న్యూఢిల్లీ: కరోనా కట్టడికి భౌతిక దూరం పాటించడం, మాస్కులు తొడుక్కోవడంతో పాటు భవనాల్లోపలి గాల్లోని తేమను నియంత్రించడం కూడా ముఖ్యమని భారత్ – జర్మనీ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఆసుపత్రులు, కార్యాలయాలు, బస్సులు, రైళ్లు వంటి రవాణా వ్యవస్థల్లో గాల్లోని తేమ శాతాన్ని 40 – 60 శాతానికి పరిమితం చేయడం ద్వారా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయవచ్చునని ఇరు దేశాల శాస్త్రవేత్తలు సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనం ద్వారా తెలిసింది. సీఎస్‌ఐఆర్‌కు చెందిన నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ, జర్మనీలోని లిబ్నిజ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ట్రోపోస్ఫియర్ రీసెర్చ్‌లు నిర్వహించిన ఈ అధ్యయనం వివరాలు ఏరోసాల్ అండ్ ఎయిర్ క్వాలిటీ రీసెర్చ్ జర్నల్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి.
గాల్లోని తేమశాతం ఐదు మైక్రోమీటర్ల కంటే తక్కువ సైజున్న తుంపర్లలోని సూక్ష్మజీవులపై ప్రభావం చూపుతుందని, ఉపరితలాలపై వైరస్ ఉనికికి, అది నిర్వీర్యమయ్యేందుకూ కీలకమని ఈ అధ్యయనం ద్వారా తెలిసింది. ‘‘గాల్లోని తేమ 40 శాతం కంటే తక్కువ ఉంటే కోవిడ్ బారిన పడ్డ వారు వదిలే తుంపర్లలోని కణాలు తక్కువ నీటి కణాలను ఆకర్షిస్తాయి. ఫలితంగా తేలికగా ఉంటాయి. ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి. దీనివల్ల ఇతరులకు సోకే అవకాశమూ ఎక్కువ అవుతుంది’’అని లిబ్నిజ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ట్రోపోస్ఫియర్ రీసెర్చ్ శాస్త్రవేత్త అజిత్ వివరించారు. గాల్లో తేమ తక్కువగా ఉంటే ముక్కు లోపలి పొరలు కూడా పొడిగా మారతాయి, వైరస్ ఎక్కువగా చొచ్చుకుపోయే అవకాశం ఉంటుందని తెలిపారు. తేమశాతం ఎక్కువగా ఉంటే తుంపర్లు వేగంగా బరువెక్కి నేల రాలిపోతాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment