శాస్త్ర, సాంకేతికానికి.. నామమాత్రమే!
ఈ రంగాలకు కేటాయింపులు రూ.37,435 కోట్లు
న్యూఢిల్లీ: శాస్త్రసాంకేతిక రంగాల మంత్రిత్వ శాఖకు ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.37,435 కోట్లను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కేటాయించారు. ఇందులో అంతరిక్ష పరిశోధన విభాగాని(డీఓఎస్)కి అదనంగా రూ.1,000 కోట్ల కేటాయింపులు జరిపినట్టు జైట్లీ తెలిపారు. గతేడాది డీఓఎస్– అణు శక్తి (డీఏఈ), శాస్త్రసాంకేతిక మంత్రిత్వ శాఖలు రెండింటికీ కలిపి కేటాయించిన మొత్తం రూ.32,030.72 కోట్లు.
► డీఓఎస్‌కు ప్రకటించిన రూ.9,093 కోట్లలో 4,155 కోట్లు మూలధన వ్యయం కింద కేటాయింపులు జరిగాయి. ఇస్రో ప్రతిష్టాత్మక చంద్రయాన్ –2 వంటి ప్రాజెక్టుల కోసం ఈ నిధులను ఖర్చు చేస్తారు. గతేడాది (2016–17) బడ్జెట్‌లో డీఓఎస్‌కు రూ.8,045 కోట్లు, 2015–16లో రూ.6,920 కోట్లు ఇచ్చారు.
► అదేవిధంగా డీఏఈకి రూ.124.61 కోట్లు కేటాయించారు. ప్రొటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ (పీఎఫ్‌బీఆర్)తో పాటు రాజస్తాన్ అణు విద్యుత్ ప్రాజెక్టు (ఆర్‌ఏపీఎస్ 7, 8), కుడంకులం అణు విద్యుత్ ప్రాజెక్టు (3, 4 యూనిట్లు) తదితర ప్రాజెక్టుల కోసం ఈ నిధులు వినియోగిస్తారు.
► అలాగే డీఏఈ పరిధిలోని బాబా అణు పరిశోధన కేంద్రం (బార్క్), ఇందిరాగాంధీ అణు పరిశోధన కేంద్రం (ఐజీసీఏఆర్), రాజారమణ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ రీసెర్చ్‌లకు రూ.3,062 కోట్లు (గతేడాదితో పోలిస్తే రూ.814.42 కోట్లు అదనం) కేటాయించారు.
► శాస్త్రసాంకేతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ది కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్‌ఐఆర్)కు రూ.4,446 కోట్లు (గతేడాది రూ.4,062 కోట్లు) ఇచ్చారు.
► సైన్స్ అండ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ విభాగాలకు వరుసగా రూ.4,817.27, రూ.2,222.11 కోట్ల కేటాయింపులు జరిగాయి.
► భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖకు రూ.1,719.48 కోట్లు (గతేడాది రూ.1,576.14 కోట్లు) ఇచ్చారు.
కనీసం ఒక శాతం నిధులుంటేనే..
భారత్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలకు కేటా యింపులు నామమాత్రమే అన్నది గత బడ్జెట్లను చూస్తే స్పష్టమవుతుంది. స్థూల జాతీయోత్పత్తి (జీఎస్‌పీ)లో కనీసం ఒక శాతం నిధులు కేటాయి స్తేనే దేశాన్ని నాలెడ్జ్ సొసైటీగా మార్చాలన్న లక్ష్యం నెరవేరుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొన్నేళ్లుగా ఈ రంగాలకు కేటాయింపులు గరిష్టంగా జీఎస్‌పీలో 0.88 శాతమే ఉండటం గమనార్హం. దక్షిణ కొరియా, అమెరికా, చైనాలు ఈ రంగాలకు భారీగా నిధులిస్తుండడంతో ఆ దేశాల నుంచి కొత్త ఉత్పత్తులు, సాంకేతిక పరిజ్ఞానం వస్తున్నాయి. వారు తీసుకుంటున్న పేటెంట్లను చూస్తే ఇది తెలు స్తుంది. దక్షిణ కొరియాలో ప్రతి పది లక్షల జనాభా కు దాదాపు 4,451 పేటెంట్లు నమోదవుతోంటే.. భారత్‌లో ఈ సంఖ్య 17 మాత్రమే!