
లండన్ : మానసిక అలజడి, ఒత్తిడి కారణంగా అర్థరైటిస్, గుండె సమస్యలు, ఊపిరితిత్తుల వ్యాధులు చుట్టుముట్టే ముప్పు అధికమని తాజా అథ్యయనం వెల్లడించింది. మానసిక అలజడి తక్కువగా ఉన్నప్పటికీ తీవ్ర శ్వాసకోశ సమస్యలు వచ్చే ప్రమాదం పొంచిఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. 16,485 మందిపై మూడేళ్ల పాటు పరిశీలించిన అనంతరం సౌతాంప్టన్ జనరల్ హాస్పిటల్ పరిశోధకులు ఈ వివరాలు వెల్లడించారు.
మానసిక ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా జీవించే వారితో పోలిస్తే మానసిక అలజడి కొద్దిపాటిగా ఉన్న వారిలోనూ అర్ధరైటిస్ వచ్చే అవకాశాలు 57 శాతం అధికమని తేలింది. అధిక ఒత్తిడితో సతమతమయ్యే వారికి అర్థరైటిస్ వచ్చే అవకాశం 72 శాతం ఉండగా, తీవ్ర అలజడితో బాధపడేవారికి అర్థరైటిస్ ముప్పుతప్పదని పరిశోధకులు హెచ్చరించారు.
యాంగ్జయిటీ, కుంగుబాటులను ప్రాథమిక దశలోనే నియంత్రించడం ద్వారా తీవ్ర అనారోగ్యాలను నివారించవచ్చని జర్నల్ సైకోమాటిక్ రీసెర్చ్ జర్నల్‌లో ప్రచురితమైన అథ్యయన రచయిత ప్రొఫెసర్ కేథరిన్ గేల్ పేర్కొన్నారు.మానసిక అశాంతి ఏస్థాయిలో ఉందనే దానిపై గుండె జబ్బులు చుట్టుముటే అవకాశాలు అంత అధికమని అథ్యయనంలో గుర్తించినట్టు చెప్పారు.