stroke threat
-
కుంగుబాటుతో స్ర్టోక్ ముప్పు
లండన్ : కుంగుబాటుకు గురైన వారిలో హృదయ స్పందనలు అస్తవ్యస్తంగా తయారై స్ర్టోక్, అకాల మరణానికి దారితీసే ముప్పు అధికమని తాజా అథ్యయనం హెచ్చరించింది. కుంగుబాటును నివారించే మాత్రలతో ఈ రిస్క్‌కు సంబంధం లేదని స్పష్టం చేసింది. కుంగుబాటును నివారించే మందులు వాడే ముందు వీరి అకాల మరణం ముప్పు ఏడు రెట్లు ఉండగా, చికిత్స తీసుకున్న నెలలోనే ముప్పు మూడు రెట్లకు తగ్గిందని అథ్యయనంలో వెల్లడైంది. డెన్మార్క్‌కు చెందిన అర్హస్ యూనివర్సిటీ పరిశోధకులు 2000 నుంచి 2013 వరకూ కుంగుబాటు మందులు తీసుకుంటున్న 7.8 లక్షల మందిని పరీక్షించిన అనంతరం ఈ వివరాలు వెల్లడించింది. మనసుకు, గుండెకు మధ్య ఉన్న సంబంధం ఈ అథ్యయనంలో ప్రస్ఫుటంగా స్పష్టమైందని పరిశోధకులు పేర్కొన్నారు. కుంగుబాటుకు లోనైన వ్యక్తులు అస్తవ్యస్త హార్ట్‌బీట్‌తో పాటు గుండెకొట్టుకునే వేగం అసాధారణంగా పెరిగే సమస్యను ఎదుర్కొంటారని, మందులతో దాన్ని నియంత్రించవచ్చని అథ్యయనం వెల్లడించింది. మానసిక సమస్యలు గుండెపై ప్రభావం చూపవచ్చనేందుకు తమ అథ్యయనంలో ఆధారాలు లభించాయని పరిశోధకులు పేర్కొన్నారు. అథ్యయన వివరాలు యూరోపియన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ కార్డియాలజీలో ప్రచురితమయ్యాయి. -
ఎనర్జీ డ్రింక్స్‌తో 90 నిమిషాల్లోనే..
లండన్ : ఒక ఎనర్జీ డ్రింక్‌తో కేవలం 90 నిమిషాల్లోనే గుండె పోటు, స్ర్టోక్ ముప్పు పెరిగే అవకాశం ఉందని తాజా అథ్యయనం హెచ్చరించింది. ఎనర్జీ డ్రింక్‌లు రక్త నాళాలను పెళుసుబారేలా చేయడంతో కీలక అవయవాలకు రక్త సరఫరాలో ఆటంకాలు ఏర్పడతాయని హోస్టన్కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ పరిశోధకులు పేర్కొన్నారు. గతంలో రెడ్ బుల్, మాన్స్టర్ వంటి ఎనర్జీ డ్రింక్‌లకు కడుపు, నరాలు, గుండె సమస్యలకు మధ్య సంబంధాన్ని పలు అథ్యయనాలు పేర్కొన్నా వీటిని అతిగా సేవించడం వల్ల దుష్పరిణామాలు ఉంటాయని వెల్లడించాయి. అయితే ఎనర్జీ డ్రింక్ తీసుకున్న 90 నిమిషాల్లోనే రక్తనాళాల్లో మార్పులు చోటుచేసుకుంటున్నట్టు తాజా అథ్యయనం పేర్కొంది. ఎనర్జీ డ్రింక్‌ల్లో కలిపే కేఫిన్, టారిన్, చక్కెర ఇతర హెర్చల్స్ రక్తనాళాలపై ప్రభావం చూపుతున్నట్టు పరిశోధకులు అంచనా వేశారు. ఎనర్జీ డ్రింక్‌ల్లో చక్కెర శాతం అధికంగా ఉండటం గమనార్హం. కెఫిన్ సైతం రక్త నాళాలు కుచించకుపోయేలా చేస్తుందని, తాత్కాలికంగా బీపీని పెంచే అడ్రినలైన్ హోర్మోన్‌ను విడుదల చేస్తుందని పేర్కొన్నారు. ఎనర్జీ డ్రింక్‌ల వాడకం పెరుగుతున్నందున వీటి అనర్ధాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని మెక్ గవర్న్ స్కూల్ ప్రొఫెసర్ డాక్టర్ జాన్ హిగ్గిన్స్ సూచించారు. -
పెయిన్‌కిల్లర్స్‌తో ఆ రిస్క్ అధికం..
లండన్ : తరచూ నొప్పి నివారణ (పెయిన్‌కిల్లర్) మాత్రలు వాడితే గుండె పోటు, స్ర్టోక్ ముప్పు 50 శాతం అధికమని తాజా అథ్యయనం హెచ్చరించింది. పెయిన్‌కిల్లర్స్‌తో జీర్ణాశయ వ్యాధుల రిస్క్ కూడా పొంచిఉందని వెల్లడైంది. పెయిన్‌కిల్లర్స్ నుంచి రోగులను కాపాడేందుకు అంతర్జాతీయంగా తక్షణ చర్యలు అవసరమని బ్రిటిష్ మెడికల్ జర్నల్‌లో ప్రచురితమైన తాజా అథ్యయనం స్పష్టం చేసింది. పెయిన్‌కిల్లర్స్‌తో ప్రమాదాన్ని పసిగట్టి తక్షణమే వీటి వాడకాన్ని గణనీయంగా తగ్గించాల్సిన అవసరం ఉందని అథ్యయనం చేపట్టిన డెన్మార్క్‌కు చెందిన అరస్ యూనివర్సిటీ ఆస్పత్రి పరిశోధక బృందం కోరింది. పెయిన్కిల్లర్స్లో తరచూ వాడే డకోఫెనాక్తో ఈ తరహా ముప్పు అధికమని, వీటిని మందుల షాపుల్లో విరివిగా అందుబాటులో ఉంచకుండా నియంత్రించాలని సూచించింది. 63 లక్షల మంది ఆరోగ్య రికార్డులను పరిశీలించిన మీదట పరిశోధకులు ఈ వివరాలు వెల్లడించారు. ఇబూప్రోఫెన్, నాప్రోక్సెన్, పారాసెటమాల్ వాడిన రోగులతో పోలిస్తే డకోఫెనాక్ మాత్రలే గుండె జబ్బులు, స్ర్టోక్ ముప్పును అధికంగా పెంచాయని పరిశోధనలో గుర్తించారు. అసలు ఏ మందులూ తీసుకోని వారి ఆరోగ్యం మెరుగ్గా ఉందని వెల్లడైంది. పెయిన్‌కిల్లర్స్‌తో ముప్పును గుర్తించి అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని పరిశోధకులు సూచించారు. -
ఎక్కువ పనిచేస్తే స్ట్రోక్ వస్తుంది జాగ్రత్త!
మీకు అంకితభావం మరీ ఎక్కువైపోతోందా? రోజుకు 8 గంటల కంటే కూడా ఎక్కువగా పనిచేస్తున్నారా? అలా చేస్తే.. స్ట్రోక్ వచ్చే ప్రమాదం 33 శాతం ఎక్కువగా ఉంటుందట. ఎన్ని గంటలు పనిచేస్తే ఏం జరుగుతుందనే విషయాన్ని ఇప్పుడు శాస్త్రీయంగా తేల్చారు. వారానికి 55 గంటల కంటే కూడా ఎక్కువగా పనిచేస్తే.. కరొనరీ హార్ట్ డిసీజ్ వచ్చే ప్రమాదం 33 శాతం ఎక్కువగా ఉంటుందట. అలా కాకుండా సాధారణంగా 8.. లేదా అంతకంటే తక్కువగా పనిచేస్తుంటే మాత్రం కాస్త తక్కువగా.. అంటే 13 శాతం మాత్రమే స్ట్రోక్ ముప్పు ఉంటుందట. అంటే, వారానికి 35 నుంచి 40 గంటలు మాత్రమే పనిచేయాలని చెబుతున్నారు. ఈ విషయాన్ని నిర్ధారించేందుకు మొత్తం 6 లక్షల మంది మీద పరిశోధనలు చేశారు. యూరప్, అమెరికా, ఆస్ట్రేలియా ఖండాల్లో ఒక్కొక్కరి మీద దాదాపు తొమ్మిదేళ్ల పాటు ఈ పరిశోధనలు జరిగాయి. ఎన్ని గంటలు ఎక్కువ పనిచేస్తే గుండెపోటు వచ్చే ముప్పు అంత ఎక్కువగా ఉంటుందని చివరకు తేల్చారు. లండన్ యూనివర్సిటీ కాలేజీకి చెందిన ఎపిడెమియాలజీ ప్రొఫెసర్ మికా కివిమాకి నేతృత్వంలో పరిశోధన మొత్తం సాగింది. దీని వివరాలను లాన్సెట్ పత్రికలో ప్రచురించారు.