'ఉట్టి కొట్టలేనమ్మ.. స్వర్గానికి నిచ్చెనలు వేసింది' అన్న చందంగా, భూమిపై బతకడం చేతకాని మనిషి అంతరిక్షంలో కాలనీలు కట్టి కాపరం చేస్తానంటున్నాడు. ఆ దిశగా ఆధునిక మానవుడు పరిశోధనలు ముమ్మరం చేస్తున్నాడు. కానీ, అది అంత తేలిక కాదు, పైగా మనిషిని మనిషే చంపుకొని తినే దారుణమైన పరిస్థితులు వస్తాయని కొందరు శాస్త్రవేత్తలు భయపడుతున్నారు. కరోనా వంటి ఊహాతీతమైన వ్యాధులు వచ్చి, మనిషిని పట్టి పీడిస్తున్నాయి. భవిష్యత్తులో ఇంకా ఎటువంటి వ్యాధులను ఎదుర్కోవాల్సి వస్తుందోనని మనిషి భయపడుతూనే ఉన్నాడు.
కొత్త కొత్త వైరస్‌లు పుట్టుకొస్తూ వుంటే శాస్త్రవేత్తలు సైతం కంగారుపడిపోతున్నారు. సామాన్య మానవులు బెంబేలెత్తి పోతున్నారు. ఇది ఇలా ఉంటుండగానే, భూమి నుంచి దూరంగా వెళ్ళి, వేరే స్పేస్ లో జీవించవచ్చు అనే విశ్వాసాన్నీ పెంచుకుంటున్నాడు. ఇది కొత్తగా పుట్టిన కోరిక కాదు. ఎప్పటి నుంచో మనిషి ఆలోచిస్తున్నాడు. కరోనా కాలానికి ముందే కొందరు శాస్త్రవేత్తలు అంతరిక్ష జీవనాన్ని ప్రచారంలోకి తెచ్చారు.
సాధ్యాసాధ్యాలపై ఇంకా విస్తృతంగా అధ్యాయనాలు జరుగుతూనే ఉన్నాయి. కొత్త ప్రపంచంలోకి అడుగు పెడదాం, కొత్త లోకాల్లో విహరిద్దాం అని మనిషి ఎప్పటి నుంచో కలలు కంటున్నాడు. భూమిపై ఏదైనా విపత్తు వచ్చినా, పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా వసతులు, వనరులు సరిపోకపోయినా.. పైకెళ్లి జీవించాలనే ఆలోచనలకు శాస్త్రవేత్తలు మరింత పదునుపెడుతున్నారు. అంగారక గ్రహం లేదా చంద్రమండలంపై కాలనీలు నిర్మంచి జీవించవచ్చు అని శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించారు కూడా! భూమి నుంచి ఆహారాన్ని పంపించే పరిస్థితులపైనా దృష్టి సారిస్తున్నారు. ఇవ్వన్నీ సాధించడానికి సుదీర్ఘకాలం వేచి చూడాల్సిందేనని అర్థం చేసుకోవాలి.
ఆ మధ్య ఎడిన్ బర్గ్ యూనివర్సిటీకి చెందిన చార్లెస్ కొకెల్ కొత్త సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు. పాత విషయాలను కొన్నింటిని గుర్తు చేశారు. నిజంగా భూమి నివాసయోగ్యం కానప్పుడు అంతరిక్షం వైపు చూడవచ్చు. కానీ, దానిని సాధించాలంటే ఇంకా ఎన్నో పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని ఆయన చెబుతున్నారు. 19వ శతాబ్దంలో నార్త్ వెస్ట్ పాసేజ్‌ను వెతకాడానికి కెప్టెన్ సర్ జాన్ ఫ్రాంక్లిన్ బయలుదేరారు. సాంకేతిక సమస్య తలెత్తడంతో దారి తప్పారు. అత్యుత్తమ సాంకేతికత అందుబాటులో ఉన్నా, వారంతా ఒకరినొకరు చంపుకుతినే దారుణమైన దుస్థితి వచ్చిందని ప్రొఫెసర్ చార్లెస్ కొకెల్ గుర్తుచేస్తున్నాడు. అంతరిక్షంలో కూడా అటువంటి పరిస్థితులు వస్తాయని హెచ్చరిస్తున్నాడు. వనరులు, వసతులతో పాటు ఆహారకొరత ప్రధాన సమస్యగా నిలుస్తుందని ఆయన భావిస్తున్నాడు.
డాక్టర్ కామెరన్ స్మిత్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. అంతరిక్షంలో మానవ మనుగడ వేళ్లూనుకోవాలంటే? వ్యవసాయ వ్యవస్థను అభివృద్ధి చేయాలని ఎడిన్ బర్గ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు గట్టిగా చెబుతున్నారు. గ్రహాంతర వాసులకోసం వెతుకులాట కూడా ఇప్పటికే మొదలైంది. అంతరిక్షంలోకి వెళ్లబోయే ముందు, ఈ భూమిని పవిత్రంగా, పచ్చగా కాపాడుకోవడం ముఖ్యం. స్వార్థం శృతి మించి, కోరికలు, విలాసాలు ఆకాశాన్ని అంటిన ఆధునిక మానవుడు సహజ వనరులను ధ్వంసం చేసుకుంటూ వెళ్తున్నాడు.
తత్ఫలితంగా అడువులు అంతరించి పోతున్నాయి, జీవనదులు ఇంకిపోతున్నాయి. భూమి క్రుంగిపోతోంది, సముద్ర మట్టాలు పెరిగి పోతున్నాయి. అగ్ని గోళాలు బద్ధలై పోతున్నాయి. ఒక్కటేమిటి? విశ్వరూపమే మారిపోతోంది. ప్రకృతిని అందినకాడికి అంతం చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో రుతువుల గమనం మారిపోయింది. భూమి వేడెక్కిపోతోంది. అతివృష్టి అనావృష్టి, ప్రకృతి వైపరీత్యాలు ప్రబలి పోయాయి. ఆణువణువూ కాలుష్య కాసారంగా మారింది. పీల్చే గాలి, త్రాగే నీరు, తినే ఆహారం అంతా కలుషితమై పోయింది. ఇంటాబయటా అంతా కాలుష్యమే. దీనికి ముందుగా మనిషి మనసే అత్యంత కలుషితమై పోయింది. అందుకే, కొంగ్రొత్త వింత వ్యాధులు పుట్టుకొస్తున్నాయి.
మంచినీరే కాదు, మంచిగాలి కూడా కొనడానికి కూడా దొరకని దుస్థితి వచ్చేసింది. పల్లెల ముఖచిత్రం మారిపోయింది. చేతివృత్తులు ఎగిరిపోయాయి. వ్యవసాయ విధానమే మారిపోయింది. ఆహారరక్షణపై శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. అంతరిక్షానికి ఆహార సరఫరా సంగతి తర్వాత చూద్దాం. ముందుగా, భూమిపై పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా ఆహార ఉత్పత్తి జరగడమే ప్రమాదంలో పడింది. ఆధునిక మానవుడు ఎక్కడ కాలు పెడితే అక్కడ భస్మమై పోతోంది. భూమిని పాడుచెయ్యడమే కాక, గ్రహాలను సైతం పాడు చెయ్యడానికి మనిషి తయారవుతున్నాడని కొందరు శాస్త్రవేత్తలు, మేధావులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ తరుణంలో, కరోనా వంటి ప్రాణాంతకమైన వ్యాధులు ప్రబలకుండా చూడడం శాస్త్రవేత్తల ప్రథమ కర్తవ్యం. ప్రకృతిని, భూభాగాన్ని రక్షించుకోవడం మానవాళి ప్రాథమిక అవసరం. సహజ వనరులను నిలబెట్టు కోవడం అత్యంత ముఖ్యమైన అంశం. వీటన్నిటిపై దృష్టి సారించడమే అందరి తక్షణ కర్తవ్యం. సమాంతరంగా అంతరిక్ష పరిశోధనలు కొనసాగించుకోవచ్చు. అన్నింటి కంటే ముందుగా, మంచి వైపు మనిషి మారితే? అంతా మంచే జరుగుతుందని విశ్వసిద్దాం.
- మాశర్మ
Comments
Please login to add a commentAdd a comment