ఎక్కువ పనిచేస్తే స్ట్రోక్ వస్తుంది జాగ్రత్త!
మీకు అంకితభావం మరీ ఎక్కువైపోతోందా? రోజుకు 8 గంటల కంటే కూడా ఎక్కువగా పనిచేస్తున్నారా? అలా చేస్తే.. స్ట్రోక్ వచ్చే ప్రమాదం 33 శాతం ఎక్కువగా ఉంటుందట. ఎన్ని గంటలు పనిచేస్తే ఏం జరుగుతుందనే విషయాన్ని ఇప్పుడు శాస్త్రీయంగా తేల్చారు. వారానికి 55 గంటల కంటే కూడా ఎక్కువగా పనిచేస్తే.. కరొనరీ హార్ట్ డిసీజ్ వచ్చే ప్రమాదం 33 శాతం ఎక్కువగా ఉంటుందట. అలా కాకుండా సాధారణంగా 8.. లేదా అంతకంటే తక్కువగా పనిచేస్తుంటే మాత్రం కాస్త తక్కువగా.. అంటే 13 శాతం మాత్రమే స్ట్రోక్ ముప్పు ఉంటుందట.
అంటే, వారానికి 35 నుంచి 40 గంటలు మాత్రమే పనిచేయాలని చెబుతున్నారు. ఈ విషయాన్ని నిర్ధారించేందుకు మొత్తం 6 లక్షల మంది మీద పరిశోధనలు చేశారు. యూరప్, అమెరికా, ఆస్ట్రేలియా ఖండాల్లో ఒక్కొక్కరి మీద దాదాపు తొమ్మిదేళ్ల పాటు ఈ పరిశోధనలు జరిగాయి. ఎన్ని గంటలు ఎక్కువ పనిచేస్తే గుండెపోటు వచ్చే ముప్పు అంత ఎక్కువగా ఉంటుందని చివరకు తేల్చారు. లండన్ యూనివర్సిటీ కాలేజీకి చెందిన ఎపిడెమియాలజీ ప్రొఫెసర్ మికా కివిమాకి నేతృత్వంలో పరిశోధన మొత్తం సాగింది. దీని వివరాలను లాన్సెట్ పత్రికలో ప్రచురించారు.