శాస్త్రీయ ఆధారాలను తొక్కిపెడుతున్నదెవరు?
శాస్త్రీయ ఆధారాలను తొక్కిపెడుతున్నదెవరు?
Published Thu, Mar 2 2017 10:12 AM | Last Updated on Sat, Sep 15 2018 7:34 PM
నందిగామ సమీపంలో జరిగిన బస్సు దుర్ఘటనలో శాస్త్రీయ ఆధారాలను తెరమరుగు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నేర స్థలానికి ఫోరెన్సిక్ నిపుణులు వెళ్లకపోవడం, భౌతిక ఆధారాలకు ఎంతమాత్రం ప్రాధాన్యం ఇవ్వకపోవడం అనుమానాలను మరింత బలపరుస్తున్నాయి. ఈ కేసులో కొన్ని లోపాలను ఫోరెన్సిక్ నిపుణులు లేవనెత్తుతున్నారు.
డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడా?
ఈ విషయాన్ని ఫోరెన్సిక్ లేబొరేటరీ నిర్ధారించాల్సి ఉంటుంది. ఈ పరీక్ష చేసేది ఫోరెన్సిక్ లేబొరేటరీలోని టాక్సికాలజీ విభాగం (విష పదార్థాల నిర్థారణ). ఆసుపత్రికి వచ్చిన మృతదేహాన్ని భౌతికంగా పరిశీలించి, విస్రా (కాలేయం, కిడ్నీలు, గుండె)ను సేకరించి ఫోరెన్సిక్ లేబొరేటరీకి పంపాలి. ఈ విషయంలో ఆసుపత్రి వర్గాలు ఆలస్యం చేయడం వెనుక రహస్యం ఏమిటి?
ఒకవేళ డ్రైవర్ మద్యం తాగితే మూడుగంటల వరకూ విస్రాలో ఆల్కహాల్ పదార్థాలు ఉంటాయి. దీన్ని సేకరించి లేబొరేటరీకి పంపితే ఆల్కహాల్ శాతం ఎంతో తేలిపోతుంది. ఈ ఘటనలో బస్సు గంట క్రితమే విజయవాడలో ఆగినట్టు తెలుస్తోంది. అంటే అక్కడ మద్యం తాగి ఉంటే అది ఫోరెన్సిక్ పరీక్షలో తేలిపోయేందుకు వీలుంది.
విస్రాను మార్చేస్తారా?
డ్రైవర్ వాస్తవ పరిస్థితిని బయటకు రానీయకుండా చేయడానికి... విస్రాను మార్చే అవకాశం ఉంది. గతంలో వర్థమాన నటి ప్రత్యూష కేసులో ఇదే జరిగినట్టు వివాదం చెలరేగింది. ఆమె అత్యాచారానికి గురైందని ఫోరెన్సిక్ వైద్యులు ముందే వెల్లడించారు. దీంతో విస్రాను మార్చివేసి, ఆమె విషం తాగినట్టు చిత్రీకరించే ప్రయత్నం చేశారనే ఆరోపణలు వచ్చాయి. అప్పుడు అధికారంలో ఉంది చంద్రబాబు ప్రభుత్వమే. ఆయన మంత్రివర్గ సహచరుల కుమారులపైనే అప్పట్లో అనుమానాలు వచ్చాయి. దీంతో లేబొరేటరీకి పంపిన విస్రాను డీఎన్‌ఏ టెస్టుకు పంపాలనే డిమాండ్ తెరమీదకొచ్చినా చంద్రబాబు సర్కారు పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ ఘటనలోనూ ఇలా జరిగే వీలుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కారణంగానే పోస్టుమార్టం చేయడంలో వైద్యులు నిర్లక్ష్యం చేసి ఉండొచ్చనే అనుమానాలు విన్పిస్తున్నాయి.
భౌతిక ఆధారాలు తీసుకున్నారా
సంఘటనా స్థలం కీలకమైంది. ఇక్కడ భౌతిక ఆధారాలే కేసుకు బలం. సాధారణంగా బస్సు దుర్ఘటన సమయంలో టైర్ గుర్తులు (స్కిడ్ మార్క్స్) తీసుకోవాలి. దీనివల్ల బస్సు ఎంత వేగంతో వెళ్తుంది? ఆ బస్సు పటుత్వం (ఫిట్‌నెస్) ఎంత? అనే కీలకమైన అంశాలను గుర్తించవచ్చు. కానీ ఇక్కడ ఈ ఆధారాలు తీసుకున్న దాఖలాలే లేవు. ఇవన్నీ యాజమాన్యాన్ని కాపాడేందుకు పక్కా ప్రణాళికతో జరిగాయా? అనే సందేహాలకు తావిస్తున్నాయి.
Advertisement
Advertisement