
మళ్లీ భూమి కుంగింది
వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె మండలం గూడవాండ్లపల్లెలో శనివారం మధ్యాహ్నం రైతు శ్రీనివాసులురెడ్డికి చెందిన పొలంలో దాదాపు పది అడుగుల వెడల్పు, ఏడు అడుగుల లోతుతో ఉన్నట్లుండి భూమి ఒక్కసారిగా కుంగిపోయింది.
చింతకొమ్మదిన్నె:
వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె మండలం గూడవాండ్లపల్లెలో శనివారం మధ్యాహ్నం రైతు శ్రీనివాసులురెడ్డికి చెందిన పొలంలో దాదాపు పది అడుగుల వెడల్పు, ఏడు అడుగుల లోతుతో ఉన్నట్లుండి భూమి ఒక్కసారిగా కుంగిపోయింది. మామిడి మొక్కలను పరిశీలించేందుకు వెళ్లిన రైతుకు శబ్దం వినిపించడంతో ఆ ప్రాంతాన్ని పరిశీలించగా, అప్పటికే గుంతపడినట్లు చెబుతున్నారు. గతంలో ఈ రైతుకు సంబంధించిన పసుపు పంటల్లో దాదాపు 20 అడుగుల లోతు, 10 అడుగుల వెడల్పుతో రెండు భారీ గుంతలు ఏర్పడ్డాయి. నాయనోరిపల్లె, బుగ్గమల్లేశ్వరస్వామి,పెద్ద ముసల్‌రెడ్డిపల్లె గ్రామాల్లో గతంలో భారీవర్షం కురిసినప్పుడే ఇలాంటి ఘటనలు చోటుచేసుకోగా ప్రస్తుతం రెండు రోజుల నుంచి మండలంలో భారీ స్థాయిలో వర్షపాతం నమోదు కావడంతో మళ్లీ గుంతలు పడుతున్నాయి. గతంలో కేంద్ర, రాష్ట్ర శాస్త్రవేత్తల బృందం భూమి కుంగిన ప్రాంతాలను పరిశీలించి వాటి కొలతలను, మట్టిని సేకరించి పరీక్షల నిమిత్తం తీసుకెళ్లారు. ఇప్పటివరకు ఎలాంటి నివేదికను అందించకపోగా ప్రస్తుతం తిరిగి గుంతలు పడుతుండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
ఒక్కసారిగా శబ్దం వచ్చింది
శనివారం మధ్యాహ్నం మామిడి మొక్కలను పరిశీలించేందుకు పొలం వద్దకు వెళ్లాను. పొలంలో అటు ఇటు తిరుగుతుండగా ఒక్కసారిగా శబ్దం వచ్చింది. అక్కడికి వెళ్లి చూస్తే పెద్దపాటి గుంత ఏర్పడడంతో భయాందోళనకు గురయ్యాను. గతంలో పసుపు పంటలో ఇలాంటి గుంతలు భారీ తరహాలో ఏర్పడ్డాయి. ఎప్పుడు ఎక్కడ భూమి కుంగుతుందో అర్థం గాక పొలాల వద్దకు రావాలంటే భయమేస్తోంది.
– శ్రీనివాసులురెడ్డి, రైతు, గూడావాండ్లపల్లె