రూ.3 లక్షలు మించొద్దు
- అంతకు మించిన నగదు లావాదేవీలపై నిషేధం
- నల్లధనం కట్టడికి సిట్ చేసిన సిఫార్సుకు ఆమోదం
- ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి.. బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి జైట్లీ ప్రకటన
- ఎవరైనా రూ. 3 లక్షలకు మించి తీసుకుంటే జరిమానా
బడ్జెట్‌లోనూ కేంద్ర ప్రభుత్వం నల్లధనంపై కొరడా ఝుళిపించింది. ఇందులోభాగంగా నగదు లావాదేవీలపై పరిమితి విధించింది. అన్ని రకాల లావాదేవీల్లో నగదు రూ.3 లక్షలకు మించకూడదని ఆంక్షలు విధించింది. ఇది వచ్చే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. నగదు లావాదేవీలపై పరిమితి విధించాలంటూ నల్లధనంపై సుప్రీంకోర్టు నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) నిర్ణయం ప్రకారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం
ఈ మేరకు బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ‘రూ.3 లక్షలకు మించిన నగదు లావాదేవీలు పూర్తిగా నిషిద్ధం’ అని జైట్లీ ప్రకటించారు. సిట్ సిఫార్సును ఆమోదించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అవినీతి, పన్ను ఎగవేత నియంత్రణకు ఈ చర్య ఎంతగానో దోహదపడుతుందని భావిస్తున్నారు.
– న్యూఢిల్లీ
పరిమితి మించితే పరేషాన్..
నల్లధనం చలామణిని నియంత్రించి స్వల్ప నగదు ఆర్థిక వ్యవస్థను సాధించేందుకు ఉద్దేశించిన ఈ లక్ష్యాన్ని సాధించేందుకు సెక్షన్ 269ఎస్‌టీని ఆదాయ పన్ను చట్టంలో పొందుపరచాలని జైట్లీ బడ్జెట్‌లో ప్రతిపాదించారు. దీనిప్రకారం ఏ వ్యక్తి కూడా నగదు రూపంలో రూ. 3 లక్షలు, అంతకుమించి తీసుకోకూడదు. పరిమితులు ఎలాగంటే.. ఎ) ఒక రోజులో ఒక వ్యక్తి నుంచి ఏక మొత్తంలో తీసుకోకూడదు; బి) ఒక లావాదేవీలో తీసుకోకూడదు; సి) ఒక వ్యక్తికి సంబంధించిన ఒక ఈవెంట్ లావాదేవీల్లో తీసుకోకూడదు. ఈ ప్రతిపాదిత పరిమితులు ప్రభుత్వానికి, బ్యాంకింగ్ కంపెనీలకు, పోస్టాఫీసు సేవింగ్స్ బ్యాంక్, కోఆపరేటివ్ బ్యాంక్‌లకు వర్తించవు. ఎవరైనా వ్యక్తి మూడు లక్షల రూపాయలకు మించి ఎవరి నుంచైనా తీసుకుంటే అతడికి జరిమానా విధించాలని కూడా బడ్జెట్‌లో ప్రతిపాదించారు. నిర్దేశిత లావాదేవీ ఎంత మొత్తంలో జరిపితే ఆ విలువకు సమాన మొత్తంలో జరిమానా వేయాలని పేర్కొన్నారు. ఇలాంటి జరిమానాలను విధించే అధికారం ఆదాయపు పన్ను కమిషనర్‌కు ఉంటుందని చెప్పారు.
భారీగా లెక్కల్లో చూపని సంపద
నల్లధనం కట్టడికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ అత్యున్నత కమిటీ అయిన సిట్ తన ఐదో నివేదికను గత జూలైలో సుప్రీంకోర్టుకు సమర్పించిన సంగతి తెలిసిందే. దేశంలో లెక్కల్లో చూపని సంపద, నగదు భారీగా పోగుబడి ఉన్నాయని నివేదికలో పేర్కొంది. ‘నగదు లావాదేవీలపై ప్రస్తుతం వివిధ దేశాల్లో అమల్లో ఉన్న నిబంధనలు, వివిధ నివేదికలు, కోర్టులు చెప్పిన అంశాలను పరిశీలించాక నగదు లావాదేవీలపై గరిష్ట పరిమితి విధించాల్సిన అవసరం ఉందని సిట్ భావించింది’అని అందులో చెప్పింది. అందువల్ల రూ. 3 లక్షలు, అంతకుమించి జరిపే నగదు లావాదేవీలపై నిషేధం విధించాలని, ఈదిశగా చట్టం చేసి ఆమేరకు అలాంటి లావాదేవీలను అక్రమంగా ప్రకటించాలని సిఫార్సు చేసింది. చట్టప్రకారం వాటిపై శిక్ష విధించాలని పేర్కొంది.
నిషేధం మంచిదే: సిట్
నగదు లావాదేవీలపై రూ. 3 లక్షలు మించకుండా నిషేధం విధించాలంటూ తమ సిఫార్సును బడ్జెట్‌లో ప్రకటించడంపై సిట్ హర్షం వ్యక్తంచేసింది. దీనిపై సిట్ చైర్మన్ రిటైర్డ్ జస్టిస్ ఎంబీ షా మాట్లాడుతూ.. ‘ఇది (రూ.3 లక్షల నగదు లావాదేవీలపై నిషేధం) చాలా అవసరం. మంచి నిర్ణయం కూడా. ఇది చాలా దేశాల్లో అమల్లో ఉందన్న విషయాన్ని గతంలో సమర్పించిన మా నివేదికలో చెప్పాం. గత ఏడాదే దీనిపై మేము సిఫార్సు చేశాం. ఆమోదం పొందడానికి చాలా కాలం పట్టింది’అని అన్నారు. అయితే ఒక్కో వ్యక్తి వద్ద నగదు రూ. 15 లక్షలకు మించకుండా పరిమితులు విధించాలంటూ తాము చేసిన మరో సిఫార్సు కూడా అవినీతి కట్టడికి బాగా ఉపకరిస్తుందని చెప్పింది. ఈ సిఫార్సును ప్రభుత్వం ఆమోదించకపోవడంపై బాధగా ఉందా అన్న ప్రశ్నకు.. తమ సిఫార్సులను అమలుచేయడం, చేయకపోవడమనేది ప్రభుత్వ ఇష్టమన్నారు. అక్రమ, లెక్కల్లో చూపని సంపదను నియంత్రించడానికి మరిన్ని కఠిన చర్యలు అవసరమన్నారు.
ఆర్థిక నేరస్తుల ఆస్తుల జప్తు
దేశం విడిచి వెళ్లినవారి ఆస్తుల జప్తునకు ప్రత్యేక చట్టం: జైట్లీ
న్యూఢిల్లీ: లిక్కర్ టైకూన్ విజయ్‌మాల్యా బ్యాంకు లకు చెల్లించాల్సిన బకాయిల వసూలుకు చేసిన ప్రయత్నాలు విఫలమైన నేపథ్యంలో మాల్యా లాంటి దేశం విడిచి వెళ్లిన ఆర్థిక నేరస్తుల ఆస్తు లను జప్తు చేసేందుకు ప్రత్యేక చట్టం తీసుకువచ్చే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. ‘‘చట్టాన్ని తప్పించుకుని కొందరు ఆర్థిక నేరగాళ్లు విదేశాలకు తరలి వెళ్లిన సంఘటనలు ఉన్నాయి. అలాంటి వారి ఆస్తులను జప్తు చేసే కొత్త చట్టాన్ని తీసుకువచ్చేందుకు యోచిస్తోంది’’అని బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆయన వెల్లడించారు.
ట్రిబ్యునల్స్ కుదింపు
గత కొన్నేళ్లుగా అనేక ట్రిబ్యునల్స్ పని ఒత్తిడితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, అందువల్ల వాటి సంఖ్యను హేతుబద్ధీకరించాలని నిర్ణయిం చామని, అవకాశం ఉన్న ట్రిబ్యునల్స్‌ను విలీనం చేయాలని భావిస్తున్నామని జైట్లీ చెప్పారు.