కణాలు ఏదో ఒక రంగును వెదజల్లేలా చేయవచ్చని వారు తెలిపారు. అలా చేయడం ద్వారా మెదడు కణాల చర్యలను అర్థం చేసుకునేందుకు వీలవుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ తరహాలో అధ్యయనం భవిష్యత్తులో మెదడుకు సంబంధించిన అనేక చికిత్సలకు దోహదపడుతుందని వారు తెలిపారు. వారి పరిశోధనల వివరాలు 'సైంటిఫిక్ రిపోర్ట్స్' అనే పత్రికలో ప్రచురించారు.