చేయిచేయి కలిపితే అసాధ్యమేమీ లేదు
శాస్త్ర పరిశోధనలను వ్యాపారస్థాయికి అభివృద్ధి చేయడమే ‘రిచ్’ లక్ష్యం
⇒ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్
⇒ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ ప్రారంభం
⇒ ప్రభుత్వ రంగ పరిశోధనా సంస్థలు లాభాలపై దృష్టి పెట్టాలి: సుజనా
⇒ ఇది వినూత్న ప్రయత్నం: ప్రఖ్యాత శాస్త్రవేత్త మషేల్కర్
సాక్షి, హైదరాబాద్: టీ–హబ్‌తో సృజనాత్మక తను, టీ–ఐపాస్‌తో ప్రభుత్వ విధాన నిర్ణయాల అమలును సులభతరం చేసిన తెలంగాణ ప్రభుత్వం శాస్త్ర, సాంకేతిక రంగాల పరిశోధనల ఫలితాలను సామాన్యుల చెంతకు చేర్చేలా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌లోని అన్ని పరిశోధన శాలలు, అత్యున్నత విద్యాసంస్థలు, పారిశ్రా మికవేత్తలు, పెట్టుబడిదారులను ఒక దగ్గరకు చేరు స్తూ.. రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్(రిచ్)ను ఏర్పాటు చేసింది. శాస్త్ర పరిశోధనలకు విలువలు జోడించడం, వాటిని ఉత్పత్తులు, సేవలుగా మార్చడంలో ఎదు రవుతున్న ఇబ్బందులను పరిష్కరించడం తోపాటు వ్యాపారస్థాయికి అభివృద్ధి చేయడం రిచ్ ప్రధాన లక్ష్యాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు.
రిచ్ సంస్థ ప్రారంభం సందర్భంగా శుక్రవారం ఇక్కడి ఐఐసీటీలో జరిగిన సమా వేశంలో మంత్రి మాట్లాడుతూ.. దేశంలో మేథోసంపత్తికి కొరత లేదని, అయితే ఎవరికి వారు తమదైన పంథాలో ఒంటరిగా పనిచేయడం వల్ల దేశం అగ్రస్థానానికి ఎదగలేకపోతోందని, ఈ కొరతను తీర్చే లక్ష్యంతోనే తెలంగాణ ప్రభుత్వం రిచ్‌ను ఏర్పాటు చేసిందని, చేయిచేయి కలిపితే అసాధ్యమేమీ లేదని అన్నారు. ఐఐసీటీ, సీసీఎంబీ, ఇక్రిశాట్, ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టి ట్యూట్‌తోపాటు మేథోహక్కుల పరిరక్షణ కోసం నల్సార్, వ్యాపార అవకాశాల విస్తరణ కోసం ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ రిచ్‌తో కలసి పనిచేస్తాయని వివరించారు.
అత్యధిక యువశక్తి కలిగిన భారత్ ఆలోచించడం మొదలుపెడితే ఊహించని అద్భుతాలు ఆవిష్కృతమవుతాయన్నారు. భాగ్యనగరంలో అందుబాటులో ఉన్న వృత్తినైపుణ్యాలు, మౌలిక సదుపాయాలు, ఫార్మా, రక్షణ రంగ పరిశ్రమల విస్తృతులను అనుకూలంగా మార్చుకుని అభివృద్ధిలో మరింత ఉన్నత స్థాయికి ఎదిగేందుకు రిచ్ ఉపయో గపడుతుందని చెప్పారు. రక్షణ రంగంలో పనిచేస్తున్న చిన్న, మధ్యతరహా పరిశ్రమలు హైదరాబాద్‌లోనే దాదాపు వెయ్యి వరకూ ఉన్నాయని, వీటన్నింటి ద్వారా నగరానికి సమీప భవిష్యత్తులో రూ.30 వేల కోట్ల వ్యా పారం రానుందని అన్నారు. కేంద్రం అందించే నిధులతో పరిశోధనలు చేస్తున్న ప్రభుత్వ రంగ పరిశోధనా సంస్థలు లాభాలపై దృష్టి పెట్టాలని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి వై.సుజనాచౌదరి పేర్కొన్నారు.
‘రిచ్’ ఏర్పాటు చారిత్రాత్మకం..
‘రిచ్’ ఏర్పాటు చారిత్రాత్మకమైన విషయమని, పారిశ్రామిక, పరిశోధన, వ్యా పార సంస్థలు కలసికట్టుగా చేపట్టే కార్యక్రమం ప్రపంచంలో మరోటి లేదంటే అతిశయోక్తి కాదని సీఎస్‌ఐ ఆర్ మాజీ డైరెక్టర్ జనరల్, ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆర్‌ఏ మషేల్కర్ అన్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటవుతున్న రిచ్ ద్వారా ప్రపంచస్థాయి ఉత్పత్తులను డిజైన్ చేయడం తోపాటు వాటిని ఇక్కడే తయారు చేయడం ద్వారా ఉపాధి కల్పనకు అవకాశం లభిస్తుందన్నారు. రిచ్ సంస్థలో రూ.50 కోట్లతో రీసెర్చ్ టు మార్కెట్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లు ఐటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు.
సంస్థ డైరెక్టర్ జనరల్‌గా నియమితులైన ఐఎస్‌బీ మాజీ ఉపకులపతి అజిత్ రంగ్నేకర్ మాట్లా డుతూ.. సీఎస్‌ఐ ఆర్, డీఆర్‌డీవో సంస్థలతో పాటు అనేక సంస్థలను భాగస్వాములను చేస్తామని, ఒకట్రెండు ఏళ్లలో మరిన్ని ఆవిష్కరణలు చేయడం తోపాటు వాటిని వాణిజ్య స్థాయికి చేరు స్తామన్నారు. రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి, ఐఐసీటీ డైరెక్టర్ శ్రీవారి చంద్రశేఖర్, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పాపారావు, రెడ్డీస్ ల్యాబ్స్, శాంతా బయోటెక్ అధిపతులు తదితరులు పాల్గొన్నారు.