మేడను వెనక్కు నడుపుతున్న సిబ్బంది
నెమలికి నేర్పిన నడకలివీ’ అన్నాడు ఓ సినీకవి. దాన్ని ఇప్పుడు మనం ‘మేడకు నేర్పిన నడకలివీ’ అని అనుకోవాల్సి వస్తోంది. ఒకప్పుడు ఎటూ కదలని భవనాలు మొదలైన వాటిని ‘స్థిరా’స్తులుగా చెప్పుకొనేవారు. ఇప్పుడవి కదులుతూ ‘చరా’స్తులుగా మారాయి. దానికి ఉదాహరణగా నిలుస్తోంది రంగంపేటలో ఓ రెండంతస్తుల మేడ. అదేంటో తెలుసుకుందామా..
సాక్షి, రంగంపేట (తూర్పుగోదావరి) : పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం అసాధ్యాలను సైతం సుసాధ్యం చేస్తూ అబ్బురపరుస్తోంది. ‘స్థిర’ ఆస్తులుగా చెప్పుకొనే భవనాలు ‘చర’ ఆస్తులుగా మారి అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తున్నాయి. జీవరాశులే కాదు.. నేను కూడా నడుస్తున్నాను చూడండంటూ రంగంపేటలోని ఓ రెండంతస్తుల మేడ 26 అడుగులు వెనక్కు వెళ్లింది. వివరాల్లోకి వెళితే.. రాజానగరం నుంచి సామర్లకోట వరకూ ఏడీబీ రోడ్డును ఆరులైన్ల రోడ్డుగా అభివృద్ధి చేస్తున్న విషయం విదితమే. ఈ విస్తరణలో రంగంపేట మెయిన్ రోడ్డు పక్కన ఉన్న రెండంతస్తుల భవనం తొలగించాల్సి ఉంది. అది ఇష్టం లేని ఆ భవన యజమాని పోతుల రామ్‌కుమార్ దాన్ని వెనక్కు జరపాలని నిశ్చయించుకున్నారు. దాంతో చెన్నైకి చెందిన ఏజే బిల్డింగ్ లిఫ్టింగ్ అండ్ షిఫ్టింగ్ కంపెనీకి, విజయవాడకు చెందిన ఒక సబ్ కాంట్రాక్టర్‌కు భవనాన్ని 33 అడుగులు వెనక్కి జరిపేందుకు కాంట్రాక్టు ఇచ్చారు. బీహార్ రాష్ట్రానికి చెందిన టెక్నిషియన్లు మేడను వెనుకకు జరిపే పనులు ప్రారంభించారు. ఈ మొత్తం పనులు పూర్తి కావడానికి రెండు నెలలకు అగ్రిమెంట్ చేసుకున్నట్టు రామ్‌కుమార్ తెలిపారు.
ఈ చిత్రంలో కనిపిస్తున్న రెండు భవనాలు పక్కపక్కన ఉండేవి. వెనక్కి నడిచిన పెద్ద భవనం ఇప్పుడిలా..
ఇప్పటికి పనులు ప్రారంభించి 57 రోజులు కాగా 33 అడుగులకు గాను 26 అడుగులు మేడ వెనక్కి జరిగింది. మరో వారం రోజుల్లో మేడ మొత్తం 33 అడుగులు వెనక్కి జరుగుతుందని రామ్‌కుమార్ తెలిపారు. ఈ భవనం కదులుతున్న తీరు గమనిస్తే.. భవనం ఫ్లోరింగ్ మొత్తం తవ్వి పిల్లర్లకు 350 రోలింగ్ జాకీలు అమర్చారు. ఆ జాకీలపై భవనాన్ని ఉంచి మరికొన్ని భారీ జాకీలను మేడకు దన్నుగా ఉంచి ఒక్కొక్క జాకీ వద్ద ఇద్దరు వ్యక్తులు జాకీలను తిప్పడంతో భవనం అతి సూక్ష్మంగా వెనక్కి కదులుతోంది. అలా ఇంతవరకూ 26 అడుగులు వెనక్కు జరిగింది. మేడ మొత్తం 33 అడుగులు వెనక్కి నడిచిన తరువాత భవనాన్ని 2 అడుగుల ఎత్తు కూడా భవనాన్ని చేయిస్తామని రామ్‌కుమార్ తెలిపారు. మేడ వెనక్కి జరుగుతున్న తీరును తిలకించేందుకు ఎక్కడెక్కడి నుంచో ప్రజలు తరలివస్తున్నారు. దాంతో ఈ ప్రాంతం జనసందోహంతో కళకళలాడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment