కరెంట్ అఫైర్స | Current affairs | Sakshi
Sakshi News home page

కరెంట్ అఫైర్స

Published Wed, Sep 30 2015 11:50 PM | Last Updated on Sun, Sep 3 2017 10:15 AM

కరెంట్ అఫైర్స

కరెంట్ అఫైర్స

సైన్స్ అండ్ టెక్నాలజీ
 పీఎస్‌ఎల్‌వీ సీ-30 ప్రయోగం విజయవంతం ఖగోళ పరిశోధన కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్‌ఎల్‌వీ) సీ-30 ప్రయోగం విజయవంతమైంది. ఈ ఉపగ్రహ వాహక నౌక ద్వారా ఇస్రో 1,513 కిలోల బరువు గల ఆస్ట్రోశాట్‌ను సెప్టెంబరు 28న శ్రీహరికోటలోని షార్ నుంచి ప్రయోగించింది. ఆస్ట్రోశాట్‌తో పాటు మరో ఆరు విదేశీ ఉపగ్రహాలను భూమికి 650 కిలోమీటర్ల ఎత్తులోని సూర్యానువర్తన కక్ష్యలో ప్రవేశపెట్టింది. వీటిలో ఇండోనేషియాకు చెందిన లపాన్-2 (76 కిలోలు), కెనడాకు చెందిన యాక్సెట్ యా (14 కిలోలు), యూఎస్‌కు చెందిన లెమర్-2, 3, 4, 5 (28 కిలోలు) ఉన్నాయి. భారత్ తొలిసారి ఖగోళ పరిశోధన కోసం ఉపగ్రహాన్ని ప్రయోగించింది.
 
 శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డులు
 కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ 2015 సంవత్సరానికి ప్రతిష్టాత్మక శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డుకు 11 మంది శాస్త్రవేత్తలను ఎంపిక చేసింది. జీవశాస్త్రంలో బాలసుబ్రమణియన్ గోపాల్ (ఐఐఎస్సీ- బెంగళూరు), రాజీవ్ కుమార్ వర్షణే (ఇక్రిశాట్), భూ, వాతావరణ, సాగర, గ్రహ విజ్ఞాన శాస్త్రం: జ్యోతిరంజన్ శ్రీ చందర్ రే (ఫిజికల్ సైన్స్ లేబరేటరీ- అహ్మదాబాద్), ఇంజనీరింగ్ సెన్సైస్: యోగేష్ జోషి (ఐఐటీ- కాన్పూర్), గణిత శాస్త్రం: రితబ్రత మున్షీ (టీఐఎఫ్‌ఆర్- ముంబై), కె.సందీప్ (టీఐఎఫ్‌ఆర్- బెంగళూరు), భౌతిక శాస్త్రం: బేదంగదాస్ మొహంతీ (ఎన్‌ఐఎస్‌ఈఆర్- భువనేశ్వర్), మందర్ దేశ్‌ముఖ్ (టీఐఎఫ్‌ఆర్- ముంబై), వైద్యశాస్త్రం: విదితా వైద్య (టీఐఎఫ్‌ఆర్-ముంబై), రసాయన శాస్త్రం: డి.శ్రీనివాసరెడ్డి (సీఐఎస్‌ఆర్-పూణె), ప్రద్యుత్ ఘోష్ (ఐఎసీఎస్- జాదవ్‌పూర్).
 
 జాతీయం
  రాజస్థాన్‌లో 68 శాతానికి రిజర్వేషన్లు రాజస్థాన్ శాసనసభ సెప్టెంబరు 22న ఆమోదించిన రెండు బిల్లులతో ఆ రాష్ట్రంలో రిజర్వేషన్లు 68 శాతానికి చేరాయి. ఇందులో ఒకటి స్పెషల్ బ్యాక్‌వర్డ్ క్లాస్(ఎస్‌బీసీ)లో గుజ్జర్లకు 5 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లు కాగా మరొకటి ఆర్థికంగా వెనుకబడిన తరగతుల(ఈబీసీ)లకు 14 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లు. ఈ రెండు బిల్లులను రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాల్సిందిగా కేంద్రాన్ని కోరుతూ రాజస్థాన్ శాసనసభ తీర్మానాన్ని ఆమోదించింది.
 
 భారతీయ సంపన్నుల్లో ముకేశ్ అంబానీకి మొదటి స్థానం
 సెప్టెంబర్ 24న ఫోర్బ్స్ మేగజీన్ ప్రకటించిన జాబితాలో ముకేశ్ అంబానీ వరుసగా తొమ్మిదోసారి మొదటి స్థానంలో నిలిచారు. 100 మంది భారతదేశంలోని అత్యంత సంపన్నుల జాబితాను ఫోర్‌‌బ్స మేగజీన్ రూపొందించింది. ముకేశ్ 18.9 బిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో నిలువగా, సన్ ఫార్మా అధినేత దిలీప్ సింఘ్వీ 18 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో, విప్రో అధినేత అజీం ప్రేమ్‌జీ 15.9 డాలర్లతో మూడో స్థానాన్ని దక్కించుకున్నారు.
 
 అంతర్జాతీయం
 ఐరాస సుస్థిర అభివృద్ధి సభ ఐక్యరాజ్యసమితి (ఐరాస) సుస్థిర అభివృద్ధి సభ సెప్టెంబరు 25 నుంచి మూడు రోజుల పాటు జరిగింది. ఈ సదస్సులో వివిధ దేశాల ప్రధానులు, అధ్యక్షులు, ప్రపంచ బ్యాంకు, ద్రవ్యనిధి సంస్థల అధిపతలు పాల్గొన్నారు. ఈ సదస్సులో ప్రసంగించిన పోప్ ఫ్రాన్సిస్ కొత్త అభివృద్ధి లక్ష్యాలను స్వాగతించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ సంపన్న దేశాలు టెక్నాలజీని ఇతర దేశాలకు అందజేయాలన్నారు. ఐరాసలో సంస్కరణలు అమలు చేస్తేనే దాని విశ్వసనీయత కొనసాగుతుందని పునరుద్ఘాటించారు. పేదరికాన్ని రూపుమాపేందుకు ఉద్దేశించిన ప్రత్యేక అభివృద్ధి అజెండాను ఐరాస జనరల్ అసెంబ్లీ సెప్టెంబరు 15న ఆమోదించింది. పేదరిక నిర్మూలన, ఆరోగ్యకర జీవనం, విద్యను ప్రోత్సహించడం, వాతావరణ మార్పులను అరికట్టడం వంటి 17 లక్ష్యాలను ఇందులో నిర్దేశించారు. వీటి సాధనకై ఏడాదికి 3.5 నుంచి 5 ట్రిలియన్ డాలర్ల వరకు వెచ్చించనున్నారు.
 
 ఐరాస సంస్కరణలకు పిలుపునిచ్చిన
 జీ-4 దేశాలు భారత ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో బ్రెజిల్, జర్మనీ, జపాన్, భారత్ దేశాలతో కూడిన జీ-4 సదస్సు సెప్టెంబరు 26న న్యూయార్క్‌లో జరిగింది. ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వానికి జీ-4 దేశాలకు అన్ని అర్హతలు ఉన్నాయని ఈ సందర్భంగా జీ-4 దేశాలు ప్రకటించాయి. నిర్దేశిత కాలవ్యవధిలో భద్రతామండలిని సంస్కరించాలని డిమాండ్ చేశాయి. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు, ప్రధాన ఆర్థిక వ్యవస్థలు, ఖండాలకు ప్రాతినిధ్యం కల్పించినప్పుడే భద్రతా మండలి విశ్వసనీయత, న్యాయబద్ధత కలిగి ఉంటుందని స్పష్టం చేశాయి. దశాబ్దం తర్వాత జరిగిన ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని షింజో అబే, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కల్, బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్‌లు పాల్గొన్నారు.
 
 హజ్ యాత్ర తొక్కిసలాటలో
 వెయ్యి మందికి పైగా మృతి సౌదీ అరేబియాలోని మినా వద్ద సెప్టెంబరు 24న జరిగిన తొక్కిసలాటలో వెయ్యి మందికి పైగా హజ్ యాత్రికులు మరణించారు.ఇందులో 35 మంది భారతీయులు ఉన్నారని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సెప్టెంబరు 28న తెలిపారు. మృతుల్లో ఎక్కువ మంది ఆఫ్రికా, అరబ్ దేశాలకు చెందిన వారు ఉన్నారు. మినాలో జమారత్ వద్ద సైతానును రాళ్లతో కొట్టేందుకు యాత్రికులు భారీగా రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది.
 
 రాష్ట్రీయం
 ఛత్తీస్‌గఢ్-తెలంగాణల మధ్య
 విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఛత్తీస్‌గఢ్ నుంచి 1000 మోగావాట్ల విద్యుత్ కొనుగోలుకు తెలంగాణ ప్రభుత్వం ఆ రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సమక్షంలో సెప్టెంబరు 22న ఈ మేరకు ఇరు రాష్ట్రాల అధికారులు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. 2014, నవంబరులో ఇరు రాష్ట్రాల మధ్య కుదిరిన 2000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో భాగంగానే తాజా ఒప్పందం జరిగింది. వచ్చే 12 ఏళ్ల పాటు ఈ ఒప్పందం అమల్లో ఉంటుంది.
 
 తెలంగాణకు మరో మూడు
 ఎంఎల్‌సీ స్థానాలు తెలంగాణకు మూడు ఎంఎల్‌సీ స్థానాలు కేటాయిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సెప్టెంబరు 22న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ స్థానాలను స్థానిక సంస్థల కోటా కింద రంగారెడ్డి, మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాలకు ఒక్కొక్కటి కేటాయించారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో 11 స్థానిక సంస్థల నియోజక వర్గాలు ఉన్నాయి. తాజాగా మరో మూడు స్థానాలు చేరడంతో ఆ సంఖ్య 14 కు చేరుకుంది.
 
 ఏపీ విద్యుత్ ప్రాజెక్టులకు
 రూ.9,000 కోట్ల ఆర్‌ఈసీ రుణం ఆంధ్ర ప్రదేశ్‌లో నిర్మించే విద్యుత్ ప్రాజెక్టుల కోసం రూ.9,000 కోట్లు రుణం ఇచ్చేందుకు గ్రామీణ విద్యుతీకరణ సంస్థ(ఆర్‌ఈసీ) అంగీకరించింది. ఈ మేరకు సెప్టెంబరు 15న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఏపీ జెన్కో, ప్రభుత్వ రంగ
 
 సంస్థ ఆర్‌ఈసీల మధ్య సంతకాలు జరిగాయి. ఈ మొత్తంలో రూ.3,000 కోట్లతో అనంతపురం జిల్లాలో 500 మెగావాట్ల సౌరవిద్యుత్ ప్రాజెక్టును నెలకొల్పుతారు. మిగిలిన మొత్తాన్ని సరఫరా, పంపిణీ నెట్‌వర్క్‌ల కోసం వినియోగించనున్నారు.
 
 ఆంధ్రప్రదేశ్‌కు రూ.1000 కోట్ల
 కేంద్ర సహాయం సెప్టెంబరు 25న ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.1000 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ఆంధ్ర, రాయలసీమల్లోని ఏడు వెనకబడిన జిల్లాలకు ఒక్కో జిల్లాకు రూ.50 కోట్లు చొప్పున మొత్తం రూ.350 కోట్లు, రాజధాని నిర్మాణానికి రూ.350 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు రూ. 300 కోట్లు చొప్పున ఈ మొత్తాన్ని కేటాయించింది.
 
 కాకినాడ ఎల్‌ఎన్‌జీ టెర్మినల్‌కు ఒప్పందం
 రాష్ట్రంలో గ్యాస్ గ్రిడ్ అభివృద్ధిలో భాగంగా ఏపీ ప్రభుత్వం కాకినాడ ఎల్‌ఎన్‌జీ టెర్మినల్‌కు సంబంధించి ఒప్పందం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎపీజీడీసీ), గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్), షెల్, ఇంజీ సంస్థలు ఈ మేరకు రెండు అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు సమక్షంలో సెప్టెంబరు 25న విజయవాడలో దీనికి సంబంధించిన సంతకాలు జరిగాయి. ఈ ఒప్పందంలో భాగంగా రూ.1,800 కోట్ల వ్యయంతో కాకినాడ డీప్ వాటర్ పోర్టులో ఎల్‌ఎన్‌జీ ఫ్లోటింగ్ స్టోరేజీ, రీ గ్యాసిఫికేషన్ యూనిట్‌ను నెలకొల్పుతారు.
 
 క్రీడలు
  సానియా- హింగిస్‌లకు
 గ్వాంగ్‌జౌ ఓపెన్ టైటిల్ గ్వాంగ్‌జౌ ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్‌ను సానియా మిర్జా (భారత్), మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడీ గెలుచుకుంది. చైనాలోని గ్వాంగ్‌జౌలో సెప్టెంబరు 26న జరిగిన ఫైనల్స్‌లో జు షిలిన్- యు జియోడి (చైనా) జోడీని ఓడించి వీరిద్దరు టైటిల్‌ను గెలుచుకున్నారు. 2015 సీజన్‌లో సానియాకు ఇది ఏడో టైటిల్ కాగా హింగిస్‌కు ఆరో టైటిల్. మహిళల సింగిల్స్ టైటిల్‌ను జెలెనా జంకోవిచ్ (సెర్బియా) గెలుచుకుంది.
 
 క్యాబ్ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ
 బెంగాల్ క్రికెట్ అసోసియేషన్(క్యాబ్) అధ్యక్షుడిగా టీం ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ నియమితులయ్యారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సెప్టెంబరు 24న ఈ మేరకు ప్రకటన చేశారు. క్యాబ్ అధ్యక్షుడిగా ఉన్న జగ్మోహన్ దాల్మియా మరణంతో క్యాబ్ పగ్గాలను గంగూలీ చేపట్టారు. 2016లో క్యాబ్ ఎన్నికలు జరిగే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.
 
 పంకజ్ అద్వానీకి ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్ షిప్
 ఐబీఎస్‌ఎఫ్ ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్ షిప్ టైటిల్‌ను పంకజ్ అద్వానీ (భారత్) గెలుచుకున్నాడు. ఆడిలైడ్ (ఆస్ట్రేలియా)లో సెప్టెంబరు 27న జరిగిన ఫైనల్లో పీటర్ గిల్‌క్రిస్ట్ (సింగపూర్) ను పంకజ్ ఓడించాడు. ఇది పంకజ్‌కి 14వ టైటిల్.
 
 హామిల్టన్‌కు జపాన్ గ్రాండ్ ప్రీ టైటిల్
 ఫార్ములా వన్ జపాన్ గ్రాండ్ ప్రీ టైటిల్‌ను మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ గెలుచుకున్నాడు. సెప్టెంబరు 27న జరిగిన రేసులో హామిల్టన్ మొదటి స్థానంలో నిలువగా నికో రోస్‌బర్గ్ రెండో స్థానం, వెటల్ మూడో స్థానంలో నిలిచారు.
 
 సంక్షిప్తంగా
 తెలంగాణ ప్రభుత్వం గ్రామ పంచాయతీలను ఈ-పంచాయతీలుగా తీర్చిదిద్దనుంది. ఈ మేరకు అక్టోబర్ 2న మొదట దశలో 104 పంచాయతీల్లో ఈ-సేవలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, పింఛనర్ల కోసం ప్రవేశపెట్టిన ఉచిత వైద్య సేవల పథకం అక్టోబరు 2వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ పథకాన్ని జర్నలిస్టులకు కూడా అమలు చేయననున్నారు.స్వచ్ఛభారత్ నిధుల సమీకరణ కోసం టెలికాం సేవలు, పెట్రోలు, బొగ్గు, ఇనుప ఖనిజం వంటి వాటిపై సుంకం (సెస్సు) విధించాలని ముఖ్యమంత్రులతో కూడిన ఉపసంఘం సిఫార్సు చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement