
మానసిక సమస్యలు గుండెపై ప్రభావం చూపుతాయన్న అథ్యయనం
లండన్ : కుంగుబాటుకు గురైన వారిలో హృదయ స్పందనలు అస్తవ్యస్తంగా తయారై స్ర్టోక్, అకాల మరణానికి దారితీసే ముప్పు అధికమని తాజా అథ్యయనం హెచ్చరించింది. కుంగుబాటును నివారించే మాత్రలతో ఈ రిస్క్‌కు సంబంధం లేదని స్పష్టం చేసింది. కుంగుబాటును నివారించే మందులు వాడే ముందు వీరి అకాల మరణం ముప్పు ఏడు రెట్లు ఉండగా, చికిత్స తీసుకున్న నెలలోనే ముప్పు మూడు రెట్లకు తగ్గిందని అథ్యయనంలో వెల్లడైంది.
డెన్మార్క్‌కు చెందిన అర్హస్ యూనివర్సిటీ పరిశోధకులు 2000 నుంచి 2013 వరకూ కుంగుబాటు మందులు తీసుకుంటున్న 7.8 లక్షల మందిని పరీక్షించిన అనంతరం ఈ వివరాలు వెల్లడించింది. మనసుకు, గుండెకు మధ్య ఉన్న సంబంధం ఈ అథ్యయనంలో ప్రస్ఫుటంగా స్పష్టమైందని పరిశోధకులు పేర్కొన్నారు.
కుంగుబాటుకు లోనైన వ్యక్తులు అస్తవ్యస్త హార్ట్‌బీట్‌తో పాటు గుండెకొట్టుకునే వేగం అసాధారణంగా పెరిగే సమస్యను ఎదుర్కొంటారని, మందులతో దాన్ని నియంత్రించవచ్చని అథ్యయనం వెల్లడించింది. మానసిక సమస్యలు గుండెపై ప్రభావం చూపవచ్చనేందుకు తమ అథ్యయనంలో ఆధారాలు లభించాయని పరిశోధకులు పేర్కొన్నారు. అథ్యయన వివరాలు యూరోపియన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ కార్డియాలజీలో ప్రచురితమయ్యాయి.