కుతూహలం రేపే దేవ రహ్యస్యం | Interestingly, the secret of turning | Sakshi
Sakshi News home page

కుతూహలం రేపే దేవ రహ్యస్యం

Published Fri, Dec 12 2014 11:45 PM | Last Updated on Sat, Sep 15 2018 7:34 PM

కుతూహలం రేపే దేవ  రహ్యస్యం - Sakshi

కుతూహలం రేపే దేవ రహ్యస్యం

దేవతల గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. రాముడు, కృష్ణుడు, గణపతి, శివుడు... వీరంతా ఎవరు, ఎక్కడ ఉంటారు, అసలు ఉన్నారా లేరా, ఉంటే ఆధారాలేమైనా ఉన్నాయా అనే కుతూహలం ఉండని మనిషి ఉండడు. పురాణాల్లోను ఇతిహాసాల్లోనూ ఉండే దేవతలకు ఆధారాలు నేరుగా కనిపించవు. కాని వాటినే చారిత్రక ఆధారాలతో, శాస్త్రీయ దృక్పథంతో పరిశీలించినప్పుడు దేవతల ఉనికికి సంబంధించిన ఆనవాళ్లు కనిపిస్తాయి. ఆ అద్భుత శక్తులు మన కంటికి కనిపించకపోయినా ఇక్కడే ఎక్కడో నడయాడుతూనే ఉన్నాయి అనిపిస్తుంది. ‘దేవ రహస్యం’ పుస్తకంలో కోవెల సంతోష్ కుమార్ తన పరిశోధనలతో, ఇతరులు చేసిన పరిశోధనల ఆధారంతో అన్నింటికి మించి జ్ఞానంతో కాకుండా ఇంగితజ్ఞానంతో దేవతల సంభావ్యతనూ, వారి ఆకారాలూ వాహనాలూ నివాసాల వెనక ఉన్న సంకేతాల అర్థాలను, ఇతిహాసాలను రూఢీ పరిచే అనేక ఆసక్తికరమైన అంశాలను సామాన్య పాఠకునికి అర్థమయ్యే భాషలో చెప్పే ప్రయత్నం చేస్తారు. ఉదాహరణకు శివుడి మూడో కన్నుకు మన మెదడులో ఉండే ఒక ప్రత్యేకమైన గ్రంధిని సంకేతంగా చూపుతూ సంతోష్ చేసిన వాదన ఆలోచింప చేస్తుంది.

మహాభారత యుద్ధంలో అణ్వస్త్రాల ప్రయోగం జరిగింది అనీ, ఆ రోజులలో ఆ యుద్ధంలో 36 లక్షల మంది చనిపోయారని ఆయన వివరిస్తారు. రావణుడు పెద్ద ఇంజనీరు అనీ ఆ రోజులలో లంకలో అతడికి నాలుగు విమానాశ్రయాలు ఉన్నాయనీ అందుకు ఆధారంగా నేటికీ ఆ విమానాశ్రయ మైదానాలు కనిపిస్తాయని అంటారాయన. పుష్పక విమానం ఒక మిత్ కాదని నిజంగానే ఆ విమానం ఉండేదని చెప్తారు. విఘ్నేశ్వరుడు వ్యవసాయానికి సంబంధించిన దేవుడని నిరూపించే ఆయన వాదనతో దాదాపుగా ఏకీభవిస్తాం. శివుడి గురించి రాసిన వ్యాసాలు తప్పక పరిశీలించదగ్గవి. దేవతలను వాస్తవిక దృష్టితో పరిశీలిం చాలనుకునేవారు ఈ పుస్తకం చదివితే కొత్త ఆలోచనలు వచ్చే అవకాశం తప్పనిసరిగా ఉంది. సంతోష్  ఈ కృషిని కొనసాగించాలి.
 దేవ రహస్యం- కోవెల సంతోష్ కుమార్
 వెల: రూ.150  ప్రతులకు: 9052116463
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement