చికిలింత చిగురు సంపంగి గుబురు | Cikilinta gum foliage sampangi | Sakshi
Sakshi News home page

చికిలింత చిగురు సంపంగి గుబురు

Published Sun, Feb 8 2015 12:41 AM | Last Updated on Sat, Sep 2 2017 8:57 PM

చికిలింత చిగురు సంపంగి గుబురు

చికిలింత చిగురు సంపంగి గుబురు

నా పాట నాతో మాట్లాడుతుంది
 
 చిత్రం    :    చిరంజీవులు (1956)
 రచన    :    మల్లాది రామకృష్ణశాస్త్రి
 సంగీతం    :    ఘంటసాల
 గానం    :    పి.లీల, ఘంటసాల    

 
మల్లాది పాట నాతో మాట్లాడింది... ఇలా.
నా తండ్రి మల్లాది ఎంత గొప్పవాడని చెప్పేది. ఆరుద్రకు అనుమానం వచ్చినా, శ్రీశ్రీకి సందేహం కలిగినా చిటికెలో తీర్చగల తెలుగు విజ్ఞానబోధి. శ్రీశ్రీని సినిమాలోకి తీసుకొచ్చింది మల్లాది. నలభై భాషలను నేర్చుకున్న బహుముఖీన ప్రజ్ఞా. ఇత్యాది ఎన్ని చెప్పినా, మల్లాది వారి ప్రతిభా విశ్వరూపం మాటలకు అందేది కాదు. ఎంత చెప్పినా తనివి తీరేది కాదు.
 చిరంజీవులు- సినిమా.... సంగీతం ఘంటసాల.
 మనసైన చినదాని మీద మనసుపడ్డ పాట రాయాలి.
 మనసంటే అందరికి తెలుసు. మనసంటే ఇష్టమని కూడా మనకు తెలుసు.
 తను అలంకరించుకొని, తన గదినీ, పానుపునూ అలంకరించి ఎదురుచూసే వాసకసజ్జికల్లాగా... విరహంతో ఎదురుచూసే అభిసారికల్లాగా సుకుమారమైన ఎండకన్నెరుగని సుందరమైన తెలుగు పదాలు మల్లాది చూపు కోసం ఎదురుచూస్తుంటాయి కదా!
 ముందు మనసు గురించి. ‘గిలిగింత’ ‘పులకింత’... ఇలా బిందుపూర్వక తకారంలో చిన్న చిలిపిదనం ఉంటుంది. చిలిపిలోని ‘చి’ కూడా... గారాబంలోనూ, మారాంలోనూ, ఇష్టమైన వారిముందు ఒలకబోసే సిగ్గుతనంలోనూ, ‘చి’ అక్షరం భలే ముచ్చటగా వినవేడుకగా ఉంటుందని అక్షరమర్మయోగి మల్లాదికి తెలియదా!
 మనసు - చికిలింత చిగురు - ‘చికిలింత’... మనోహరమైన, తేట అయిన, స్వచ్ఛమైన అనే అర్థంలో మొదలెట్టాడు.
 మనసు - సంపంగి గుబురు - హృదయనాసికలను మత్తెక్కించే సంపంగి గుబురును చిన్నదాని మనసుకు నిర్వచనంగా ఎంచుకున్నాడు.
 (పాఠకులు ఒక విషయం గమనించాలి. పదాలను ఎంచుకోవడమంటే గంటలు గంటలు తర్జించి భర్జించి, నిఘంటువులతో చర్చించి కాదు సుమా! అలవోకగా అవే చెలిమెల్లా ఊరుతుంటాయి.)
 ఆ తరువాత మల్లాది ఇక్కడ మనసుకు మరో మెరుపు అద్దాడు. నాయకుని ఉద్దేశ్యం, పాట ముఖ్యోద్దేశం కలిపి చెప్పడానికి... ‘చినదాని మీద మనసూ’ అని. ‘మీద’ అనేది లాగి పాడటం ఘంటసాల చమత్కార చాతుర్యం.
 ఆ (తన యొక్క) మనసైన చినదానికి (ఆమె) అందానికి (తన) కనుసైగ మీద మనసుతో ‘పల్లవి’ని యమాసుందరంగా చూపించాడు.
 ఆ తర్వాత చరణం ఇలా మొదలెట్టాడు.
 ‘చెంపకు చేరడేసి కన్నులున్న చిన్నదీ’... ఎవరు? నట యమున జమున!
 చిన్నదాని సిగలో రేకలెన్నో
 గువ్వ కన్ను... హవ్వ... నల్లరంగురైక అనొచ్చుగా!
 గువ్వకన్ను రైక మీద చుక్కలెన్నో
 ఆ చుక్కలెన్నిసార్లు లెక్కిస్తేనో తప్ప మనసు చుక్కల మీదికెళ్లదు కదా! మరి ఆ లెక్కించిన చుక్కల రాయుడైన కథానాయకుడెవరు? ధీరలలిత ముఖుడు, జ్వలితాంతర్ముఖుడు... నటనానందమూరి తారకరాముడు!
 పాట చివరిలో మళ్లీ మనసును ‘మనసే మరుమల్లెల దొంతర’ అని మరో (బహువచనంతో) సువాసనల మరుమల్లెలతో వచించి, మన ఊసే విరజాజి దొంతర అంటాడు. ఇదంతా ఏ ప్రదేశంలో ఎక్కడ... ఎప్పుడూ మరీ! కేవలం పాలవన్నెలలోనే కాదు మురిపాల వెన్నెలలో అని ఊరిళ్ల మురిపాలను మనలో ఊరించి పాట ముగించి పానగల్ పార్కులోకి మౌనతపస్విలా రిక్షాఎక్కి (జీవితాంతం ఒకే రిక్షా. ఆ రిక్షా నడిపిన వ్యక్తి పేరు ‘చెల్లం’. రిక్షాపుల్లరును కూడా జీవితాంతం మార్చలేదు. అది మల్లాది కృతజ్ఞతావాత్సల్యం), అక్కడ వేచివున్న ప్రజ్ఞావంతుల, ప్రతిభావంతుల కళ్లలో సహస్రానేక నిగూఢ జ్ఞాన రహస్మంత్ర వెలుగులు అద్దడానికి వెళ్లిపోయాడు! అలా నేను పుట్టి, తర్వాత ఘంటసాల వారితో బాణీల ఓణీలు కుట్టించుకుని, లీల- ఘంటసాల గొంతు వాకిట్లోంచి  మీ వీనులలోకి పాట పల్లకీ అయ్యానన్న మాట!
 ఇప్పటికి నేను ఆ పల్లకీ దిగనే లేదు సుద్దాలా! అని తను కూడా పానగల్ పార్క్ వైపే వెళ్ళిపోయింది ‘చికిలింత చిరంజీవినీ పాట’!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement