Kerala Stampede: కొచ్చిన్‌ వర్సిటీలో తొక్కిసలాట... నలుగురు విద్యార్థుల దుర్మరణం | Sakshi
Sakshi News home page

Kerala Stampede: కొచ్చిన్‌ వర్సిటీలో తొక్కిసలాట... నలుగురు విద్యార్థుల దుర్మరణం

Published Sun, Nov 26 2023 6:01 AM

Kerala Stampede: Cochin University Tech Fest stampede kills students - Sakshi

కొచ్చి: కేరళలోని కొచ్చిన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో ఘోరం జరిగింది. వర్సిటీ టెక్‌ ఫెస్ట్‌లో భాగంగా శనివారం రాత్రి జరిగిన సంగీత విభావరిలో భారీ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో నలుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఇద్దరు అమ్మాయిలు కాగా ఇద్దరు అబ్బాయిలు. మరో 64 మందికి విద్యార్థులు పైగా గాయపడ్డారు. నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు చెబుతున్నారు.

వర్షం, మెట్లే కారణం!
సంగీత విభావరి వర్సిటీ ఓపెన్‌ ఎయిర్‌ ఆడిటోరియంలో ఏర్పాటైంది. ప్రఖ్యాత నేపథ్య గాయని నికితా గాంధీ తదితరులు రావడంతో ఏకంగా 2 వేల మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. దాంతో ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. విభావరి ఊపులో ఉండగా ఉన్నట్టుండి వర్షం కురవడంతో వెనక వైపున్న వాళ్లంతా తల దాచుకునేందుకు ముందుకు తోసుకొచ్చారు. ఆ తాకిడిని తాళలేక వేదిక ముందున్న వాళ్లంతా బయటికి పరుగులు తీశారు.

అదే సమయంలో బయట తడుస్తున్న వాళ్లు కూడా లోనికి తోసుకొచ్చారు. దాంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ఆడిటోరియంలోకి వచ్చేందుకు, వెళ్లేందుకు ఒకటే ద్వారం ఉండటంతో చూస్తుండగానే అక్కడ తోపులాట పెరిగిపోయింది. పలువురు విద్యార్థులు ఎత్తయిన మెట్ల మీది నుంచి పడిపోయారు. వారిని మిగతా వారు తొక్కుకుంటూ పరుగులు తీయడంతో పలువురు తీవ్ర గాయాల పాలయ్యారు. ఆరుగురి పరిస్థితి విషమించడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

వారిలో నలుగురు అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. దారుణంపై కేరళ సీఎం పినరాయి విజయన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇద్దరు మంత్రులను వెంటనే వర్సిటీకి పంపించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాల్సిందిగా ఆదేశించారు. ఉదంతంపై లోతుగా దర్యాప్తు జరిపిస్తామని ప్రకటించారు. విద్యార్థులు భారీగా రావడం, ఆకస్మిక వర్షమే ప్రమాదానికి దారి తీసినట్టు వర్సిటీ వీసీ డాక్టర్‌ శంకరన్‌ అభిప్రాయపడ్డారు.

Advertisement
 
Advertisement
 
Advertisement