భారతి, శిరీష... ఆ పేర్లలోనే ఏదో కరెంట్ ఉంది.‘చెట్టులెక్కగలవా ఓ నరహరి’ అని చెంచిత అడిగింది.నరహరి అడగలేదు.ఎందుకంటే చెంచితకు చెట్టులెక్కడం రాదు.. పుట్టలెక్కడం రాదు అని జనాభిప్రాయం.చెట్లే ఎక్కలేని స్త్రీలు కరెంట్ పోల్ ఏమెక్కుతారని కూడా చాలా ఏళ్లుగా అభిప్రాయం.‘మేము ఎక్కగలం’ అన్నారు భారతి, శిరీష.లైన్లను దారిలో పెట్టగలం అని పెట్టి మరీ చూపిస్తున్నారు.ఉమెన్ పవర్ అంటే ఏమిటో కాదు. ఇటువంటి స్త్రీలు చూపేదే.
పల్లెటూరులో పుట్టి పెరిగిన ఇద్దరు యువతులు కొత్త చరిత్రకు నాంది పలికారు. విద్యుత్ శాఖలో మహిళలు చేయలేరని భావించే లైన్‌మెన్ ఉద్యోగానికి రాష్ట్రంలో తొలిసారిగా ఎంపికై ఎంతోమందికి వెలుగు బాట చూపారు. లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో అవరోధాలు ఎదురైనా పట్టుదల తో ముందుకు సాగారు. కోర్టును ఆశ్రయించి అనుకున్నది సాధించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం దేశ్యా తండాకు చెందిన 32 ఏళ్ల వాంకుడోతు భారతి, సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం గణేష్‌పల్లి గ్రామానికి చెందిన 20 ఏళ్ల బబ్బూరి శిరీషల విజయగాథ ఇది.
తల్లి, మేనమామతో శిరీష
ఇంతకాలం పురుషులకే పరిమితమైన విద్యుత్ లైన్‌మెన్ పోస్టును మహిళలుగా తొలిసారి మీరు చేజిక్కించుకోవడం ఎలా ఉంది?
భారతి: చాలా ఆనందంగా ఉంది. ముందు ఉద్యోగం కోసం చాలా సాధారణంగానే అన్ని ప్రయత్నాలు చేశా. కానీ, ఇలా అందరూ అభినందనలు చెబుతుంటే గర్వంగా కూడా ఉంది.
శిరీష: మేం పడిన కష్టానికి ఫలితం దక్కిందనిపించింది.
ఈ ఉద్యోగాన్నే ఎంచుకోవడానికి కారణం?
భారతి: తండాలో పుట్టి పెరిగాను. గిరిజనులమైన మాకు వ్యవసాయమే ఆధారం. అయినా, ఎంకామ్ వరకు చదువుకున్నాను. ఐటిఐ చేస్తే ఉద్యోగావకాశాలు పెరుగుతాయనీ అదీ పూర్తి చేశాను. గవర్నమెంటు ఉద్యోగాలకు ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఆ క్రమంలోనే లైన్‌మెన్ నోటిఫికేషన్ గురించి తెలిసింది. చిన్నప్పటి నుంచీ పొలాల్లో చెట్లు ఎక్కాను, నాట్లేశాను, కలుపుతీశాను, ఎండవానలు తేడా లేకుండా పనులు చేశాను. లైన్‌మన్ ఉద్యోగం చేయడం పెద్ద కష్టం అనిపించలేదు.
శిరీష: మా అమ్మ నాన్నలకు నేనొక్కదాన్నే కూతురును. మాకు ఎలాంటి ఆస్తిపాస్తుల్లేవు. రెక్కలకష్టమే జీవనాధారం. ఊళ్లో పనులు దొరక్క నా చిన్నప్పుడే అమ్మనాన్నలు మేడ్చల్‌కు వలసవెళ్లారు. అక్కడి కంపెనీల్లో కూలి పనులు చేస్తూ పూటగడుపుకునేవారు. మేడ్చల్‌లోని ప్రభుత్వ పాఠశాలలో పదవతరగతి చదివా. ఆ తర్వాత పరిస్థితుల కారణంగా తిరిగి ఊరికి వెళ్లిపోయాం. ఊళ్లోనే ఉంటున్న నాకు మా మేనమామ చెప్పడంతో ఐటిఐ పూర్తిచేశాను. ఆ తర్వాత అంబేద్కర్ యూనివర్శిటీ నుంచి డిగ్రీ చేస్తూ, ఈ ఉద్యోగానికి అప్లై చేశాను. ఈ ఉద్యోగం ఆడవాళ్లు చేయదగినది కాదు అని నాకు ఎంతమాత్రం అనిపించలేదు.
లైన్‌మెన్ పోస్టుల్లో మహిళా అభ్యర్థులకు అవకాశమే లేదన్నారు. మరి ఆ అవరోధాలను ఎలా ఎదుర్కొన్నారు?
భారతి: 2019 సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ వచ్చింది. అందులో స్త్రీలు అప్లయ్ చేసుకోవడానికి అసలు ఆప్షనే లేదు. అన్ని రంగాల్లో స్త్రీలకు 33 శాతం అవకాశాలు ఉన్నాయంటారు, మరి దీనికి ఎందుకు లేదు అని కోర్టుకు వెళ్లాను. కోర్టు పర్మిషన్ ఇచ్చింది. రిటన్ టెస్ట్ అయిపోయింది. పోల్ టెస్ట్‌కి మళ్లీ అడ్డంకులు. మళ్లీ కోర్టుకు వెళ్లాం. భవిష్యత్తులో న్యాయం చేయాలని బెంచ్ తీర్పునిచ్చింది. ఈ కాపీని తీసుకెళ్లి సంబంధిత అధికారులకు చూపించగా... ‘కోర్టు తీర్పు భవిష్యత్తులో అని ఉందిగా...తర్వాత చూద్దాంలే...’ అని దాట వేశారు. మళ్లీ కోర్టుకు వెళ్లాం. గడువు లోపల పోల్ టెస్ట్ పెట్టి, కంప్లీట్ చేయమని మళ్లీ కోర్టు అదేశాలు ఇచ్చింది. ఆ టెస్ట్‌లో 1 మినిట్‌లోపు పోల్ ఎక్కి దిగాలి. అందులో పాసయ్యాను. అధికారులు అభినందించి, ఎంపికైనట్టు చెప్పారు.
శిరీష: ఈ పోస్టుకు దరఖాస్తుచేసే సమయంలో మహిళలకు అప్షన్ లేకపోవడం చాలా ఆందోళనగా అనిపించింది. ఈ రోజుల్లో ఇంకా మగ–ఆడ తేడా చూపే ఉద్యోగాలు ఉన్నాయా అనుకున్నాను. మొత్తానికి కోర్టుకు వెళ్లడంతో పర్మిషన్ వచ్చింది. కిందటి నెల 23న హైద్రాబాద్ యూసుఫ్‌గూడలోని సీపీటీఐ (సెంట్రల్ పవర్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్)లో విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల సమక్షంలో పోల్ క్లైంబింగ్ పరీక్ష నిర్వహించడంతో విజయవంతంగా పరీక్షలో నెగ్గాను.
విద్యుత్ స్తంభాలు ఎక్కడం, దిగడం... ఈ పనులు మీరెలా నేర్చుకున్నారు?
భారతి: ఇద్దరు పిల్లల తల్లిని. ఎనిమిదేళ్ల కొడుకు, నాలుగేళ్ల కూతురు ఉన్నారు నాకు. తండాల్లో పుట్టి పెరిగినదాన్ని. చెట్లు ఎక్కి దిగడం చిన్నప్పటి నుంచీ నాకు అలవాటే. ఆ ధైర్యంతోనే స్తంభాలు ఎక్కగలనని కోర్టుకు విన్నవించుకున్నా. అయినా పోల్ టెస్ట్‌కు ముందు వరంగల్‌లోని ఎన్‌పీసిఎల్ గ్రౌండ్‌లో నెల రోజుల పాటు రోజూ ఉదయం సాయంత్రం ప్రాక్టీస్ చేశాను.
శిరీష: మా మేనమామ శేఖర్‌గౌడ్ ప్రత్యేకంగా తర్ఫీదునిచ్చాడు. ఇంట్లో తాడుతో స్తంభాలు ఎక్కే విధానం, ఆ తర్వాత ప్రజ్ఞాపూర్‌లోని సబ్‌స్టేషన్ లో పోల్ ఎక్కడం నేర్పాడు. రేషన్ బియ్యం తప్ప ఇతర పోషకాహారం లభించని దయనీయ స్థితిలో ఉన్న నాకు ఫిజికల్ ఫిట్‌నెస్ కోసం పోషకాహారం సమకూర్చాడు. దాదాపు ఆరునెలలు సాధన చేశాను.
ఎంతో ఆత్మవిశ్వాసం, అంతకుమించి ధైర్యం తో లైన్‌మెన్ ఉద్యోగంలో చేరిన వీరికి అభినందనలు చెబుదాం.
కష్టమేమీ కాదు..
పేదరికంలో ఎన్నో కష్టాలు పడ్డాను. వాటి ముందు స్తంభాలు ఎక్కి, ఎలక్ట్రికల్ పనులు చేయడం పెద్ద కష్టమేమీ అనిపించలేదు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా నిరుత్సాహపడలేదు. మొండిగా కోర్టు చుట్టూ తిరిగా. గవర్నర్ అభినందించడం జీవితంలో మరిచిపోలేను.
– బబ్బూరి శిరీష
నిమిషంలో పోల్ టెస్ట్ పాస్
నా చిన్నతనంలో తండా నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూల్‌కి నడిచివెళ్లేదాన్ని. ఇంటర్ దేరుట్ల కాలేజీలో, డిగ్రీ భద్రాచలంలో గవర్నమెంట్ కాలేజీలో, ఎంకామ్ కేయూ యూనివర్శిటీలో చదివాను. పద్దెనిమిదేళ్ల క్రితం పెళ్లయ్యింది. పిల్లలు పుట్టాక అత్తగారింటివద్దే వ్యవసాయపనులు చేసుకుంటూ ఉండిపోయాను. అయినా, ప్రతీ ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను. లైన్‌మన్ జాబ్ ఇన్నాళ్లకు వచ్చింది. రోజు మొత్తం వ్యవసాయం పనులు చేయడం వల్ల నిమిషంలో పోల్ ఎక్కడం పెద్ద కష్టమేమీ అనిపించలేదు.
– వాంకుడోతు భారతి
– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
ఇన్‌పుట్స్: – వై.సురేందర్, సాక్షి, గజ్వేల్
ఫొటోలు: కె.సతీష్, సిద్దిపేట
Telangana's 1st linewoman : 20 years old Sirisha cracked the junior lineman Exam by TSSPDCL to become 1st linewoman in Telanagana Congratulations Sirisha proud of your accomplishments #womenempowerment @PMOIndia @MinistryWCD @IPRTelangana @PIBHyderabad @airnews_hyd @DDYadagiri
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) January 2, 2021
Comments
Please login to add a commentAdd a comment