Immortals
-
బైరాన్‌పల్లి చరిత్ర అందరికీ తెలియాలి
సాక్షి, సిద్దిపేట: తెలంగాణ సాయుధ పోరాటంలో భాగంగా రజాకార్లపై పోరాడిన బైరాన్‌పల్లి చరిత్ర అందరికీ తెలియాల్సిన అవసరం ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెప్పారు. అమరుల త్యాగాలను గురించి తెలుసుకోవడంతో యువతలో దేశభక్తి భావం పెంపొందుతుందని పేర్కొన్నారు. గురువారం గవర్నర్ సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. తొలుత కొమురవెల్లి మల్లన్న ఆలయానికి వెళ్లారు. ఆలయ పూజారులు, అధికారులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గవర్నర్ స్వామివారిని దర్శించుకుని, పట్నం వేయించి పూజలు చేశారు. తర్వాత ధూల్మిట్ట మండలం బైరాన్‌పల్లికి వెళ్లారు. రజాకార్లతో పోరాడి అమరులైన 118 మంది స్మారకార్థం ఏర్పాటు చేసిన స్తూపం వద్ద నివాళులు అర్పించారు. నాడు పోరా టం జరిగిన బురుజును సందర్శించారు. నాటి పోరాటంలో పాల్గొన్న సమరయోధులను సన్మానించారు. బైరాన్‌పల్లిని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని, అమరుల కుటుంబాలకు సమరయోధుల పింఛను ఇప్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాగా సిద్దిపేట జిల్లాలో గవర్నర్ కార్యక్రమాలకు కలెక్టర్, సీపీ, ఇతర ఉన్నత అధికారులెవరూ హాజరుకాలేదు. కాన్వాయ్ ఆపి మహిళతో మాట్లాడిన గవర్నర్ చేర్యాల పట్టణంలో సంధ్యారాణి అనే మున్సిపల్ కార్మికు రాలు చేయి ఊపుతూ గవర్నర్ కాన్వాయ్‌ను ఆపడానికి ప్రయత్నించింది. అది చూసిన తమిళిసై కాన్వాయ్ ఆపి సంధ్యారాణితో మాట్లాడారు. తమది పేద కుటుంబమని, ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నామని సంధ్యారాణి వాపోయింది. దీనితో ఆమె నివాసమున్న ఇంట్లోకి గవర్నర్ వెళ్లి పరిశీలించారు. ఆదుకుంటానని హామీ ఇచ్చారు. విద్యార్థిని విజ్ఞప్తి మేరకు వెళ్లి.. సెప్టెంబర్ 28న రాజ్‌భవన్‌లో తెలంగాణ విమోచన ఉద్యమం, పోరాటాలు, త్యాగాలపై ఉపన్యాస పోటీలు నిర్వహించారు. ఆ పోటీల్లో బైరాన్‌పల్లికి చెందిన బీటెక్ విద్యార్థి చల్లా అఖిల పాల్గొన్నారు. ఆ సమయంలో బైరాన్‌పల్లిని సందర్శించాలని ఆమె కోరగా గవర్నర్ తమిళిసై అంగీకరించారు. తాజాగా బైరాన్‌పల్లికి వెళ్లారు. తన కోరిక మేరకు గవర్నర్ రావడం సంతోషంగా ఉందని.. ఇప్పటికైనా బైరాన్‌పల్లి అభివృద్ధి బాట పడుతుందని ఆశిస్తున్నానని ఈ సందర్భంగా అఖిల పేర్కొన్నారు. -
2050 నాటికి మనిషికి మరణమనేది ఉండదు!
పుట్టిన వాడు గిట్టక తప్పదు...గిట్టిన వాడు పుట్టక తప్పదని కురుక్షేత్రంలో అర్జునుడికి కృష్ణుడు గీతను బోధిస్తాడు. అంతే మరి పుట్టిన ప్రతి మనిషి చనిపోవాల్సిందే. మళ్లీ పుడతాడో లేదో మనకు తెలియదు. కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు మాత్రం పుట్టిన మనిషి చనిపోకుండా చిరకాలం జీవించేలా చేయవచ్చని అంటున్నారు. మనిషికి మరణమనేది లేకుండా కాలాతీతంగా జీవించ వచ్చని అందుకు పరిశోధనలు కూడా మొదలయ్యాయని లాన్ పియర్సన్ అనే శాస్త్రవేత్త పేర్కొన్నారు. కృత్రిమ మేధస్నును ఉపయోగించి, ల్యాబ్‌లో మనిషి అవయవాలు, కణాలను తయారు చేస్తున్నారు. అంతా సవ్యంగా సాగితే 2050 కల్లా ఈ సదుపాయం అందుబాటులోకి రానుందని పియర్సన్ వెల్లడించారు. 1970 తర్వాత పుట్టిన ప్రతి మనిషి చిరంజీవిలా మరణమనేది లేకుండా బతకవచ్చని తెలిపారు. ప్రతి మనిషి మరణం లేకుండా బతకాలని కోరుకుంటారనీ అన్నారు. కాకపోతే ఇది ధనిక, సంపన్న వర్గాలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. 2060 వచ్చేసరికి మధ్య తరగతి వర్గాల ప్రజలకు , 2070 కల్లా పేద దేశాల్లో సైతం ఈ పద్దతి అమల్లోకి వస్తుందని తెలిపారు. భవిష్యత్తులో వృద్దాప్యం అనేది కూడా ఎవరికి తెలియకుండా పోతుంది. నవ యవ్వనంతో ఉండగలిగేలా శరీర కణాలను, అవయవాలను సృష్టిస్తున్నామని అన్నారు. దుబాయ్‌లో జరిగిన వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్‌లో హిబ (HIBA హైబ్రిడ్ ఇంటిలిజెన్స్ బయోమెట్రిక్ అవతార్)ను ప్రదర్శించారు. అనేక పరిశోధనల అనంతరం దీన్ని సృష్టించారు. మానవ మేధస్సు, కాన్షియస్నెస్ ద్వారా మనుషులు కలుస్తారనే దానికి నిదర్శనమే హిబ. అప్పుడే తనకు మరణమంటూ లేని మనిషిని తయారు చేయాలనే ఐడియా వచ్చిందని పియర్సన్ తెలిపారు. మనిషిని చిరకాలంగా ఉండేలా చేసేందుకు మూడు పద్దతులున్నాయని తెలిపారు. మానవ శరీరాన్ని కృత్రిమంగా తయారు చేయడం ఒకటి. ల్యాబ్‌లో శరీరఅవయవాలను, కణాలను తయారు చేసి అమర్చడం. రోబోలను తయారు చేసి వాటికి చనిపోయిన మానవుని మేధస్సును జోడించడం ఇంకో పద్దతి. ఊహా జనిత ప్రపంచాన్ని సృష్టించి అందులో మానవ మేధస్సును, వారి జ్ఞాపకాలను భద్రపరచి కంప్యూటర్ ద్వారా మనిషిని బతికేలా చేయడం. ఇలా వారి మేధస్సును, జ్ఞాపకాలను భద్రపరిచే చిప్‌ను స్టేక్(stack), దీన్ని మరో శరీరంలోకి ప్రవేశపెట్టడం స్కిన్(skin) అంటారు. తద్వారా మనిషి చనిపోయినా... మళ్లీ తన జీవితం తనకే ఉంటుంది. -
రాతే అసలు పరీక్ష!
పదో తరగతి రాత పరీక్షల్లో 35 శాతం (28 మార్కులు) వస్తేనే పాస్ ఇంటర్నల్ మార్కులు పాస్/ఫెయిల్‌లో లెక్కలోకి రావు పాఠశాల విద్యా డెరైక్టర్ చిరంజీవులు వెల్లడి ద్వితీయ భాషలో మాత్రం 20 మార్కులకే పాస్ 15 నిమిషాల వరకూ ఆలస్యానికి అనుమతి వెబ్సైట్ నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం సాక్షి, హైదరాబాద్: పదో తరగతి వార్షిక పరీక్షల్లో ప్రతి సబ్జెక్టులో 80 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తుండగా, ఇంటర్నల్స్‌కు 20 మార్కులు ఉంటాయని.. అయితే విద్యార్థుల పాస్/ఫెయిల్ నిర్ధారణలో ఇంటర్నల్స్ మా ర్కులను పరిగణనలోకి తీసుకోబోమని పాఠశాల విద్యా డెరైక్టర్ టి.చిరంజీవులు తెలిపారు. ప్రతి సబ్జెక్టుకు నిర్వహించే రాత పరీక్షల్లో (రెం డు పేపర్లు కలిపి) మొత్తం 80 మార్కులకుగాను 35 శాతం (28 మార్కులు) సాధిస్తేనే ఉత్తీర్ణులు అయినట్లని ఆయన వివరించారు. ఇంటర్నల్ మార్కులు కేవలం విద్యార్థి స్కోరింగ్‌కు మాత్రమే పనికి వస్తాయని చెప్పా రు. ఒక్క ద్వితీయ భాషలో మాత్రం పాత విధానం ప్రకారం 20 మార్కులు వస్తే పాస్ అయినట్లేనని... ఈ విషయాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు గమనించాలని సూచించారు. ఈ నెల 25వ తేదీ నుంచి నిర్వహించనున్న పదో తరగతి పరీక్షల ఏర్పాట్లపై గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బట్టీ విధానానికి స్వస్తి ‘‘దేశవ్యాప్తంగా ఒకే విధానం ఉండేలా అమల్లోకి తెచ్చిన నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ)లో భాగంగా పాఠ్య ప్రణాళికతోపాటు పరీక్షల విధానంలో సంస్కరణలను అమల్లోకి తెచ్చాం. ఈసారి ఆబ్జెక్టివ్ పేపర్ ఉండదు. బట్టీ పట్టి చదివి రాసే అవకాశముండదు. పాఠ్య పుస్తకాల్లోని పాఠ్యాంశాలకు అనుబంధంగా ప్రశ్నలుంటాయి. విద్యార్థులు సొంతంగా ఆలోచించి జవాబు లు రాయాలి. సిలబస్‌లోని అంశాలపైనే ప్రశ్నలు ఇవ్వాలనేది ఏమీ లేదు. విద్యార్థులు ఆ ప్రశ్నను బేస్ చేసుకొని వివరణలు, ఉదాహరణలతో జవాబులు రాయాల్సి ఉంటుంది. ఈ విధానంపై విద్యార్థులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చినందున..ఎలాంటి ఆందోళనకు గురికావద్దు. దీని కోసమే 15 ని మిషాలు అదనంగా సమయం ఇచ్చాం. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 వరకు పరీక్షలు జరుగుతాయి. ద్వితీయ భాష పేపర్ ఒక్కటే ఉన్నందున దానికి ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 వరకు అంటే మరో అరగంట అదనంగా సమయం ఉంటుంది.’’ హాల్టికెట్లలో మార్పులకు అవకాశం ‘‘రాష్ట్రవ్యాప్తంగా 2,614 కేంద్రాల్లో ఈ నెల 25వ తేదీ నుంచి నిర్వహించే ఈ పరీక్షలకు 5.65 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. హాల్‌టికెట్లను ఇప్పటికే స్కూళ్లకు పంపించాం. హాల్‌టికెట్లు అందని విద్యార్థులు.. శుక్రవారం నుంచి bsetelangana.org వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే వీటిని సంబంధిత ప్రధానోపాధ్యాయుడి ద్వారా అటెస్ట్ చేయించుకోవాలి. విద్యార్థులు తమ హాల్టికెట్లలో ఏమైనా తప్పులున్నట్లు గుర్తిస్తే... సంబంధిత ప్రధానోపాధ్యాయుడి దృష్టికి తీసుకెళ్లి మార్పులు చేయించుకోవాలి.’’ 11 నుంచి స్పాట్ వాల్యుయేషన్ ఏప్రిల్ 11వ తేదీ నుంచి స్పాట్ వాల్యుయేషన్‌ను ప్రారంభించి 25వ తేదీ నాటికి పూర్తిచేస్తాం. పరీక్షల సమయంలో ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయడానికి హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. 040-23230941, 040-23230942 నంబర్లకు ఫోన్ చేయవచ్చు. ఏప్రిల్ 8 నాటికి ప్రధాన పరీక్షలు, 11వ తేదీ నాటికి అన్ని పరీక్షలు పూర్తవుతాయి. - శేషుకుమారి, ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ 15 నిమిషాల వరకూ అనుమతి ‘‘విద్యార్థులు పరీక్ష కేంద్రానికి ఉదయం 8:45 గంటల వరకే చేరుకోవాలి. పరీక్ష ప్రారంభ సమయానికి 10-15 నిమిషాల వరకూ ఆలస్యాన్ని అనుమతిస్తారు. అంతకంటే ఎక్కువ ఆలస్యమైతే కేసును బట్టి పరిశీలించి అనుమతిస్తారు. అరగంటకు మించితే మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించరు. వేసవి ఎండల దృష్ట్యా విద్యార్థులు డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదముంది. వైద్యారోగ్యశాఖ అధికారులు అందుబాటులో ఉంటారు. జిల్లాకో లైజనింగ్ అధికారిని నియమించాం. సమస్యాత్మక కేంద్రాలను అదనపు డెరైక్టర్ స్థాయి అధికారులు తనిఖీ చేస్తారు.’’ -
చికిలింత చిగురు సంపంగి గుబురు
నా పాట నాతో మాట్లాడుతుంది చిత్రం : చిరంజీవులు (1956) రచన : మల్లాది రామకృష్ణశాస్త్రి సంగీతం : ఘంటసాల గానం : పి.లీల, ఘంటసాల మల్లాది పాట నాతో మాట్లాడింది... ఇలా. నా తండ్రి మల్లాది ఎంత గొప్పవాడని చెప్పేది. ఆరుద్రకు అనుమానం వచ్చినా, శ్రీశ్రీకి సందేహం కలిగినా చిటికెలో తీర్చగల తెలుగు విజ్ఞానబోధి. శ్రీశ్రీని సినిమాలోకి తీసుకొచ్చింది మల్లాది. నలభై భాషలను నేర్చుకున్న బహుముఖీన ప్రజ్ఞా. ఇత్యాది ఎన్ని చెప్పినా, మల్లాది వారి ప్రతిభా విశ్వరూపం మాటలకు అందేది కాదు. ఎంత చెప్పినా తనివి తీరేది కాదు. చిరంజీవులు- సినిమా.... సంగీతం ఘంటసాల. మనసైన చినదాని మీద మనసుపడ్డ పాట రాయాలి. మనసంటే అందరికి తెలుసు. మనసంటే ఇష్టమని కూడా మనకు తెలుసు. తను అలంకరించుకొని, తన గదినీ, పానుపునూ అలంకరించి ఎదురుచూసే వాసకసజ్జికల్లాగా... విరహంతో ఎదురుచూసే అభిసారికల్లాగా సుకుమారమైన ఎండకన్నెరుగని సుందరమైన తెలుగు పదాలు మల్లాది చూపు కోసం ఎదురుచూస్తుంటాయి కదా! ముందు మనసు గురించి. ‘గిలిగింత’ ‘పులకింత’... ఇలా బిందుపూర్వక తకారంలో చిన్న చిలిపిదనం ఉంటుంది. చిలిపిలోని ‘చి’ కూడా... గారాబంలోనూ, మారాంలోనూ, ఇష్టమైన వారిముందు ఒలకబోసే సిగ్గుతనంలోనూ, ‘చి’ అక్షరం భలే ముచ్చటగా వినవేడుకగా ఉంటుందని అక్షరమర్మయోగి మల్లాదికి తెలియదా! మనసు - చికిలింత చిగురు - ‘చికిలింత’... మనోహరమైన, తేట అయిన, స్వచ్ఛమైన అనే అర్థంలో మొదలెట్టాడు. మనసు - సంపంగి గుబురు - హృదయనాసికలను మత్తెక్కించే సంపంగి గుబురును చిన్నదాని మనసుకు నిర్వచనంగా ఎంచుకున్నాడు. (పాఠకులు ఒక విషయం గమనించాలి. పదాలను ఎంచుకోవడమంటే గంటలు గంటలు తర్జించి భర్జించి, నిఘంటువులతో చర్చించి కాదు సుమా! అలవోకగా అవే చెలిమెల్లా ఊరుతుంటాయి.) ఆ తరువాత మల్లాది ఇక్కడ మనసుకు మరో మెరుపు అద్దాడు. నాయకుని ఉద్దేశ్యం, పాట ముఖ్యోద్దేశం కలిపి చెప్పడానికి... ‘చినదాని మీద మనసూ’ అని. ‘మీద’ అనేది లాగి పాడటం ఘంటసాల చమత్కార చాతుర్యం. ఆ (తన యొక్క) మనసైన చినదానికి (ఆమె) అందానికి (తన) కనుసైగ మీద మనసుతో ‘పల్లవి’ని యమాసుందరంగా చూపించాడు. ఆ తర్వాత చరణం ఇలా మొదలెట్టాడు. ‘చెంపకు చేరడేసి కన్నులున్న చిన్నదీ’... ఎవరు? నట యమున జమున! చిన్నదాని సిగలో రేకలెన్నో గువ్వ కన్ను... హవ్వ... నల్లరంగురైక అనొచ్చుగా! గువ్వకన్ను రైక మీద చుక్కలెన్నో ఆ చుక్కలెన్నిసార్లు లెక్కిస్తేనో తప్ప మనసు చుక్కల మీదికెళ్లదు కదా! మరి ఆ లెక్కించిన చుక్కల రాయుడైన కథానాయకుడెవరు? ధీరలలిత ముఖుడు, జ్వలితాంతర్ముఖుడు... నటనానందమూరి తారకరాముడు! పాట చివరిలో మళ్లీ మనసును ‘మనసే మరుమల్లెల దొంతర’ అని మరో (బహువచనంతో) సువాసనల మరుమల్లెలతో వచించి, మన ఊసే విరజాజి దొంతర అంటాడు. ఇదంతా ఏ ప్రదేశంలో ఎక్కడ... ఎప్పుడూ మరీ! కేవలం పాలవన్నెలలోనే కాదు మురిపాల వెన్నెలలో అని ఊరిళ్ల మురిపాలను మనలో ఊరించి పాట ముగించి పానగల్ పార్కులోకి మౌనతపస్విలా రిక్షాఎక్కి (జీవితాంతం ఒకే రిక్షా. ఆ రిక్షా నడిపిన వ్యక్తి పేరు ‘చెల్లం’. రిక్షాపుల్లరును కూడా జీవితాంతం మార్చలేదు. అది మల్లాది కృతజ్ఞతావాత్సల్యం), అక్కడ వేచివున్న ప్రజ్ఞావంతుల, ప్రతిభావంతుల కళ్లలో సహస్రానేక నిగూఢ జ్ఞాన రహస్మంత్ర వెలుగులు అద్దడానికి వెళ్లిపోయాడు! అలా నేను పుట్టి, తర్వాత ఘంటసాల వారితో బాణీల ఓణీలు కుట్టించుకుని, లీల- ఘంటసాల గొంతు వాకిట్లోంచి మీ వీనులలోకి పాట పల్లకీ అయ్యానన్న మాట! ఇప్పటికి నేను ఆ పల్లకీ దిగనే లేదు సుద్దాలా! అని తను కూడా పానగల్ పార్క్ వైపే వెళ్ళిపోయింది ‘చికిలింత చిరంజీవినీ పాట’! -
అమరులకు ప్లీనరీ నివాళి