
రాతే అసలు పరీక్ష!
- పదో తరగతి రాత పరీక్షల్లో 35 శాతం (28 మార్కులు) వస్తేనే పాస్
- ఇంటర్నల్ మార్కులు పాస్/ఫెయిల్‌లో లెక్కలోకి రావు
- పాఠశాల విద్యా డెరైక్టర్ చిరంజీవులు వెల్లడి
- ద్వితీయ భాషలో మాత్రం 20 మార్కులకే పాస్
- 15 నిమిషాల వరకూ ఆలస్యానికి అనుమతి
- వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి వార్షిక పరీక్షల్లో ప్రతి సబ్జెక్టులో 80 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తుండగా, ఇంటర్నల్స్‌కు 20 మార్కులు ఉంటాయని.. అయితే విద్యార్థుల పాస్/ఫెయిల్ నిర్ధారణలో ఇంటర్నల్స్ మా ర్కులను పరిగణనలోకి తీసుకోబోమని పాఠశాల విద్యా డెరైక్టర్ టి.చిరంజీవులు తెలిపారు. ప్రతి సబ్జెక్టుకు నిర్వహించే రాత పరీక్షల్లో (రెం డు పేపర్లు కలిపి) మొత్తం 80 మార్కులకుగాను 35 శాతం (28 మార్కులు) సాధిస్తేనే ఉత్తీర్ణులు అయినట్లని ఆయన వివరించారు. ఇంటర్నల్ మార్కులు కేవలం విద్యార్థి స్కోరింగ్‌కు మాత్రమే పనికి వస్తాయని చెప్పా రు. ఒక్క ద్వితీయ భాషలో మాత్రం పాత విధానం ప్రకారం 20 మార్కులు వస్తే పాస్ అయినట్లేనని... ఈ విషయాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు గమనించాలని సూచించారు. ఈ నెల 25వ తేదీ నుంచి నిర్వహించనున్న పదో తరగతి పరీక్షల ఏర్పాట్లపై గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
బట్టీ విధానానికి స్వస్తి
‘‘దేశవ్యాప్తంగా ఒకే విధానం ఉండేలా అమల్లోకి తెచ్చిన నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ)లో భాగంగా పాఠ్య ప్రణాళికతోపాటు పరీక్షల విధానంలో సంస్కరణలను అమల్లోకి తెచ్చాం. ఈసారి ఆబ్జెక్టివ్ పేపర్ ఉండదు. బట్టీ పట్టి చదివి రాసే అవకాశముండదు. పాఠ్య పుస్తకాల్లోని పాఠ్యాంశాలకు అనుబంధంగా ప్రశ్నలుంటాయి. విద్యార్థులు సొంతంగా ఆలోచించి జవాబు లు రాయాలి. సిలబస్‌లోని అంశాలపైనే ప్రశ్నలు ఇవ్వాలనేది ఏమీ లేదు. విద్యార్థులు ఆ ప్రశ్నను బేస్ చేసుకొని వివరణలు, ఉదాహరణలతో జవాబులు రాయాల్సి ఉంటుంది. ఈ విధానంపై విద్యార్థులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చినందున..ఎలాంటి ఆందోళనకు గురికావద్దు. దీని కోసమే 15 ని మిషాలు అదనంగా సమయం ఇచ్చాం. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 వరకు పరీక్షలు జరుగుతాయి. ద్వితీయ భాష పేపర్ ఒక్కటే ఉన్నందున దానికి ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 వరకు అంటే మరో అరగంట అదనంగా సమయం ఉంటుంది.’’
హాల్‌టికెట్లలో మార్పులకు అవకాశం
‘‘రాష్ట్రవ్యాప్తంగా 2,614 కేంద్రాల్లో ఈ నెల 25వ తేదీ నుంచి నిర్వహించే ఈ పరీక్షలకు 5.65 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. హాల్‌టికెట్లను ఇప్పటికే స్కూళ్లకు పంపించాం. హాల్‌టికెట్లు అందని విద్యార్థులు.. శుక్రవారం నుంచి bsetelangana.org వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే వీటిని సంబంధిత ప్రధానోపాధ్యాయుడి ద్వారా అటెస్ట్ చేయించుకోవాలి. విద్యార్థులు తమ హాల్‌టికెట్లలో ఏమైనా తప్పులున్నట్లు గుర్తిస్తే... సంబంధిత ప్రధానోపాధ్యాయుడి దృష్టికి తీసుకెళ్లి మార్పులు చేయించుకోవాలి.’’
11 నుంచి స్పాట్ వాల్యుయేషన్
ఏప్రిల్ 11వ తేదీ నుంచి స్పాట్ వాల్యుయేషన్‌ను ప్రారంభించి 25వ తేదీ నాటికి పూర్తిచేస్తాం. పరీక్షల సమయంలో ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయడానికి హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. 040-23230941, 040-23230942 నంబర్లకు ఫోన్ చేయవచ్చు. ఏప్రిల్ 8 నాటికి ప్రధాన పరీక్షలు, 11వ తేదీ నాటికి అన్ని పరీక్షలు పూర్తవుతాయి.
- శేషుకుమారి, ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్
15 నిమిషాల వరకూ అనుమతి
‘‘విద్యార్థులు పరీక్ష కేంద్రానికి ఉదయం 8:45 గంటల వరకే చేరుకోవాలి. పరీక్ష ప్రారంభ సమయానికి 10-15 నిమిషాల వరకూ ఆలస్యాన్ని అనుమతిస్తారు. అంతకంటే ఎక్కువ ఆలస్యమైతే కేసును బట్టి పరిశీలించి అనుమతిస్తారు. అరగంటకు మించితే మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించరు. వేసవి ఎండల దృష్ట్యా విద్యార్థులు డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదముంది. వైద్యారోగ్యశాఖ అధికారులు అందుబాటులో ఉంటారు. జిల్లాకో లైజనింగ్ అధికారిని నియమించాం. సమస్యాత్మక కేంద్రాలను అదనపు డెరైక్టర్ స్థాయి అధికారులు తనిఖీ చేస్తారు.’’