ఈరోజే ఎదురవుతుంటే...
సిద్దిపేట టౌన్, న్యూస్‌లైన్: దశాబ్దాలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని పోరుబాట పట్టిన మెతుకుసీమలో సోమవారం సరి కొత్త ఉదయం ఆవిష్కృతం కానుంది. ఉద్యమ చరిత్రలో చెరగని సంతకం చేసిన జిల్లా కోటి ఆకాంక్షలను నింపుకుంది. పొడుస్తున్న పొద్దులో కొత్త ఆశలు చిగురిస్తాయని విశ్వసిస్తోంది.
మానీళ్లు మాకు కావాలని, మా ఉద్యోగాలు మాకే రావాలని, తడారుతున్న గొంతులు తడిసిపోవాలని ఆశపడుతోంది.
జిల్లాలో ప్రవహిస్తున్న సింగూరు నీళ్లు బీడు వారిన లక్షలాది ఎకరాలను తడపాలని ఆశపడుతున్నది. కోట్లాది మంది హైదారాబాద్ గొంతుకలను తడుపుతున్న మంజీరా నీరు జిల్లాలోని తడారిన పల్లె గొంతుల ను తడపాలని కొరుతున్నది. అదేవిధంగా జిల్లాలోని తూర్పు భాగంలోని తడ్కపల్లి వద్ద మరో సింగూరు ప్రాజెక్టు నిర్మాణమై సిద్దిపేట ప్రాంతాన్ని ఆకుపచ్చగా మార్చాలని ఆశపడుతోంది. ఫ్లోరైడ్ రహిత మంచి నీరు పల్లెలకు అందుతుందని వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు.
ఇక్కడి పరిశ్రమల్లో ఈ ప్రాంత వాసులకే ఉద్యోగాలు రావాలని నిరుద్యోగులు కోరుకుంటున్నారు. కొత్త పరిశ్రమలు ఇక్కడ విస్తరించాలని, ఉపాధి అవకాశాలను పెంపొందించాలని విద్యార్థులు ఆశపడుతున్నారు.
ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు లేక, కుటీర పరిశ్రమ లు దెబ్బతిని, వృత్తులు ధ్వంసమై దుబాయి, ముం బాయి తదితర ప్రాంతాలకు వలసపోవద్దని తల్లిదండ్రులు ఆశపడుతున్నారు. ఇక్కడి వృత్తులకు, కుటీర పరిశ్రమలకు చేయూతనిచ్చే విధానం అమలు కావాలని కోరుకుంటున్నారు.
ఇక్కడ ఉన్నత విద్య అవకాశాలు పెరగాలని, సరికొత్త యూనివర్సిటీలు రావాలని తల్లిదండ్రులు ఆశపడుతున్నారు. రాబోయే ఉద్యోగాల కోసం అవసరమైన కొత్త కోర్సులను ఇక్కడ ప్రవేశపెట్టాలని విద్యాసంస్థలు కోరుతున్నాయి.
వ్యవసాయం దండగా కాకుండా పండగలా మారాలని రైతులు ఆశపడుతున్నారు. ప్రపంచ మార్కెటింగ్ అవసరాలకు అనుగుణంగా పంటలు పండాలని, మార్కెటింగ్ సౌకర్యాలు చేకూరాలని రైతులు ఆశపడుతున్నారు.
రైల్వేలైనులు ఏర్పడాలని, రవాణా వ్యవస్థ మరింత మెరుగు పడాలని తద్వారా జాతీయ స్థాయిలో వ్యాపారాభివృద్ది జరగాలని ఇక్కడి వ్యాపారులు కోరుకుంటున్నారు.