మాయాబజార్ సినిమాలో ‘చిన్నమయ’ ఒక్క మంత్రమేస్తే.. ఖాళీ అయిన గంగాళాలు గారెలు,అరిసెలతో నిండిపోతాయి. నిజజీవితంలోనూ ఇలా జరిగితే ఎంతబాగుండు కదా..కాకపోతే మంత్రాలకు చింతకాయలు రాలుతాయా ఏంటీ.. నిజమే.. కాకపోతే సైన్స్ మంత్రానికి టెక్నాలజీ యంత్రాన్ని జోడిస్తే అసాధ్యమేమీ కాదు..
ఓ మంత్రం.. లేదా యంత్రంతో మనిషి తనకు కావాల్సినవన్నీ సృష్టించుకోవడం కల్పన కావొచ్చు. స్టార్‌ట్రెక్ లాంటి సినిమాల్లోనూ ‘రెప్లికేటర్’అనే యంత్రం అక్షయ పాత్ర లాగా ఏది కావాలంటే అది తయారు చేసి పెడుతుంది. ఇలాంటిది తయారయ్యేందుకు ఇంకో వందేళ్లు పట్టొచ్చేమో కానీ, ఈ దిశగా శాస్త్రవేత్తలు అడుగులు వేస్తున్నారు. ప్రకృతితో సంబంధం లేకుండా.. మానవ శ్రమ, కాలుష్యాలకు దూరంగా పాలు, మాంసం మాత్రమే కాదు.. ఏకంగా కార్లనే ముద్రించి తయారు చేసేందుకు సిద్ధమవుతోంది శాస్త్ర ప్రపంచం.
వైఢూర్యాలు కాదు.. వజ్రాలే!
భూమి లోపలి పొరల్లో నిక్షిప్తమై ఉండే వజ్రాలు కార్బన్‌తో తయారవుతాయి. ఈ విషయం చాలావరకు తెలిసిందే. అయితే ఒక్కో వజ్రం వెనుక కోట్ల ఏళ్ల చరిత్ర ఉంటుంది. అన్నేళ్లు విపరీతమైన ఒత్తిడి, ఉష్ణోగ్రతల్లో నలిగితే గానీ.. కార్బన్ కాస్తా వజ్రంగా మారదు. అయితే భూమి లోపలి పొరల్లాంటి పరిస్థితులను కృత్రిమంగా సృష్టించి వజ్రాలను చౌకగా తయారుచేయాలన్న ప్రయత్నం సాగుతోంది. జిర్కోన్ వంటి మూలకాల సాయంతో తయారు చేయగలిగారు. సహజమైన వజ్రాలతో అన్ని రకాలుగా సరిపోలినా కానీ వీటిపై ఆదరణ మాత్రం పెద్దగా పెరగలేదు.
ఇదే సమయంలో సహజ వజ్రాల మైనింగ్‌లో ఇమిడి ఉన్న అనేక నైతిక అంశాల కారణంగా ఇప్పుడు డీబీర్స్ వంటి కంపెనీలు గనులను నిలిపేయాలని నిర్ణయించాయి. 2018లోనే డిబీర్స్ పూర్తిగా కృత్రిమ వజ్రాలతోనే ఆభరణాలను తయారు చేయాలని తీర్మానించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆభరణాల తయారీ సంస్థ పండోరా కూడా ఈ ఏడాది ఇకపై తాము గనుల్లోంచి వెలికితీసిన వజ్రాలను వాడబోమని ప్రకటించనుంది.
పాలు, పెరుగు కూడా..
పాలలో ఏముంటాయి? కొవ్వులు, కొన్ని విటమిన్లు, ఖనిజాలు, నీళ్లు అంతేనా? ఒకట్రెండు ప్రోటీన్లు ఉంటాయనుకున్నా వీటన్నింటినీ తగుమోతాదులో కలిపేస్తే పాలు తయారు కావా? అన్న ప్రశ్న వస్తుంది. ఇంత పనికి.. ఆవుల్ని, గేదెలను మేపడం, వాటి వ్యర్థాలను ఎత్తి పారేసి శుభ్రం చేసుకోవడం, పితికిన పాలను ఫ్యాక్టరీల్లో శుద్ధి చేసి ప్యాకెట్లలోకి చేర్చి ఇంటింటికీ పంపిణీ చేయడం అవసరమా? అంటున్నారు ఈ కాలపు శాస్త్రవేత్తలు కొందరు. జంతువులతో ఏమాత్రం సంబంధం లేకుండానే పాలను పోలిన పాలను తయారుచేయడం పెద్ద కష్టమేమీ కాదన్నది వీరి అంచనా.
పెర్‌ఫెక్ట్ డే అనే కంపెనీ కొన్ని రకాల శిలీంద్రాల్లో మార్పులు చేయడం ద్వారా అవి పాల లాంటి ద్రవాలను ఉత్పత్తి చేసేలా చేయగలిగారు. ఇమాజిన్ డెయిరీ కూడా పశువుల అవసరం లేని పాల ఉత్పత్తుల తయారీకి ప్రయత్నిస్తోంది. కాకపోతే ఈ కంపెనీ మనం బ్రెడ్ లాంటివాటిని తయారు చేసేందుకు వాడే ఈస్ట్ సాయం తీసుకుంటోంది. ఈ కృత్రిమ పాలను ఐస్‌క్రీమ్‌గా మార్చి అందరికీ అందించేందుకు పెర్‌ఫెక్ట్ డెయిరీ ఇప్పటికే కంపెనీలతో చర్చలు జరుపుతోంది. అంతెందుకు అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఈ రకమైన కొత్త రకం పాలు, పాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి కూడా!
కృత్రిమ మాంసం..
భూమ్మీద ఉన్న వ్యవసాయ భూమిలో సగం భూమిని మాంసం ఉత్పత్తి కోసం వినియోగిస్తున్నారు. పశువులకు అవసరమైన దాణా, గింజలు, వాటి పోషణకు అవసరమైన నీరు తదితర ఇతర వనరుల కోసం ఇంత భూమిని వాడుకుంటున్నాం. ఇవేవీ లేకుండా ఒక ఫ్యాక్టరీ, పెరుగుదలకు ఉపయోగపడే ఎంజైమ్స్‌తో కావాల్సినంత మాంసం సృష్టించేందుకు చాలాకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవలే ఓ మోస్తరు విజయం సాధించాం. పదేళ్ల కిందటే ఖైమా కొట్టిన మాంసం లాంటి పదార్థాన్ని తయారు చేయగలిగినా కొన్ని ఇబ్బందులతో ఆ టెక్నాలజీ ముందుకు సాగలేదు.
తాజాగా 2018లో ఇజ్రాయెల్ కంపెనీ ఆలెఫ్ ఫామ్స్ తొలిసారి ల్యాబ్‌లోనే స్టీక్ (మాంసపు ముక్క)ను తయారు చేసింది. మరింకేం అలెఫ్ ఫామ్స్ లాంటివి ఊరుకొకటి పెట్టేస్తే సరిపోతుంది కదా అంటే.. దానికి ఇంకొంచెం సమయం ఉంది. ఎందుకంటే ప్రస్తుతానికి ల్యాబ్‌లో పెంచిన మాంసం ఖరీదు చాలా ఎక్కువ. 2011తో పోలిస్తే రేటు గణనీయంగా తగ్గినా మరింత తగ్గితే గానీ అందరికీ అందుబాటులోకి రాదు. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్‌లోనే ఇంకో కంపెనీ వాణిజ్యస్థాయిలో చికెన్ ముక్కలను తయారు చేసి దుకాణాలకు సరఫరా చేస్తోంది.
ఆఖరికి రక్తం కూడా..
మన శరీరపు ఆరోగ్యం గురించి ఠక్కున చెప్పేయగల శక్తి రక్తానికి ఉందంటారు. అవయవాలన్నింటికీ శక్తినిచ్చే ఆక్సిజన్‌ను సరఫరా చేయడంతో పాటు మలినాలు, వ్యర్థాలను బయటకు పంపేందుకు సాయపడుతుంది రక్తం. యుద్ధంలో లేదా ప్రమాద సమయాల్లో కోల్పోయే రక్తాన్ని దాతల రక్తంతో భర్తీ చేసేందుకు అవకాశం ఉన్నా అది స్వచ్ఛమైన వ్యవహారం కాదు. పైగా మన సొంత రక్తం పనిచేసినట్లు ఇతరుల రక్తం పనిచేస్తుందన్న గ్యారంటీ కూడా లేదు.
ఈ నేపథ్యంలోనే అన్నీ మంచి లక్షణాలు ఉన్న కృత్రిమ రక్తాన్ని తయారు చేసేందుకు 50 ఏళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో జరిగిన రెండు వేర్వేరు పరిశోధనల పుణ్యమా అని 50 ఏళ్లుగా సాధ్యం కాని కృత్రిమ రక్తం తయారీ త్వరలో వీలయ్యే అవకాశం ఏర్పడింది. 2017లో మానవ మూలకణాలను రక్త కణాలుగా మార్చే పద్ధతులను రెండు బృందాలు సమర్పించాయి. ఈ రెండు సక్రమంగా పనిచేస్తాయని రుజువైతే.. త్వరలోనే కృత్రిమ రక్తం అందుబాటులోకి వస్తుందని శాస్త్రవేత్తల అంచనా.
ఫ్యాక్టరీల్లో ఫర్నిచర్ కలప..
గ్రామీణ ప్రాంతాల్లో వంటకు మొదలుకొని కాగితం, ఫర్నిచర్ తయారీల వరకు కలప వినియోగం విస్తృతంగా జరుగుతోంది. కానీ దీనికోసం రోజూ వందల ఎకరాల అటవీభూమి నాశనమవుతోంది. ఇలా కాకుండా.. దృఢమైన కలపను పరిశోధనశాలలోనే తయారు చేయగలిగితే? అమెరికాలోని టెక్సాస్‌లో ఉన్న మసాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఈ అద్భుతం సాధ్యమే అంటున్నారు. మొక్కల కణాలను గ్రోత్‌మీడియంలో ఉంచి పెంచడమే కాకుండా.. అవి కలప మాదిరిగా అతుక్కునేలా చేయగలిగారు. మొక్కల హార్మోన్లు కనీసం రెండు కణాల్లో లిగ్నిన్ (కలపకు దృఢత్వాన్ని ఇచ్చేది) పెరుగుదలను ప్రోత్సహిస్తున్నట్లు గుర్తించారు. ఈ హార్మోన్లను నియంత్రించడం ద్వారా ఉత్పత్తి చేసే కలప లక్షణాలను నిర్ణయించొచ్చు. అంతా బాగానే ఉంది కానీ.. ప్రస్తుతానికి ఈ ఆలోచన చాలా ప్రాథమిక దశలోనే ఉంది. ఇంకొన్నేళ్ల తర్వాతే కృత్రిమ కలపతో టేబుళ్లు, కుర్చీలు, తలుపులు తయారవుతాయి!
Comments
Please login to add a commentAdd a comment