యూఏఈ మంత్రి షేక్ అబ్దుల్లాతో కరచాలనం చేస్తున్న మంత్రి కేటీఆర్
హైదరాబాద్: నగరంలోని టీ హబ్ పనితీరు బేషుగ్గా ఉందని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) విదేశీ వ్యవహారాలు, అంతర్జాతీయ సహకార శాఖ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ అన్నారు. దేశంలోనే అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్‌గా పేరుగాంచిన గచ్చిబౌలిలోని టీహబ్‌ను ఆయన శుక్రవారం సందర్శించారు. టీ హబ్ వద్ద రాష్ట్ర ఐటీ మంత్రి కె తారకరామారావు, ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్ యూఏఈ మంత్రికి ఘనస్వాగతం పలికారు. అనంతరం టీ హబ్‌లో అన్నిప్రధాన ప్రాంతాలను, స్టార్టప్‌లను, సమావేశ గదిని, నిర్మాణాన్ని షేక్ అబ్దుల్లా పరిశీలించారు.
తెలంగాణ ప్రభుత్వంతో కలసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. వ్యాపార అవకాశాలను మరింత మెరుగుపర్చేందుకు యూఏఈని సందర్శించాలని కోరగా కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. యూఏఈ మద్దతుతో మార్కెటును దృష్టిలో ఉంచుకొని ఉత్పత్తులు, సమస్యల పరిష్కారం దిశగా స్టార్టప్‌ల రూపకల్పనకు చొరవ చూపేందుకు ఇద్దరు మంత్రులు అంగీకరించారు. సహజసిద్ధ వనరులు, నీరు వంటి అంశాలపై సంయుక్తంగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని, తెలంగాణ ఇండస్ట్రియల్ పాలసీ గురించి ఆయనకు కేటీఆర్ వివరించారు. దేశంలోనే అతిపెద్ద స్టార్టప్‌గా టీ హబ్‌ను రూపొందించామని, ఇంతకన్నా మరింత పెద్దగా టీ హబ్–2 తుది మెరుగులు దిద్దుకుంటోందన్నారు.
ఆగస్టులో బ్లాక్ చైన్ కాంగ్రెస్
బ్లాక్‌చైన్ టెక్నాలజీపై పూర్తిస్థాయి దృష్టి పెడుతున్నామని, ఇది సమస్యల పరిష్కారంలో ఎంతో ఉపయుక్తంగా ఉందని యూఏఈ మంత్రి పేర్కొన్నారు. ఆగస్టు మొదటివారంలో హైదరాబాద్‌లో అంతర్జాతీ య స్థాయి బ్లాక్‌చైన్ కాంగ్రెస్ సదస్సు నిర్వహిస్తున్నామని, ఇందులో పాల్గొనాలని యూఏఈ మంత్రిని కేటీఆర్ ఆహ్వానించారు.
యూఎస్‌పీ శిక్షణ కేంద్రం
భారతదేశంలో నాణ్యమైన ఔషధాలు తయారీ లక్ష్యంగా ఫార్మారంగంలోని వారికి, ఇతర గ్రాడ్యుయేట్లకు మార్గదర్శిగా నిలిచే ప్రతిష్టాత్మక యూఎస్‌పీ శిక్షణ సంస్థ హైదరాబాద్‌లో శుక్రవారం కొత్తగా ప్రారంభమైంది. ఒక మిలియన్ డాలర్ల ఖర్చుతో ఈ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వంతో ప్రతిష్టాత్మక యూఎస్‌పీ శిక్షణ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ సమక్షంలో ఐటీ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, యూఎస్‌పీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కె.వి.సురేంద్రనాథ్ ఒప్పందంపై సంతకాలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment