kailasagiri
-
విశాఖపట్నం : కైలాసగిరి..సందడే సందడి (ఫొటోలు)
-
విశాఖ కైలాసగిరి వద్ద టూరిస్ట్ బస్సుకి ప్రమాదం
విశాఖపట్నం, సాక్షి: కైలాసగిరి వద్ద సోమవారం సాయంత్రం ఘోరం జరిగింది. ఓ టూరిస్ట్ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 18 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. బ్రేక్ ఫెయిల్ కావడంతో మలుపు వద్ద కొండను బస్సు ఢీ కొట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారని, వీళ్లంతా పశ్చిమ బెంగాల్‌కు చెందిన టూరిస్టులు అని తెలుస్తోంది. వీళ్లలో 18 మందికి 18 మందికి స్వల్ప గాయాలు కాగా.. చికిత్స నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు. 16 మందికి ప్రాథమిక చికిత్స చేసి డిశ్చార్జ్ చేయగా.. మరో ఇద్దరికి మాత్రం కేజీహెచ్ వైద్యులు చికిత్స కొనసాగిస్తున్నారు. -
కైలాసగిరిపై స్కై బ్రిడ్జ్
విశాఖ సిటీ: మాస్టర్‌ప్లాన్ రోడ్లు.. సెంటు స్థలాల లేఅవుట్లు.. జగనన్న ఎంఐజీ స్మార్ట్ టౌన్‌షిప్‌లు.. ఇలా ఒకవైపు ప్రజావసరాలకు అనువైన అభివృద్ధి, మౌలిక సదుపాయాల నిర్మాణాలు..కైలాసగిరి, తెన్నేటి పార్కుల పునరుద్ధరణ.. సీ హారియర్ మ్యూజియం.. హెల్త్ ఎరీనా జాగింగ్ ట్రాక్.. కొండకర్ల ఆవలో ఫ్లోటింగ్ జెట్టీ.. మరోవైపు పర్యాటకులను ఆకట్టుకొనే ప్రాజెక్టులకు విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) విశాఖ ప్రగతిలో కీలకపాత్ర పోషిస్తోంది. సుందర విశాఖను పర్యాటకులకు స్వర్గధామంగా మలిచేందుకు మరిన్ని బృహత్తర ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. వీఎంఆర్డీఏ గత ఏడాది కాలంలో చేపట్టిన ప్రాజెక్టులు, వాటి ప్రగతి, భవిష్యత్తులో చేపట్టే ప్రాజెక్టులపై మెట్రోపాలిటన్ కమిషనర్, కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున శుక్రవారం వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో జరిగిన మీడియా సమావేశంలో వివరించారు. వీఎంఆర్డీఏ గత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ 31వ తేదీ వరకు రూ.161 కోట్లు ఆదాయం రాగా.. రూ.215 కోట్లు వ్యయం జరిగినట్లు వెల్లడించారు. సెంటు స్థలాల అభివృద్ధి విషయంలో ప్రభుత్వం బల్క్ ల్యాండ్ ప్రతిపాదనకు అంగీకారం తెలిపిందని, వాటి వేలం ద్వారా సంస్థకు ఆదాయం సమకూరుతోందని చెప్పారు. ఫన్ ప్రాజెక్టులు.. స్టార్ హోటల్.. ► పిల్లల కోసమే ప్రత్యేకంగా వైశాఖి జల ఉద్యానవనంలో 3.48 ఎకరాల్లో పీపీపీ విధానంలో రూ.40 కోట్ల అంచనా వ్యయంతో అమ్యూజ్మెంట్ అండ్ ఫన్ జోన్ ఏర్పాటుకు టెండర్లను ఆహ్వానించారు. ► అలాగే తెన్నేటి పార్కు బీచ్‌లో డిజైన్–ఇన్వెస్ట్–ఇన్స్టాల్మెంట్–ఆపరేషన్ విధానంలో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ► వీఎంఆర్డీఏ పార్కు వెనుక ఉన్న 7.97 ఎకరాల్లో పీపీపీ విధానంగా రూ.220 కోట్లతో ఫైవ్‌స్టార్ హోటల్, మైస్ సెంటర్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి జ్యుడీషియల్ రివ్యూ కోసం పంపించారు. ► నేచురల్ హిస్టరీ పార్క్ అండ్ మ్యూజియం రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు డీపీఆర్ సిద్ధం చేశారు. ● ఎన్ఏడీ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు 25 శాతం మేర పూర్తయ్యాయి. 9 నెలల్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ► 83 లేఅవుట్లలో 1,41,654 మందికి సెంటు స్థలాల పట్టాలు అందించారు. ఈ లేఅవుట్ల అభివృద్ధిలో వీఎంఆర్డీఏ ప్రముఖ పాత్ర పోషించింది. వీటిలో రూ.175 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించారు. ► భూములు ఇచ్చిన రైతులకు 1,215 ఎకరాల్లో 48 లేఅవుట్లు అభివృద్ధి చేసి ప్లాట్లను కేటాయించారు. వాటి అభివృద్ధికి రూ.660 కోట్లు అవసరమవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ నిధులను మూడు దశలలో ఖర్చు చేయనున్నారు. ఇప్పటికే తొలి దశలో రూ.200 కోట్లతో క్వారీ రబ్బిష్ రోడ్లు, సీసీ డ్రైన్ల పనులు జరుగుతున్నాయి. ఫేజ్–2లో రూ.305 కోట్లతో బీటీ రోడ్లు, ప్లాంటేషన్, పార్కులు, ఎలక్ట్రిఫికేషన్ పనులు ప్రగతిలో ఉన్నాయి. ఫేజ్–3లో రూ.155 కోట్లతో నీటి సరఫరా కల్పించనున్నారు. ► ఈ ఏడాది సెప్టెంబర్ నెలాఖరుకు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనులు చేస్తున్నారు. జగనన్న ఎంఐజీ స్మార్ట్ టౌన్‌షిప్‌కు మంచి స్పందన ► మధ్య తరగతి ప్రజలకు తక్కువ ధరకు స్థలాలు ఇవ్వాలన్న సంకల్పంతో చేపట్టిన జగనన్న ఎంఐజీ స్మార్ట్ టౌన్‌షిప్‌కు మంచి స్పందన వస్తోంది. ► విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలో 204.96 ఎకరాల్లో లేఅవుట్లు వేసి 1280 ప్లాట్లు అందుబాటులోకి తీసుకువచ్చారు. ► విజయనగరం జిల్లా రఘుమండలో ఉన్న 229 ప్లాట్లకు ఇప్పటికే 165 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో లాటరీ తీసి 160 మంది కేటాయింపులు చేశారు. అలాగే జియ్యానివలసలో 130 ప్లాట్లకు 66 దరఖాస్తులు రాగా 56 మందికి ఇచ్చారు. విశాఖలో పాలవలస 1, 2లలో 150 దరఖాస్తులకు గాను లాటరీ 94 ప్లాట్లు విక్రయించారు. ఇప్పటికీ వస్తున్న దరఖాస్తులను పరిశీలించి త్వరలోనే వాటికి లాటరీ ప్రక్రియను చేపట్టనున్నారు. రూ.58.74 కోట్లతో మాస్టర్‌ప్లాన్ రోడ్ల అభివృద్ధి ► విశాఖలో రూ.58.74 కోట్లతో మాస్టర్‌ప్లాన్ రోడ్ల అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ► బోయపాలెం హైవే నుంచి నుంచి కాపులుప్పాడ, బీచ్ రోడ్డులో సీతకొండ, పాయకరావుపేట రోడ్డు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ● అలాగే రూ.12 కోట్లతో లా కాలేజీ హైవే నుంచి పెబెల్ బీచ్ హౌసింగ్ వరకు ఫుట్‌పాత్, గ్రీనరీ, రూ.3.22 కోట్లతో విజయనగరం ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ జంక్షన్ నుంచి కేఏ పేట మీదగా పాల్ నగర్ జంక్షన్ వరకు రోడ్డు, రూ.9.7 కోట్లతో సబ్బవరం నుంచి గుల్లేపల్లికి, రూ.3.52 కోట్లతో యలమంచిలి రైల్వే స్టేషన్ నుంచి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి విగ్రహం వరకు, రూ.7 కోట్లతో, మారికవలస జంక్షన్ నుంచి బీచ్ రోడ్డు వరకు రోడ్డు నిర్మాణం పనులు దాదాపుగా తుది దశకు చేరుకున్నాయి. ► మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ 11 ఫ్లోర్లలో 9 ఫోర్ల నిర్మాణం పూర్తయింది. ఫిబ్రవరి నెలాఖరు నాటికి పూర్తి చేసే లక్ష్యంతో పనులు చేస్తున్నారు. ● చీమలాపల్లి, ఎండాడ లా కాలేజీ వద్ద చేపట్టిన కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణం 30 శాతం పూర్తయింది. ఈ సమావేశంలో వీఎంఆర్డీఏ జాయింట్ కమిషనర్ రవీంద్ర, సెక్రటరీ కీర్తి, సీఈ శివప్రసాద్‌రాజు, డీఎఫ్ఓ శాంతిస్వరూప్, ఈఈలు భవానీప్రసాద్, బలరాం తదితరులు పాల్గొన్నారు. కై లాసగిరిపై సరికొత్త ప్రాజెక్టులు ► పర్యాటకులను మరింత ఆకట్టుకొనే తరహాలో కై లాసగిరిపై గ్లాస్ స్కై వాక్ బ్రిడ్జ్ నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ► ఆరు నెలల్లో దీని నిర్మాణం పూర్తిచేయాలన్న లక్ష్యంతో అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ► దీంతో పాటు జిప్‌లైన్, స్కై సైక్లింగ్ సౌకర్యాలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఇప్పటికే టెండర్ల ప్రక్రియను చేపట్టారు. రెండు నెలల్లోనే వీటిని ఏర్పాటు చేసి ప్రజలకు, పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించాలని భావిస్తున్నారు. ►అలాగే కై లాసగిరిపై 1.99 ఎకరాల్లో పీపీపీ విధానంలో రూ.18 కోట్లతో నేచర్ కాటేజీలు, రివాల్వింగ్ రెస్టారెంట్, బీచ్ వ్యూ కేఫ్ నిర్మాణానికి సంబంధించి టెండర్ల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఏడాదిన్నరలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ► వీఎంఆర్డీఏ పార్కు లైహౌస్ వద్ద ఓషన్ డెక్ నిర్మాణానికి ఇప్పటికే టెండర్లను పూర్తి చేశారు. ► సీఆర్‌జెడ్ అనుమతులు వచ్చిన వెంటనే నిర్మాణాలు ప్రారంభించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. ► కై లాసగిరిపై రూ.4.69 కోట్ల అంచనా వ్యయంతో సైన్స్ మ్యూజియం నిర్మాణానికి రెండు రోజుల క్రితమే శంకుస్థాపన చేశారు. ► అలాగే కొండపై డ్యాషింగ్ కార్, 12డీ థియేటర్, ఫ్లాష్ టవర్ ఏర్పాటుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేశారు. -
కైలాసగిరికి మరో మకుటం
ఆరిలోవ (విశాఖ తూర్పు): విశాఖపట్నంలోని కైలాసగిరిని రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు మరో అడుగు పడింది. ఇప్పటికే పర్యాటక ప్రాంతంగా ఉన్న కైలాసగిరి.. ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి నగరానికి వచ్చే పర్యాటకులను ఆకర్షించే విధంగా మరిన్ని హంగులు సంతరించుకుంటోంది. తాజాగా సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియం పురుడుపోసుకుంటోంది. కేంద్ర సాంస్కృతికశాఖ, రాష్ట్ర ప్రభుత్వం కలిసి సుమారు ఎకరా విస్తీర్ణంలో రూ.4.69 కోట్లతో ఈ మ్యూజియం ఏర్పాటు చేస్తున్నాయి. 3డీ ఆర్ట్ గ్యాలరీ, సిలికా విగ్రహాలు, సైన్స్ వర్కింగ్ మోడల్ ప్రదర్శనలు, శాస్త్రీయ థీమ్‌లు తదితరాలతో.. ఏడాదిలో ఇది అందుబాటులోకి రానుంది. ఈ మ్యూజియం నిర్మాణానికి ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మంగళవారం ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జునతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కైలాసగిరిని ముఖ్య పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. ఇక్కడ పర్యాటకులకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు. గతంలో పలు అభివృద్ధి పనులకు ఇక్కడ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు కేంద్ర సాంస్కృతికశాఖ, రాష్ట్ర ప్రభుత్వం కలిసి మ్యూజియం గ్రాంట్æస్కీం కింద సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఎస్సీఏపీ) ఆధ్వర్యంలో అధునాతనమైన సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రూ.4.69 కోట్లతో ఏర్పాటు చేస్తున్న దీనికి.. రూ.3.75 కోట్లను ఎస్సీఏపీకి కేంద్ర సాంస్కృతికశాఖ కేటాయించగా మిగిలిన సుమారు రూ.కోటిని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ పనుల్ని ఏడాదిలో పూర్తిచేసి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారని ఆయన చెప్పారు. జీవీఎంసీ కార్పొరేటర్ స్వాతి, ఎస్సీఏపీ సీఈవో డాక్టర్ కె.జయరామిరెడ్డి, వీఎంఆర్డీఏ జాయింట్ కమిషనర్ రవీంద్ర, కార్యదర్శి బి.కీర్తి తదితరులు పాల్గొన్నారు. -
కైలాసగిరి.. పర్యాటక సిరి
సాక్షి, విశాఖపట్నం: అందాల విశాఖ నగరానికి వచ్చే ప్రతి సందర్శకుడూ కైలాసగిరి వెళ్తాడు. విదేశాల నుంచి వచ్చే 10 మంది పర్యాటకుల్లో 8 మంది కైలాసగిరిని సందర్శిస్తున్నారని పర్యాటక శాఖ లెక్కలు చెబుతున్నాయి. గిరిపై నుంచి సాగర నగరి సొగసులు.. వయ్యారాలు ఒలకబోస్తున్న తీరం సోయగాలు చూసేందుకు ఉవ్విళ్లూరుతారు. కొత్త ప్రాజెక్టులతో కైలాసగిరి మరింత సొబగులద్దుకోనుంది. ఇప్పటికే భారీ శివపార్వతుల విగ్రహం, శంకుచక్రనామాలు, టైటానిక్ వ్యూ, తెలుగు మ్యూజియం, మినీ త్రీడీ థియేటర్, రోప్‌వే.. కొండ చుట్టూ తిరుగుతూ విశాఖ అందాలు చూపించే రైలు బండితో కళకళలాడుతున్న కైలాసగిరిపై రాబోయే రోజుల్లో మరిన్ని పర్యాటక ప్రాజెక్టులకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. మొత్తంగా 380 ఎకరాల్లో అభివృద్ధి పనులకు వీఎంఆర్డీఏ శ్రీకారం చుడుతోంది. సముద్ర మట్టానికి 110 మీటర్ల ఎత్తులో ఉన్న కైలాసగిరిపై నుంచి విశాఖను చూస్తే సుందరంగా కనిపిస్తుంది. అందుకే ఈ పర్యాటక ప్రాంతానికి క్రేజ్ ఉంది. మరిన్ని కొత్త ప్రాజెక్టులతో దేశ, విదేశీ సందర్శకులను ఆకర్షించేలా వీఎంఆర్డీఏ ప్రణాళికలు సిద్ధం చేసింది. రీస్టోరేషన్ అండ్ రీడెవలప్మెంట్ ప్రాజెక్టు కింద రూ.61.93 కోట్లతో 380 ఎకరాల కైలాసగిరి హిల్ టాప్ పార్కును అభివృద్ధి చేయనుంది. ముఖద్వారం మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దనుంది. దీనికి తోడు కియోస్క్‌లు, ఫుడ్‌కోర్టులు, అ«ధునాతన టాయిలెట్స్ ఏర్పాటు చేయనుంది. ల్యాండ్ స్కేప్ వర్క్స్, పాత్‌వేలు, వ్యూపాయింట్స్ అభివృద్ధి చేయనుంది. సరికొత్త విద్యుత్ దీపాలంకరణతో పాటు పర్యాటకులకు పూర్తిస్థాయి భద్రత కల్పించేందుకు ప్రతిచోటా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనుంది. అలాగే కొండపై ఉన్న 7ఎకరాల్లో రూ.37కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన 3 ప్లానిటోరియం ప్రాజెక్ట్‌కు సంబంధించి డీపీఆర్ కూడా సిద్ధం చేస్తోంది. మొత్తంగా అన్ని విధాలా కైలాసగిరిని అభివృద్ధి చేసి ప్రస్తుతం వచ్చిన పర్యాటకుల సంఖ్యను రెట్టింపు చేసుకోవాలని వీఎంఆర్డీఏ భావిస్తోంది. రెండో ఘాట్ రోడ్డు నిర్మాణం ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్ రికవరీ ప్రాజెక్టు(ఏపీడీఆర్పీ) కింద ప్రపంచ బ్యాంకు అందిస్తున్న నిధులతో కైలాసగిరిని మరింత ఆకర్షణీయంగా అభివృద్ధి చేసేందుకు వీఎంఆర్డీఏ రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం కైలాసగిరికి ఒక ఘాట్‌రోడ్డు ఉంది. దీనికి అనుగుణంగా మరో ఘాట్ రోడ్డుని ఆధునిక సౌకర్యాలతో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. 800 మీటర్ల పొడవుతో ఈ ఘాట్ రోడ్డు నిర్మించనున్నారు. ఏపీడీఆర్పీ నిధుల్లో 8.97 కోట్లతో రెండో ఘాట్ రోడ్డు నిర్మాణంతో పాటు ప్రస్తుతం ఉన్న ఘాట్ రోడ్డును అభివృద్ధి చెయ్యనున్నారు. దీనికి సంబంధించిన డీపీఆర్ కూడా సిద్ధమవుతోంది. మొత్తం మీద మరో ఏడాది కాలంలో కైలాసగిరిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసేందుకు వీఎంఆర్డీఏ సమగ్ర కార్యచరణతో ముందుకెళ్తోంది. రెండో ఘాట్ రోడ్డు నమూనా పర్యాటకంలో ప్రధానాకర్షణగా... అన్ని హంగులతో కైలాసగిరిని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. దేశీయ పర్యాటకులతో పాటు విదేశీ సందర్శకుల అభిరుచులకు తగ్గట్లుగా ఫుడ్‌కోర్టులు, ఇతర మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని రకాల చర్యలకు ఉపక్రమిస్తున్నాం. 3డీ ప్లానిటోరియం ప్రాజెక్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇవన్నీ పూర్తయితే దేశీయ పర్యాటకంలో కైలాసగిరి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. – పి.కోటేశ్వరరావు, వీఎంఆర్డీఏ కమిషనర్ -
వినీలాకాశంలో విహరించేలా..
సాక్షి, విశాఖపట్నం: కైలాసగిరి.. మరింత శోభాయమానంగా రూపుదిద్దుకోనుంది. వినీలాకాశాన్ని నేలకు తీసుకొచ్చేలా అంతర్జాతీయ స్థాయి ప్లానిటోరియం నిర్మాణం కైలాసగిరికి మణిహారంలా మారనుంది. దీనికోసం ఇప్పటికే డీపీఆర్ సిద్ధం చేసిన వీఎంఆర్డీఏ.. సరికొత్త డిజైన్‌తో నిర్మించేందుకు సిద్ధమవుతోంది. అందాల విశాఖ నగరానికి వచ్చే ప్రతి పర్యాటకుడూ కైలాసగిరిని సందర్శిస్తాడు. విదేశాల నుంచి వచ్చే 10 మంది పర్యాటకుల్లో.. 8 మంది కైలాసగిరిని సందర్శిస్తుంటారని పర్యాటక శాఖ లెక్కలు చెబుతున్నాయి. గిరిపై నుంచి చూస్తే.. సాగర నగరి సొగసులు.. వయ్యారాలు ఒలకబోస్తున్న తీరం సోయగాలు మనసును కట్టిపడేస్తాయి. అలాంటి కైలాసగిరిపై వినూత్న ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. భవిష్యత్తులో విభిన్న పర్యాటక సొబగులద్దుకునేందుకు సిద్ధమవుతోంది. టూరిజం ఐకాన్‌గా కైలాసగిరిని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా కైలాసగిరి అభివృద్ధికి పూర్తి స్థాయి ప్రణాళికల్ని వీఎంఆర్డీఏ సిద్ధం చేసింది. తారలు దిగివచ్చి.. తళుక్కున కనిపిస్తే.. సముద్ర మట్టానికి 110 మీటర్ల ఎత్తులో ఉన్న కైలాసగిరిపై నుంచి విశాఖను చూస్తే.. సుందరంగా కనిపిస్తుంది. ఆకాశం అందినట్లుగా ఉంటుంది. మరి ఆ నింగిని తాకుతూ.. నక్షత్రాల మధ్య విహరించే అవకాశం వస్తే.. ఎంతో బావుంటుంది కదా.. ఆ స్వప్నం సాకారం చేసే ప్రాజెక్టు సిద్ధమవుతోంది. అంతర్జాతీయ స్థాయి సక్షత్రశాల నిర్మాణానికి కైలాసగిరి సిద్ధమవుతోంది. రూ.37 కోట్ల వ్యయంతో ప్లానిటోరియం నిర్మించేందుకు వీఎంఆర్డీఏ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందు కోసం 7 ఎకరాల స్థలాన్ని కొండపై గుర్తించింది. హైబ్రిడ్ ప్రొజెక్షన్లు, 3డీ డిజిటల్ ప్రొజెక్టర్‌తో 200 మంది కూర్చొని వీక్షించేలా ప్లానిటోరియం నిర్మించనున్నారు. ప్రదర్శన ప్రారంభమైన వెంటనే నక్షత్రాల నడుమ మనం విహరించే అనుభూతిని 3డీ టెక్నాలజీ కలిగించనుంది. కేవలం ప్లానిటోరియం మాత్రమే కాకుండా... గ్రహాలు, నక్షత్రాలు, సౌరమండలం, ఉపగ్రహాలు.. ఇలా.. సౌర కుటుంబంలోని ప్రతి విషయాన్ని ప్రజలకు వివరించేలా చుట్టూ వివరాలు తెలుసుకునేలా చిత్రాలు, వివరాలు ఏర్పాటు చెయ్యనున్నారు. అంతర్జాతీయ హంగులతో.. ‘పదే పదే నిర్మించం కదా.. అందుకే.. అంతర్జాతీయ స్థాయిలో నిర్మించేందుకు ప్రయత్నించండి..’’ ప్లానిటోరియం నిర్మాణంపై వీఎంఆర్డీఏ అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. సీఎం మార్గదర్శకాలకు అనుగుణంగా ప్లానిటోరియం నిర్మించేందుకు వివిధ అంతర్జాతీయ స్థాయి నక్షత్రశాలల్ని అధికారులు పరిశీలించారు. మంగుళూరులోని పిలుకుల ప్రాంతీయ సైన్స్ సెంటర్ తరహాలో దీన్ని అభివృద్ధి చేసేందుకు సిద్ధమవుతున్నారు. దేశంలో మొదటి త్రీడీ ప్లానిటోరియంమైన మంగుళూరు కేంద్రాన్ని కొద్ది నెలల క్రితం వీఎంఆర్డీఏ కమిషనర్ కోటేశ్వరరావు బృందం పరిశీలించింది. సాంకేతిక పరిజ్ఞానం, నిర్వహణ తీరుని సంబంధిత అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. మంగుళూరుకి మించి అంతర్జాతీయ హంగులతో దీన్ని నిర్మించాలని నిర్ణయించారు. త్రీడీ షో తో పాటు.. ప్లానిటోరియంలో కాఫీ షాప్, సావనీర్ షాపింగ్‌ని ఏర్పాటు చేయనున్నారు. కొత్త అనుభూతి అందించనున్న త్రీడీ ప్రొజెక్షన్ షో డిజైన్ కోసం కసరత్తు కైలాసగిరిపై నిర్మించనున్న ప్లానిటోరియంను సరికొత్త డిజైన్‌లో నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం.. ప్రాజెక్టు డీపీఆర్ రూపకల్పనకు కోల్‌కతా ఎన్సీఎస్ఎం డైరెక్టర్ జనరల్ అరిజిత్ దుత్తాచౌదరి నేతృత్వంలో నలుగురు నిపుణుల బృందాన్ని సైతం ఏర్పాటు చేశారు. ఈ కమిటీ డీపీఆర్, డిజైన్ల రూపకల్పనకు కైలాసగిరిపై ప్లానిటోరియం నిర్మాణానికి అనువైన స్థల గుర్తింపుతో పాటు కావాల్సిన పరికరాలు, ఐకానిక్ బిల్డింగ్, ఇతర సాంకేతికాంశాల విషయాలపై సూచనలు చేసింది. ఆ కమిటీ సూచించిన అంశాల ప్రకారం ప్లానిటోరియం డిజైన్ల కోసం వీఎంఆర్డీఏ పోటీ నిర్వహించింది. అర్హత గల ఆర్కిటెక్ట్ సంస్థల నుంచి డిజైన్లను ఆహా్వనించింది. 66 ఆర్కిటెక్ట్ సంస్థలు పోటీ పడ్డాయి. 13 సంస్థలు మాత్రమే డిజైన్లు, ఇతర పత్రాలు సమరి్పంచాయి. వీటిలో ప్రథమ బహుమతి పొందిన స్టూడియో ఎమర్జెన్స్ సంస్థ రూపొందించిన డిజైన్ని ఎంపిక చేసి.. దాని తరహాలో ప్లానిటోరియం నిర్మించాలని నిర్ణయించారు. నిపుణుల కమిటీ సూచనలతో... ప్రాథమికంగా డిజైన్‌ను ఎంపిక చేసినప్పటికీ.. దీని సాధ్యాసాధ్యాలపై వీఎంఆర్డీఏ తీవ్ర కసరత్తు చేస్తోంది. డిజైన్‌లో మార్పులు చేర్పులు, ఇంజినీరింగ్ స్ట్రక్చరల్ వ్యవహారాలపై సలహాలు, సూచనలు తీసుకునేందుకు దేశంలోని ప్రముఖ ఆర్కిటెక్ట్‌లు, స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ నిపుణులు, ఐఐటీ ప్రొఫెసర్లతో త్వరలోనే కమిటీ వేయనుంది. వీరంతా.. ఈ డిజైన్‌లో మార్పులు చేసి.. ప్లానిటోరియంకు తుది రూపు తీసుకురానున్నారు. గొప్ప అనుభూతిని అందించేలా... కైలాసగిరిపైకి వచ్చే సందర్శకులకు గొప్ప అనుభూతిని అందించే విధంగా ప్లానిటోరియం నిర్మించాలని సీఎం సూచించారు. ఆయన ఆదేశాలకు అనుగుణంగా డిజైన్ల కోసం పోటీ నిర్వహించాం. ఎంపిక చేసిన డిజైన్‌లో మార్పులు చేర్పుల్ని నిపుణుల కమిటీ ద్వారా ఫైనలైజ్ చేస్తాం. దేశీయ సందర్శకులే కాకుండా.. అంతర్జాతీయ పర్యాటకులకూ సరికొత్త అనుభూతిని కలిగించేందుకు ప్రయతి్నస్తున్నాం. ప్రపంచంలో ఎన్నో ప్లానిటోరియంలు ఉండొచ్చు. కానీ.. కైలాసగిరిపై ఏర్పాటుకానున్న ప్లానిటోరియం వాటన్నింటికంటే విభిన్నమైందిగా ఉండాలన్నదే ప్రభుత్వ అభిమతం. – పి.కోటేశ్వరరావు, వీఎంఆర్డీఏ కమిషనర్ -
కైలాసగిరిపై గ్యాంగ్‌రేప్ యత్నం
ప్రేమ పేరుతో వల వేశాడు.. షికారుకు వెళ్దామంటూ ముద్దు ముద్దు మాటలతో మభ్యపెట్టాడు. కానీ అతని మాటల వెనుక.. ముద్దుముచ్చట్ల వెనుక చెరబట్టే కీచక పథకం ఉందన్న విషయం తెలియక గుడ్డిగా అతడిని నమ్మి కైలాసగిరిపైకి వెళ్లిన ఆమెకు ఆ కామాంధుడి విషపు ఆలోచనలు తెలిసొచ్చాయి. ఏకాంతం పేరుతో పొదల్లోకి తీసుకెళ్లి ముందుగానే వేసుకున్న ప్లాన్ ప్రకారం ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడు. అతగాడికి ముగ్గురు స్నేహితులు తోడయ్యారు. రాక్షసంగా తన మీద పడిన వారిని తీవ్రంగా ప్రతిఘటిస్తూ.. ఆ యువతి కేకలు వేసింది. ఆమె అదృష్టం బాగుండి ఆ కేకలు అటుగా వెళ్తున్న పికెట్ పోలీసుల చెవిన పడ్డాయి. వెంటనే వారు అక్కడికి చేరుకొని యువతిని రక్షించారు. సామూహిక లైంగిక దాడికి యత్నించిన నలుగురినీ పట్టుకొని ఆరిలోవ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అప్రమత్తంగా వ్యవహరించి యువతి మాన, ప్రాణాలను కాపాడిన పోలీసులను నగర పోలీస్ కమిషనర్ మీనా అభినందించారు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: నగరంలోని ఓ నర్సింగ్ కాలేజీలో చదువుతున్న యువతి(19)ని జోడుగుళ్ళపాలేనికి చెందిన డగోడుపల్లి నరేష్ (17) కొన్నాళ్ళుగా ప్రేమ పేరిట వెంటపడుతూ వస్తున్నాడు. ఓసారి సరదాగా కైలాసగిరి వెళ్దామంటూ ఎప్పటి నుంచో అడుగుతుండటంతో కాదనలేక సరే అంది. ఆ మేరకు బుధవారం సాయంత్రం ఇద్దరూ కలిసి కైలాసగిరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏకాంతంగా ఉందామంటూ పక్కనే ఉన్న పొదల్లోకి తీసుకువెళ్ళాడు. వెంట తెచ్చుకున్న మద్యం సేవించాడు. తర్వాత ఒక్కసారిగా అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. ఇంతలో ఆమె ప్రతిఘటించడంతో దగ్గరలోనే ఉన్న ముగ్గురు స్నేహితులకు ఫోన్‌చేశాడు. మల్లె నూకరాజు (17), గలావిల్లి రమణ(23) గరికిన నూకరాజు(18).. అనే ముగ్గురు అక్కడికి వచ్చారు. నలుగురూ సామూహిక అత్యాచారయత్నానికి ఒడిగట్టారు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించి గట్టిగా వేసిన కేకలు పక్కనే పికెటింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు వినపడింది. వెంటనే పోలీసులు పొదలోకి వెళ్ళి ఆ యువతిని రక్షించారు. పారిపోతున్న నలుగురు యువకులను వెంటాడి పట్టుకుని ఆరిలోవ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిందితుల్లో నరేష్ ఐటీఐ చదువుతుండగా, మల్లె నూకరాజు కెమెరామెన్‌గా పనిచేస్తున్నాడు. రమణ బైక్ మెకానిక్ కాగా గరికిన నూకరాజు డిగ్రీ ఫస్టియర్ చదువుతున్నాడు. వీరిలో నరేష్, మల్లెనూకరాజు మైనర్లు కావడం గమనార్హం. నిందితులు అదుపులో ఉన్నారని, విచారణ చేస్తున్నామని, సమగ్ర వివరాలు గురువారం వెల్లడిస్తామని ఆరిలోవ సీఐ కష్ణ కిషోర్‌కుమార్ చెప్పారు. ఆరిలోవ పోలీసులు భేష్.. సీపీ ఓ యువతి మాన, ప్రాణాలను రక్షించిన ఆరిలోవ పోలీసులను నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా, డీసీపీ రంగారెడ్డి అభినందించారు. పోలీసులు సరైన సమయంలో స్పందించకుంటే మద్యం మత్తులో ఉన్న నిందితులు ఏ అఘాయిత్యానికైనా పాల్పడే ప్రమాదం ఉండేదన్నారు. ఇటీవల ప్రత్యేకించి కైలాసగిరి, తొట్లకొండ, రుషికొండ ప్రాంతాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసి నిరంతర నిఘా పెంచామని చెప్పారు. ఫలితంగానే ఓ అవాంఛనీయ ఘటనను అడ్డుకోగలిగామని అన్నారు. -
విశాఖలో పర్యటించిన గవర్నర్ బిశ్వ భూషణ్
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ విశాఖ పర్యటనలో భాగంగా కైలాసగిరి, సిటీ సెంట్రల్ పార్కులను సందర్శించారు. ఈ నేపథ్యంలో వీఎంఆర్డీఏ కమిషనర్ కోటేశ్వర రావు గవర్నర్‌కు స్వాగతం పలికారు. గవర్నర్ వెంట ముఖ్యకార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా కూడా హాజరయ్యారు. తొలుత గవర్నర్ పర్యాటక కేంద్రం కైలాసగిరిలో పర్యటించారు. తరువాత తెలుగు మ్యూజియమ్‌ను సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విశాఖ సుందరమైన ప్రదేశం.. తెలుగు మ్యూజియం అద్భుతంగా ఉందని ప్రశంసించారు. తెలుగు అభివృద్ధి కోసం కృషి చేసిన సాహిత్య, రాజకీయ, ప్రముఖుల చిత్రాలు చూడటం ఆనందంగా ఉందన్నారు. రాజా నరసింగరావు, సర్వేపల్లి రాధకృష్ణన్ లాంటి మహోన్నత వ్యక్తులను స్మరించుకున్నానని తెలిపారు. మొదటి సారి 1977లో విశాఖలో జరిగిన కార్మిక సంఘాల సదస్సులో పాల్గొన్నానని గుర్తు చేసుకున్నారు. తర్వాత డా. వైఎస్ రాజశేఖరరెడ్డి సిటీ సెంట్రల్‌ను పార్క్‌ను సందర్శించారు. మ్యూజికల్ ఫౌంటెన్‌ను తిలకించి.. పార్కులో ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. -
విశాఖలో గవర్నర్‌కు ఘన స్వాగతం
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు విశాఖ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. గవర్నర్ హోదాలో ఆయన తొలిసారి విశాఖలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ వచ్చిన గవర్నర్‌కు జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, నగర పోలీస్ కమిషనర్ మీనా, నేవీ అధికారులు స్వాగతం పలికారు. గవర్నర్ మొదట తూర్పు నావికాదళం ఆపరేషన్ బేస్‌ను సందర్శించి, సర్క్యూట్ హౌస్‌కు వెళతారు. సాయంత్రం కైలాసగిరికి వెళ్లి తెలుగు మ్యూజియం, అనంతరం డాక్టర్ వైఎస్సార్ సిటీ సెంట్రల్ పార్క్‌ను సందర్శిస్తారు. గురువారం ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని సందర్శించి బ్లడ్ డొనేషన్ క్యాంపును ప్రారంభిస్తారు. అదే రోజు మధ్యాహ్నం పోర్ట్ ట్రస్ట్‌ని సందర్శించి అక్కడ నుంచి రాత్రికి విజయవాడ బయలుదేరనున్నారు. -
కైలాసగిరిపై ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం
ఆరిలోవ(విశాఖతూర్పు): నగరంలోని కైలాసగిరిపై ప్రేమజంట ఆత్మహత్యకు యత్నించారు. వీరిలో ప్రియుడు మృతి చెందగా ప్రియురాలు కేజీహెచ్‌లో చికిత్స పొందుతోంది. శ్రీకాకుళం జిల్లా, వీరఘట్టం మండలం అడారు గ్రామానికి చెందిన చౌడాడ సత్యనారాయణ అలియాస్ లక్ష్మణరావు(26), రౌతు కమల(22) కైలాసగిరిపై బాదం జ్యూస్‌లో విషం కలిపి తాగేసి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆత్మహత్యాయత్నానికి ముందు ఇద్దరూ సూసైడ్ నోట్లు రాశారు. క్షమించండి శివ(అన్నయ్య)... అమ్మను జాగ్రత్తగా చూసుకో. మీతో కలసి ఉండాలని అనుకొన్నా నాకు ఆ ఆదృష్టం లేదు. మామయ్యలతో కలసి అంతా హ్యాపీగా ఉండండి. నన్ను క్షమించండి. అమ్మ నీ ప్రాణం. ఇదే నా ఆఖరి కోరిక. నేను చనిపోవడానికి ఎవ్వరూ కారణం కాదు. మా ఇద్దరం కలిసి ఒకరిని విడిచి మరొకరం ఉండలేకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకొన్నాము. అంటూ కమల సూసైడ్ నోట్ రాసింది.. కమల రాసిన సూసైడ్ నోట్ ,కైలాసగిరిపై మృతిచెందిన సత్యనారాయణ పక్కనే అస్మారక స్థితిలో పడిఉన్న కమల క్షమించిండి అన్నయ్యా... అమ్మా, నాన్నలను జాగ్రతగా చూసుకో. నువ్వు ఉన్నావనే నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకొన్నాను. అక్క, బావలను జాగ్రత్తగా చూసుకో. తనను నేను మరిచిపోలేకపోతున్నాను. మా ఇద్దరం కలసి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మా చావుకు ఎవరూ కారణం కాదు. ఇందులో ఎవరి ప్రమేయమూ లేదు. మా ఇద్దరి వల్ల మన రెండు కుటుంబాలు గొడవలు పడకూడదు. మా ఇద్దరినీ క్షమించండి అంటూ సత్యనారాయణ సూసైడ్ నోట్ రాశాడు. -
పర్యాటక ప్రాంతంలో పుర్రె కలకలం
సాక్షి, విశాఖపట్నం: పర్యాటక ప్రాంతం కైలాసగిరిలో ఓ మనిషి పుర్రె లభించడం కలకలంరేపింది. పుర్రె లభ్యమయిన ప్రాంతానికి 50 అడుగుల దూరంలో కొండపై మొండెం లభ్యమైంది. ఆత్మహత్య చేసుకున్నట్లు మొండెం లభ్యమయిన చోట ఆధారాలుదొరికాయి. ఆత్మహత్య చేసుకుని 20 రోజులు గడిచి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ముందుగా పుర్రె లభ్యం కావడంతో పోలీసులు హత్యగా అనుమానించారు. ఆరిలోవ పోలీసులు గుర్తు తెలియని మృతదేహం ఆధారాలను సేకరించే పనిలోపడ్డారు. -
ప్రకృతి సీమకు పవన మార్గం
త్వరలో అరకులోయకు హెలిటూర్ వుడా పార్క్ టు కైలాసగిరికి కూడా.. విశాఖపట్నం : హెలికాప్టర్లో విశాఖ చూడాలని ఉందా? విశాఖ నుంచి అరకులోయ, సాగరతీరం నుంచి కైలాసగిరికి గాల్లో విహరించాలని ఉందా? అయితే ఆ ముచ్చట త్వరలోనే తీరనుంది. చేతిలో సొమ్ముంటే చాలు.. గాల్లో తేలిపోవచ్చు.. సుందర విశాఖను వీక్షించవచ్చు..! పర్యాటకరంగంలో విశాఖకు ఎంతో ప్రత్యేకత ఉంది. తన అందచందాలతో దేశ విదేశాల్లోని పర్యాటకులను ఎంతగానో ఆక ర్షిస్తోంది. ఏటా అరకోటికి పైగా పర్యాటక ప్రియులు విశాఖ నగరంతో పాటు మన్యంలోని అరకు అందాలను చూడడానికి వస్తుంటారు. వీరి సంఖ్య ఏటా గణనీయంగా పెరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే పర్వత శిఖరాలపై ఉన్న కేదార్నాథ్, అమర్నాథ్, వైష్ణోదేవి వంటి పుణ్యక్షేత్రాల కు హెలికాప్టర్లో భక్తులను తీసుకెళ్లడంలో అనుభవం ఉన్న స్కై చాపర్స్ లాజిస్టిక్స్ ప్రయివేటు లిమిటెడ్ సంస్థ విశాఖలో హెలిటూరిజానికి ముందుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కూడా కుదుర్చుకుంది. హెలి టూరిజానికి డెరైక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అనుమతి కూడా లభించింది. ఈ సంస్థ తొలిదశలో వుడా పార్కు నుంచి కైలాసగిరికి హెలికాప్టర్ నడపనుంది. ఇది పర్యాటకులను, ఆసక్తి ఉన్న వారిని ఎక్కించుకుని వుడా పార్కు నుంచి సాగరతీరం మీదుగా ఐదు నిమిషాల పాటు విహరిస్తూ కైలాసగిరిపై ల్యాండ్ అవుతుంది. కైలాసగిరిపై అందచందాలను చూశాక తిరిగి వుడా పార్కుకు తీసుకొస్తుంది. ఇందుకోసం వుడా పార్కు, కైలాసగిరిపై ల్యాండింగు, టేకాఫ్‌ల కోసం హెలిప్యాడ్లను సమకూర్చమని ‘స్కై చాపర్స్’ వుడాను కోరింది. వుడా పార్కులో గతంలో ఉన్న ఎంజీఎం చిల్డ్రన్ వరల్డ్ స్థలాన్ని హెలిప్యాడ్‌కు ఖరారు చేశారు. దీనిపై నేవీ అధికారులకు, డీజీసీఏకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కోసం లేఖ రాశారు. అంతేకాదు.. హెలిటూరిజం సర్వీసు ప్రారంభమైతే ఒక్కొక్కరికి రూ.2,500 టిక్కెట్ ధర నిర్ణయించే అవకాశం ఉంది. అరకులోయకు కూడా.. మరోవైపు విశాఖ నుంచి అరకులోయకు కూడా హెలికాప్టర్‌ను నడపనున్నారు. విశాఖలో బయల్దేరే హెలికాప్టర్ 20 నిమిషాల్లో అరకు చేరుకుంటుంది. పర్యాటకులు అక్కడ అందుబాటులో ఉన్న పర్యాటక ప్రాంతాలను చూసొచ్చాక విశాఖకు తీసుకొస్తుంది. అరకు టూర్‌కు ఒక్కొక్కరికి టిక్కెట్ ధర రూ.4000 నుంచి 4500 వసూలు చేయనున్నారు. ఒక్కో హెలికాప్టర్లో గరిష్టంగా ఐదుగురు కూర్చునే వీలుంటుంది. జులై మొదటి వారంలో.. విశాఖలో హెలి టూరిజాన్ని జులై మొదటి వారంలో ప్రారంభించాలనుకుంటున్నాం. ఇందుకవసరమైన ప్రక్రియ పూర్తవుతోంది. ఇప్పటికే సుమారు రూ.13 కోట్లతో కొత్త హెలికాప్టర్ కొనుగోలు చేశాం. ప్రస్తుతానికి ఒక హెలికాప్టర్‌తో సర్వీసులు నడుపుతాం. అవసరమైతో మరొకటి కొంటాం. వుడా పార్క్ నుంచి కైలాసగిరికి, అలాగే ఆరకులోయకు పర్యాటకులను తిప్పుతాం. అరకులోయకు రోజూ నడపాలా? లేక వీకెండ్లలో నడపాలా? అన్నది పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటాం. పర్యాటకులు, విశాఖ వాసుల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నాం. చంద్రశేఖర్, బిజినెస్ డెవలప్మెంట్ డెరైక్టర్, స్కైచాపర్స్. -
తెగిపడిన కైలాసగిరి రోప్ వే
కొక్కెం ఊడిపడిన కేబుల్‌కారు చెట్ల మధ్య ఇరుక్కుపోవడంతో తప్పిన గండం ఆరుగురికి స్వల్పగాయాలు విశాఖపట్నం: ఆదివారం ఆనందంగా గడపటానికి వచ్చిన పర్యాటకులు పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. విశాఖపట్నం కైలాసగిరిపై రోప్‌వే కొక్కెం ఊడిపోవడంతో కేబుల్ కారు తెగిపడింది. దీంతో సికింద్రాబాద్ నుంచి వచ్చిన ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి గాయాలయ్యాయి. కొండపై ఉన్న చెట్ల మధ్యలో ఇది చిక్కుకుపోవడంతో పెనుప్రమాదం తప్పింది. సాయంత్రం 4 గంటల సమయంలో వీరు కొండపై నుంచి కిందకు దిగేందుకు రోప్‌వే వద్దకు వెళ్లి కేబుల్‌కారు ఎక్కారు. అయితే రోప్‌వే స్టేషన్ దాటిన వెంటనే కేబుల్‌కారుకు ఉన్న కొక్కెం ఒక్కసారిగా ఊడిపోయింది. దీంతో కేబుల్ కార్ తెగిపడింది. ఈ ప్రమాదంలో అలేఖ్య (24), ఆశిష్‌కుమార్(38), ఆర్.మనీషా(19), ఆర్.సుజన(33), యాచిక సాగర్(6), షియాకొండల్(6)కు స్వల్పగాయాలయ్యాయి. ఈ హఠాత్పరిణామానికి సందర్శకులంతా ఒక్కసారి భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమయిన నిర్వాహకులు వెనుక వస్తున్న కేబుల్‌కార్లను వెంటనే నిలిపివేయడంతో పెనుప్రమాదం తప్పింది. ప్రమాదానికి గురైన కేబుల్‌కారు స్టార్ట్ అయిన వెంటనే సంఘటన జరగడంతో ప్రాణనష్టం జరగలేదు. అదే కొద్ది దూరం ప్రయాణించిన తరువాత జరిగినట్టయితే ప్రాణనష్టం జరిగి ఉండేదని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఆరిలోవ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడ్డవారిని వెంటనే కె.జి.హెచ్‌కు తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అయిన వెంటనే కేర్ ఆసుపత్రికి తీసుకుని వెళ్లినట్టు పోలీసులు తెలిపారు. -
కైలాసగిరిపై స్వల్ప అగ్నిప్రమాదం
విశాఖపట్నం : విశాఖ నగరం సమీపంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం కైలాసగిరిపై మంగళవారం మధ్యాహ్నం స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు చెత్తాచెదారం అంటుకోవటంతో ఆ మంటలు ఎండిన చెట్లకు వ్యాపించాయి. వేడిగాలులు తోడు కావటంతో మంటల తీవ్రత పెరుగుతుందేమోనని స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. కాగా అధికారులు సకాలంలో స్పందించి చర్యలు తీసుకోగా పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.