బైరాన్‌పల్లి సమరయోధులతో గవర్నర్ మాటామంతీ
సాక్షి, సిద్దిపేట: తెలంగాణ సాయుధ పోరాటంలో భాగంగా రజాకార్లపై పోరాడిన బైరాన్‌పల్లి చరిత్ర అందరికీ తెలియాల్సిన అవసరం ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెప్పారు. అమరుల త్యాగాలను గురించి తెలుసుకోవడంతో యువతలో దేశభక్తి భావం పెంపొందుతుందని పేర్కొన్నారు. గురువారం గవర్నర్ సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. తొలుత కొమురవెల్లి మల్లన్న ఆలయానికి వెళ్లారు. ఆలయ పూజారులు, అధికారులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గవర్నర్ స్వామివారిని దర్శించుకుని, పట్నం వేయించి పూజలు చేశారు.
తర్వాత ధూల్మిట్ట మండలం బైరాన్‌పల్లికి వెళ్లారు. రజాకార్లతో పోరాడి అమరులైన 118 మంది స్మారకార్థం ఏర్పాటు చేసిన స్తూపం వద్ద నివాళులు అర్పించారు. నాడు పోరా టం జరిగిన బురుజును సందర్శించారు. నాటి పోరాటంలో పాల్గొన్న సమరయోధులను సన్మానించారు. బైరాన్‌పల్లిని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని, అమరుల కుటుంబాలకు సమరయోధుల పింఛను ఇప్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాగా సిద్దిపేట జిల్లాలో గవర్నర్ కార్యక్రమాలకు కలెక్టర్, సీపీ, ఇతర ఉన్నత అధికారులెవరూ హాజరుకాలేదు.
కాన్వాయ్ ఆపి మహిళతో మాట్లాడిన గవర్నర్
చేర్యాల పట్టణంలో సంధ్యారాణి అనే మున్సిపల్ కార్మికు రాలు చేయి ఊపుతూ గవర్నర్ కాన్వాయ్‌ను ఆపడానికి ప్రయత్నించింది. అది చూసిన తమిళిసై కాన్వాయ్ ఆపి సంధ్యారాణితో మాట్లాడారు. తమది పేద కుటుంబమని, ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నామని సంధ్యారాణి వాపోయింది. దీనితో ఆమె నివాసమున్న ఇంట్లోకి గవర్నర్ వెళ్లి పరిశీలించారు. ఆదుకుంటానని హామీ ఇచ్చారు.
విద్యార్థిని విజ్ఞప్తి మేరకు వెళ్లి..
సెప్టెంబర్ 28న రాజ్‌భవన్‌లో తెలంగాణ విమోచన ఉద్యమం, పోరాటాలు, త్యాగాలపై ఉపన్యాస పోటీలు నిర్వహించారు. ఆ పోటీల్లో బైరాన్‌పల్లికి చెందిన బీటెక్ విద్యార్థి చల్లా అఖిల పాల్గొన్నారు. ఆ సమయంలో బైరాన్‌పల్లిని సందర్శించాలని ఆమె కోరగా గవర్నర్ తమిళిసై అంగీకరించారు. తాజాగా బైరాన్‌పల్లికి వెళ్లారు. తన కోరిక మేరకు గవర్నర్ రావడం సంతోషంగా ఉందని.. ఇప్పటికైనా బైరాన్‌పల్లి అభివృద్ధి బాట పడుతుందని ఆశిస్తున్నానని ఈ సందర్భంగా అఖిల పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment