భూమిపై నీటి వనరులు రోజురోజుకూ తరిగిపోతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారాలను కనుగొనే దిశగా పరిశోధకులు ఎప్పటినుంచో ప్రయోగాలను ప్రారంభించారు. ఈ క్రమంలోనే గాల్లోంచి నీటిని ఒడిసిపట్టేందుకు ఇప్పటికే బోలె డన్ని యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. కానీ వీటన్నింటికీ కరెంటు కావాలి. భారీ సైజు యంత్రాలూ కావాలి. పెద్ద పెద్ద తెరలు అవసరమవుతాయి. అయితే ఇవేవీ లేకుండానే గాల్లోని ఆవిరిని నీరుగా మార్చేయవచ్చని అంటోంది సింగపూర్‌లోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ (ఎన్‌యూఎస్). ప్రత్యేకమైన ప్లాస్టిక్ పోగులు, సూక్ష్మ రంధ్రాలతో అత్యధిక ఉపరితలాన్ని కలిగిన మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్‌లతో ఈ అద్భుతాన్ని సాధించవచ్చని ఎన్‌యూఎస్ శాస్త్రవేత్తలు ప్రయోగపూర్వకంగా నిరూపించారు.
కిలో ఏరోజెల్‌తో రోజుకు 17 లీటర్ల నీరు..
ఈ పద్ధతిలో ఒక కిలో ఏరోజెల్ పదార్థంతో రోజుకు 17 లీటర్ల నీటిని పొందొచ్చు. ఈ పదార్థం ఒక స్పాంజ్ మాదిరిగా గాల్లోని తేమను కాస్తా నీరుగా మారుస్తుంది. ఈ పదార్థం సేకరించిన నీటిని స్పాంజ్ మాదిరిగా పిండి సేకరించాల్సిన అవసరం లేదు. తగుమోతాదులో నీరు చేరిన వెంటనే దానంతట అదే నీరు బయటకు వచ్చేస్తుంది. ఏరోజెల్‌లోని పదార్థాలు నీటి అణువులను ఆకర్షించడం.. వికర్షించడం రెండూ చేయగలగడం దీనికి కారణం. ఏరోజెల్‌ను ఎండలో ఉంచినప్పుడు దాని పనితీరు మరింత మెరుగ్గా ఉందని, సేకరించిన ఆవిరిలో 95 శాతాన్ని నీరుగా మారుస్తోందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ప్రొఫెసర్ హో గిమ్ వీ తెలిపారు.
పంటకు పూత.. చీడకు చెక్!
చీడపీడలు ఆశిస్తే పంట నాశనమవుతుంది. రసాయనాలతో క్రిమికీటకాలను చంపేసి పంటను కాపాడుకుందామంటే.. పర్యావరణానికి ముప్పు కలుగుతుం ది. అయితే దీనికి క్రాప్‌కోట్(పంట పూత)ను ప్రత్యామ్నాయంగా పేర్కొంటోంది కాలిఫోర్ని యాకు చెందిన స్టారప్ కంపెనీ క్రాప్ ఎన్‌హ్యాన్స్‌మెంట్! ఈ కంపెనీ తయారు చేసిన పదార్థాన్ని పంటలపై పిచికారీ చేస్తే.. చీడపీడలకు పంట అస్సలు కనపడకుండా పోతుందట! క్రాప్ ఎన్‌హ్యాన్స్‌మెంట్ కంపెనీ చెట్ల నుంచి వెలికితీసిన ఒక పదార్థాన్ని నీటితో కలిపి వాడుతుందట. పంటలపై ఈ పదార్థాన్ని పిచికారి చేస్తే.. 12 నుంచి 24 గంటల్లో నీరు మొత్తం ఆవిరైపోతుంది. చెట్ల నుంచి వెలికితీసిన పదార్థపు పూత పంటలపై నిలిచిపోతుంది. ఈ పూత కాస్తా మొక్కలను చీడపీడలకు కనపడకుండా చేస్తాయని కంపెనీ చెబుతోంది. ఎలా అన్న ప్రశ్నకు కంపెనీ కూడా స్పష్టమైన సమాధానం ఇవ్వడం లేదు. కానీ... ప్రత్యేక పదార్థపు పూత పూసిన మొక్కల ఉపరితలాలను ఆహారంగా, పునరుత్పత్తి కేంద్రాలుగా క్రిమికీటకాలు గుర్తించడం లేదన్న విషయం తమకు స్పష్టమైందని కంపెనీ సీటీవో దామియన్ హాడుక్ తెలిపారు. క్రిమి కీటకాలను బట్టి పరిస్థితి మారుతోందన్నారు. వాతావరణ పరిస్థితులను బట్టి తాము అభివృద్ధి చేసిన పూత 6 వారాల పాటు పనిచేస్తుందని వివరించారు.
మొక్కలకు, జంతువులకు నష్టం లేదు!
ప్రత్యేక పదార్థపు పూత పూసినప్పటికీ మొక్కల కిరణజన్య సంయోగ క్రియకు ఎలాంటి ఇబ్బందీ ఉండదని హాడుక్ చెప్పారు. మొక్కకు, మనుషులకు, జంతువులకు ఈ పూత ద్వారా ఎలాంటి నష్టమూ ఉండదన్నారు. దక్షిణ అమెరికా, మధ్య అమెరికా, ఇండోనేసియా, ఆఫ్రికా, యూరప్‌లలో తాము క్షేత్ర స్థాయి పరిశీలనలు నిర్వహించామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment