
నెలముందే కృష్ణా పుష్కర పనులు పూర్తి
సాక్షి, హైదరాబాద్: గోదావరి పుష్కరాలకు దేశవ్యాప్త గుర్తింపు వచ్చిన నేపథ్యంలో వచ్చే సంవత్సరం జరగనున్న కృష్ణా నదీ పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటినుంచే సన్నద్ధమవుతోంది. శనివారంతో గోదావరి పుష్కరాలు ముగియటంతో ఇక కృష్ణా పుష్కరాలపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాలకు అనుకున్నదానికి మించి భక్తులు పోటెత్తినప్పటికీ ఎక్కడా పెద్దగా ఇబ్బందులు ఎదురు కాకుండా ప్రభుత్వం నిర్వహించిన విషయం తెలిసిందే.
ఎంతమంది భక్తులు పుణ్యస్నానాలాచరించారనే విషయంలో శాస్త్రీయ పద్ధతిలో లెక్కలు తేల్చనప్పటికీ... ప్రభుత్వం మాత్రం ఆ సంఖ్య 6.7 కోట్లుగా పేర్కొంటోంది. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వెల్లువెత్తటంతో అన్ని పుష్కర క్షేత్రాలు కిటకిటలాడాయి. ఈ నేపథ్యంలో కృష్ణా పుష్కరాలకు కూడా భక్తులు వెల్లువెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుంచే ఏర్పాట్లకు శ్రీకారం చుట్టాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని ఆదేశించారు. సరిగ్గా ఏడాది సమయం ఉన్నందున ముందస్తుగా ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.
నిజానికి గోదావరి పుష్కరాల ఏర్పాట్ల విషయంలో ప్రభుత్వం ఆలస్యంగా మేల్కొంది. నిధుల విషయం తేల్చకపోవటం, సకాలంలో వాటిని విడుదల చేయకపోవటంతో పుష్కరాలు ప్రారంభం అయ్యాక కూడా పనులు జరుగుతూనే ఉన్నాయి. వానలు లేక నదిలో నీటి ప్రవాహం కనిష్ట స్థాయికి చేరుకోవటంతో భక్తులు కొంత నిరుత్సాహానికి గురయ్యారు. కానీ అదే ఓ రకంగా వరంగా మారింది. పుష్కరాల సమయంలో భారీ వర్షాలు కురిసి ఉంటే అంతా గందరగోళంగా మారేది. ఉదయం నుంచి రాత్రి వరకు అన్ని చోట్లా భక్తులు అధిక సంఖ్యలోనే కనిపించారు.
ఆ సమయంలో ఈదురుగాలులతో కూడిన వర్షం వస్తే భక్తులకు తలదాచుకునే సౌకర్యం ఉండకపోయేది. భద్రాచలం, బాసర, కాళేశ్వరం, ధర్మపురిలాంటి ప్రధాన ఘాట్ల వద్దనే ఏర్పాట్లు చాలకపోగా మిగతా చిన్న ఘాట్ల పరిస్థితి దారుణంగా ఉంది. వానలు కురవకపోవటంతో ఇబ్బందులు తప్పాయి. కృష్ణా పుష్కరాలు కూడా వానాకాలంలోనే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పుష్కరాలు ప్రారంభమయ్యే నెల ముందే ఏర్పాట్లు పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో కృష్ణా నది ప్రవహించే నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పుష్కర ఘాట్లకు ప్రాంతాలను గుర్తించే పని త్వరలో ప్రారంభించనున్నారు.
మేడారంపై దృష్టి: ఇదిలా ఉండగా వచ్చే ఫిబ్రవరిలో వరంగల్ జిల్లా మేడారంలో సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహించాల్సి ఉంది. ప్రధాన గిరిజన జాతర కావటంతో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ నుంచి కూడా భారీగా భక్తులు తరలి వస్తారు. మూడురోజుల జాతరలో భక్తుల సంఖ్య కోటిని మించుతుంది. గత రెండు జాతరల్లో ఏర్పాట్లు సరిగా లేక భక్తుల నుంచి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈసారి ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.