కైలాసగిరిపై స్కై బ్రిడ్జ్‌ | - | Sakshi
Sakshi News home page

కైలాసగిరిపై స్కై బ్రిడ్జ్‌

Published Sat, Jan 6 2024 1:00 AM | Last Updated on Sun, Jan 7 2024 12:46 PM

- - Sakshi

విశాఖ సిటీ: మాస్టర్‌ప్లాన్‌ రోడ్లు.. సెంటు స్థలాల లేఅవుట్లు.. జగనన్న ఎంఐజీ స్మార్ట్‌ టౌన్‌షిప్‌లు.. ఇలా ఒకవైపు ప్రజావసరాలకు అనువైన అభివృద్ధి, మౌలిక సదుపాయాల నిర్మాణాలు..కైలాసగిరి, తెన్నేటి పార్కుల పునరుద్ధరణ.. సీ హారియర్‌ మ్యూజియం.. హెల్త్‌ ఎరీనా జాగింగ్‌ ట్రాక్‌.. కొండకర్ల ఆవలో ఫ్లోటింగ్‌ జెట్టీ.. మరోవైపు పర్యాటకులను ఆకట్టుకొనే ప్రాజెక్టులకు విశాఖపట్నం మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) విశాఖ ప్రగతిలో కీలకపాత్ర పోషిస్తోంది. సుందర విశాఖను పర్యాటకులకు స్వర్గధామంగా మలిచేందుకు మరిన్ని బృహత్తర ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది.

వీఎంఆర్‌డీఏ గత ఏడాది కాలంలో చేపట్టిన ప్రాజెక్టులు, వాటి ప్రగతి, భవిష్యత్తులో చేపట్టే ప్రాజెక్టులపై మెట్రోపాలిటన్‌ కమిషనర్‌, కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున శుక్రవారం వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్స్‌ ఎరీనాలో జరిగిన మీడియా సమావేశంలో వివరించారు. వీఎంఆర్‌డీఏ గత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్‌ 31వ తేదీ వరకు రూ.161 కోట్లు ఆదాయం రాగా.. రూ.215 కోట్లు వ్యయం జరిగినట్లు వెల్లడించారు. సెంటు స్థలాల అభివృద్ధి విషయంలో ప్రభుత్వం బల్క్‌ ల్యాండ్‌ ప్రతిపాదనకు అంగీకారం తెలిపిందని, వాటి వేలం ద్వారా సంస్థకు ఆదాయం సమకూరుతోందని చెప్పారు.

ఫన్‌ ప్రాజెక్టులు.. స్టార్‌ హోటల్‌..
► పిల్లల కోసమే ప్రత్యేకంగా వైశాఖి జల ఉద్యానవనంలో 3.48 ఎకరాల్లో పీపీపీ విధానంలో రూ.40 కోట్ల అంచనా వ్యయంతో అమ్యూజ్‌మెంట్‌ అండ్‌ ఫన్‌ జోన్‌ ఏర్పాటుకు టెండర్లను ఆహ్వానించారు.

► అలాగే తెన్నేటి పార్కు బీచ్‌లో డిజైన్‌–ఇన్వెస్ట్‌–ఇన్‌స్టాల్‌మెంట్‌–ఆపరేషన్‌ విధానంలో ఫ్లోటింగ్‌ బ్రిడ్జ్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

► వీఎంఆర్‌డీఏ పార్కు వెనుక ఉన్న 7.97 ఎకరాల్లో పీపీపీ విధానంగా రూ.220 కోట్లతో ఫైవ్‌స్టార్‌ హోటల్‌, మైస్‌ సెంటర్‌ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి జ్యుడీషియల్‌ రివ్యూ కోసం పంపించారు.

► నేచురల్‌ హిస్టరీ పార్క్‌ అండ్‌ మ్యూజియం రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు డీపీఆర్‌ సిద్ధం చేశారు. ● ఎన్‌ఏడీ వద్ద రైల్వే ఓవర్‌ బ్రిడ్జ్‌ నిర్మాణ పనులు 25 శాతం మేర పూర్తయ్యాయి. 9 నెలల్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.
► 83 లేఅవుట్లలో 1,41,654 మందికి సెంటు స్థలాల పట్టాలు అందించారు. ఈ లేఅవుట్ల అభివృద్ధిలో వీఎంఆర్‌డీఏ ప్రముఖ పాత్ర పోషించింది. వీటిలో రూ.175 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించారు.
► భూములు ఇచ్చిన రైతులకు 1,215 ఎకరాల్లో 48 లేఅవుట్లు అభివృద్ధి చేసి ప్లాట్లను కేటాయించారు. వాటి అభివృద్ధికి రూ.660 కోట్లు అవసరమవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ నిధులను మూడు దశలలో ఖర్చు చేయనున్నారు. ఇప్పటికే తొలి దశలో రూ.200 కోట్లతో క్వారీ రబ్బిష్‌ రోడ్లు, సీసీ డ్రైన్ల పనులు జరుగుతున్నాయి. ఫేజ్‌–2లో రూ.305 కోట్లతో బీటీ రోడ్లు, ప్లాంటేషన్‌, పార్కులు, ఎలక్ట్రిఫికేషన్‌ పనులు ప్రగతిలో ఉన్నాయి. ఫేజ్‌–3లో రూ.155 కోట్లతో నీటి సరఫరా కల్పించనున్నారు.

► ఈ ఏడాది సెప్టెంబర్‌ నెలాఖరుకు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనులు చేస్తున్నారు.

జగనన్న ఎంఐజీ స్మార్ట్‌ టౌన్‌షిప్‌కు మంచి స్పందన
► మధ్య తరగతి ప్రజలకు తక్కువ ధరకు స్థలాలు ఇవ్వాలన్న సంకల్పంతో చేపట్టిన జగనన్న ఎంఐజీ స్మార్ట్‌ టౌన్‌షిప్‌కు మంచి స్పందన వస్తోంది.

► విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలో 204.96 ఎకరాల్లో లేఅవుట్లు వేసి 1280 ప్లాట్లు అందుబాటులోకి తీసుకువచ్చారు.

► విజయనగరం జిల్లా రఘుమండలో ఉన్న 229 ప్లాట్లకు ఇప్పటికే 165 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో లాటరీ తీసి 160 మంది కేటాయింపులు చేశారు. అలాగే జియ్యానివలసలో 130 ప్లాట్లకు 66 దరఖాస్తులు రాగా 56 మందికి ఇచ్చారు. విశాఖలో పాలవలస 1, 2లలో 150 దరఖాస్తులకు గాను లాటరీ 94 ప్లాట్లు విక్రయించారు. ఇప్పటికీ వస్తున్న దరఖాస్తులను పరిశీలించి త్వరలోనే వాటికి లాటరీ ప్రక్రియను చేపట్టనున్నారు.

రూ.58.74 కోట్లతో మాస్టర్‌ప్లాన్‌ రోడ్ల అభివృద్ధి
► విశాఖలో రూ.58.74 కోట్లతో మాస్టర్‌ప్లాన్‌ రోడ్ల అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

► బోయపాలెం హైవే నుంచి నుంచి కాపులుప్పాడ, బీచ్‌ రోడ్డులో సీతకొండ, పాయకరావుపేట రోడ్డు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ● అలాగే రూ.12 కోట్లతో లా కాలేజీ హైవే నుంచి పెబెల్‌ బీచ్‌ హౌసింగ్‌ వరకు ఫుట్‌పాత్‌, గ్రీనరీ, రూ.3.22 కోట్లతో విజయనగరం ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌ హౌస్‌ జంక్షన్‌ నుంచి కేఏ పేట మీదగా పాల్‌ నగర్‌ జంక్షన్‌ వరకు రోడ్డు, రూ.9.7 కోట్లతో సబ్బవరం నుంచి గుల్లేపల్లికి, రూ.3.52 కోట్లతో యలమంచిలి రైల్వే స్టేషన్‌ నుంచి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి విగ్రహం వరకు, రూ.7 కోట్లతో, మారికవలస జంక్షన్‌ నుంచి బీచ్‌ రోడ్డు వరకు రోడ్డు నిర్మాణం పనులు దాదాపుగా తుది దశకు చేరుకున్నాయి.

► మల్టీ లెవెల్‌ కార్‌ పార్కింగ్‌ 11 ఫ్లోర్లలో 9 ఫోర్ల నిర్మాణం పూర్తయింది. ఫిబ్రవరి నెలాఖరు నాటికి పూర్తి చేసే లక్ష్యంతో పనులు చేస్తున్నారు. ● చీమలాపల్లి, ఎండాడ లా కాలేజీ వద్ద చేపట్టిన కన్వెన్షన్‌ సెంటర్ల నిర్మాణం 30 శాతం పూర్తయింది.

ఈ సమావేశంలో వీఎంఆర్‌డీఏ జాయింట్‌ కమిషనర్‌ రవీంద్ర, సెక్రటరీ కీర్తి, సీఈ శివప్రసాద్‌రాజు, డీఎఫ్‌ఓ శాంతిస్వరూప్‌, ఈఈలు భవానీప్రసాద్‌, బలరాం తదితరులు పాల్గొన్నారు.

కై లాసగిరిపై సరికొత్త ప్రాజెక్టులు

► పర్యాటకులను మరింత ఆకట్టుకొనే తరహాలో కై లాసగిరిపై గ్లాస్‌ స్కై వాక్‌ బ్రిడ్జ్‌ నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

► ఆరు నెలల్లో దీని నిర్మాణం పూర్తిచేయాలన్న లక్ష్యంతో అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

► దీంతో పాటు జిప్‌లైన్‌, స్కై సైక్లింగ్‌ సౌకర్యాలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఇప్పటికే టెండర్ల ప్రక్రియను చేపట్టారు. రెండు నెలల్లోనే వీటిని ఏర్పాటు చేసి ప్రజలకు, పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించాలని భావిస్తున్నారు.

►అలాగే కై లాసగిరిపై 1.99 ఎకరాల్లో పీపీపీ విధానంలో రూ.18 కోట్లతో నేచర్‌ కాటేజీలు, రివాల్వింగ్‌ రెస్టారెంట్‌, బీచ్‌ వ్యూ కేఫ్‌ నిర్మాణానికి సంబంధించి టెండర్ల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఏడాదిన్నరలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.

► వీఎంఆర్‌డీఏ పార్కు లైహౌస్‌ వద్ద ఓషన్‌ డెక్‌ నిర్మాణానికి ఇప్పటికే టెండర్లను పూర్తి చేశారు.

► సీఆర్‌జెడ్‌ అనుమతులు వచ్చిన వెంటనే నిర్మాణాలు ప్రారంభించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు.

► కై లాసగిరిపై రూ.4.69 కోట్ల అంచనా వ్యయంతో సైన్స్‌ మ్యూజియం నిర్మాణానికి రెండు రోజుల క్రితమే శంకుస్థాపన చేశారు.

► అలాగే కొండపై డ్యాషింగ్‌ కార్‌, 12డీ థియేటర్‌, ఫ్లాష్‌ టవర్‌ ఏర్పాటుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement