
మానవ మేధస్సును జోడించిన రోబో ఊహాచిత్రం, ఇన్‌సెట్‌లో సైంటిస్ట్ పియర్సన్
పుట్టిన వాడు గిట్టక తప్పదు...గిట్టిన వాడు పుట్టక తప్పదని కురుక్షేత్రంలో అర్జునుడికి కృష్ణుడు గీతను బోధిస్తాడు. అంతే మరి పుట్టిన ప్రతి మనిషి చనిపోవాల్సిందే. మళ్లీ పుడతాడో లేదో మనకు తెలియదు. కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు మాత్రం పుట్టిన మనిషి చనిపోకుండా చిరకాలం జీవించేలా చేయవచ్చని అంటున్నారు. మనిషికి మరణమనేది లేకుండా కాలాతీతంగా జీవించ వచ్చని అందుకు పరిశోధనలు కూడా మొదలయ్యాయని లాన్ పియర్సన్ అనే శాస్త్రవేత్త పేర్కొన్నారు.
కృత్రిమ మేధస్నును ఉపయోగించి, ల్యాబ్‌లో మనిషి అవయవాలు, కణాలను తయారు చేస్తున్నారు. అంతా సవ్యంగా సాగితే 2050 కల్లా ఈ సదుపాయం అందుబాటులోకి రానుందని పియర్సన్ వెల్లడించారు. 1970 తర్వాత పుట్టిన ప్రతి మనిషి చిరంజీవిలా మరణమనేది లేకుండా బతకవచ్చని తెలిపారు. ప్రతి మనిషి మరణం లేకుండా బతకాలని కోరుకుంటారనీ అన్నారు. కాకపోతే ఇది ధనిక, సంపన్న వర్గాలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. 2060 వచ్చేసరికి మధ్య తరగతి వర్గాల ప్రజలకు , 2070 కల్లా పేద దేశాల్లో సైతం ఈ పద్దతి అమల్లోకి వస్తుందని తెలిపారు.
భవిష్యత్తులో వృద్దాప్యం అనేది కూడా ఎవరికి తెలియకుండా పోతుంది. నవ యవ్వనంతో ఉండగలిగేలా శరీర కణాలను, అవయవాలను సృష్టిస్తున్నామని అన్నారు. దుబాయ్‌లో జరిగిన వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్‌లో హిబ (HIBA హైబ్రిడ్ ఇంటిలిజెన్స్ బయోమెట్రిక్ అవతార్)ను ప్రదర్శించారు. అనేక పరిశోధనల అనంతరం దీన్ని సృష్టించారు. మానవ మేధస్సు, కాన్షియస్‌నెస్ ద్వారా మనుషులు కలుస్తారనే దానికి నిదర్శనమే హిబ. అప్పుడే తనకు మరణమంటూ లేని మనిషిని తయారు చేయాలనే ఐడియా వచ్చిందని పియర్సన్ తెలిపారు.
మనిషిని చిరకాలంగా ఉండేలా చేసేందుకు మూడు పద్దతులున్నాయని తెలిపారు. మానవ శరీరాన్ని కృత్రిమంగా తయారు చేయడం ఒకటి. ల్యాబ్‌లో శరీరఅవయవాలను, కణాలను తయారు చేసి అమర్చడం. రోబోలను తయారు చేసి వాటికి చనిపోయిన మానవుని మేధస్సును జోడించడం ఇంకో పద్దతి. ఊహా జనిత ప్రపంచాన్ని సృష్టించి అందులో మానవ మేధస్సును, వారి జ్ఞాపకాలను భద్రపరచి కంప్యూటర్ ద్వారా మనిషిని బతికేలా చేయడం. ఇలా వారి మేధస్సును, జ్ఞాపకాలను భద్రపరిచే చిప్‌ను స్టేక్(stack), దీన్ని మరో శరీరంలోకి ప్రవేశపెట్టడం స్కిన్(skin) అంటారు. తద్వారా మనిషి చనిపోయినా... మళ్లీ తన జీవితం తనకే ఉంటుంది.