క్రిస్పర్‌ క్యాస్‌–9తో.. కేన్సర్‌కు చెక్‌ | Check For Cancer With Crisper Case 9 | Sakshi
Sakshi News home page

కేన్సర్‌కు..క్రిస్పర్‌ క్యాస్‌–9 చెక్‌

Published Tue, Nov 24 2020 8:52 AM | Last Updated on Tue, Nov 24 2020 10:38 AM

 Check For Cancer With Crisper Cas–9 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేన్సర్‌పై పోరులో ఇజ్రాయెల్‌ శాస్త్రవేత్తలు మరో ముందడుగు వేశారు. జన్యు ఎడిటింగ్‌ టెక్నాలజీ క్రిస్పర్‌ క్యాస్‌–9 సాయంతో కేన్సర్‌ కణాలను విజయ వంతంగా మట్టుబెట్ట గలిగారు. ఎలుకలపై జరిగిన ప్రయోగాలు విజయవంతమైన నేపథ్యంలో ఇంకో రెండేళ్లలోనే ఈ కొత్త పద్ధతిని మానవ వినియో గానికి సిద్ధం చేస్తామని ఇజ్రాయెల్‌ శాస్త్రవేత్త డాన్‌ పీర్‌ పేర్కొన్నారు. ఇదే జరిగితే కేన్సర్‌ చికిత్సకు ప్రస్తుతం ఉపయోగిస్తున్న కీమోథెరపీ చరిత్ర పుటల్లో కలిసిపోతుందని అంచనా.

దుష్ప్రభావాలు ఉండవు...
మన జన్యువుల్లో అవసరానికి తగ్గట్లు మార్పుచేర్పులు చేసుకొనేందుకు క్రిస్పర్‌ క్యాస్‌–9 ఉపయోగపడుతుంది. ఈ టెక్నాలజీని ఇప్పటికే అరుదైన వ్యాధుల చికిత్స కోసం ప్రయోగాత్మకంగా ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో టెల్‌ అవీవ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్త డాన్‌ పీర్‌ ఈ టెక్నాలజీని కేన్సర్‌ చికిత్సకు ప్రయోగా త్మకంగా వాడి విజయం సాధించారు.

పైగా ఈ టెక్నాలజీ వల్ల ఎలాంటి దుష్ప్రభావాలూ ఉండవని, కేన్సర్‌ కణాలు మాత్రమే మరణించేలా డీఎన్‌ఏలో మార్పులు చేయగలిగామని డాన్‌ పీర్‌ తెలిపారు. ఇంకోలా చెప్పాలంటే ఇదో అందమైన కీమోథెరపీ అని ఆయన అభివర్ణించారు. పరిశోధన వివరాలు సైన్స్‌ అడ్వాన్సెస్‌ జర్నల్‌లో ప్రచురితమ య్యాయి. ఈ పద్ధతిని ఉపయోగించి కేన్సర్‌ కణాలను చంపేస్తే మరోసారి వ్యాధి తిరగబెట్టే అవకాశం ఉండదని డాన్‌ పీర్‌ తెలిపారు. 

ఆయుష్షు పెరుగుతుంది..
క్రిస్పర్‌ క్యాస్‌–9 సాయంతో తాము అభివృద్ధి చేసిన కేన్సర్‌ చికిత్స వల్ల కేన్సర్‌ రోగుల జీవితకాలం మరింత పెరుగుతుందని, మూడుసార్లు ఉపయోగిస్తే చాలు.. ఈ టెక్నాలజీ కేన్సర్‌ కణతిని నాశనం చేయవచ్చని డాన్‌ పీర్‌ చెబుతున్నారు. కేన్సర్‌ కణాల డీఎన్‌ఏను ఈ టెక్నాలజీ ద్వారా కత్తిరించవచ్చని, ఫలితంగా ఆ కణాలు మరణిస్తాయని తెలిపారు. ప్రస్తుతం కేన్సర్‌ చికిత్సకు ఉపయోగించే కీమోథెరపీతో అనేక దుష్ప్రభావాలు ఉంటా యని, క్రిస్పర్‌ క్యాస్‌–9 టెక్నాలజీతో ఆ సమస్య లేదని స్పష్టం చేశారు.

మెదడు, గర్భాశయ కేన్సర్లు ఉన్న వందలాది ఎలుకలపై తాము పరిశోధనలు చేపట్టామని, చికిత్స అందుకున్న ఎలుకల జీవితకాలం.. కంట్రోల్‌ గ్రూపులోని ఎలుకల కంటే రెండు రెట్లు ఎక్కువైందని పీర్‌ వివరించారు. అన్ని రకాల కేన్సర్లకు ఈ టెక్నాలజీని ఉపయోగించేందుకు తాము ప్రయత్నాలు చేస్తున్నామని, అన్నీ సవ్యంగా సాగితే రెండేళ్లలో ఇది మానవ వినియోగానికి అందుబాటులోకి వస్తుందని వివరించారు.

రోగి శరీరం నుంచి సేకరించిన పదార్థం (బయాప్సీ) ఆధారంగా సాధారణ ఇంజెక్షన్‌ ద్వారా చికిత్స కల్పించవచ్చా? లేక కణతిలోకి నేరుగా ఇంజెక్షన్‌ ఇవ్వాలా? అన్నది తెలుస్తుందని వివరించారు. జన్యువుల సూచనలను ప్రొటీన్లుగా మార్చే ఎంఆర్‌ఎన్‌ఏను ఈ టెక్నాలజీలో కత్తెరల మాదిరిగా వాడుకుంటామని, కేన్సర్‌ కణాలను గుర్తించే నానోస్థాయి కొవ్వు పదార్థాలను కూడా కలిపి ఇంజెక్షన్‌ ఇస్తామని చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement