ప్రయోగాలపై పట్టింపేదీ..?  | Government Should Look After Inspire Manak Programme In Telangana | Sakshi
Sakshi News home page

ప్రయోగాలపై పట్టింపేదీ..? 

Published Mon, Jul 8 2019 9:45 AM | Last Updated on Mon, Jul 8 2019 9:45 AM

Government Should Look After Inspire Manak Programme In Telangana - Sakshi

దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించని చందంగా ఉంది జిల్లాలో ఇన్‌స్పైర్‌ మానక్‌ పరిస్థితి. బాలశాస్త్ర వేత్తలను తయారు చేసేలా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంపై హెచ్‌ఎంలు, సైన్స్‌ ఉపాధ్యాయులు దృష్టి పెట్టడంలేదు. ప్రాజెక్టుల తయారీకి ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తున్నా.. జిల్లాలోని 841 పాఠశాలలకుగాను.. ఇప్పటివరకు మూడు పాఠశాలలే దరఖాస్తు చేశాయంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికారుల పర్యవేక్షణ లోపం, ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు నష్టపోతున్నారు.
‘ఇన్‌స్పైర్‌ మానక్‌’కు స్పందన కరువు

సాక్షి, నల్లగొండ: పాఠశాల స్థాయిలోనే విద్యార్థుల్లో దాగిఉన్న సృజనాత్మకతను వెలికితీసి శాస్త్ర సాంకేతిక రంగాల వైపు మళ్లించేందుకు ఏటా కేంద్ర ప్రభుత్వం ఇన్‌స్పైర్‌ మానక్‌ (మిలియన్‌ మైండ్స్‌ ఆన్‌ మెంటింగ్‌ నేషనల్‌ అసిరెన్స్‌ నాలెడ్జ్‌) కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో నూతన ఒరవడిని సృష్టించేందుకు విద్యార్థులను పాఠశాలస్థాయి నుంచే ప్రయోగాల బాట పట్టించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది.

ఉపాధ్యాయుల నిర్లక్ష్యం, అధికారులు దృష్టి సారించని కారణంగా ఇన్‌స్పైర్‌ మానక్‌ కార్యక్రమానికి జిల్లాలోని పాఠశాలల నుంచి స్పందన కరువైంది. జిల్లా వ్యాప్తంగా ప్రాథమికోన్నత, ఉన్నత, గురుకుల, కస్తూరిబా, ప్రైవేట్‌ పాఠశాలల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని ఫిబ్రవరిలో కేంద్రశాస్త్ర సాంకేతిక మండలి ఆదేశాలు జారీ చేసింది. కానీ జిల్లాలోని రెండు మూడు పాఠశాలలు మినహా దరఖాస్తులు అందలేదు. అంటే ఉపాధ్యాయులు, అధికారులు ఇన్‌స్పైర్‌ మానక్‌పై ఎంత దృష్టి పెట్టారనేది స్పష్టమవుతోంది. 

బాలశాస్త్రవేత్తలను తయారు చేసేలా..
బాలలను చిన్నప్పటి నుంచే శాస్త్ర సాంకేతిక రంగంవైపు మళ్లించాలన్న ఉద్దేశంతో కేంద్రంలోని శాస్త్ర సాంకేతిక మండలి ఏటా ఇన్‌స్పైర్‌ మానక్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా పాఠశాలల నుంచి సైన్స్‌ ప్రాజెక్టుల తయారీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల్ని ఆహ్వానిస్తుంది. ప్రాథమికోన్నత పాఠశాలల నుంచి 3 ప్రాజెక్టులు, ఉన్నత పాఠశాలల నుంచి 5 ప్రాజెక్టుల చొప్పున తయారు చేసేందుకు అవకాశం ఉంది. ఏఏ ప్రాజెక్టులు తయారు చేస్తారు అనే దానిపై ఆన్‌లైన్‌లో ఆయా పాఠశాలలకు చెందిన విద్యార్థులతో ఆయా పాఠశాలల హెచ్‌ఎం, సైన్స్‌ ఉపాధ్యాయుడు కలిసి ప్రాజెక్టులను తయారు చేస్తామని దరఖాస్తు చేయాల్సి ఉంది. ఇందులో జిల్లాలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలతో పాటు గురుకుల, కస్తూరిబా, మోడల్‌ స్కూళ్లు, ప్రయివేట్, ఎయిడెట్‌ పాఠశాలలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఫిబ్రవరిలో దరఖాస్తులకు ఆహ్వానం..
ఇన్‌స్పైర్‌ మానక్‌ కార్యక్రమంలో భాగంగా సైన్స్‌ ప్రాజెక్టుల తయారీకి ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూలై 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక మండలి సూచించింది. కాగా జిల్లాలోని 841 పాఠశాలలు ఉండగా అందులో కేవలం రెండు మూడు పాఠశాలలు మాత్రమే ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్నాయి. దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 31 చివరి తేదీ. ఇటు అధ్యాపకులగానీ, అటు విద్యాశాఖ ఉన్నతాధికారులుగానీ ఇన్‌స్పైర్‌ మానక్‌పై దృష్టి సారించని కారణంగా విద్యార్థులు నష్టపోయే పరిస్థితి నెలకొంది. 

ప్రభుత్వం డబ్బులు ఇచ్చినా నిర్లక్ష్యం
ఇన్‌స్పైర్‌ మానక్‌ కార్యక్రమంలో భాగంగా ప్రాజెక్టుల తయారీకి ఒక్కో ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నేరుగా ఆయా విద్యార్థుల అకౌంట్లలోనే రూ.10వేలను జమ చేస్తుంది. అందులో రూ.5వేలు ప్రాజెక్టును తయారు చేసేందుకు ఖర్చు చేయాల్సి ఉండగా, మిగిలిన రూ.5వేలు ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇన్‌స్పైర్‌ కార్యక్రమానికి వెళ్లేందుకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇందులో ఎవరిపైనా రూపాయి భారం పడని పరిస్థితి. ప్రభుత్వం నిధులు ఇచ్చినా ప్రభుత్వ ఉపాధ్యాయులు, అధికారుల నుంచి స్పందన కరువవుతోంది. 

నష్టపోనున్న విద్యార్థులు..
బాల శాస్త్రవేత్తలను తయారు చేసేందుకు ప్రభుత్వం రూ.కోట్లను ఖర్చు చేస్తోంది. ఉపాధ్యాయులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా కేంద్ర ప్రభుత్వ లక్ష్యం నీరుగారడంతోపాటు విద్యార్థులు కూడా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాక ఒకవేళ ఆయా పాఠశాల విద్యార్థులు పంపిన ప్రాజెక్టు రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రదర్శనలో ఎంపికైతే ఒక్కో ప్రాజెక్టుకు రూ.20వేల పైచిలుకే డబ్బులను కూడా కేంద్రమే చెల్లిస్తుంది. దానికితోడు రాష్ట్రపతిని కలిసే అవకాశం కలవడంతో పాటు జాతీయ స్థాయిలో శాస్త్రజ్ఞుల సలహాలను కూడా పొందే అవకాశం ఈ ప్రాజెక్టుల తయారీ ద్వారా లభించనుంది. ఇన్ని అవకాశాలను అధ్యాపకుల, అధికారుల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

ఇప్పటికైనా స్పందిస్తే మేలు..
విద్యాశాఖ అధికారులు, ఆయా పాఠశాలల అధికారులు, సైన్స్‌ ఉపాధ్యాయులు స్పందించి విద్యార్థుల ప్రయోగాల తయారీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓ పక్క దేశం అన్ని శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందుకు పోతుంటే జిల్లా నుంచి బాల శాస్త్రవేత్తలను తయారు చేసేందుకు విద్యాశాఖ తనవంతు పాత్రగా జిల్లా నుంచి సైన్స్‌ ప్రయోగాల తయారీకి పూనుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని దరఖాస్తుల కార్యక్రమాన్ని ముమ్మరం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

విద్యార్థులకు ఎంతో ఉపయోగం
ఇన్‌స్పైర్‌ మానక్‌ కార్యక్రమం విద్యార్థులకు ఎంతో మేలు. చిన్నప్పటి నుంచే సైన్స్‌ ప్రయోగాలు చేయడం వల్ల వారు బాలశాస్త్రవేత్తలు అయ్యే అవకాశం ఉంటుంది. కేంద్రంలోని శాస్త్ర సాంకేతిక మండలి ఏటా ఇన్‌స్పైర్‌ మానక్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రాజెక్టుల తయారీకి సంబంధించిన వివరాలను దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 31 చివరి తేదీ. ఇప్పటి వరకు కొన్ని పాఠశాలలు మాత్రమే దరఖాస్తు చేసుకున్న మాట వాస్తవమే. ఇంకా పాఠశాలలు ముందుకు వస్తే విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. 
– లక్ష్మీపతి, జిల్లా సైన్స్‌ అధికారి, నల్లగొండ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement