లండన్ : వృద్ధుల మెదడు మొద్దుబారుతుందని, యువకులతో పోలిస్తే వారి మెదడు కణాల్లో ఎదుగుదల మందగిస్తుందనే అంచనాలను తాజా అథ్యయనం పటాపంచలు చేసింది. యువకుల తరహాలోనే పెద్దవయసు వారి మెదడు కణాలూ వృద్ధి చెందుతాయని కొలంబియా యూనివర్సిటీ పరిశోధకుల అథ్యయనంలో తొలిసారిగా వెల్లడైంది. 79 సంవత్సరాల వయస్సున మహిళలు, పురుషుల మెదడు కణాలు 14 సంవత్సరాల వయసు వారి తరహాలోనే వ్యాప్తి చెందుతున్నాయని తమ పరిశోధనలో వెల్లడైనట్టు రీసెర్చర్లు తెలిపారు.
పెద్దల మెదడులో కొత్త న్యూరాన్లు పెరగవని గతంలో పలు అథ్యయనాలు వెల్లడించాయి. అయితే జర్నల్ సెల్ స్టెమ్ సెల్‌లో ప్రచురితమైన నూతన అథ్యయనంలో మాత్రం ఇందుకు భిన్నమైన అంశాలు వెలుగుచూశాయి. తాజా అథ్యయన ఫలితాలు అల్జీమర్స్ వ్యాధుల వంటి పలు మానసిక, న్యూరలాజికల్ వ్యాధుల చికిత్సలో మెరుగైన పద్ధతుల ఆవిష్కరణకు దారితీస్తాయని చెబుతున్నారు.
అంచనాలకు భిన్నంగా సీనియర్ సిటిజన్లు మెరుగైన జ్ఞాపకశక్తిని, సరైన భావోద్వేగ నియంత్రణలను కలిగి ఉంటారని తమ పరిశోధనలో వెల్లడైందని అథ్యయనానికి నేతృత్వం వహించిన కొలంబియా యూనివర్సిటీకి చెందిన న్యూరోబయాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మౌరా బోల్డ్రినీ తెలిపారు. పెద్దల మెదడులో కొత్తగా న్యూరాన్ల పెరుగుదల నిలిచిపోవడంతో వారిలో జ్ఞాపకశక్తి మందగిస్తుందని గతంలో శాస్త్రవేత్తలు భావించేవారు. అయితే యువత మాదిరే పెద్దల మెదడులోనూ వేలాది కొత్త న్యూరాన్లు పుట్టుకొస్తున్నాయని డాక్టర్ బోల్ర్డినీ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment