ఆరిలోవ (విశాఖ తూర్పు): విశాఖపట్నంలోని కైలాసగిరిని రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు మరో అడుగు పడింది. ఇప్పటికే పర్యాటక ప్రాంతంగా ఉన్న కైలాసగిరి.. ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి నగరానికి వచ్చే పర్యాటకులను ఆకర్షించే విధంగా మరిన్ని హంగులు సంతరించుకుంటోంది. తాజాగా సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియం పురుడుపోసుకుంటోంది. కేంద్ర సాంస్కృతికశాఖ, రాష్ట్ర ప్రభుత్వం కలిసి సుమారు ఎకరా విస్తీర్ణంలో రూ.4.69 కోట్లతో ఈ మ్యూజియం ఏర్పాటు చేస్తున్నాయి.
3డీ ఆర్ట్ గ్యాలరీ, సిలికా విగ్రహాలు, సైన్స్ వర్కింగ్ మోడల్ ప్రదర్శనలు, శాస్త్రీయ థీమ్‌లు తదితరాలతో.. ఏడాదిలో ఇది అందుబాటులోకి రానుంది. ఈ మ్యూజియం నిర్మాణానికి ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మంగళవారం ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జునతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కైలాసగిరిని ముఖ్య పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. ఇక్కడ పర్యాటకులకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు. గతంలో పలు అభివృద్ధి పనులకు ఇక్కడ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు.
ఇప్పుడు కేంద్ర సాంస్కృతికశాఖ, రాష్ట్ర ప్రభుత్వం కలిసి మ్యూజియం గ్రాంట్æస్కీం కింద సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఎస్‌సీఏపీ) ఆధ్వర్యంలో అధునాతనమైన సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రూ.4.69 కోట్లతో ఏర్పాటు చేస్తున్న దీనికి.. రూ.3.75 కోట్లను ఎస్‌సీఏపీకి కేంద్ర సాంస్కృతికశాఖ కేటాయించగా మిగిలిన సుమారు రూ.కోటిని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసినట్లు తెలిపారు.
ఈ పనుల్ని ఏడాదిలో పూర్తిచేసి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారని ఆయన చెప్పారు. జీవీఎంసీ కార్పొరేటర్ స్వాతి, ఎస్‌సీఏపీ సీఈవో డాక్టర్ కె.జయరామిరెడ్డి, వీఎంఆర్‌డీఏ జాయింట్ కమిషనర్ రవీంద్ర, కార్యదర్శి బి.కీర్తి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment